వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టో..! | YSR Congress Party Releases Manifesto for Election 2019 | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో విడుదల..

Published Sat, Apr 6 2019 10:10 AM | Last Updated on Sat, Apr 6 2019 4:44 PM

YSR Congress Party Releases Manifesto for Election 2019 - Sakshi

సాక్షి, అమరావతి : తెలుగువారి నూతన సంవత్సరాది అయిన ఉగాది పర్వదినాన కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ.. నవయుగ సాకారానికి నాంది పలుకుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించడమే లక్ష్యంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన ఎన్నికల ప్రణాళికను ప్రకటించారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యం.. రాష్ట్రంలోని ప్రతి ఇంటిలోనూ సుఖసంతోషాలు నింపడమే ధ్యేయం.. ప్రతి మొములోనూ చిరునవ్వు కదలాడేలా.. ప్రజలంతా ఆత్మగౌరవంతో ఆర్థిక స్వావలంబనతో ఉన్నతంగా జీవించేలా.. సమున్నత ఆశయంతో ప్రతి ఒక్కరికీ మేలు కలిగించేవిధంగా వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోను వైఎస్‌ జగన్‌ ప్రజల ముందు ఉంచారు. అన్నదాతకు అండగా .. సేద్యాన్ని మళ్లీ పండుగ చేస్తూ.. రైతులపై వైఎస్‌ జగన్‌ వరాల జల్లు కురిపించారు. అందరికీ వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తింపజేస్తూ.. ఆయురారోగ్యాలకు భరోసాగా నిలిచారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, అమ్మవడి పథకాల ద్వారా కేజీ నుంచి పీజీ వరకు చదువులకు ప్రాధాన్యమిస్తూ.. ఉన్నత విద్యావంతుల సమాజానికి పెద్దపీట వేశారు.

 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, యాదవులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లు, రజకులు, మత్స్యకారులు, చేనేత కార్మికులు, కులవృత్తి దారులు, చిరు వ్యాపారులు, కాపులు, ఆర్య వైశ్యులు, న్యాయవాదులు, ముస్లిం మైనారిటీలు, క్రిష్టియన్‌ మైనారిటీలు, అగ్రకుల పేదలు, యువత ఇలా సమాజంలోని అన్ని వర్గాల వారికి సామాజిక భద్రత, భరోసా ఇచ్చేలా..  సంక్షేమానికి, స్వావలంబనకు పెద్ద పీట వేస్తూ.. సమసమాజ స్థాపన.. అన్ని వర్గాల సుఖసంక్షేమాలే ధ్యేయంగా మేనిఫెస్టోను వైఎస్‌ జగన్‌ రూపొందించారు.

ఎన్నికల మేనిఫెస్టో పవిత్రమైనది. విధిగా అమలు చేయాల్సినది. అమలు చేసిన హామీల ఆధారంగానే మళ్లీ ప్రజల ముందుకు వెళ్లి ఓట్లు అడగాలని త్రికరణ శుద్ధిగా నమ్మిన వైఎస్‌ జగన్‌.. తన ఎన్నికల ప్రణాళికను ప్రకటించేలా సమయంలో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. మనసా, వాచా, కర్మణా ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేస్తానని, తాను ప్రకటించిన హామీల్లో ఏ ఒక్క అబద్ధమూ లేదని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో 650కిపైగా హామీలు ఇచ్చి.. ఏ ఒక్కటి నెరవేర్చకుండా.. ప్రజలను మోసం చేసిన చంద్రబాబు..  మళ్లీ తాజాగా కొత్త మేనిఫెస్టో పేరుతో డ్రామా ఆడుతున్నారని, మీ భవిష్యత్తు నా బాధ్యత అంటూ.. మళ్లీ ప్రజల చెవ్వులు పువ్వులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది సబుబేనా అని ప్రశ్నించారు.

గత తొమ్మిదేళ్లుగా ప్రజల మధ్య ఉంటూ.. తన సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమై.. వారి సమస్యలు తెలుసుకొని భరోసా ఇచ్చిన జననేత వైఎస్‌ జగన్‌.. ‘ నేను విన్నాను.. నేను ఉన్నాను’ అన్న స్ఫూర్తిని చాటుతూ.. ‘మన ఇంటికి వైఎస్‌ పాలన వస్తుంది.. లక్షలాది కుటుంబాల్లో వెలకట్టలేని సంతోషం’  తెస్తుంది.. అంటూ మేనిఫెస్టోను అందించారు. అవ్వాతాతల కోసం పింఛన్ల పెంపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కలకు అండగా వైఎస్సార్‌ చేయూత, పేదలందరికీ ఇళ్లు, పట్టణ గృహనిర్మాణం, మద్యపాన నిషేధం, జీవన బీమా, యువతకు ఉపాధి, విద్య-నైపుణ్య శిక్షణ, పరిశ్రమలు, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, సుపరిపాలన తదితర అంశాల ద్వారా సామాజిక భద్రతకు వైఎస్‌ జగన్‌ పెద్ద పీట వేశారు. ప్రతి ఇంటికి నవరత్నాల ద్వారా రూ. లక్ష నుంచి ఐదు లక్షల వరకు లబ్ధి చేకూరుతుందని తన మేనిఫెస్టోలో ప్రముఖంగా పేర్కొన్న వైఎస్సార్‌సీపీ.. వైఎస్సార్‌ రైతు భరోసా కింద రైతులకు ఏటా ఉజ్జాయింపుగా రూ. 12,500 నుంచి లక్ష రూపాయల వరకు అందుతాయని, అదేవిధంగా అందరికీ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా లబ్ధిదారులకు ఉజ్జాయింపుగా లక్ష నుంచి 10 లక్షల వరకు సాయం అందుతుందని పేర్కొంది. ఇక, అమ్మవడి ద్వారా పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి రూ. 15వేలు ఏటా అందనుండగా, వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కలకు రూ. 75వేలు ఉచితంగా దశలవారీగా అందిస్తామని తెలిపింది.

ఫించన్ల పెంపు ద్వారా సంవత్సరానికి ఉజ్జాయింపుగా అవ్వా తాతలకు 36 వేల నుంచి 72వేల వరకు అందుతాయని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా ఉజ్జాయింపుగా రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు అందుతాయని, అదనంగా మరో 20వేలు విద్యార్థులకు వసతి, భోజనం కోసం తమ ప్రభుత్వం అందించనుందని తెలిపింది. పేదలందరికీ ఇళ్ల పథకం ద్వారా రూ. 2 నుంచి 5 లక్షలు లబ్ధిదారులకు అందనున్నాయని, అదేవిధంగా వైఎస్సార్‌ ఆసరా పథకం కింద పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు ఏటా ఉజ్జాయింపుగా రూ. 50వేలు అందనున్నాయని తెలిపింది.


 

మేనిఫెస్టోలోని అంశాల వారీగా ఇలా..

బీసీ సంక్షేమం

  • ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ప్రతి ఏడా రూ. 10,000 కోట్లతో , 5 సంవత్సరాలలో రూ. 50,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి,  ఈ ఐదేళ్లలో కనీసం రూ.20,000 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. మనం బీసీల అభ్యున్నతికి సంవత్సరానికి రూ. 15,000 కోట్ల చెప్పున ఐదేళ్లలో రూ. 75,000 కోట్లు ప్రత్యేక ఉప ప్రణాళిక ద్వారా ఖర్చు చేస్తాం
  • రాజకీయ ఎదుగుదల కోసం అన్ని నామినేటేడ్‌ పదవుల్లో(దేవాలయ ట్రస్టు బోర్డులు, మార్కెట్‌ యార్డు కమిటీలు, కార్పొరేషన్లు తదితర) బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. అంతేకాదు ఆర్థిక ఎదుగుదల కోసం అన్ని నామినేటెడ్, కాంట్రాక్ట్‌ వర్క్స్‌లో కూడా 50శాతం బీసీ, ఎసీ, ఎస్టీ మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం తీసుకొస్తాం
  • బీసీల్లో అన్ని ఉప కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వైఎస్సార్‌ చేయూత పథకానికి ఎంత అవసరమైతే అంత నిధులను కేటాయించి వారి అభ్యున్నతికి తోడుగా ఉంటాం.
  • బీసీ చెల్లెమ్మల వివాహానికి వైఎస్సార్‌ పెళ్లి కానుకగా, ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న రూ. 35,000లని రూ.50,000లకు పెంచుతాం
  • ప్రాతినిధ్యం లేని కులాలకు ఎంత వీలైతే అంత చట్ట సభల్లో అవకాశం కల్పించడానికి చిత్తశుద్దితో కృషి చేస్తాం
  • శాశ్వత ప్రాతిపదిక బీసీ కమీషన్‌ ఏర్పాటు చేసి చట్టబద్దత కల్పిస్తాం. ఆ కమిషన్‌ పరిధిని విస్తరించి, ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా ఆ కమిషన్‌ పారదర్శకంగా పనిచేసే పరిస్థితి కల్పిస్తాం. బీసీల సమస్యల్ని పరిష్కరించేందుకు, కులం సర్టిఫికేట్‌ దగ్గర నుంచి గ్రూపుల మార్పిడి వరకు, ఎంబీసీల వ్యవహారమైతేనేమి రోజు వారి బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలైతేనేమి, రాష్ట్ర పరిధిలోనేనివి కేంద్రానికి సిఫార్సు చేసి పంపించే అంశాలైనేమి, వీటన్నింటిని పరిష్కరించేందుకు శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ను చట్టబద్ధంగా, పారదర్శకంగా ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర పరిధిలోని అంశాలు ఇక్కడ పరిష్కరిస్తూ, కేంద్ర పరిధిలోని అంశాతైనే ఆ కమిషన్‌ ఇచ్చిన శాస్త్రీయ నివేదికను పొందుపరుస్తూ కేంద్రానికి తీర్మానం చేసి పంపుతాం.
  • ప్రమాదవశాత్తు బీసీ కులాలకు చెందిన వారు మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్సార్‌ బీమా ద్వారా రూ. 5,00,000 ఇస్తాం.

నాయీబ్రాహ్మణులు, టైలర్లు, రజకులు

  • షాపులు ఉన్న నాయీ బ్రాహ్మణులకు, లాండ్రీషాపు ఉన్న రజకులకు, టైలర్‌ షాపులున్న టైలర్లకు సంవత్సరానికి రూ. 10,000 ఆర్థిక సహాయం చేస్తాం. వారికి తోడుగా ఉంటాం.

మత్స్యకారులు

  • మత్స్యకారులకు వేట నిషేద సమయంలో( ఏప్రిల్‌ 15-జూన్‌ 14) ఆర్థిక సహాయం రూ. 4,000 వేలు నుంచి రూ. 10,000 పెంచుతాం.
  • మత్స్యకారుల పడవలకు కొత్తగా అనుమతులు మంజూరు చేస్తాం
  • ప్రమాదశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తాం.

చేనేత కార్మికులు

  • మగ్గం ఉన్న చేనేత కుటుంబానికి సంవత్సరానికి రూ. 24,000 ప్రోత్సాహకంగా ఇస్తాం
  • కులవృత్తిదారులు । చిరు వ్యాపారులు
  • కులవృత్తిదారులు, చిరువ్యాపారులకు ( పుట్‌పాత్‌ మీద సామన్లు అమ్ముకునేవారికి, తోపుడు బండ్ల మీద కూరగాయలు, టిఫెన్లు అమ్ముకునేవారికి ఇంకా అనేకమైన చిరువ్యాపారులు) రోజుకు రూ. 2000 నుంచి రూ.3000 పెట్టుబడి కోసం రూ. 3,4 నుంచి 10 రూపాయల వడ్డీతో అప్పులు తీసుకుని అవస్థలు పడుతున్న ఆ చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులిచ్చి రూ. 10,000 సున్నా వడ్డీకే ఇస్తాం. ఆ సొమ్మును వారు ఎప్పుడైనా తీసుకోవచ్చు.

కాపు సంక్షేమం

  • దేశంలో వివిధ రాష్ట్రాలలో జాట్లు, గుజ్జర్లు, పటేళ్లు, మనరాష్ట్రంలో కాపు సోదరులు వీరంతా కూడా రిజర్వేన్‌ కల్పించాలని కోరుతున్న పరిస్థితి మనం గమనిస్తూనే ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్లు 50శాతం మించకూడదన్న నిబంధన మనందరికి తెలిసిన ఉన్న చిక్కుముడి. ఇది తెలిసి కూడా టిడీపీ తమ గత ఎన్నికల ప్రణాళికలో కాపులకు బీసీలలో కలుపుతామని మెసపూరితమైన హామీ ఇచ్చారు. మనపరిధిలో లేని విషయంలో మనం ప్రయత్నం చేస్తామని చెప్పగలం కానీ అంతకుమించి రిజర్వేషన్‌ కల్పిస్తామని చెప్తే అది ప్రజలకు చేర్యే అవుతుంది. ఈ నేపథ్యంలో కాపు రిజర్వేషన్ల విషయంలో మా వైఖరి ఎప్పుడూ ఒక్కటే. మొదటి నుంచి మేము చెపుతూ ఉంటున్నట్టుగానే బీసీ హక్కులకు భంగం కలుగకుండా వారి ప్రయోజనాలకు నష్టం రాకుండా జరిగే రిజర్వేషన్లకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వం కాపు రిజర్వేన్ల విషయంలో మోసం చేయడమే కాకుండా, సంవత్సరానికి రూ. 1.000 కోట్ల చొప్పున ఐదేల్లలో రూ. 5,000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి ఈ ఐదేళ్లలో కేవలం రూ. 1,340 కోట్లు కేటాయించిన నేపథ్యంలో, మేము ప్రభుత్వంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్‌కు సంవత్సరానికి రూ. 2,000 కోట్లు చొప్పున ఐదేళ్లలకు కలిపి రూ. 10,000 కోట్లు కేటాయిస్తాం. ఖర్చు చేస్తాం.

ఆర్యవైశ్యులు

  • ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తాం. ఆర్యవైశ్య సత్రాలను నడిపే హక్కు వారికే ఇస్తాం.

న్యాయవాదులు

  • జూనియర్‌ న్యాయవాదులకు మొదటి 3 సంవత్సరాల ప్రాక్టీస్‌ పీరియడ్‌లో ప్రతి నెలకు రూ. 5000 స్టైఫండ్‌ ఇస్తాం
  • న్యాయవాదల వెల్‌ఫేర్‌ ఫండ్‌ కోసం రూ. 100 కోట్లు కేటాయిస్తాం.
  • హైకోర్టులో ప్రాక్టీస్‌ చేస్తున్న న్యాయవాదులకు ఇండ్లస్థలాలు తక్కువ ధరకు ఇస్తాం.

హిందూ దేవాలయాలు

  • అర్చకులకు రిటైర్మెంట్‌ విధానాన్ని రద్దు చేస్తాం
  • 6సీ దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు మార్చి 2019 జీఓలో సూచించిన వేతనం కంటే అదనంగా 25 శాతం జీతాలు పెంచుతాం
  • దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలు మరియు అర్చకుల వేతనాల కోసం పంచాయితీ జనాభాను బట్టి నెలకు రూ 10,000 నుంచి రూ 35,000 వరకూ ఇస్తాం
  • అర్చకులకు ఇళ్ల స్ధలాలు కేటాయించి వారికి ఇళ్లు కట్టిస్టాం

ముస్లిం మైనారిటీలు

  • మైనారిటీల సబ్‌ప్లాన్‌ను పారదర్శకంగా అమలు చేస్తాం
  • వక్ఫ్‌ బోర్డు, ముస్లిం మైనారిటీలకు సంబంధించిన స్థిర-చర ఆస్తులను రీసర్వే చేయించి పూర్తిస్ధాయిలో శాశ్వత ప్రాతిపదికన వాటిని పరిరక్షిస్తూ స్థిరాస్తులను డిజిటలైజ్‌ చేయించి , ఆయా వర్గాల ప్రజల అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేస్తాం
  • ముస్లిం మైనారిటీ చెల్లెమ్మల వివాహానికి వైఎస్‌ఆర్‌ కానుకగా రూ 1,00,000 ఇస్తాం
  • హజ్‌ యాత్రకు వెళ్లే ముస్లింకు ఆర్థిక సాయం చేస్తాం
  • ఇమామ్‌లకు ఇళ్ల స్ధలాలు కేటాయించి వారికి ఇళ్లు కట్టిస్తాం
  • మసీదులో ఇమామ్‌లు, మజమ్‌లకు గౌరవ వేతనం కోసం నెలకు రూ 15,000 ఇస్తాం
  • ప్రమాదవశాత్తూ ముస్లిం, మైనారిటికి చెందిన వారు మరణిస్తే వారి కుటుంబానికి  వైఎస్‌ఆర్‌ బీమా ద్వారా రూ 5,00,000 ఇస్తాం

క్రిష్టియన్‌ మైనారిటీలు
క్రిష్టియన్‌ మైనారిటీ చెల్లెమ్మల వివాహానికి వైఎస్‌ఆర్‌ కానుకగా రూ 1,00,000 ఇస్తాం
పాస్టర్లకు వివాహ రిజిస్ర్టార్‌ లైసెన్స్‌ పద్ధతిని సులభతరం చేస్తాం
పాస్టర్లకు రూ 5000 తగ్గకుండా గౌరవం వేతనం ఇస్తాం
హోలీ ల్యాండ్‌ యాత్రకు వెళ్లే క్రిష్టియన్స్‌కు ఆర్థిక సాయం చేస్తాం
పాస్టర్లకు ఇళ్ల స్థలాలు కేటాయించి వారికి ఇళ్లు కట్టిస్తాం
ప్రమాదవశాత్తూ క్రిష్టియన్‌ మైనారిటీకి చెందిన వారు మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్‌ఆర్‌ బీమా ద్వారా రూ 5,00,000 ఇస్తాం

అగ్రకులాల సంక్షేమం

  • అన్ని అగ్రకులాల (క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ తదితర) వారికి కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం
  • ఆ కార్పొరేషన్‌లకు తగిన నిధులు కేటాయించి ఆయా కులాలకు చెందిన పేదలకు అండగా ఉంటాం

సుపరిపాలన

  • కుల, వర్గ, మతతత్వాలు లేని సమ సమాజ నిర్మాణానికి కావలసిన సుపరిపాలన అందిస్తాం
  • రాష్ట్రంలో భూములన్నింటినీ ‘సమగ్ర రీ సర్వే’ చేయించి భూ యజమానులకు శాశ్వత యాజమాన్య హక్కు కల్పిస్తాం
  • ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తాం, పరిపాలన ప్రజల దగ్గరకు తీసుకువెళ్లేందుకు చర్యలు చేపడతాం
  • రాజధానిని ఫ్రీ జోన్‌గా (అందరికీ ఉద్యోగ అవకాశాలు ఉండే విధంగా) గుర్తిస్తూ నిజమైన వికేంద్రీకరణే లక్ష్యంగా రాష్ట్రంలోని సమగ్రంగా అభివృద్ధి  చేస్తాం
  • గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా ‘గ్రామ సచివాలయాలు’  మరియూ పట్టణాల్లో ‘వార్డు సచివాలాయాలు’ ఏర్పాటు చేసి గ్రామ, ఆయా వార్డుల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వ పథకాలన్నింటిని ప్రజల దగ్గరకు తీసుకుపోయేందుకు కేంద్రంగా చేస్తాం. అంతేకాదు లంచాలకు తావులేకుండా ప్రభుత్వ పథకాలన్నీ 50 ఇళ్లకు ఓ గ్రామ వాలంటీరు లేదా వార్డు వాలంటీర్లచే డోర్‌ డెలివరీ చేయిస్తాం.

ప్రభుత్వ ఉద్యోగులు

  • సీపిఎస్‌ రద్దు చేస్తాం, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తాం
  • ఉద్యోగులు కోరుకున్న విధంగా అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్‌ ఇస్తాం. అంతేకాదు సకాలంలో పీఆర్‌సీ అమలుపరుస్తాం
  • అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను వారి అర్హత, సర్వీసును పరిగణనలోకి తీసుకుని వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్‌ చేస్తాం
  • సమాన పనికి-సమాన వేతనం ప్రాతిపదికన అవుట్‌ సోర్సింగ్‌ వారికి న్యాయం చేస్తాం
  • పెన్షనర్స్‌ సమస్యల పరిష్కారానికి ప్రతి జిల్లాలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేస్తాం
  • పోలీసులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వీక్లీ ఆఫ్‌ను అమలు చేస్తాం
  • సైనికులు, మాజీ సైనికులు చట్టం వారికి కల్పించిన రాయితీలు, హక్కులు కూడా పొందలేని పరిస్థితిలో ఉన్నారు. వీటిని మారుస్తూ వీరికి గౌరవమిస్తూ ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో ఒక ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసి వారి సమస్యలను యుద్ధప్రాతిపదిక పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం.
  • ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల మీద అరాచకాలు పెరిగిపోయాయి. మన ప్రభుత్వం రాగానే ఉద్యోగులు నిర్భయంగా పనిచేసుకునే స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పిస్తాం
  • అంగన్‌వాడి మరియు ఆశా వర్కర్ల, హోంగార్డుల జీతాలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న జీతాల కంటే రూ 1000 ఎక్కువ ఇచ్చి వారి పరిస్థితి మెరుగుపరుస్తాం. మన రాష్ట్రంలో తక్కువగా జీతం తీసుకుంటున్న విఓఏ, సంఘమిత్ర, యానిమేటర్ల జీతాలు రూ 10,000కు పెంచుతాం. విఆర్‌ఓ, విఆర్‌ఏ జీతాల మరియు ఉద్యోగ సమస్యలు పరిష్కరిస్తాం.
  • ప్రభుత్వ ఉద్యోగులకు, ఆయా ప్రాంతాల్లో ఇళ్ల స్ధలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇస్తాం.

పరిశ్రమలు

  • ప్రత్యేక హోదా దేవుడి దయతో సాధిద్దాం..తద్వారా ఉద్యోగాల విప్లవం తీసుకువస్తాం
  • పరిశ్రమల స్ధాపనకు ప్రోత్సాహకంగా ఇస్తున్న రాయితీలకు (భూమి, పన్ను, విద్యుత్‌ తదితర) తోడు ఏపీఐడీసీని పునరుద్ధరించి తద్వారా నిరుద్యోగ యువతకు సబ్సిడీ అందించి కొత్త అథ్యాయానికి శ్రీకారం చుడతాం

ఆటో/టాక్సీ

  • సొంత ఆటో/టాక్సీ నడిపే వారికి ఇన్సూరెన్స్‌, ఫిట్‌నెస్‌,  రిపేర్లు తదితర అసవరాల కోసం సంవత్సరానికి రూ. 10వేలు ఇస్తాం

జీవన బీమా

  • 18 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న ఏ పౌరుడైనా సహజంగా మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్సార్‌ జీవన బీమా పథకం ద్వారా రూ. లక్ష అందిస్తాం

ఎస్సీ, ఎస్టీ సంక్షేమం

  • ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. (మాదిగలకు, మాలలకు మరియు రెల్లి తదితర కులాలకు)
  • ఎస్సీ మరియు ఎస్టీ సబ్‌ప్లాన్‌ను పారదర్శకంగా అమలు చేస్తాం
  • ఎస్సీ, ఎస్టీలకు భూపంపిణీ కార్యక్రమంతోపాటు ఉచితంగా బోరు వేయించి ఇస్తాం
  • ఎస్సీ, ఎస్టీ చెల్లెమ్మల వివాహానికి ‘వైఎస్సార్‌ పెళ్లికానుక’గా లక్ష రూపాయలు ఇస్తాం
  • ఎస్సీ, ఎస్టీ కాలనీలలో మరియు గిరిజన తండాలలో ప్రతి ఇంటికీ 200 యూనిట్‌ల వరకు ఉచిత కరెంట్‌ ఇస్తాం లేదా సంవత్సరానికి రూ. ఆరు వేలు నేరుగా చేతికే ఇస్తాం
  • గిరిజనులకు ప్రత్యేక జిల్లా ఏర్పాటుచేసి అందులో ప్రత్యేకంగా యూనివర్సిటీ, మెడికల్‌ కాలేజ్‌ మరియు ఇంజినీరింగ్‌ కాలేజ్‌ ఏర్పాటు చేస్తాం
  • 500 మంది జనాభా ఉన్న ప్రతి తండాను, గూడెంను పంచాయతీగా మారుస్తాం
  • ప్రతి ఐటీడీఏ పరిధిలోనూ ఒక సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తాం
  • పోడు భూములను సాగు చేసుకునే గిరిజన రైతులకు యాజమాన్య హక్కు కల్పిస్తూ ఫారెస్ట్‌ రైట్స్‌ యాక్ట్‌ 2006 ప్రకారం గిరిజనులకు వైఎస్సార్‌ ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం
  • ప్రమాదవశాత్తు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు మరణిస్తే.. వారి కుటుంబానికి వైఎస్సార్‌ బీమా ద్వారా రూ. 5,00,000 ఇస్తాం
  • ఎస్సీ మరియు ఎస్టీ లబ్ధిదారులకు ఇచ్చిన అసైన్మెంట్‌ భూములు, అత్తగారి సొత్తు అన్నట్టుగా సేకరించి.. పట్టా భూములకు ఇస్తున్న విలువ కంటే తక్కువ పరిహారం ఇవ్వడాన్ని పూర్తిగా అరికడతాం. అలా తీసుకునే భూములకు, పట్టా భూములకు ఇచ్చే పరిహారం కంటే 10శాతం ఎక్కువ పరిహారం ఇచ్చేట్టుగా చట్ట సవరణ చేస్తాం.

విద్య - నైపుణ్య శిక్షణ

  • అధికారంలోకి రాగానే ఇప్పుడున్న ప్రభుత్వ స్కూళ్ల ముఖచిత్రాలను (ఫొటోలు) మీ ముందు ఉంచుతాం. రెండేళ్లలో వాటి దశ, దిశ మార్చి.. మారిన ముఖచిత్రాలు మరలా మీ ముందుంచుతాం. స్కూళ్లలో చదువుల ప్రమాణాలు మారుస్తాం. ప్రతి స్కూల్‌లోనూ ఇంగ్లిష్‌ మీడియాం ప్రవేశపెడతాం. మాతృభాషకు తగిన ప్రాధాన్యం ఇచ్చేందుకు తెలుగు సబ్జెక్టును తప్పనిసరిగా ప్రతి విద్యార్థి/ విద్యార్థినీ చదివేట్టుగా నిబంధన చేస్తాం. పుస్తకాలు, యూనిఫాంలు సరైన సమయానికి ఇస్తాం. మధ్యాహ్న భోజన నాణ్యతను పెంచుతాం. అవసరమైన మేరకు టీచర్ల ఉద్యోగాల భర్తీ పూర్తిస్థాయిలో చేస్తాం

జర్నలిస్టులు..

  • జర్నలిస్టులకు ఆయా ప్రాంతాలలో ఇంటి స్థలాలు ఏర్పాటు చేస్తాం

వైఎస్సార్‌ జలయజ్ఞం

  • దివంగత మహానేత వైఎస్సార్‌ కలలు కన్న జలయజ్ఞాన్ని పూర్తిచేస్తాం
  • పోలవరం, పూల సుబ్బయ్య వెలిగొండ సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తాం
  • రక్షిత మంచినీరు - సాగునీరు కల నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం. మళ్లీ జలకళను తీసుకొస్తాం


యువత-ఉపాధి

  • ప్రత్యేక హోదా సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నాం.. సాధించే వరకు ఈ పోరాటాన్ని చేస్తూనే ఉంటాం. హోదా సాధన ద్వారా ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం
  • ప్రతి గ్రామంలో గ్రామసచివాలయం ద్వారా అదే ఊరిలో పది మంది యువతకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం
  • అంతేకాదు ప్రతి గ్రామంలో, వార్డులో 50 ఇళ్లకు ఒకరు చొప్పున సేవా దృక్పథం ఉన్న యువతీయువకులను నెలకు రూ. 5వేల గౌరవ వేతనంతో గ్రామ వాలంటీర్‌గా, వార్డ్‌ వాలంటీర్‌గా నియమిస్తాం. వారు గ్రామ సచివాలయానికి, వార్డ్‌ సచివాలయానికి అనుసంధానకర్తగా ఉండి ఆ 50 ఇళ్లకు ప్రభుత్వ పథకాలు, వాటిలో భాగంగా నవరత్నాల ద్వారా అందించే పథకాలు, వైఎస్సార్‌ రైతు భరోసా నుంచి వైఎస్సార్‌ చేయూత వరకు అన్ని పథకాలు ఇంటివద్దకే అందేలా డోర్‌ డెలివరీ చేస్తారు. వీళ్లకి ఇంతకన్నా మెరుగైన ఉద్యోగాలు బయట ఎక్కడైనా వచ్చేవరకూ సేవా దృక్పథంతో ఈ సేవలను ఆ గ్రామంలో, వార్డులలో ఆయా సచివాలయాలతో అనుసంధానమై అందిస్తారు.
  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ, రేషన్‌, పింఛన్‌ మొదలగు వాటికి సంబంధించిన సమస్యలేవైనా 72 గంటల్లోనే గ్రామ సచివాలయాల, వార్డు సచివాలయాల ద్వారా పరిష్కరిస్తాం
  • రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న దాదాపు 2 లక్షల 30వేల ఉద్యోగాలను భర్తీ చేయడంతోపాటు ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగాల క్యాలెండర్‌ను విడుదల చేస్తాం
  • ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా అసెంబ్లీ మొదటి సమావేశాల్లోనే బిల్లును తీసుకొస్తాం. జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకొని జిల్లాలోని పరిశ్రమలకు అనుకూలంగా, వారికి ఏ రకమైన స్కిల్స్‌ కావాలి అన్న విషయాల మీద, వారిని కూడా భాగస్వాములను చేస్తూ ప్రతి జిల్లాలోనూ స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లను ఏర్పాటు చేస్తాం. ఉచితంగా మన పిల్లలకు ట్రైనింగ్‌ ఇప్పిస్తాం
  • గవర్నమెంట్‌ కాంట్రాక్టులు ఏవైతే ఉంటాయో.. కార్లు, బస్సులు అద్దెకు తీసుకోవడం మొదలు, ఇంకా ఇటువంటి ఇతరత్రా ఆదాయాన్నిచ్చే గవర్నమెంటు కాంట్రాక్టులు అన్నీ నిరుద్యోగ యువతకే ఇచ్చేట్టుగా చట్టాన్ని తెస్తాం. అంతేకాదు వారికి తోడుగా  ఉండేందుకు, వారు కార్లు కాని, బస్సులు కాని ఇతరత్రా వాహనాలు, పరికరాలు కొనేందుకు సబ్సిడీ కూడా ఇస్తాం. అంతేకాదు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతకు 50శాతం రిజర్వేషన్‌ కూడా కేటాయిస్తాం

ఖాళీగా ఉన్న 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.. గ్రామ సచివాలయాల్లో 1.60 లక్షల ఉద్యోగాలు.. 3.50 లక్షల గ్రామ వాలంటీర్లు

వైఎస్సార్‌ ఆసరా

  • ఎన్నికల రోజు వరకు అక్కచెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును నాలుగు దఫాలుగా నేరుగా వారి చేతికే అందిస్తాం
  • అంతేకాదు మళ్లీ సున్నా వడ్డీకే రుణాల విప్లవం తెస్తాం. ఆ వడ్డీ డబ్బు మేమే బ్యాంకులకు అక్కచెల్లెమ్మల తరఫున కడతాం

మద్యపాన నిషేధం

  • కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది
  • మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి
  • అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం.. మద్యాన్ని 5 స్టార్‌ హోటల్స్‌కి మాత్రమే పరిమితం చేస్తాం

అగ్రిగోల్డ్‌

  • చెప్పిన మాట ప్రకారం అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ. 1,150 కోట్లు కేటాయించి, తద్వారా గవర్నమెంట్‌ లెక్కల ప్రకారం ఉన్న 13 లక్షల మంది బాధితులకు వెంటనే మేలు చేస్తాం. మిగిలిన వారికి త్వరితగతిన పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేస్తాం.

పట్టణ గృహనిర్మాణం

  • పట్టణ గృహనిర్మాణ పథకం కింద నిర్మించే ఒక్కొక్క ఇల్లు 300 అడుగులట. అడుగుకు రూ. 2,000తో పేదవారికి అమ్మారు. ఇందులో రూ. 3 లక్షలు పేదవాడి పేరుతో అప్పుగా రాసుకొని.. ఆ అప్పు భారం 20 ఏళ్ల పాటు నెలనెలా రూ. మూడువేల చొప్పున తిగిరి కట్టాల్సిన పరిస్థితి. ఈ అప్పు రద్దు చేసి ఆ భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది

యాదవులు

  • తిరుమలలో శ్రీవారి గర్భగుడి తలుపులు సన్నిధి గొల్లలు తెరిచే సాంప్రదాయం పునరుద్ధరిస్తాం.
  • గొర్రెల కాపరులకు చనిపోయిన ప్రతి గొర్రెకు రూ. 6వేల బీమా అందిస్తాం

అమ్మవడి పథకం

  • పిల్లల చదువుకు ఏ పేదింటి తల్లి భయపడకూడదు
  • పిల్లలను బడికి పంపితే చాలు ప్రతి తల్లికి సంవత్సరానికి రూ. 15వేలు అందిస్తాం

వైఎస్సార్‌ చేయూత పథకం

  • వైఎస్సార్‌ చేయూత ద్వారా ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కాచెల్లెళ్లకు తోడుగా ఉంటాం
  • ప్రస్తుత కార్పొరేషన్‌ వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ అందరికీ మేలు జరిగేలా ఇస్తాం. ప్రస్తుతం అరకొరగా అది కూడా లంచం లేనిదే ఇవ్వని పరిస్థితులను మారుస్తూ పారదర్శక ప్రమాణాలను తీసుకువస్తాం
  • 45 సంవత్సరాలు నిండిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కలకు వైఎస్సార్‌ చేయూత ద్వారా మొదటి ఏడాది తరువాత దశలవారీగా రూ. 75వేలు ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా ఇస్తాం


పింఛన్ల పెంపు

  • ప్రస్తుతం ఉన్న పింఛన్ల అర్హత వయసు 65 నుంచి 60కి తగ్గిస్తాం
  • అవ్వా తాతలకు పింఛన్‌ రూ. 3వేల వరకు పెంచుకుంటూపోతాం
  • వికలాంగులకు పింఛన్‌ రూ. మూడు వేలు ఇస్తాం

ఫీజు రీయింబర్స్‌మెంట్‌

  • పేదవారి చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తాం
  • పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు వసతి, భోజనం కోసం అదనంగా ఏటా రూ. 20 వేలు ప్రతి విద్యార్థికి అందిస్తాం

పేదలందరికీ ఇళ్లు

  • ఇల్లు లేని పేదలందరికీ పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు చూడకుండా పక్కా ఇల్లు కట్టిస్తాం
  • ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్లు కట్టిస్తాం
  • ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం. వారి పేరునే రిజిస్ట్రేషన్‌ చేస్తాం. ఇళ్లు కూడా కట్టిస్తాం
  • ఇల్లు ఇచ్చే రోజును ఆ ఇంట్లోని అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌
  • అంతేకాదు డబ్బు అవసరమైతే అదే ఇంటి మీద పావలా వడ్డీకే రుణం వచ్చేట్టుగా బ్యాంకులతో మాట్లాడుతాం

అందరికీ వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకం

  • వార్షికాదాయం రూ. 5 లక్షలు దాటని అన్ని వర్గాల వారికీ, నెలకు 40వేల ఆదాయం దాటని ప్రతి ఒక్కరికీ వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తాం
  • వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తాం
  • ఎన్ని లక్షల రూపాయలు ఖర్చయినా ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా వైద్యచికిత్స అందజేస్తాం
  • హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై..ఇలా ఎక్కడ చికిత్స చేయించుకున్నా.. మెరుగైన ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తాం
  • అన్ని రకాల వ్యాధుల ఆపరేషన్లను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొస్తాం
  • జబ్బుకు సంబంధించిన ఆపరేషన్‌ తర్వాత విశ్రాంతి సమయంలో ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు ఆర్థిక సాయం చేస్తాం
  • కిడ్నీ వ్యాధి, తలసేమియా ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి ప్రత్యేకంగా నెలనెలా రూ. 10వేల పెన్షన్‌ అందజేస్తాం
  • ఆరోగ్య శ్రీ సేవలను ఇంకా మెరుగ్గా.. పకడ్బందీగా అందిస్తూనే.. మరోవైపు రెండేళ్లలోగా కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దుతాం
  • ప్రస్తుత ప్రభుత్వ ఆస్పత్రులు ఎలా ఉన్నాయో ఫొటోలు మీ ముందు ఉంచుతాం
  • రెండేళ్ల తర్వాత అవే ఆస్పత్రుల దశాదిశ మార్చిన తర్వాత వాటి ముఖ చిత్రాలు, ఫొటోలను మళ్లీ మీ ముందు ఉంచుతాం
  • ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్ల సంఖ్యను అవసరమైనమేరకు పూర్తిగా పెంచుతాం


అన్నదాతకు అండగా

  • ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం 50వేలు ఇస్తాం.
  • పంటవేసే సమయానికి మే నెలలోనే 12500 ఇస్తాం
  • పంటబీమా కోసం రైతన్న చెల్లించాల్సిన బీమా ప్రిమియం మొత్తం మా ప్రభుత్వమే చెల్లిస్తుంది
  • రైతన్నకు ఉచితంగా బోర్లు వేయిస్తాం.. రైతులకు పగటిపూట ఉచితంగా 9 గంటల కరెంటు ఇస్తాం
  • ఆక్వా రైతులకు యూనిట్‌ రూపాయిన్నరకే చార్జీకే కరెంటు అందిస్తాం
  • మూడువేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం
  • పంట వేసేముందే.. ఆయా పంటలకు లభించే మద్దతు ధరలను ప్రకటిస్తాం.. గిట్టుబాటు ధరకు గ్యారెంటీ ఇస్తాం
  • నాలుగు వేల కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తుల సహాయక నిధిని ఏర్పాటుచేస్తాం
  • ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు, గోదాములు, అవసరం మేరకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేస్తాం
  • మొదటి ఏడాది సహకార రంగాన్ని పునరుద్ధరిస్తాం
  • రెండో ఏడాది నుంచి సహకార డైరీకి పాలు పోసే.. ప్రతిపాడి రైతుకు లీటరుకు నాలుగు రూపాయలు బోనస్‌ ఇస్తాం
  • వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డుట్యాక్స్‌, టోల్‌ ట్యాక్స్‌ రద్దు చేస్తాం
  • ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన రైతు కుటుంబానికి వైఎస్సార్‌ బీమా పథకం ద్వారా రూ. ఏడు లక్షలు ఇస్తాం. అంతేకాదు ఆ డబ్బు అప్పులవాళ్లకు చెందకుండా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొచ్చి.. ఆ రైతు కుటుంబానికి అండగా ఉంటాం.

కౌలు రైతులకు సంబంధించి..

  • కౌలు రైతులకు పంటపై హక్కు ఉండేవిధంగా చర్యలు.. 11 నెలలు మించకుండా కౌలు రైతుల భూములకు రక్షణ కల్పిస్తూ చట్టసవరణ చేస్తాం
  • కౌలు రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తాం.. ఆ కాల వ్యవధిలో పంటకు సంబంధించిన అన్ని రాయితీలు, సబ్సిడీలు వారికి అందేలా చేస్తాం
  • నవరత్నాల్లో రైతులకు ప్రకటించిన మిగిలిన అన్ని హామీలు.. పంట బీమా దగ్గరి నుంచి వడ్డీలేని రుణాల వరకు.. 9 గంటల ఉచిత విద్యుత్‌ నుంచి గిట్టుబాటు ధరల గ్యారెంటీ వరకు.. ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వైఎస్సార్‌ బీమా ద్వారా ఏడు లక్షలు రూపాయలు.. ఇలా ప్రతి అంశామూ కౌలు రైతులందరికీ వర్తింపజేస్తాం.
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు రైతుభరోసా కింద ఏటా 12,500 రూపాయలు వీరికి అదనంగా  అందజేస్తాం

4 పేజీల వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోను ఆవిష్కరించిన వైఎస్‌ జగన్‌..

  • ఈ మేనిఫెస్టోను పార్టీ వెబ్‌సైట్‌లోంచి తీసేయ్యం
  • ప్రతి రోజు ఇది కనిపించేలా ప్రముఖంగా ఉంచుతాం. మనసా వాచా కర్మణా ఈ మేనిఫెస్టోను అమలు చేస్తాం
  • ఈ మేనిఫెస్టోను అమలు చేసిన తర్వాత.. దీనిని చూపించి 2024లో ఎన్నికలకు వెళ్లి మళ్లీ ప్రజల ఆశీర్వాదాన్ని కోరుతాం
  • ఇందులో ఒక్క అబద్ధం.. ఒక్క మోసం కూడా ఉండదు
  • మేనిఫెస్టోలోని మెజారిటీ అంశాలు నవరత్నాలే
  • పాదయాత్రలో ఇచ్చిన హామీలు.. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన అంశాలు ఉన్నాయి

మేనిఫెస్టోకు విశ్వసనీయత ఉండాలి

  • ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు
  • ఉగాది శుభదినాన మ్యానిఫెస్టోను విడుదల చేస్తుండటం సంతోషకరం
  • రాష్ట్రంలో ఒక కొత్త యుగానికి, ఒక కొత్త అధ్యాయానికి ఈ రోజు నాంది పలుకుతున్నాం
  • ప్రతి పార్టీ ఎన్నికలు వచ్చేసరికి మేనిఫెస్టో పేరిట ఒక బుక్‌లెట్‌ లేదా పేపర్‌ విడుదల చేస్తోంది.
  • ఆ బుక్‌లెట్‌లో వందల వందలు పేపర్లు పెట్టడం.. ప్రతి కులానికి ఒక పేజీ పెట్టి.. ఆ తర్వాత మోసం చేయడం
  • ఈ సందర్భంగా చంద్రబాబు మేనిఫెస్టో గురించి మాట్లాడక తప్పదు.
  • ఎన్నికల ప్రణాళిక పవిత్రమైనది. మేనిఫెస్టోలో చెప్పిన విషయాలను సంబంధించిన ప్రభుత్వం చేయకపోతే.. అది మోసం చేసినట్టు కదా!
  • ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరముంది
  • ఎన్నికల్లో గెలువడం కోసం మేనిఫెస్టో అనే సుందరమైన పదంతో ప్రజలను మోసం చేసే కార్యక్రమం జరగకూడదు
  • మేనిఫెస్టోను ప్రకటించి.. ఐదేళ్లు దానిని అందుబాటులో ఉంచి.. ఆ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశమూ ఇదిగో నేను చేశానని చెప్పి.. ఇదిగో నా 2014 మేనిఫెస్టో అని చూపించి.. అధికారంలో ఉన్న వాళ్లు ఓట్లు అడగాలి
  • అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు విశ్వసనీయతకు అర్థం
  • 2014లో చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టో ఇది..
  • ప్రతి కులానికి ఒక పేజీ కేటాయించారు. 650 హామీలు ఇచ్చారు
  • ప్రస్తుతం టీడీపీ వెబ్‌సైట్‌లోనూ ఈ మేనిఫెస్టో కనిపించకుండా మాయం చేశారు
  • ఈ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలు గమనిస్తే.. చంద్రబాబును చొక్కా పట్టుకొని నిలదీస్తారేమోనని ఆయన భయం
  • చంద్రబాబు తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలివి..

వ్యవసాయ రుణాలు పూర్తిగా మాఫీ..

ఐదువేల కోట్లతో ధరల స్థిరీకరణనిధి

డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ

బెల్టు షాపుల రద్దు

మహిళలకు భద్రత, ప్రత్యేక పోలీసు వ్యవస్థ

మహిళలకు సెల్‌ఫోన్‌ ద్వారా ఐదు నిమిషాల్లో సహాయం అందించే రక్షణ వ్యవస్థ

యువతకు ఉద్యోగమూ, ఉపాధి.. రెండు ఇవ్వకపోతే రెండువేల నిరుద్యోగ భృతి

గుడిసెల్లేని ఆంధ్రప్రదేశ్‌, పేదపిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య

ఎన్టీఆర్‌ సుజల పథకం కింద ఇంటింటికీ రెండురూపాయలకే 20 లీటర్ల మినరల్‌ వాటర్‌

ఇంకా చాలా హామీలు ఇచ్చారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement