వైఎస్సార్‌ సీపీ మేనిఫెస్టో : రైతులపై వరాల జల్లు | YSRCP Assurances To Farmers In manifesto | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ మేనిఫెస్టో : రైతులపై వరాల జల్లు

Published Sat, Apr 6 2019 11:36 AM | Last Updated on Sat, Apr 6 2019 4:24 PM

YSRCP Assurances To Farmers In manifesto - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని అన్నదాతలను వైస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వరాల వెల్లువతో ముంచేసింది. ప్రస్తుతం అప్పుల్లో కూరుకుపోయిన రైతుల బతుకుల్లో వెలుగు నింపేలా విన్నూత్న పథకాలను ప్రకటించింది. పేదరికాన్ని తరిమి కొట్టి.. ప్రతి రైతును ధనవంతున్ని చేసే పథకాలను ప్రకటించారు. పంటలకు గిట్టుబాబటు ధరలతో పాటు  ప్రతి కుటుబంబానికి పెట్టుబడి సాయం కింద రూ. 50వేలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ‘నేను విన్నాను.. నేను ఉన్నాను..’ అనే శీర్షికతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉగాది పర్వదినాన పార్టీ ఎన్నికల మేనిఫెస్టో– 2019 విడుదల చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఉదయం మేనిఫెస్టో విడుదల చేశారు. 14 నెలల సుదీర్ఘ పాదయాత్రలో ఆయన చూసినవి, తెలుసుకున్న అంశాల ప్రధాన ప్రాతిపదికగా ఈ మేనిఫెస్టోను రూపొందించారు. నవరత్నాలతో పాటు పాదయాత్రతో ఇచ్చిన హామీలను కూడా మేనిఫెస్టోలో పొందుపరిచారు.

చదవండి : వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలో ఇంకా ఏమున్నాయంటే..

వైఎస్సార్‌సీపీ ప్రకటించిన మేనిఫేస్టోలో రైతులకు పెద్దపీట వేశారు. రాజన్న రాజ్యంలో రైతే రాజులా బతికారు. మళ్లీ రాజన్న రాజ్యం తేవాలనే ఉద్దేశంతో రైతులపై వరాల జల్లు కురిపించారు. ప్రతి రెతు కుటుంబాని పెట్టుబడి సాయం కింద రూ. 50వేలు అందిస్తామని హామీ ఇచ్చారు. పంటలకు మద్దతుధరతో పాటు నాలుగు వేల కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తుల సహాయక నిధిని ఏర్పాటుచేస్తామన్నారు. ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన రైతు కుటుంబానికి వైఎస్సార్‌ బీమా పథకం ద్వారా రూ. ఏడు లక్షలు అందించనున్నారు. అంతేకాదు ఆ డబ్బు అప్పులవాళ్లకు చెందకుండా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొచ్చి.. ఆ రైతు కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇలా మొత్తంగా ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి లక్ష రూపాయల సాయం అందేలా హామీలను అందించారు. అలాగే కౌలు రైతులపై కూడా వరాల జల్లు కురిపించారు. కౌలు రైతులకు వడ్డీలేని రుణాలు ఇవ్వడంతో పాటు.. ఆ కాల వ్యవధిలో పంటకు సంబంధించిన అన్ని రాయితీలు, సబ్సిడీలు వారికి అందేలా చూస్తామన్నారు. రైతులకు ప్రకటించిన వైఎస్సార్‌ బీమా పథకాన్ని కౌలు రైతు అందజేస్తామన్నారు. మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన ముఖ్య హామీలు..

  • ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం 50వేలు
  • పంటవేసే సమయానికి మే నెలలోనే రూ.12500 
  • పంటబీమా కోసం రైతన్న చెల్లించాల్సిన బీమా ప్రిమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది
  • రైతన్నకు ఉచిత బోర్లు. .. పగటిపూట ఉచితంగా 9 గంటల కరెంటు
  • ఆక్వా రైతులకు యూనిట్‌ రూపాయిన్నర చార్జీకే కరెంటు 
  • మూడువేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు
  • పంట వేసేముందే.. ఆయా పంటలకు లభించే మద్దతు ధరల ప్రకటన.. గిట్టుబాటు ధరకు గ్యారెంటీ 
  • నాలుగు వేల కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తుల సహాయక నిధిని ఏర్పాటు
  • ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు, గోదాములు, అవసరం మేరకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కేంద్రాలు ఏర్పాటు
  • మొదటి ఏడాది సహకార రంగాన్ని పునరుద్ధరణ.
  • రెండో ఏడాది నుంచి సహకార డైరీకి పాలు పోసే.. ప్రతిపాడి రైతుకు లీటరుకు నాలుగు రూపాయలు బోనస్‌
  • వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డుట్యాక్స్‌, టోల్‌ ట్యాక్స్‌ రద్దు
  • ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన రైతు కుటుంబానికి వైఎస్సార్‌ బీమా పథకం ద్వారా రూ. ఏడు లక్షలు అందజేత. అంతేకాదు ఆ డబ్బు అప్పులవాళ్లకు చెందకుండా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొచ్చి.. ఆ రైతు కుటుంబానికి అండగా ఉండటం.

కౌలు రైతులకు ఇచ్చిన హామీలు

  • కౌలు రైతులకు పంటపై హక్కు ఉండేవిధంగా చర్యలు.. 11 నెలలు మించకుండా కౌలు రైతుల భూములకు రక్షణ కల్పిస్తూ చట్టసవరణ
  • కౌలు రైతులకు వడ్డీలేని రుణాలు..  ఆ కాల వ్యవధిలో పంటకు సంబంధించిన అన్ని రాయితీలు, సబ్సిడీలు వారికే అందిస్తారు
  • నవరత్నాల్లో రైతులకు ప్రకటించిన మిగిలిన అన్ని హామీలు.. పంట బీమా దగ్గరి నుంచి వడ్డీలేని రుణాల వరకు.. 9 గంటల ఉచిత విద్యుత్‌ నుంచి గిట్టుబాటు ధరల గ్యారెంటీ వరకు.. ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వైఎస్సార్‌ బీమా ద్వారా ఏడు లక్షలు రూపాయలు.. ఇలా ప్రతి అంశామూ కౌలు రైతులందరికీ వర్తింపజేశారు.
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు రైతుభరోసా కింద ఏటా 12,500 రూపాయలు వీరికి అదనంగా  అందజేస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement