Telangana: Electricity Charges In Telangana To Increase From April - Sakshi
Sakshi News home page

Telangana Electricity Bill: పేదింటికి పెద్ద షాక్‌.. 50%కు పైగా పెరగనున్న సామాన్యుడి కరెంటు బిల్లు

Published Thu, Mar 24 2022 4:22 AM | Last Updated on Thu, Mar 24 2022 3:35 PM

Electricity Charges In Telangana To Increase - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐదేళ్లుగా పొంచి ఉన్న విద్యుత్‌ చార్జీల బాంబు ఒక్కసారిగా పేలింది. పేద, మధ్య తరగతి, ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాలపై బాదుడుకు రంగం సిద్ధమైంది. అయితే ఇతర   వర్గాలతో పోల్చుకుంటే పేదలపైనే అధిక భారం  పడనుంది. గృహాలు, వాణిజ్యం, పరిశ్రమలు.. ఇలా అన్ని రంగాల విద్యుత్‌ చార్జీలు వచ్చే నెల నుంచే పెరగనుండగా, మే నుంచి బిల్లులు షాక్‌ కొట్టబోతున్నాయి. విద్యుత్‌ చార్జీల పెంపు ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా రూ.5,596 కోట్ల అదనపు భారం వినియోగదారులపై పడనుంది. ఈ మేరకు 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్‌ రిటైల్‌ సప్లై టారిఫ్‌ ను రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(టీఎస్‌ఈఆర్సీ) చైర్మన్‌ తన్నీరు శ్రీరంగారావు..సభ్యులు ఎండీ మనోహర్‌రాజు, బండారు కృష్ణయ్యతో కల సి బుధవారం ప్రకటించారు.

18 శాతం విద్యుత్‌ చార్జీల పెంపునకు ఉత్తర, దక్షిణ తెలంగాణ విద్యు త్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్, టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌)లతో పాటు సిరిసిల్ల కోఆపరేటివ్‌ ఎలక్ట్రిసిటీ సప్లై సొసైటీ అనుమతి కోరగా, 14% పెంచుకోవడానికి అనుమతిచ్చినట్టు విలేకరులకు వెల్లడించారు. ఎల్టీ కేటగిరీలోని గృహ వినియోగంపై యూనిట్‌కు 10–50 పైసలు చొప్పున, ఎల్టీ కేటగిరీలోని గృహేతర వినియోగంతో పాటు హెచ్‌టీ కేటగిరీలోని అన్ని రకాల వినియోగంపై యూనిట్‌కు రూ.1 చొప్పున చార్జీలు పెరగనున్నాయి. గృహ కేటగిరీలో ఒక శ్లాబు నుంచి మరో శ్లాబుకు మారిన వెంటనే ఉండే తదుపరి ఉప కేటగిరీకి యూనిట్‌కు 10 పైసలు చొప్పున, మిగిలిన అన్ని ఉప కేటగిరీలకు 50 పైసలు చొప్పున చార్జీల పెంపునకు ఈఆర్సీ అనుమతిచ్చింది. చార్జీలకు తోడుగా డిమాండ్‌ చార్జీలు, కస్టమర్‌ చార్జీలు సైతం పెరగనుండడంతో వచ్చే నెల నుంచి విద్యుత్‌ చార్జీలు తడిసిమోపెడు కానున్నాయి.

పేదలకు కరెంటు వాత ఇలా
గృహ కేటగిరీలోని అన్ని శ్లాబుల విద్యుత్‌ చార్జీలను యూని ట్‌కు 10–50 పైసలు చొప్పున పెంచాలని నిర్ణయించడంతో తక్కువ విద్యుత్‌ వినియోగించే పేద, మధ్య తరగతి ప్రజలపైనే అత్యధిక భారం పడబోతోంది. నెలకు 50 యూనిట్లు, 100 యూనిట్లు, 200 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించే వినియోగదారులకు విద్యుత్‌ బిల్లులు చుక్కలు చూపించబోతున్నాయి. ఉదాహరణకు.. ఒకే గదిలో నివాసముండే పేద కుటుంబానికి చెందిన శ్రీనివాస్‌ నెలకు 50 యూనిట్లలోపు విద్యుత్‌ వాడుతుండగా, ఇప్పటివరకు నెలకు గరిష్టంగా రూ.97.5కు మించి బిల్లు ఎప్పుడూ రాలేదు. విద్యుత్‌ తో పాటు కస్టమర్‌ చార్జీలను సైతం పెంచడం, గృహాలపై కొత్తగా ప్రతి కిలోవాట్‌ లోడ్‌కు రూ.10 చొప్పున డిమాండ్‌ చార్జీలు విధించడంతో ఇకపై ఆయనకు రూ.147.5 బిల్లు (50% పైగా) రానుంది. అయితే 200 యూనిట్లు, ఆపై విద్యుత్‌ వినియోగించే ఎగువ మధ్యతరగతి, ధనిక వర్గాలపై భారం తక్కువగా పడనుంది. వీరికి 10% లోపే బిల్లులు పెరగనున్నాయి. 

ఎవరిపై ఎంత భారం: తెలంగాణ వచ్చాక తొలిసారిగా 2015–16లో, తర్వాత 2016–17లో విద్యుత్‌ చార్జీలు పెంచారు. మళ్లీ ఐదేళ్ల గ్యాప్‌ తర్వాత 2022–23లో చార్జీలు పెరగబోతున్నాయి. కొత్త చార్జీలు అమల్లోకి వస్తే ఏటా.. ఎల్టీ విభాగంలోని 1.10 కోట్ల గృహాలు, 44 లక్షల గృహేతర కేటగిరీల వినియోగదారులపై సుమారు రూ.2 వేల కోట్లు, హెచ్‌టీ విభాగంలోని అన్ని కేటగిరీలు కలిపి 13,717 మంది వినియోగదారులపై రూ.3,500 కోట్ల అదనపు భారం పడనుంది. 

రూ.8,221.17 కోట్లకు పెరిగిన సబ్సిడీ
రాష్ట్రంలోని అన్ని వర్గాల వినియోగదారులకు 2022–23లో నిరంతర విద్యుత్‌ సరఫరా చేసేం దుకు రూ.53,054 కోట్ల వ్యయం కానుందని రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ప్రతిపాదించగా, వ్యయాన్ని రూ.48,708 కోట్లకు తగ్గించి ఆమోదించినట్టు ఈఆర్సీ చైర్మన్‌ తెలిపారు. రూ. 16,580 కోట్ల ఆదాయ లోటు ఉండనుందని డిస్కంలు అంచనా వేయగా, రూ.14,237 కోట్లకు తగ్గించి ఈఆర్సీ ఆమోదించింది. వినియోగదారులపై భారం పెరగకుండా విద్యుత్‌ సబ్సిడీలను రూ.5,940 కోట్ల నుంచి రూ.8,221.17 కోట్లకు పెంచాలని ఈఆర్సీ కోరడంతో ప్రభుత్వం అంగీకరించింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ సరఫ రాకు రూ.6,754.64 కోట్లు, గృహాలకు రాయితీపై విద్యుత్‌ సరఫరాకు రూ.1,466.53 కోట్లను సబ్సిడీ గా ప్రభుత్వం చెల్లించనుంది.

గతంతో పోల్చితే ప్రభుత్వ సబ్సిడీలు 38.39శాతం పెరిగాయి. సబ్సి డీలను సర్దుబాటు చేయగా, మిగలనున్న రూ. 6,016 కోట్ల ఆదాయ లోటు భర్తీ చేసుకోవడానికి గాను విద్యుత్‌ చార్జీల పెంపు ద్వారా వినియోగదా రులపై రూ.5,596 కోట్ల అదనపు భారం వేయడానికి ఈఆర్సీ అనుమతిచ్చింది. డిస్కంలు రూ. 6,831 కోట్ల మేర పెంపును ప్రతిపాదించగా, రూ. 1235 కోట్ల భారాన్ని తగ్గించి ఆమోదించినట్టు శ్రీరంగారావు వెల్లడించారు. యూనిట్‌ విద్యుత్‌ సరఫరా చేయడానికి 2018–19లో సగటున రూ. 6.04  వ్యయం కాగా, 2022–23లో ఇది రూ.7.03 కు పెరగనుందని ఈ ఆర్సీ అంచ నా వేసింది. పెరిగిన విద్యుత్‌ కొనుగోళ్ల వ్య యం, డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్‌మిషన్‌ చార్జీల దృష్ట్యా చార్జీల పెంపునకు అనుమతించినట్టు చైర్మన్‌ చెప్పారు. 

సెలూన్లు, కుటీర పరిశ్రమలకు మినహాయింపు: వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌తో పాటు ఎస్సీ, ఎస్టీల గృహాలకు నెలకు ఉచితం గా 101 యూనిట్లు వంటివి యధాతథంగా కొనసాగనున్నాయి. నాయి బ్రాహ్మణుల హెయిర్‌ సె లూన్లు, రజకుల లాండ్రీ షాపులు, దోభీ ఘాట్లకు నెలకు ఉచితంగా 250 యూనిట్లు, పవర్‌ లూమ్స్, పౌల్ట్రీలు, స్పిన్నింగ్‌ మిల్లులకు యూనిట్‌పై రూ.2 చొప్పున సబ్సిడీ వంటి పథకాలు కూడా కొనసాగుతాయి. హెయిర్‌ సెలూన్లు, కుటీర పరిశ్రమలు, హార్టీకల్చర్‌ నర్సరీలు, కార్పొరేట్‌ వ్యవసాయం, ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌ కేంద్రాలకు చార్జీల పెంపు నుంచి మినహాయింపు లభించింది. 

బకాయిలు చెల్లించాలని కోరతాం
ఎత్తిపోతల పథకాలు, గ్రామ పంచాయతీలు, ము న్సిపాలిటీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సంబం ధించిన రూ.12,598 కోట్ల విద్యుత్‌ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం బకాయిపడి ఉండగా, ప్రైవేటు వ్యక్తు లు, సంస్థలు రూ.4,603.41 కోట్ల బిల్లులను బకా యిపడి ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద బకాయిదారుగా ఉన్న విషయాన్ని విలేకరులు ఈఆర్సీ దృ ష్టికి తీసుకెళ్లగా.. బకాయిలను చెల్లించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరతామని శ్రీరంగారావు తెలిపారు. 

ఫిక్స్‌డ్‌/డిమాండ్‌ చార్జీలు ఏమిటి?
కిలోవాట్లలో వినియోగించే లోడ్‌ ఆధారంగా విద్యుత్‌ కనెక్షన్లను జారీ చేస్తారు. అంటే తక్కువ విద్యుత్‌ వాడే వారికి తక్కువ కిలోవాట్ల లోడ్‌ ఉంటుంది. అధిక విద్యుత్‌ వాడే వారికి అధిక కిలోవాట్ల లోడ్‌ ఉంటుంది. కిలోవాట్‌ లోడ్‌కు కొంత మొత్తం చొప్పున మొత్తం లోడ్‌కు ఫిక్స్‌డ్‌/డిమాండ్‌ చార్జీలు విధిస్తారు.

ఈ చార్జీలు అదనం..
విద్యుత్‌ బిల్లులో ఎనర్జీ చార్జీ, డిమాండ్‌ చార్జీ, కస్టమర్‌ చార్జీలతో పాటు ఎలక్ట్రిసిటీ డ్యూటీ, అడిషనల్‌ చార్జీ (అనుమతించిన లోడ్‌కు మించి విద్యుత్‌ వినియోగిస్తే), మినిమమ్‌ చార్జీ, ఇంధన సర్దుబాటు చార్జీ (ఎఫ్‌ఎస్‌ఏ), రీకనెక్షన్‌ చార్జీ, కెపాసిటర్‌ చార్జీ, టెస్టింగ్‌ చార్జీ, అపరాధ రుసుం వంటి వివిధ రకాల చార్జీలను విధిస్తారు. తాజాగా కస్టమర్‌ చార్జీలను 60–100 శాతం వరకు పెరిగాయి. హైటెన్షన్‌ కేటగిరీ వినియోగదారులపై కస్టమర్‌ చార్జీల పెంపు భారం భారీగా పడింది. 

ఈఆర్సీ మరికొన్ని నిర్ణయాలు..

  • హెచ్‌టీ కేటగిరీలోని పారిశ్రామిక వినియోగదారులపై యూనిట్‌కు రూ.2 చొప్పున గ్రీన్‌ టారిఫ్‌ విధించాలని డిస్కంలు ప్రతిపాదించగా, 66 పైసలకు తగ్గించి ఈఆర్సీ ఆమోదించింది. 
  • స్వీయ అవసరాలను తీర్చుకోవడానికి పారిశ్రామిక వినియోగదారులు నిర్వహించే కాప్టివ్‌ విద్యుత్‌ ప్లాంట్లపై గ్రిడ్‌ సపోర్ట్‌ చార్జీలు విధించాలని డిస్కంలు కోరగా, దీనిపై నిర్ణయాన్ని ఈఆర్సీ వాయిదా వేసింది. ఈ అంశాన్ని గ్రిడ్‌ కోఆర్డినేషన్‌ కమిటీకి రిఫర్‌ చేసింది. 
  • ప్రతి ఏటా నవంబర్‌ 30లోగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన చార్జీల పెంపు ప్రతిపాదనలు (టారీఫ్‌ ప్రతిపాదనలు) సమర్పించడంలో డిస్కంలు విఫలమైతే జరిమానాలు విధించడానికి కొత్త మార్గదర్శకాలను ఈఆర్సీ ప్రకటించింది. 
  • వ్యవసాయ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లకు రెండేళ్లలోగా 2ఏ కమ్యూనికేషన్‌ మీటర్లను డిస్కంలు బిగించాలి. వ్యవసాయ విద్యుత్‌ వినియోగం లెక్కలు కచ్చితంగా తేలడానికి దీనిని తప్పనిసరి చేసినట్టు ఈఆర్సీ వెల్లడించింది. 
  • విద్యుత్‌ సాంకేతిక, వాణిజ్య నష్టాల మొత్తం (ఏటీఅండ్‌సీ లాసెస్‌) 15 శాతంపైన ఉన్న ప్రాంతాలపై డిస్కంలు ప్రత్యేక దృష్టి సారించి నష్టాలను తగ్గించేందుకు నిర్దేశిత కాలపరిమితితో కూడిన ప్రత్యేక కార్యాచరణను ఈఆర్సీకి సమర్పించాలి. లేకుంటే ఈ నష్టాలను తదుపరి ఏడాది చార్జీల పెంపు అంశంలో పరిగణనలోకి తీసుకోబోమని ఈఆర్సీ తెలిపింది. ∙ఆసక్తిగల వినియోగదారులందరికీ స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్లు బిగించాలి. స్మార్ట్‌ గ్రిడ్‌ అభివృద్ధి కార్యాచరణను ఈఆర్సీకి డిస్కంలు సమర్పించాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement