వైద్యం ఖర్చు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ | Special Story On YS Jagan Aarogyasri | Sakshi
Sakshi News home page

వైద్యం ఖర్చు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ

Published Tue, Apr 9 2019 7:42 AM | Last Updated on Tue, Apr 9 2019 9:45 AM

Special Story On YS Jagan Aarogyasri - Sakshi

మొన్న
బాబు జమానాలో వైద్యం ఎండమావి 1995–2004 మధ్య కాలం ఒక చీకటి యుగం. సామాన్యులకు పెద్ద జబ్బు వస్తే ఆస్తుల మ్ముకోవాలి. అదీ చాలదంటే మరణమే శరణ్యం. ప్రభుత్వాసుపత్రుల్లో సతులు లేక, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లలేక పేద రోగులు పడిన అగచాట్లు మాటల్లో చెప్పలేనివి.

నిన్న
వైఎస్సార్‌ హయాంలో వైద్యానికి భరోసా 2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. సామాన్యులకు కూడా ప్రభుత్వమే ఉచితంగా వైద్యమందించాలి... అది కూడా కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో అంటూ ఆరోగ్య శ్రీ ప్రవేశపెట్టారు. దీంతో సామాన్యులు కూడా సగౌరవంగా కార్పొరేట్‌ ఆస్పత్రులకు వెళ్లి ఎంత పెద్ద జబ్బుకైనా ఉచితంగా వైద్యం చేయించుకున్నారు. 

నేడు
2014లో మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆరోగ్యశ్రీకి కష్టాలొచ్చాయి. ఇతర రాష్ట్రాల్లో వైద్యం లేదన్నారు. రేషన్‌ తీసుకోకపోతే కార్డు తొలగించారు. నిధులివ్వకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులు వైద్యం నిరాకరించాయి. ప్రమాదంలో గాయపడితే పట్టించుకునే దిక్కులేరు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం కావడంతో పేదలకు పెద్ద దిక్కు లేకుండా పోయింది. చాలా జబ్బులకు ఆరోగ్యశ్రీని తేసేశారు. హైదరాబాద్‌లో కనీసం క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌కు కూడా అవకాశం లేకుండా పోయింది. 

రేపు
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక... వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో పేద రోగులు వైద్యం కోసం తమ జేబునుంచి వ్యయం చేసే అవసరమే ఉండదు. ఎలాంటి జబ్బు చేసినా భయపడే అవకాశం లేదు. పేదవారికే కాకుండా వార్షికాదాయం రూ.5 లక్షల లోపు ఉన్నవారందరికీ ఉచిత వైద్యం అందించనున్నారు. వీళ్లందరికీ యూనివర్సల్‌ హెల్త్‌ కార్డులు ఇచ్చి కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యమందిస్తారు. 

సాక్షి, అమరావతి : ఉన్నత స్థాయి వైద్యం, శస్త్రచికిత్సల విషయంలో సామాన్యుడికి, సంపన్నుడికి మధ్య సరిహద్దులను చెరిపేసిన వైద్య విప్లవం ఆరోగ్య శ్రీ. రూ.5 లక్షలు చెల్లించి కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందిన స్థితిమంతులతోపాటే వ్యవసాయ కూలీకీ ఉచితంగా వైద్యమందించిన స్వర్ణయుగమది. స్వాతంత్య్రానంతరం సామాన్యుడికి ప్రభుత్వమే ఉచిత వైద్య బీమా కల్పించిన చరిత్ర. ఈ విప్లవానికీ, స్వర్ణయుగానికీ, భరోసాకూ అన్నిటికీ మూలం ఆరోగ్యశ్రీ. దీని సృష్టికర్త మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి. పేదల వైద్యానికి నేనున్నాంటూ పెద్దన్నలాగా, పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ముఖ్యమంత్రి రాష్ట్ర చరిత్రలో ఒకే ఒక్కరు వైఎస్సార్‌. ప్రమాదకర జబ్బుతో బాధపడుతూ, పైసా చేతిలో లేక కొట్టుమిట్టాడుతున్న కోట్లాది మంది పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ వరప్రసాదిని అయింది. వైఎస్‌ హయాంలో వచ్చిన ఈ అద్భుత పథకాన్ని దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో అమలు చేయడమే ఓ విశేషమైతే, సహజంగా ఉచిత పథకాలను వ్యతిరేకించే ప్రపంచ బ్యాంకు బృందం ఆరోగ్య శ్రీని మెచ్చుకోవడం మరో విశేషం. దీన్నిబట్టి పథకం ఎంతలా ప్రజలకు మేలు చేసిందో అంచనా వేయొచ్చు. వైఎస్‌ మరణానంతరం పథకానికి పేర్లు మార్చి ఉండవచ్చు, నిర్వీర్యం చేసేలా వ్యవహరించి ఉండవచ్చు... అయినా, ఆరోగ్యశ్రీ స్ఫూర్తిని, మహా నేత గొప్పదనాన్ని చెరిపివేయలేకపోయారు. 


ఎంతో మందికి అదనపు ప్రయోజనం 
వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏ ఆశయంతోనైతే ఆరోగ్య శ్రీని ప్రవేశపెట్టారో.. వాటిని మరింత సమర్థంగా అమలు చేస్తామని, రూ.1000 బిల్లు దాటితే పథకం వర్తింపజేస్తామంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ పేద రోగుల్లో మళ్లీ ఆశలు రేపుతోంది. చిన్నచిన్నవి నాలుగు టెస్టులు చేయించుకుంటేనే రూ.2 వేలు బిల్లు దాటే ఈ రోజుల్లో ఆ భారంతో లక్షలాది మంది పేదలు ఆర్థికంగా దెబ్బతింటున్నారు. రూ.వెయ్యి దాటిన బిల్లులను ఆరోగ్యశ్రీలోకి తెస్తే ఏటా 1.40 లక్షల కుటుంబాలు అదనంగా లబ్ధి పొందే అవకాశం ఉంది. పెద్ద జబ్బులకు ఇతర రాష్ట్రాల్లోని ఏ నగరంలోనైనా వైద్యం చేయించుకోవచ్చునని జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన భరోసా ఎంతోమందికి ఊపిరి పోయనుంది. కిడ్నీ వ్యాధి పీడితులకు ప్రస్తుతం ఇస్తున్న పింఛనును రూ.10 వేలు చేస్తానన్న హామీ జీవితంపై వేలాదిమందికి కొత్త ఆశలు రేపుతోంది. 

వైఎస్సార్‌ సీపీ పూర్తి మేనిఫెస్టో
వైఎస్‌ జగన్‌ భరోసా ఇలా.. 

  • ప్రస్తుతం ఆరోగ్య శ్రీ పరిధిలో ఉన్నవారు ఏదైనా వ్యాధికి వైద్యం చేయించుకోవాలంటే ముందుగా అది నిర్ధారణ జరగాలి. అయితే, నిర్ధారణ పరీక్షలు ఆరోగ్య శ్రీ కింద చెయ్యడం లేదు. వైఎస్‌ జగన్‌
  • ప్రకటించిన మేరకు... రూ.వెయ్యి దాటిన వైద్య ఖర్చులను ఆరోగ్య శ్రీ కిందకు చేరిస్తే సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ స్కాన్, వివిధ పరీక్షలు ఉచితం కానున్నాయి. దీనివల్ల చిన్న చిన్న మండల కేంద్రాల్లో 
  • వ్యాధి నిర్ధారణ చేయించుకోవచ్చు.
  • ఏపీ పరిధిలోనే కాక హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి పెద్ద పెద్ద నగరాలకూ వెళ్లి వైద్యం చేయించుకోవచ్చు. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో గాని, నర్సింగ్‌ హోంలలో గాని ఎక్కడైనా సరే... రోగి ఆరోగ్యశ్రీ కింద చేరితే వైద్యానికి నిరాకరించే అవకాశమే లేకుండా, తక్షణమే సౌకర్యవంతంగా సేవలు అందేలా నిబంధనలు తీసుకురానున్నారు. 
  • వైద్యం పూర్తయ్యాక రోగి ఎన్ని రోజులు మందులు వాడాల్సి ఉన్నా.. దానికయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. వైద్యం చేయించుకుని ఇంటికి వెళ్లే సమయంలో రోగి,వారి సహాయకుడికి ఛార్జీలు చెల్లిస్తారు. 
  • ఫాలోఅప్‌ వైద్యం... అంటే క్యాన్సర్‌ బాధితులకు కీమో థెరపీ, రేడియో థెరపీ వంటి చికిత్సలకు ఎన్నిసార్లైనా ఆ వ్యయం ప్రభుత్వమే భరిస్తుంది. 
  • దీర్ఘకాలిక వ్యాధుల (తలసేమియా, కిడ్నీ, గుండె జబ్బులు, హెచ్‌ఐవీ)తో బాధపడుతున్న వారికి నెలకు రూ.10 వేల పింఛను ఇస్తారు. 
  • రూ.వెయ్యి బిల్లు దాటినవారిని ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెస్తే... ఏటా సుమారు 1.40 లక్షల కుటుంబాలు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. 
  • పేదలు ఏటా వైద్య పరీక్షల కోసం కనీసం రూ.2 వేల కోట్లు వ్యయం చేస్తున్నట్లు అంచనా. రూ.వెయ్యి దాటిన వైద్య ఖర్చులను ఆరోగ్య శ్రీలోకి తెస్తే... ఈ డబ్బంతా వారికి మిగులుతుంది. 
  • మహా నేత డా.వైఎస్‌ఆర్‌ కాలంలో జరిగినట్లే... మూగ, చెవిటి బాలలు అందరికీ ఉచితంగా కాంక్లియర్‌ ఇంప్లాంట్‌ శస్త్రచికిత్సలు చేయిస్తారు. 
  • కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్‌ సరిగా జరగడం లేదు. పేదలు ఆస్పత్రులకు వెళితే ఏడాది తర్వాత రమ్మంటున్నారు. ఈలోగా వారి ప్రాణాలు పోతున్నాయి. ఈ పరిస్థితిని పూర్తిగా మారుస్తారు. 
  • రోగి కుటుంబ పోషకుడైతే వారు కోలుకునే వరకు ఆర్థిక సాయం చేస్తారు. 
  • శస్త్రచికిత్స పూర్తయ్యాక వైద్యులు సూచించే విశ్రాంతి సమయంలో పనులు చేసుకోలేరు కాబట్టి ఆర్థిక సాయం అందిస్తారు. వారం, నెల, ఆరు నెలలైనా సరే ప్రభుత్వ సాయం నిరాటంకంగా కొనసాగుతుంది. 


యూనివర్సల్‌ హెల్త్‌ స్కీమ్‌ ద్వారా భారీగా లబ్ధి 
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మేనిఫెస్టోలో ప్రకటించిన యూనివర్సల్‌ హెల్త్‌ స్కీమ్‌ ద్వారా రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వారికి భారీగా లబ్ధి చేకూరనుంది. నెలకు రూ.40 వేల వేతనం తీసుకునేవారు కూడా పెద్ద జబ్బులు చేస్తే రెండు మూడు లక్షలు వ్యయం చేయాల్సిందే. ఇప్పుడు వాళ్లందరూ గుండెల మీద చేతులేసుకుని హాయిగా ఉండొచ్చు. 

  • రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారు రాష్ట్రంలో కనిష్టంగా 30 లక్షల మంది వరకూ ఉంటారని అంచనా. వీళ్లందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు లేకపోవడంతో సొంతంగా వైద్యానికి ఖర్చు చేయడం మినహా మరో దారి లేదు. ఇలాంటి వారందరికీ యూనివర్సల్‌ హెల్త్‌ కార్డులు అందజేస్తారు. వీటి ద్వారా ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులైన వారి తరహాలోనే మన రాష్ట్రంలో గానీ, ఇతర రాష్ట్రాల్లో గానీ ఉచిత వైద్యం పొందొచ్చు. 
  • కుటుంబ పోషకుడితోపాటు కుటుంబ సభ్యులందరూ ఈ పథకం పరిధిలోకి వస్తారు. హెల్త్‌కార్డుతో ఏ కార్పొరేట్‌ ఆస్పత్రిలోనైనా ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు. 
  • ఎంత పెద్ద ఆపరేషన్‌ అయినా ఉచితంగా వైద్యం చేసి ఇంటికి పంపే వరకూ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఆస్పత్రిదే. 

చాలామంది తెల్లరేషన్‌ కార్డు పరిధిలో లేని వారు అంటే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారు పెద్ద జబ్బు చేస్తే ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోలేక పోతున్నారు. ఆ వర్గం కూడా ఇప్పుడు ఆనందంగా ఉంది. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టోలో రూ.5 లక్షలు లోపు వార్షికాదాయం ఉన్నా వారికి ఉచితంగా వైద్యమందిస్తానని చెప్పారు. వీళ్లందరికీ యూనివర్సల్‌ హెల్త్‌కార్డులు ఇచ్చి కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం అందిస్తామని చెప్పారు. దీంతో మధ్యతరగతి వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ పథకం పరిధిలోకి సుమారు 30 లక్షల మంది పైనే వస్తారని అంచనా. ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న వారి లాగే వీళ్లు కూడా హెల్త్‌ కార్డు చూపించి ఏ రాష్ట్రంలో ఉన్న పెద్దాసు పత్రుల్లోనైనా వైద్యం చేయించుకునేలా వెసులుబాటు కల్పించడంతో వారికి భరోసా ఇచ్చినట్టయింది. క్యాన్సర్, గుండెజబ్బులు వంటి వాటికి ఆరోగ్యశ్రీ పరిధిలో లేకపోవడంతో ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి.తాజాగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేనిఫెస్టోలో చేర్చిన ఈ పథకంతో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారు కూడా జేబులో నుంచి నయాపైసా వ్యయం చేయకుండా వైద్యం చేయించుకునే అవకాశం వస్తుంది.

టీబీ వస్తే ఆరోగ్యశ్రీ లేదా సారూ..
నా వయస్సు 48. వ్యవసాయ కూలీ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటున్నా. భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. నాకు మూడేళ్ల కిత్రం క్షయ (టీబీ) వ్యాధి సోకింది. దగ్గు, జ్వరం తగ్గకపోవడంతో వైద్యం కోసం కర్నూలులోని ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలకు వెళ్తే రూ.10 వేలు అడిగారు. ఆరోగ్య శ్రీ కార్డు చూపిస్తే చెల్లదన్నారు. దీంతో నా దగ్గర ఉన్న రూ.6 వేలకు రూ.4 వేలు అప్పు చేసి పరీక్షలు చేయించుకున్నా. కర్నూలు ప్రభుత్వాసుపత్రికి వెళ్లినా ఫలితం దక్కలేదు. మళ్లీ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తున్నా. ఇప్పటికి రూ.40 వేలైంది. పిల్లల చదువు, కుటుంబ పోషణ,నా వైద్య ఖర్చులతో పరిస్థితి దయనీయంగా ఉంది. రూ.వెయ్యి బిల్లు దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా చేస్తానని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన సీఎం అయితే మా కష్టాలు తీరతాయని ఆశిస్తున్నా.
–ఎం.మన్సూర్, పెద్దమర్రివీడు,గోనెగండ్ల మండలం, కర్నూలు జిల్లా (ఈయన సాక్షితో మాట్లాడిన రెండ్రోజుల తర్వాత... తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు) 

డయాలసిస్‌ మాత్రమే అందుతోంది
మాది నిరుపేద కుటుంబం. కొబ్బరి కాయలు వలిచే కార్మికుడిని. నాకు ముగ్గురు కొడుకులు, కొంతకాలం క్రితం నా రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. నా భార్య కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అయితే, ఆపరేషన్‌కు రూ.4 లక్షలు ఖర్చవుతుందన్నారు. అంత ఆర్థిక స్తోమతలేదు. ఎన్టీఆర్‌ ఆరోగ్య శ్రీ పథకంలో మూడు నెలలుగా డయాలసిస్‌ చేయించుకుంటున్నా. వారానికి మూడుసార్లు కాకినాడ ట్రస్టు ఆస్పత్రికి వెళ్లాలి. తోడుగా వచ్చే నా భార్యకు ఇద్దరికీ రూ.700 ఖర్చు అవుతోంది. ఇంజక్షన్లు, మందులకు ప్రతిసారి రూ.2 వేలు అవుతోంది. ఆరోగ్య శ్రీ పథకంలో కేవలం డయాలసిస్‌ మాత్రమే చేస్తున్నారు. మిగతా ఖర్చంతా నేనే భరించాల్సి వస్తుంది. పింఛన్‌ వస్తున్నా అది సరిపోవడం లేదు. కిడ్నీ బాధితులకు జగన్‌ నెలకి రూ.10 వేలు పింఛను ఇస్తామని ప్రకటించడం చాలా సంతోషం.
– మంచిగంటి తాతారావు, దేవగుప్తం, అల్లవరం మండలం 

కిడ్నీవ్యాధి బాధితులకు ఒక భరోసా 
కిడ్నీ జబ్బుతో బాధపడుతున్న మాకు భరోసా వచ్చింది. నెలకు రూ.5 వేలకు పైగా ఖర్చవుతోంది. చాలా ఇబ్బంది పడుతున్నాం. రూ.10 వేలు ఇస్తానన్న వైఎస్‌ జగన్‌ హామీతో మాలాంటివారికి ధైర్యంగా బతకగలమనే నమ్మకం వచ్చింది. ఎవరినీ పైసా అడగకుండా రూ.10 వేల పెన్షన్‌తో మా బతుకు మేం బతకగలం. – బొనియల ఎల్లమ్మ, కిడ్నీ వ్యాధి బాధితురాలు, వజ్రపుకొత్తూరు,శ్రీకాకుళం జిల్లా  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement