ప్రజల మనసు గెలిచిన మేనిఫెస్టో | YSRCP Manifesto Is A People Manifesto | Sakshi
Sakshi News home page

ప్రజల మనసు గెలిచిన మేనిఫెస్టో

Published Sun, Apr 7 2019 7:17 AM | Last Updated on Sun, Apr 7 2019 8:06 AM

YSRCP Manifesto Is A People Manifesto - Sakshi

మేనిఫెస్టో తమకు పవిత్ర గ్రంథమని వైఎస్‌ జగన్‌ విశ్వసిస్తారు. మేనిఫెస్టో అంటే.. ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం ప్రజలకు అబద్ధాలు చెప్పే ప్రకటన కాదన్నది ఆయన విధానం. మేనిఫెస్టో పారదర్శకంగా, సరళంగా, వీలైనంత క్లుప్తంగా అందరికీ అర్థమయ్యేలా ఉండాలని ఆయన భావన. మేనిఫెస్టోను ప్రజలకు అందుబాటులో ఉంచి.. వాటి అమలుకు జవాబుదారీగా ఉంటామన్నారు. ఐదేళ్ల పాలన తర్వాత.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఇదిగో అమలు చేశామని చెప్పి.. మళ్లీ ప్రజల ఓట్లు అడుగుతామని స్పష్టంచేశారు. అందుకు తగ్గట్లుగానే అంశాలవారీగా స్పష్టంగా, క్లుప్తంగా ఫొటోలతో సహా రెండు పేజీల్లో వైఎస్సార్‌సీపీ 2019 ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించి ప్రజల ముందుంచారు.  

రాష్ట్రంలో సరికొత్త రాజకీయ విప్లవానికి వైఎస్సార్‌సీపీ నాంది పలికింది. విశ్వసనీయతకు మారుపేరైన ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి..‘నేను విన్నాను.. నేను ఉన్నాను’.. శీర్షికన ఉగాది పర్వదినాన పార్టీ ఎన్నికల మేనిఫెస్టో–2019 ప్రకటించారు. ప్రజల సంక్షేమంతో పాటు రాష్ట్ర ప్రగతిలో సరికొత్త అధ్యాయం లిఖించే దిశగా ముందడుగు వేశారు. ‘ఇదిగో మా మేనిఫెస్టో ఇదీ.. రానున్న ఐదేళ్లలో ప్రజాసంక్షేమానికి నాదీ భరోసా...రాష్ట్ర ప్రగతికి పూచీ నాది’అంటూ.. వైఎస్‌ జగన్‌ ఎన్నికల మేనిఫెస్టోను శనివారం ఉదయం విడుదల చేశారు. మేనిఫెస్టో అంటే తమకు పవిత్ర గ్రంథమని పునరుద్ఘాటిస్తూ.. అందులో ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఐదేళ్ల పాలన తరువాత మేనిఫెస్టో హామీలను నెరవేర్చిన తరువాతే.. మళ్లీ ప్రజల తీర్పు కోరుతామని తేల్చిచెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లో ఓ పార్టీ ఇంత పారదర్శకంగా, సరళంగా, స్పష్టంగా ఎన్నికల ప్రణాళిక విడుదల చేయడం ఇదే తొలిసారి. 

సాక్షి, అమరావతి : ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి దిశగా తమ విస్పష్టమైన ప్రణాళికను మేనిఫెస్టో ద్వారా వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారు. రాజన్న రాజ్యం–రైతన్న రాజ్యం దిశగా..  ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాతలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ వరాల జల్లు కురిపించింది. అప్పుల్లో కూరుకుపోయిన అన్నదాతల జీవితాల్లో వెలుగులు నింపేలా వినూత్న పథకాలను ప్రకటించారు. రైతులు, కౌలు రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, విద్యార్థులు, వృద్ధులు, వికలాంగులు, చేనేతల సంక్షేమానికి నిర్మాణాత్మకమైన హామీలిచ్చారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్లు, కాపులు, యాదవులు, మత్స్యకారులు, ఆర్యవైశ్యులు, నాయీబ్రాహ్మణులు, రజకులు, టైలర్లు, చిరువ్యాపారులతోపాటు క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ, ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, అగ్రిగోల్డ్‌ బాధితులు.. ఇలా అన్ని వర్గాల సంక్షేమానికి మేనిఫెస్టోలో వైఎస్సార్‌సీపీ పెద్దపీట వేసింది. ప్రతి ఇంటికి నవరత్నాల ద్వారా సంవత్సరానికి కనీసం రూ.1 లక్ష నుంచి రూ.5లక్షల వరకూ.. లబ్ధి చేకూరేలా ఆ పార్టీ ప్రణాళిక రూపొందించింది. 

ప్రజల నుంచి పుట్టిన మేనిఫెస్టో
రాష్ట్ర ప్రజల గుండె చప్పుడుకు ప్రతీకగా వైఎస్‌ జగన్‌ తమ మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టో అంటే ఏదో ఏసీ గదుల్లో కూర్చొని రాసింది కాదు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ రూపొందించిన ప్రమాణ పత్రం ఇది. ఇందులో పేర్కొన్న అంశాలన్నీ కూడా ప్రజల నుంచి తీసుకున్నవే. ఓ రాజకీయ నాయకుడు ప్రజలకు ఓ మాట ఇచ్చాక ఆ  మాటకు కట్టుబడి ఉండాలన్నది జగన్‌ నిబద్దత. మైక్‌పట్టుకుని ఓ విధానాన్ని ప్రకటించాక దాన్ని ఆచరణలో చేసి చూపించాలన్నది తీరాలన్నది ఆయన సిద్ధాంతం. మేనిఫెస్టోలో ప్రకటించాక ఆ హామీని కచ్చితంగా అమలు చేయాల్సిందేనన్నది ఆయన దృక్పథం. అందుకు అనుగుణంగానే వైఎస్‌ జగన్‌ తమ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించారు. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత వైఎస్‌ జగన్‌ దశాబ్దకాలంగా ప్రజల మధ్యనే ఉంటూ వచ్చారు. గత ఐదేళ్లలో చంద్రబాబు సర్కారు ప్రజావ్యతిరేక విధానాలపై అలుపెరుగని పోరాటం సాగించారు. ప్రజల కష్టాలు, రాష్ట్ర సమస్యలను ఆయన చాలా దగ్గర నుంచి చూశారు. తద్వారా అధికారంలోకి వస్తే ఏం చేయాలన్నదానిపై ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చారు. ఆ ప్రాతిపదికనే రెండేళ్ల క్రితం విజయవాడలో నిర్వహించిన పార్టీ ప్లీనరీ సమావేశాల్లో నవరత్నాల పథకాలను వెల్లడించారు.

తన చారిత్రాత్మక పాదయాత్ర ద్వారా నవరత్నాల పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. దాంతోపాటు పాదయాత్ర సందర్భంగా ప్రజల కష్టనష్టాలు, సమస్యలు విన్నారు. ప్రజల ఆవేదన, రాష్ట్ర పరిస్థితిని పూర్తిగా అవగతం చేసుకున్నారు. ఆ సమస్యలను పరిష్కరించేలా తమ మేనిఫెస్టో ఉండాలని భావించారు. అందుకే పార్టీ సీనియర్లతో మేనిఫెస్టో కమిటీని రూపొందించారు. వివిధ అంశాలపై శాశ్వత పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆర్థిక, సామాజికరంగాల నిపుణుల సలహాలు,సూచనలు తీసుకున్నారు. అనంతరం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి మార్గనిర్దేశం చేసేలా 2019 ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించారు. పేదల సమస్యలను పరిష్కరించేందుకు తాను ఉన్నాను అంటూ శాస్త్రీయమైన, హేతుబద్ధమైన అన్నింటికీ మించీ మానవీయతతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోను తమ పవిత్ర గ్రంథంగా ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక ఆ మేనిఫెస్టోలోని అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పరిపాలన కొనసాగిస్తానని ఆయన స్పష్టంచేశారు. మేనిఫెస్టోను ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉంచుతూ ప్రజలకు  జవాబుదారీగా ఉంటామన్నారు. నేను విన్నాను... నేను ఉన్నాను అంటూ వైఎస్‌ జగన్‌  ప్రజలకూ రాష్ట్రానికి భరోసా ఇచ్చారు. 

సమసమాజ నిర్మాణానికి దిక్సూచి
మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా మానవీయత, ప్రగతికాముకతో వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోను రూపొందించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రజల కష్టాలు తీర్చి.. రాష్ట్రాన్ని ప్రగతిబాటలో పరుగులు పెట్టించేందుకు రోడ్‌మ్యాప్‌గా మేనిఫెస్టోను రూపొందించారు. మొత్తం 35 అంశాల కింద తమ ప్రణాళికను ఆవిష్కరించారు. రైతులు–వ్యవసాయనికి పెద్దపీట వేస్తూ 14హామీలు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తామని విస్పష్టమైన హామీతోపాటు జలయజ్ఞం కింద రాష్ట్రంలో అన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చారు. ఎస్సీ–ఎస్టీ సంక్షేమం కింద 11 అంశాలు..బీసీ సంక్షేమం కింద 8 అంశాలకు సంబంధించి హామీలు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ అక్కలకు ఏడాది తరువాత ఆయా కార్పొరేషన్ల ద్వారా రూ.75వేలు ఉచితంగా ఇస్తామన్నారు. అవ్వాతాతల సంక్షేమం కోసం మనవడిగా జగన్‌ ముందుకొచ్చారు.పింఛన్‌ అర్హత వయసును 65ఏళ్ల నుంచి 60ఏళ్లకు తగ్గించడంతోపాటు పింఛన్‌ను రూ.3వేలకు పెంచుతామన్నారు. 

ప్రత్యేక హోదాతో ఉద్యోగాల విప్లవం

  • ఉద్యోగులపట్ల వైఎస్‌ జగన్‌ తన  చిత్తశుద్ధిని చాటుకున్నారు. 27శాతం ఐఆర్‌ ఇస్తామని చెప్పడంతోపాటు ఏకంగా 10హామీలు ఇవ్వడంపట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 
  • ప్రత్యేక హోదా సాధించి రాష్ట్రంలో ఉద్యోగాల విప్లవం తీసుకువస్తామని వైఎస్సార్‌సీపీ తమ విజన్‌ను ఆవిష్కరించింది.  
  • అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యల పరిష్కారానికి హేతుబద్ధమైన పరిష్కార మార్గాన్ని వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. తక్షణం రూ.1,150 కోట్లు విడుదల చేసి 13లక్షల మందికి మేలు చేస్తామన్నారు. మిగిలినవారి సమస్యను కూడా త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు.   
  • ఇన్నాళ్లూ గుర్తింపునకు నోచుకోని న్యాయవాదులు, ఆటో/ట్యాక్సీ కార్మికులు, టైలర్లు... ఇలా అన్ని వర్గాల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో సాక్షిగా వెల్లడించింది. 
  • కుటుంబాల్లో కలతలుపెడుతూ మానవ సంబంధాలను దెబ్బతీస్తున్న మద్యం మహమ్మారిని మూడు దశల్లో నిషేధించి.. మద్యం విక్రయాలను స్టార్‌ హోటళ్లకు పరిమితం చేస్తామని వైఎస్‌ జగన్‌ ప్రకటించడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement