జగన్‌ అనే నేను హామీ ఇస్తున్నా | YSRCP 2019 Elections Manifesto Full Details | Sakshi
Sakshi News home page

జగన్‌ అనే నేను హామీ ఇస్తున్నా

Published Sun, Apr 7 2019 8:17 AM | Last Updated on Sun, Apr 7 2019 3:40 PM

YSRCP 2019 Elections Manifesto Full Details - Sakshi

మాట తప్పని,మడమ తిప్పని నేతగా ప్రజల మన్ననలు అందుకుంటున్న జననేత.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శనివారం ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో–2019లో అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా కష్టాల్లో ఉన్న అన్నదాతలపై వరాల జల్లు కురిపించారు. పేదరికాన్ని పారదోలి.. రాష్ట్రాన్ని ప్రగతి బాటన పరుగులు పెట్టించి నవ శకానికి నాందిపలికేలా.. మేనిఫెస్టోలో వైఎస్‌ జగన్‌ తన దార్శనికతను ఆవిష్కరించారు. సమాజంలోని ప్రతి ఒక్క వర్గం సంక్షేమం కోసం కృషి చేసి.. సమసమాజ స్థాపనకు పాటుపడతామన్నారు. ప్రత్యేక హోదా సాధించి.. రాష్ట్రంలో ఉద్యోగాల విప్లవం తెస్తామని ప్రకటించి.. లక్షల మంది యువత ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేస్తామని హామీ ఇచ్చారు. మొత్తమ్మీద వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో నిర్మాణాత్మకంగా, ఆచరణ సాధ్యంగా, అన్ని వర్గాల ప్రజల మేలు కోరేలా ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది!! 

వైఎస్సార్‌ రైతు భరోసా

  • ప్రతి రైతు కుటుంబానికి రూ.50 వేలు అందిస్తాం.  పంట వేసే సమయానికి అంటే ప్రతి మే నెలలో రూ.12,500 చొప్పున ఇస్తాం 
  • రైతన్నలకు వడ్డీలేని పంట రుణాలు.. రైతులకు ఉచితంగా బోర్లు..
  • వ్యవసాయానికి పగటి పూట 9 గంటల ఉచిత కరెంట్‌  
  • పంటల బీమా మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది 
  • రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు 
  • పంట వేసేముందే పంట ధర ప్రకటన.గిట్టుబాటు ధరకు గ్యారెంటీ.
  • రూ.4వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు
  • ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు, గోదాములు, అవసరం మేరకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు 
  • సహకార డెయిరీకి పాలుపోసే పాడి రైతుకు లీటరుకు రూ.4 బోనస్‌ 
  • వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్‌ టాక్స్‌ రద్దు చేస్తాం, టోల్‌ టాక్స్‌ రద్దు చేస్తాం 
  • ఆక్వారైతులకు కరెంట్‌ చార్జీలు యూనిట్‌కు రూ.1.50కే ఇస్తాం 
  • ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన రైతు కుటుంబానికి వైఎస్సార్‌ బీమా ద్వారా రూ.7లక్షలు ఇస్తాం. అంతేకాదు ఆ డబ్బు అప్పుల వాళ్లకు చెందకుండా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొచ్చి ఆ రైతు కుటుంబానికి అండగా ఉంటాం. 

ఉజ్జాయింపుగా సంవత్సరానికి రూ.12,500 –లక్ష వరకూ ప్రయోజనం
(12,500 + ఉచిత బోర్లు + ఉచిత విద్యుత్‌ + 0 వడ్డీ సొమ్ము+ ట్రాక్టర్ల రోడ్‌ ట్యాక్స్‌)
 

అందరికీ వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ 

  • వార్షిక ఆదాయం రూ.5లక్షలు దాటని అన్ని వర్గాల వారికి వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ వర్తింపు 
  • వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపు 
  • ఎన్ని లక్షలు ఖర్చయినా ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిగా ఉచిత వైద్యం 
  • ఎక్కడ చికిత్స చేయించుకున్నా (హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై) ఆరోగ్యశ్రీ వర్తింపు 
  • అన్ని రకాల వ్యాధులు, ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ పరిధిలోకి 
  • ఆపరేషన్‌ లేదా జబ్బు చేసిన వ్యక్తికి చికిత్స తరువాత విశ్రాంతి సమయంలో ఆ కుటుంబానికి అండగా ఆర్థిక సహాయం 
  • కిడ్నీ, తలసేమియా వంటి  దీర్ఘకాలిక వ్యా«ధులతో బాధపడుతున్న వారికి రూ.10వేల పింఛన్‌ నెల నెలా ఇస్తాం  
  • ఆరోగ్య శ్రీ సేవలు ఇంకా మెరుగ్గా పకడ్బందీగా అందిస్తూనే మరోవైపు రెండేళ్లలోగా కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతాం. ప్రస్తుత ప్రభుత్వ ఆసుపత్రుల ముఖచిత్రాలు(ఫోటోలు) మీ ముందుంచుతాం. రెండేళ్ల తర్వాత ఆ ఆసుపత్రి దశ దిశ మార్చి మారిన ముఖచిత్రాలు మీకు చూపిస్తాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల సంఖ్య అవసరమైన మేరకు పెంచుతాం.  

ఉజ్జాయింపుగా సంవత్సరానికి రూ.1లక్ష– 10 లక్షలు ప్రయోజనం 

అమ్మ ఒడి 

  • పిల్లల చదువులకు ఏ పేదింటి తల్లీ భయపడొద్దు 
  • పిల్లలను బడికి పంపితే చాలు ప్రతి తల్లికి ఏడాదికి రూ.15,000 ఇస్తాం. 
  • ఏడాదికి కుటుంబానికి రూ.15,000  లబ్ధి 


వైఎస్సార్‌ చేయూత 

  • వైఎస్సార్‌ చేయూత ద్వారా ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కలకు తోడుగా ఉంటాం 
  • ప్రస్తుత కార్పొరేషన్ల వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ అందరికీ మేలు జరిగేలా, ఏ కొందరికో అరకొరగా ఇస్తూ అది కూడా లంచం లేనిదే ఇవ్వని పరిస్థితులను మారుస్తూ పారదర్శక ప్రమాణాలను తీసుకువస్తాం 
  • 45 నిండిన 60 ఏళ్ల లోపు ఉన్న ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ
  • అక్కలకు వైఎస్సార్‌ చేయూత ద్వారా మొదటి ఏడాది తర్వాత దశల వారీగా రూ.75వేలు ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా ఇస్తాం. 
  • ప్రతి కుటుంబానికి చేకూరే ప్రయోజనం రూ.75,000


పింఛన్ల పెంపు 

  • ప్రస్తుతం ఉన్న పింఛన్ల అర్హత వయస్సు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తాం 
  • అవ్వా తాతల పింఛన్‌ రూ.3,000 వరకూ పెంచుకుంటూ పోతాం  
  • వికలాంగులకు పింఛన్‌ రూ.3,000 ఇస్తాం 
  • ప్రతి కుటుంబానికి ఉజ్జాయింపుగా  సంవత్సరానికి ప్రయోజనం  రూ. 36,000 - 72,000

    ఫీజు రీయింబర్స్‌మెంట్‌  
  • పేదవారి చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తాం 
  • పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌పాటు వసతి, భోజనం కోసం అదనంగా ఏటా రూ.20వేలు ప్రతి విద్యార్థికి ఇస్తాం 
  • ఉజ్జాయింపుగా రూ.1లక్ష– రూ.1,50,000 ప్రయోజనం  (ఫీజు ఎంతైతే అంతా+రూ.20,000) 


వైఎస్సార్‌ జలయజ్ఞం 

  • దివంగత మహానేత వైఎస్సార్‌ కలలు కన్న జలయజ్ఞాన్ని పూర్తిచేస్తాం 
  • పోలవరం, పూల సుబ్బయ్య వెలిగొండ సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తాం 
  •  రక్షిత మంచి నీరు– సాగునీరు 
  • కల నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం, జల కళను తీసుకొస్తాం 
  • లక్షలాది రైతు కుటుంబాలకు వెలకట్టలేని లబ్ధి 

పేదలందరికీ ఇళ్లు

  • ఇల్లు లేని పేదలందరికీ పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు చూడకుండా పక్కా ఇళ్లు కట్టిస్తాం 
  • ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్లు కట్టిస్తాం 
  • ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం. వారి పేరునే రిజిస్ట్రేషన్‌ చేస్తాం, ఇళ్లు కూడా కట్టిస్తాం 
  • ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లోని అక్క చెల్లె్లమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌ 
  • అంతేకాదు డబ్బు అవసరమైతే అదే ఇంటి మీదా పావలా వడ్డీకే రుణం ఇచ్చేట్టుగా బ్యాంక్‌లతో మాట్లాడుతాం 
  • ఉజ్జాయింపుగా రూ.2లక్షల–రూ.5 లక్షల ప్రయోజనం  

యువత–ఉపాధి

  •  ప్రత్యేక హోదా సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నాం. హోదా సాధించే వరకు దీనిని కొనసాగిస్తూనే ఉంటాం. హోదాను తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో ఉద్యోగాల విప్లవం తెస్తాం.
  • ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు ద్వారా అదే ఊరికి చెందిన 10 మంది యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాము.
  • దీంతోపాటు ప్రతి గ్రామంలో, వార్డులో ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున సేవా దృక్పథం ఉన్న యువతీ/యువకులను నెలకు రూ.5 వేల గౌరవ వేతనంతో గ్రామ వాలంటీర్‌గా, వార్డు వాలంటీర్‌గా నియమిస్తాం. వారు గ్రామ సచివాలయానికి, వార్డు సచివాలయానికి అనుసంధానకర్తగా ఉండి తమ పరిధిలోని 50 ఇళ్లకు ప్రభుత్వ పథకాలు, వాటిలో భాగంగా నవరత్నాల ద్వారా అందించే పథకాలు, వైఎస్సార్‌ రైతు భరోసా నుంచి వైఎస్సార్‌ రైతు చేయూత వరకు అన్ని పథకాలు ఇంటి వద్దకే అందేలా ‘డోర్‌ డెలివరీ’ చేస్తారు. వీరికి ఇంతకంటే మంచి ఉద్యోగాలు బయట ఎక్కడైనా వచ్చేవరకు సేవా దృక్పథంతో గ్రామంలో, వార్డులో ఆయా సచివాలయాలతో అనుసంధానమై సేవలు అందిస్తారు.
  • ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ, పింఛను, రేషన్‌ తదితరాలకు సంబంధించిన సమస్యలేవైనా 72 గంటల వ్యవధిలో గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల ద్వారా పరిష్కరిస్తాం.
  • రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న దాదాపు 2 లక్షల 30 వేల ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు ఏటా జనవరి 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్‌ విడుదల చేస్తాం. 
  • ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా అసెంబ్లీ మొదటి సమావేశాల్లోనే బిల్లు తీసుకొస్తాం. జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని జిల్లాలోని పరిశ్రమలకు అనుకూలంగా, వారికి ఏ రకమైన నైపుణ్యాలు కావాలి? అన్న విషయాల మీద, వారిని కూడా భాగస్వాములను చేస్తూ, ప్రతి జిల్లాలోనూ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లు ఏర్పాటు చేస్తాం. మన పిల్లలకు ఉచితంగా శిక్షణ (ట్రైనింగ్‌) ఇప్పిస్తాం.
  • ప్రభుత్వ కాంట్రాక్టులు ఏవైతే ఉంటాయో... బస్సులు, కార్లుఅద్దెకు తీసుకోవడం మొదలు ఇంకా ఇటువంటి ఇతరత్రా ఆదాయాన్నిచ్చే గవర్నమెంట్‌ కాంట్రాక్టులు అన్నీ నిరుద్యోగ యువతకే ఇచ్చేలా చట్టం తెస్తాం. అంతేకాక వారికి తోడుగా ఉండేందుకు, వారు కార్లు కాని, బస్సులు కాని ఇతరత్రా వాహనాలు, పరికరాలు కొనేందుకు సబ్సిడీ కూడా ఇస్తాం. అంతేకాదు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతకు 50 శాతం రిజర్వేషన్‌ కూడా కేటాయిస్తాం.
  • ఖాళీగా ఉన్న 2.30 లక్షలు ఉద్యోగాల భర్తీ
  • గ్రామ సచివాలయాల్లో 1.60 లక్షలు  ఉద్యోగాలు
  • గ్రామ వాలంటీర్లు 3.50 లక్షల మంది


వైఎస్సార్‌ ఆసరా

  • ఎన్నికల రోజు వరకు అక్కచెల్లెళ్లకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును 4 దఫాలుగా నేరుగా వారి చేతికే అందిస్తాం.
  • అంతేకాక మళ్లీ సున్నా వడ్డీకే రుణాల విప్లవం తెస్తాం. ఆ వడ్డీ డబ్బును అక్కచెల్లెళ్ల తరఫున (ప్రభుత్వమే) బ్యాంకులకు మేమే కడతాం.
  • ఉజ్జాయింపుగా ఏడాదికి రూ.50 వేలు


మద్యపాన నిషేధం

  • మద్యం సంసారాల్లో చిచ్చుపెడుతోంది.
  • మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి.
  • అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. మద్యాన్ని ఫైవ్‌స్టార్‌ హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తాం.
  • లక్షలాది కుటుంబాల్లో వెలకట్టలేని సంతోషం

కౌలు రైతులు

  • భూ యజమానులకు ఇబ్బంది లేకుండా కౌలు రైతులకు పంటపై హక్కు ఉండేట్లుగా (11 నెలలకు మించకుండా) రైతుల భూములకు రక్షణ కల్పిస్తూ చట్ట సవరణలు చేస్తాం. కౌలు రైతులకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం. ఆ కాల వ్యవధిలో పంటకు సంబంధించిన అన్ని రాయితీలు, ప్రయోజనాలు వారికే అందేలా చేస్తాం. అంతేకాక నవరత్నాల్లో రైతులకు చెప్పిన మిగిలిన అన్ని హామీలు కూడా, పంట బీమా దగ్గరనుంచి వడ్డీ లేని రుణాల వరకు, 9 గంటల ఉచిత విద్యుత్‌ నుంచి గిట్టుబాటు ధరల గ్యారంటీ వరకు, ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి వైఎస్‌ఆర్‌ బీమా ద్వారా రూ.7 లక్షలు దాకా, ఇలా ప్రతి అంశాన్ని కౌలు రైతులందరికీ వర్తింపజేస్తాం.
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కౌలు రైతులకు రైతు భరోసా కింద ఏటా ఇచ్చే రూ.12,500 పెట్టుబడి సొమ్ము వీరికి అదనంగా ఇస్తాం.
  • సుపరిపాలన 
  • కుల, వర్గ, మతతత్వాలు లేని సమ సమాజ నిర్మాణానికి కావలసిన సుపరిపాలన అందిస్తాం. రాష్ట్రంలో భూములన్నింటినీ ‘‘సమగ్ర రీ సర్వే’’ చేయించి భూయజమానులకు శాశ్వత యాజమాన్య హక్కు కలుగజేస్తాం. 
  • ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తాం. పరిపాలన ప్రజల దగ్గరకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపడతాం 
  • రాజధానిని ఫ్రీ జోన్‌ గా (అందరికీ ఉద్యోగ అవకాశాలు ఉండే విధంగా) గుర్తిస్తూ నిజమైన వికేంద్రీకరణ లక్ష్యంగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తాం 
  • గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా ‘గ్రామ  సచివాలయాలు’ పట్టణాలలో ‘వార్డు సచివాలయాలు’ ఏర్పాటు చేసి గ్రామ, ఆయా వార్డుల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వ పథకాలన్నింటినీ ప్రజల  వద్దకు తీసుకుపోయేలా పనిచేస్తాం. అంతేకాదు లంచాలకు తావులేకుండా ప్రభుత్వ పథకాలన్నీ 50 ఇళ్లకు ఓ గ్రామ వాలంటీరు లేదా వార్డు వాలంటీర్‌తో డోర్‌ డెలివరీ చేయిస్తాం. 


బీసీ సంక్షేమం

  • ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం బీసీ సంక్షేమానికి ఏటా రూ.10 వేల కోట్లతో ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి, కనీసం రూ.20 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. వైఎస్సార్‌సీపీ బీసీల అభ్యున్నతికి సంవత్సరానికి రూ.15 వేల కోట్ల చొప్పున ప్రత్యేక ఉప ప్రణాళిక ద్వారా ఐదేళ్లలో రూ.75 వేల కోట్లు ఖర్చు చేస్తాం.
  • రాజకీయ ఎదుగుదల కోసం అన్ని నామినేటెడ్‌ పదవులు (దేవాలయ ట్రస్ట్‌ బోర్డులు, మార్కెట్‌ యార్డు కమిటీలు, కార్పొరేషన్లు తదితర) బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. అంతేకాక ఆర్థిక ఎదుగుదల కోసం అన్ని నామినేటెడ్, కాంట్రాక్టు పన్నుల్లో కూడా 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టం తీసుకువస్తాం.
  • బీసీల్లోని అన్ని ఉప కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వైఎస్సార్‌ చేయూత పథకానికి ఎంత అవసరమైతే అంత నిధులు కేటాయించి వారి అభ్యున్నతికి తోడుగా ఉంటాం. బీసీ చెల్లెమ్మల వివాహానికి ప్రస్తుత ప్రభుత్వం ఇస్తున్న రూ.35 వేలను పెంచి ‘వైఎస్సార్‌ పెళ్లి కానుక’గా రూ.50 వేలు ఇస్తాం.
  • ప్రాతినిధ్యం లేని కులాలకు ఎంత వీలైతే అంత చట్ట సభల్లో అవకాశం కల్పించడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తాం.
  • బీసీ జన గణన చేసి చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి సిఫార్సు చేస్తాం.
  • శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పిస్తాం. ఆ కమిషన్‌ పరిధిని విస్తరించి ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా ఆ కమిషన్‌ పారదర్శకంగా పనిచేసే పరిస్థితి కల్పిస్తాం. బీసీల సమస్యలను పరిష్కరించేందుకు కులం సర్టిఫికెట్‌ దగ్గరనుంచి గ్రూపుల మార్పిడి వరకు, ఎంబీసీల వ్యవహారమైతేనేమీ రోజువారీ బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలైతేనేమి రాష్ట్రం పరిధిలో లేనివి కేంద్రానికి సిఫార్సు చేసి పంపించే అంశాలైతేనేమి, వీటన్నింటినీ పరిష్కరించేందుకు శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ను చట్టబద్ధంగా, పారదర్శకంగా ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర పరిధిలోని అంశాలు ఇక్కడే పరిష్కరిస్తూ, కేంద్ర పరిధిలోని అంశాలైతే, ఆ కమిషన్‌ ఇచ్చిన శాస్త్రీయ నివేదికను పొందుపరుస్తూ కేంద్రానికి తీర్మానం చేసి పంపుతాం.
  • బీసీ కులాలకు చెందినవారు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్‌ఆర్‌ బీమా ద్వారా రూ.5 లక్షలు ఇస్తాం.

కాపు సంక్షేమం
దేశంలో వివిధ రాష్ట్రాల్లో జాట్లు, గుజ్జర్లు, పటేళ్లు తరహాలో మన రాష్ట్రంలో కాపు సోదరులు రిజర్వేషన్‌ కల్పించాలని కోరుతూ ఉన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఏ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న నిబంధన మనందరికీ తెలిసిన చిక్కుముడి. అయినా, టీడీపీ తమ గత ఎన్నికల ప్రణాళికలో కాపులను బీసీలలో కలుపుతామని మోసపూరిత హామీ ఇచ్చింది. మన పరిధిలో లేని విషయంలో మనం ప్రయత్నం చేస్తామని చెప్పగలం కానీ, అంతకుమించి రిజర్వేషన్‌ కల్పిస్తామని చెప్తే అది ప్రజలను మభ్యపెటేచర్యే అవుతుంది. ఈ నేపథ్యంలో కాపు రిజర్వేషన్ల విషయంలో వైఎస్సార్‌సీపీ వైఖరి ఎప్పుడూ ఒకటే. మొదటినుంచి చెబుతున్నట్టే బీసీల హక్కులకు భంగం కలగకుండా, వారి ప్రయోజనాలకు నష్టం రాకుండా జరిగే రిజర్వేషన్లకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వం కాపు రిజర్వేషన్ల విషయంలో మోసం చేయడమే కాకుండా, సంవత్సరానికి రూ.వెయ్యి కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి కేవలం రూ.1,340 కోట్లు కేటాయించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక కాపు కార్పొరేషన్‌కు సంవత్సరానికి రూ.2 వేల కోట్ల చొప్పున ఐదేళ్లకు కలిపి రూ.10 వేల కోట్లు కేటాయిస్తాం. వాటిని ఖర్చు చేస్తాం.

మత్స్యకారులు

  • మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో (ఏప్రిల్‌ 15–జూన్‌14) ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతాం.
  • మత్స్యకారుల పడవలకు కొత్తగా అనుమతులు మంజూరు చేస్తాం. మత్స్యకారులకు డీజిల్‌పై ఇచ్చే సబ్సిడీని, డెడికేటెడ్‌ పెట్రోల్‌ బంకుల ద్వారా డీజిల్‌ పట్టుకునేటప్పుడే చేతికి అందేట్లుగా అమలు చేస్తాం.
  •  ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తాం.

అగ్రిగోల్డ్‌
చెప్పినమాట ప్రకారం అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.1150 కోట్లు కేటాయించి, తద్వారా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉన్న 13 లక్షల మంది బాధితులకు వెంటనే మేలు చేస్తాం. మిగిలినవారికి త్వరితగతిన పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేస్తాం.

పట్టణ గృహ నిర్మాణం
టీడీపీ హయాంలో పట్టణ గృహ నిర్మాణ పథకం కింద 300 అడుగుల ఒక్కో ఇంటిని అడుగుకు రూ.2 వేల చొప్పున పేదవారికి అమ్మారు. ఇందులో రూ.3 లక్షలను పేదవాడి పేరుతో అప్పుగా రాసుకుని, ఆ అప్పు భారాన్ని 20 ఏళ్ల పాటు నెలనెలా రూ.3 వేలు చొప్పున తిరిగి కట్టాల్సిన పరిస్థితి. ఈ అప్పు భారాన్ని రద్దు చేసి ఆ భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది.

యాదవులు

  • తిరుమలలో శ్రీవారి గర్భగుడి తలుపులను సన్నిధి గొల్లలు తెరిచే సంప్రదాయాన్ని పునరుద్ధరిస్తాం.
  •  గొర్రెల కాపరులకు... చనిపోయిన ప్రతి గొర్రెకు 
  • రూ.6 వేలు బీమాగా అందిస్తాం.

ఆటో/ట్యాక్సీ

  • సొంత ఆటో/ట్యాక్సీ నడిపేవారికి ఇన్యూరెన్స్, ఫిట్‌నెస్, రిపేర్లు తదితర అవసరాల కోసం ఏడాదికి రూ.10 వేలు ఇస్తాం.

జీవన బీమా

  • 18 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న ఏ పౌరుడైనా సహజంగా మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్‌ఆర్‌ జీవన బీమా పథకం ద్వారా రూ.1 లక్ష అందిస్తాం.

అగ్ర కులాల సంక్షేమం

  • అన్ని అగ్ర కులాల (క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ తదితర) వారికి కూడా కార్పొరేషన్లు ఏర్పాటు.
  • ఈ కార్పొరేషన్లకు తగిన నిధులు కేటాయించి ఆయా కులాలకు చెందిన పేదలకు అండగా ఉంటాం.

న్యాయవాదులు

  • జూనియర్‌ న్యాయవాదులకు మొదటి మూడేళ్ల ప్రాక్టీస్‌ పిరియడ్‌లో ప్రతి నెల 
  • రూ.5 వేలు స్టైఫండ్‌ ఇస్తాం.
  • న్యాయవాదుల సంక్షేమ నిధి (వెల్ఫేర్‌ ఫండ్‌) కోసం రూ.100 కోట్లు. 
  • హైకోర్టులో ప్రాక్టీస్‌ చేస్తున్న న్యాయవాదులకు ఇళ్ల స్థలాలను తక్కువ ధరకు ఇస్తాం.

నాయీ బ్రాహ్మణులు, టైలర్లు, రజకులు
షాపులు ఉన్న నాయీ బ్రాహ్మణులకు, లాండ్రీ షాపు ఉన్న రజకులకు, టైలర్‌ షాపులున్న టైలర్లకు సంవత్సరానికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందిస్తాం. వారికి తోడుగా ఉంటాం.

ఆర్య వైశ్యులు
ఆర్య వైశ్యలకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తాం. ఆర్య వైశ్య సత్రాలను నడిపే హక్కును వారికే ఇస్తాం.

కుల వృత్తిదారులు..చిరు వ్యాపారులు

పెట్టుబడి కోసం రోజుకు 2 వేల నుంచి 3 వేల రూపాయిలను రూ.3, రూ.4 నుంచి రూ.10 వరకు వడ్డీకి తెచ్చుకుంటూ అవస్థలు పడుతున్న కుల వృత్తిదారులు, చిరు వ్యాపారుల (ఫుట్‌పాత్‌ మీద సామాన్లు అమ్ముకునేవారు, తోపుడు బండ్ల మీద కూరగాయలు, టిఫిన్లు అమ్ముకునేవారు తదితరులు)కు గుర్తింపు కార్డులిచ్చి, రూ.10 వేలను సున్నా వడ్డీకే ఇస్తాం. ఈ సొమ్మును వారు ఎప్పుడైనా తీసుకోవచ్చు.

విద్యనైపుణ్య శిక్షణ

  • అధికారంలోకి రాగానే ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలల ముఖచిత్రాల (ఫొటోలను)ను మీ ముందుంచుతాం. రెండేళ్లలో వాటి దశ, దిశ మార్చి మారిన చిత్రాలను మళ్లీ మీకు చూపిస్తాం. సూళ్లల్లో చదువుల ప్రమాణాలు మారుస్తాం. ప్రతి స్కూల్‌లోనూ ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడతాం. మాతృభాషకు తగిన ప్రాధాన్యం ఇచ్చేందుకు తెలుగు సబ్జెక్టును ప్రతి విద్యార్థి తప్పనిసరిగా చదివేలా నిబంధన చేస్తాం. పుస్తకాలు, యూనిఫాంలు సరైన సమయానికి ఇస్తాం. మధ్యాహ్న భోజన నాణ్యతను పెంచుతాం. టీచర్ల భర్తీని పూర్తి స్థాయిలో చేస్తాం.
  • ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల్లో ప్రస్తుతం నేర్పుతున్న కోర్సులను ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతాం. తదనుగుణంగా సాంకేతిక కళాశాలలకు పూర్తి సహాయ సహకారాలు అందించి ఉన్న కోర్సులను అప్‌గ్రేడ్‌ చేసి నైపుణ్య ప్రమాణాలు పెంచుతాం.
  • ప్రయివేట్‌ స్కూళ్లు, కళాశాలల ఫీజుల తగ్గింపు, ప్రమాణాల పెంపు, ప్రయివేటు టీచర్ల స్థితిగతులు మెరుగుపరిచేందుకు ఒక రెగ్యులేటరీ కమిషన్‌ ఏర్పాటు చేసి ఆ కమిషన్‌ నేరుగా ముఖ్యమంత్రికే రిపోర్ట్‌ చేసే వీలు కల్పిస్తూ, తద్వారా మెరుగైన పరిస్థితులు తీసుకొస్తాం.

ఎస్సీ, ఎస్టీ సంక్షేమం

  • ఎస్సీలకు మూడు వేర్వేరు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. (మాదిగలకు, మాలలకు, రెల్లి తదితర కులాలకు)
  • ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ను పారదర్శకంగా అమలు చేస్తాం.
  • ఎస్సీ, ఎస్టీలకు భూ పంపిణీ కార్యక్రమంతో పాటు ఉచితంగా బోరు వేయించి ఇస్తాం.
  • ఎస్సీ, ఎస్టీ, చెల్లెమ్మల వివాహానికి ‘వైఎస్‌ఆర్‌ పెళ్లి కానుక’గా రూ.1 లక్ష ఇస్తాం.
  • ఎస్సీ, ఎస్టీ కాలనీలు, గిరిజన తండాలలో ప్రతి ఇంటికీ 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ ఇస్తాం. లేదా సంవత్సరానికి రూ.6 వేలు నేరుగా చేతికే ఇస్తాం.
  • గిరిజనులకు ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసి అందులో ప్రత్యేకంగా యూనివర్శిటీ, మెడికల్‌కాలేజీ, ఇంజినీరింగ్‌ కాలేజీ ఏర్పాటు చేస్తాం.
  • 500 మంది జనాభా ఉన్న ప్రతి తండాను, గూడెంను పంచాయతీగా మారుస్తాం.
  •  ప్రతి ఐటీడీఏ పరిధిలో ఒక సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తాం.
  • పోడు భూములు సాగు చేసుకునే గిరిజన రైతులకు యాజమాన్య హక్కు కల్పిస్తూ ఫారెస్ట్‌ రైట్స్‌ యాక్ట్‌ 2006 ప్రకారం గిరిజనులకు వైఎస్సార్‌ ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం.
  • ఎస్సీ కాని, ఎస్టీ కాని ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్సార్‌ బీమా ద్వారా రూ.5 లక్షలు ఇస్తాం.
  •  ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఇచ్చిన అసైన్‌మెంట్‌ భూములకు పట్టా భూములకు ఇస్తున్న విలువ కంటే తక్కువ పరిహారం ఇవ్వడాన్ని పూర్తిగా అరికడతాం. ఇలా తీసుకునే భూములకు, పట్టా భూములకు ఇచ్చే పరిహారం కంటే 10 శాతం ఎక్కువ పరిహారం ఇచ్చేట్టుగా చట్ట సవరణ చేస్తాం.

హిందూ ఆలయాలు

  • అర్చకులకు రిటైర్మెంట్‌ విధానాన్ని రద్దు చేస్తాం.
  • 6సి దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు మార్చి 2019 జీవోలో సూచించిన వేతనం కంటే అదనంగా 25 శాతం జీతాలు పెంచుతాం.
  • దేవాలయాల్లో ధూప, దీప, నైవేద్యాలు, అర్చకుల వేతనాల కోసం పంచాయతీ జనాభాను బట్టి నెలకు రూ.10 వేల నుంచి రూ.35 వేల వరకు ఇస్తాం.
  • అర్చకులకు ఇళ్ల స్థలాలు కేటాయించి వారికి ఇళ్లు కట్టిస్తాం.

ముస్లిం మైనారిటీలు

  • మైనారిటీల సబ్‌ ప్లాన్‌ను పారదర్శకంగా అమలు. 
  • వక్ఫ్‌ బోర్డ్, ముస్లిం మైనార్టీలకు సంబంధించిన స్థిర–చర ఆస్తులను రీ సర్వే చేయించి పూర్తి స్థాయిలో శాశ్వత ప్రాతిపదికన వాటిని పరిరక్షిస్తూ, స్థిర ఆస్తులను డిజిటలైజ్‌ చేయించి, ఆయా వర్గాల ప్రజల అభివృద్ధికి ఉపయోగపడేలా ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు.
  • ముస్లిం మైనారిటీ చెల్లెమ్మల వివాహానికి వైఎస్సార్‌ కానుకగా రూ.లక్ష ఇస్తాం.
  • హజ్‌ యాత్రకు వెళ్లే ముస్లింలకు ఆర్థిక సాయం చేస్తాం. ఇమామ్‌లకు ఇళ్ల స్థలాలు కేటాయించి వారికి ఇళ్లు కట్టిస్తాం.
  • మసీదులో ఇమామ్‌లు, మౌజామ్‌లకు గౌరవ వేతనం కోసం నెలకు రూ.15 వేలు ఇస్తాం.
  • ముస్లిం మైనారిటీకి చెందినవారు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్సార్‌ బీమా ద్వారా రూ.5 లక్షలు ఇస్తాం.

క్రిస్టియన్‌ మైనారిటీలు

  • క్రిస్టియన్‌ మైనారిటీ చెల్లెమ్మల వివాహానికి వైఎస్‌ఆర్‌ కానుకగా రూ.లక్ష ఇస్తాం.
  • పాస్టర్లకు వివాహ రిజిస్ట్రార్‌ లైసెన్స్‌ పద్ధతిని సులభం చేస్తాం.
  • పాస్టర్లకు రూ.5 వేలు తగ్గకుండా గౌరవ వేతనం ఇస్తాం.
  • హోలీ ల్యాండ్‌ యాత్రకు వెళ్లే క్రిస్టియన్లకు ఆర్థిక సాయం చేస్తాం.
  • పాస్టర్లకు ఇళ్ల స్థలాలు కేటాయించి వారికి ఇళ్లు కట్టిస్తాం.
  • క్రిస్టియన్‌ మైనారిటీకి చెందినవారు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్‌ఆర్‌ బీమా ద్వారా రూ.5 లక్షలు ఇస్తాం.


 పరిశ్రమలు 

  • ప్రత్యేక హోదా దేవుడి దయతో సాధిద్దాం. తద్వారా ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం 
  • పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకాలుగా ఇస్తున్న రాయితీలకు తోడు ఏపీఐడీసీని పునరుద్ధరించి తద్వారా నిరుద్యోగ యువతకు సబ్బిడీ అందించి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడతాం.  

జర్నలిస్టులు
జర్నలిస్టులకు ఆయా ప్రాంతాల్లో ఇంటి స్థలాలు ఏర్పాటు చేస్తాం.

ప్రభుత్వ ఉద్యోగులు  

  • సీపీఎస్‌ రద్దు చేస్తాం. పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తాం 
  • ఉద్యోగులు కోరుకున్న విధంగా అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్‌ ఇస్తాం.  అంతేకాదు సకాలంలో పీఆర్‌సీ అమలు చేస్తాం.  
  • అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను వారి అర్హత, సర్వీసును పరిగణనలోకి తీసుకొని వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్‌ చేస్తాం 
  • సమాన పనికి–సమాన వేతనం ప్రాతిపదికగా అవుట్‌ సోర్సింగ్‌ వారికి న్యాయం చేస్తాం 
  • పెన్షనర్స్‌ సమస్యల పరిష్కారానికి ప్రతి జిల్లాలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేస్తాం 
  • పోలీసులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వీక్లీ ఆఫ్‌ను అమలు చేస్తాం 
  • సైనికులు,మాజీ సైనికులు..  చట్టం వారికి కల్పించిన రాయితీలు/హక్కులు కూడా పొందలేని పరిస్థితుల్లో ఉన్నారు. వీటిని మారుస్తూ వీరికి గౌరవమిస్తూ ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో ఒక ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసి.. వారి సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. 
  • ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల మీద అరాచకాలు పెరిగిపోయాయి. మన ప్రభుత్వం రాగానే ఉద్యోగులు నిర్భయంగా పనిచేసుకునే స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పిస్తాం 
  • అంగన్‌వాడీ , ఆశా వర్కర్లు, హోంగార్డుల జీతాలు, తెలంగాణ ఇస్తున్న జీతాల కన్నా రూ.1,000 ఎక్కువ ఇచ్చి... వారి పరిస్థితి మెరుగుపరుస్తాం. మన రాష్ట్రంలో తక్కువగా జీతం తీసుకుంటున్న వి.ఓ.ఏ, సంఘమిత్ర, యానిమేటర్ల జీతాలు రూ.10,000 పెంచుతాం.  వారి సమస్యలు పరిష్కరిస్తాం 
  •  ప్రభుత్వ ఉద్యోగులకు, ఆయా ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇస్తాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement