నెల తక్కువ.. మోత ఎక్కువ! | Telangana Electricity Discom Issue Electricity Bills Before The End Of The Month | Sakshi
Sakshi News home page

నెల తక్కువ.. మోత ఎక్కువ!

Published Sat, Apr 9 2022 3:08 AM | Last Updated on Sat, Apr 9 2022 8:21 AM

Telangana Electricity Discom Issue Electricity Bills Before The End Of The Month - Sakshi

హైదరాబాద్‌లోని నవీన్‌నగర్‌కు చెందిన ప్రసాదరావు ఫిబ్రవరిలో 219 యూనిట్ల విద్యుత్‌ వాడితే రూ.894 బిల్లు వచ్చింది. మార్చిలో 178 యూనిట్లనే వాడినా బిల్లు ఏకంగా రూ.969 వచ్చింది. తక్కువ విద్యుత్‌ వాడితే బిల్లు తక్కువ రావాలి కానీ ఎందుకు పెరిగిందని అనుకుంటున్నారా? ఫిబ్రవరిలో 31 రోజులకు మీటర్‌ రీడింగ్‌ తీసి బిల్లేశారు. మార్చిలో నెల పూర్తవకముందే 27 రోజులకే రీడింగ్‌ తీసి బిల్లు ఇచ్చారు. 27 రోజుల్లో 178 యూనిట్లు వాడగా 31 రోజులకు 204 యూనిట్లు వాడతారని అంచనా వేసి 200 యూనిట్లకు పైగా వినియోగానికి సంబంధించిన శ్లాబును వర్తింపజేశారు.

ఈ శ్లాబు కింద.. తొలి 200 యూనిట్ల వినియోగానికి యూనిట్‌కు రూ.5 చొప్పున, తర్వాత 201 నుంచి 300 యూనిట్ల వినియోగానికి యూనిట్‌కు రూ.7.20 చొప్పున చార్జీలు వర్తిస్తాయి. 204 యూనిట్లు వాడినట్టు అంచనా వేసినందున తొలి 200 యూనిట్లకు ఓ రేటు.. మిగిన 4 యూనిట్లకు మరో రేటు వర్తించనుంది. ఈ లెక్కన అసలు వాడిన 178 యూనిట్లలో 174 యూనిట్లకు యూనిట్‌కు రూ.5 చొప్పున, మిగిలిన 4 యూనిట్లకు యూనిట్‌కు రూ.7.20 చొప్పున చార్జీ విధించారు. ఈ దెబ్బకు చార్జీ రూ.898 (174్ఠ5  + 4్ఠ7.20) కు పెరిగింది. రూ.60 కస్టమర్‌ చార్జీలు, రూ.10 ఈడీ కలిపి బిల్లు రూ.969కు పెరిగింది. నెల కాకముందే బిల్లులు జారీ చేసి వినియోగదారులకు డిస్కంలు ఎలా టోపీ పెడుతున్నాయో ఈ కేసుతో అర్థమవుతుంది. 

సాక్షి, హైదరాబాద్‌: డిస్కంల తప్పు వల్ల వినియోగదారులకు విద్యుత్‌ బిల్లుల మోత మోగుతోంది. కొందరికి నెల పూర్తికాకముందే బిల్లులు జారీ చేస్తూ సగటున నెల వినియోగాన్ని అంచనా వేసి శ్లాబును మారుస్తుండటంతో బిల్లులు పెరిగి వినియోగదారులు లబోదిబోమంటున్నారు. తప్పు డిస్కంలదైనా మూల్యం మాత్రం వినియోగదారులు చెల్లిస్తున్నారు. ఇలా ఈఆర్సీ టారిఫ్‌ ఆర్డర్‌కు విరుద్ధంగా శ్లాబుల మార్పు అక్రమమని నిపుణులు తప్పుబడుతున్నారు. 

ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని.. 
నిబంధనల ప్రకారం నెల రోజులకు మీటర్‌ రీడింగ్‌ తీసి బిల్లులు జారీ చేయాలి. కానీ ఆచరణలో ఇది సాధ్యమవట్లేదు. నెల దాటాక కానీ, లేదా నెల పూర్తికాక ముందే బిల్లులు జారీ చేస్తున్నారు.  నెల గడిచాక బిల్లులు జారీ చేస్తే వినియోగం పెరిగి బిల్లు శ్లాబులు మారిపోతున్నాయి. దీంతో బిల్లులు బాగా పెరుగుతున్నాయని గతంలో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి.

దీంతో నెల సగటు వినియోగాన్ని అంచనా వేసి సంబంధిత శ్లాబు కిందే బిల్లులు జారీ చేయాలని డిస్కంలను ఈఆర్సీ ఆదేశించింది. దీన్ని అడ్డుగా పెట్టుకుని రివర్స్‌లో సైతం డిస్కంలు అమలు చేస్తున్నాయి. నెల పూర్తికాకుండానే జారీ చేసే బిల్లుల శ్లాబులను మార్చి అధిక బిల్లులు జారీ చేస్తున్నాయి. సకాలంలో మీటర్‌ రీడింగ్‌ తీయకపోవడం డిస్కంల పొరపాటైనా వినియోగదారులు భారీగా బిల్లు కట్టాల్సి వస్తోంది. 

ఎంత వాడితే ఆ స్థాయి శ్లాబే ఉండాలి 
విద్యుత్‌ నియంత్రణ మండలి జారీ చేసిన రిటైల్‌ సప్లై టారిఫ్‌ ఆర్డర్‌కు కట్టుబడి డిస్కంలు  బిల్లులు జారీ చేయాలి. నెల గడవక ముందే జారీ చేసే బిల్లుల విషయంలో దీన్ని ఉల్లంఘిస్తున్నాయని విద్యుత్‌ రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. టారిఫ్‌ ఆర్డర్‌ ప్రకారం ఎంత విద్యుత్‌ వాడితే అందుకు సంబంధించిన శ్లాబునే వర్తింపజేయాలి. నెల కాకముందే రీడింగ్‌ తీసి వినియోగాన్ని ఊహాజనితంగా అంచనా వేసి ఎక్కువ చార్జీలున్న శ్లాబును వర్తింపజేయడం అక్రమమని నిపుణులు అంటున్నారు. ఆటోమెటిక్‌గా శ్లాబులు మార్చి అధిక బిల్లులు జారీ చేసేలా మీటర్‌ రీడింగ్‌ యంత్రాల్లోని సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయడం గమనార్హం. దీనిపై ఈఆర్సీ పరిశీలన జరపాలని నిపుణులు కోరుతున్నారు. 

శ్లాబులు మార్చడం అక్రమమే 
నెల దాటాక రీడింగ్‌ తీసి బిల్లులు జారీ చేస్తే శ్లాబులు మారి బిల్లులు పెరుగుతున్నాయని గతంలో ఈఆర్సీని ఆశ్రయించాం. నెల దాటాక మీటర్‌ రీడింగ్‌ తీస్తే నెల రోజుల వినియోగాన్ని అంచనా వేసి శ్లాబును వర్తింపజేయాలని నాడు డిస్కంలకు ఈఆర్సీ ఆదేశించింది. నెల నిండక ముందే జారీ చేసే బిల్లులకూ డిస్కంలు ఈ ఉత్తర్వులను అక్రమంగా వర్తింపజేసి దోచుకుంటున్నాయి.

వాడకాన్ని తగ్గించుకున్నా ఈ విధానం వల్ల ప్రయోజనం ఉండట్లేదు. దీన్ని డిస్కంలు ఆపకపోతే హైకోర్టును ఆశ్రయిస్తాం. ఇప్పటివరకు అధికంగా వసూలు చేసిన రూ. వందల కోట్ల బిల్లులను వినియోగదారులకు తిరిగివ్వాలి.  
–డి.నర్సింహారెడ్డి, విద్యుత్‌ రంగం నిపుణుడు 

వచ్చే నెల బిల్లుల్లో డబుల్‌ మోత 
ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీల పెంపు అమల్లోకి రానుండటంతో ఏప్రిల్‌ వినియోగానికి సంబంధించి వచ్చే మే నెలలో జారీ చేసే బిల్లులు భగ్గుమని మండబోతున్నాయి. ఈ పరిస్థితిలో నెల తిరగకుండానే మీటర్‌ రీడింగ్‌ తీసి తర్వాత శ్లాబునులను మార్చి బిల్లులు  జారీ చేస్తే వినియోగదా రులపై డబుల్‌ భారం పడనుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement