సాక్షి, అమరావతి : ఐదేళ్ల చంద్రబాబు పాలనలో విద్యుత్ రంగంలో చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. బిల్లులు తగ్గిస్తామని చెప్పిన మాట దేవుడెరుగు.. పేదవాడి కరెంట్ బిల్లులు మాత్రం నాలుగు రెట్లు పెరిగాయి. అవసరం లేకున్నా ప్రైవేటు విద్యుత్‌ను కొనుగోలు చేశారు. రూ.వేల కోట్లు దోచుకున్నారు. ఏపీ జెన్‌కో ఉత్పత్తిని దారుణంగా దెబ్బతీశారు. బొగ్గు దగ్గర్నుంచి, థర్మల్ కాంట్రాక్టుల వరకూ.. ట్రాన్స్‌కో లైన్ల దగ్గర్నుంచి సోలార్ ప్లాంట్ల వరకూ ఇష్టారాజ్యంగా దోచుకున్నారు. ప్రతీ కాంట్రాక్టులోనూ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడి జోక్యంపై సర్వత్రా ఆరోపణలొచ్చాయి.
2014 ఎన్నికల్లో చంద్రబాబు అన్నదేంటి?
రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు షాక్ కొడుతున్నాయి. అధికారంలోకి వస్తూనే కరెంట్ చార్జీలు తగ్గిస్తాను.
అధికారంలోకొచ్చి చేసిందేంటి?
చంద్రబాబు సీఎం కాకముందు ఒక్కో ఇంటికీ రెండు నెలలకు రూ.100 కరెంట్ బిల్లు వచ్చేది. ఇప్పుడు నెల నెలా ఒక్కో ఇంటికీ రూ.500 నుంచి రూ.3 వేల దాకా కరెంట్ బిల్లు వస్తోంది. నేరుగా కొంత.. దొడ్డిదారిన మరికొంత విద్యుత్ చార్జీల బాదుడే బాదుడు.
ఇంత భారమా?
బాబు ఐదేళ్ల పాలనలో మూడుసార్లు విద్యుత్ చార్జీలు పెరిగాయి. జనంపై రూ.1,787 కోట్ల భారం పడింది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో రూ.800 కోట్లు, 2016–17లో రూ.745 కోట్లు, 2017–18లో రూ.242 కోట్లు విద్యుత్ చార్జీలు పెంచారు. ఇవి ప్రత్యక్షంగా మోపిన భారమే. ఇక పరోక్షంగా మరో రూ.2,800 కోట్లను ఈ సర్కార్ పిండుకుంది. 2016–17లో శ్లాబుల వర్గీకరణ (క్రితం ఏడాది 900 యూనిట్లు కాల్చినవారిని అధిక టారిఫ్‌లోకి తేవడం) వల్ల 70 లక్షల మందిపై అదనపు భారం వేసి, రూ.1,200 కోట్లు మేర దొంగదెబ్బ కొట్టింది. 2017–18లో డిమాండ్ చార్జీలు పెట్టి రూ.900 కోట్ల పరోక్ష వడ్డన చేసింది. 2018–19లో ఇంకో రూ.700 కోట్ల మేర పరోక్ష రాబడికి పూనుకుంది.
దళితులకూ పంగనామాలే
దళితులకు అంతకుముందు ప్రభుత్వం 50 యూనిట్ల మేర ఉచిత విద్యుత్ ప్రకటించింది. రాష్ట్రంలో 14 లక్షల మంది దళిత కుటుంబాలున్నాయి. నెలకు 600 యూనిట్లు దాటిన ప్రతీ దళిత కుటుంబానికి ఉచిత విద్యుత్ ఇవ్వకుండా కట్టుదిట్టం చేసింది. ఏడాదిలో పొరపాటున ఒక్క యూనిట్ ఎక్కువ కాల్చినా సబ్సిడీ ఎగవేయడం దీనివెనుక అసలు ఉద్దేశం. ఈ రీతిన దాదాపు 8.5 లక్షల దళిత కుటుంబాలకు దిగ్విజయంగా ఉచిత విద్యుత్‌ను ఎగ్గొట్టేసింది.
ఒక్క యూనిట్ వినియోగించడం వల్ల వాళ్లు యూనిట్‌కు రూ.2.40 చెల్లించేలా చేసింది. ఈ పథకానికి దాదాపు రూ.900 కోట్ల సబ్సిడీ ఇవ్వాలని పంపిణీ సంస్థలు పట్టుబడితే కేవలం రూ.124 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. దీంతో దళితుల ఇళ్లకు ఉచిత విద్యుత్ చాలావరకూ ఆగిపోయింది.
రైతన్నకూ టోకరా..
దివంగత మఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకం అందుబాటులోకి వచ్చింది. 2014 నాటికే రాష్ట్రంలో 16 లక్షల వ్యవసాయ పంపుసెట్లున్నాయి. ఈ ఐదేళ్లలో 2.5 లక్షల మంది కొత్త కనెక్షన్లకు దరఖాస్తు చేసుకుంటే, కేవలం లక్షతో సరిపెట్టింది. అధికారంలోకి వస్తే ఏడు గంటలకు బదులు 9 గంటల పాటు పగటిపూట విద్యుత్ ఇస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం కనీసం ఏడు గంటలు కూడా ఇవ్వలేదు. ఎన్నికల ముందు తొమ్మిది గంటలిస్తామని ప్రకటించినా.. ఒక్క పైసా కేటాయింపు జరగలేదు.
అదనంగా సరఫరా చేసిందీ ఒక్క యూనిట్ కూడా లేదు. ప్రతి ఏటా వ్యవసాయానికి కేవలం 9 వేల మిలియన్ యూనిట్లు కేటాయిస్తుంది. ఇంత మొత్తానికే సబ్సిడీ మంజూరు చేస్తోంది. నిజానికి 16 లక్షల పంపుసెట్లకు రోజుకు ఏడు గంటల విద్యుత్ ఇస్తే ఏడాదికి 16,280 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం మాత్రం కేవలం 9 వేల మిలియన్ యూనిట్లే ఇస్తోంది. దీన్నిబట్టి ఒక్కో పంప్‌సెట్‌కు కేవలం రోజుకు 4 గంటలకు మించి వ్యవసాయ విద్యుత్ ఇవ్వడం లేదని స్పష్టమవుతోంది.
దోపిడీ కోసం మిగులు మంత్రం
రాష్ట్ర విభజన నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉందని, దీన్ని అధిగమించి ఏడాదికి 10 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్ సాధించామని ప్రభుత్వం చెబుతోంది. దీన్ని సాకుగా చూపించి అవసరం లేకున్నా ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లను అధిక రేట్లకు ప్రోత్సహించింది. వాస్తవానికి రాష్ట్ర విభజన తర్వాత 1,600 మెగావాట్ల కృష్ణపట్నం, 600 మెగావాట్ల ఆర్టీపీపీ అందుబాటులోకి వచ్చింది. ఏడాదికి రాష్ట్ర విద్యుత్ వినియోగం 49 వేల మిలియన్ యూనిట్లు దాటడం లేదు.
కానీ పరిశ్రమలు వస్తాయని, డిమాండ్ పెరుగుతుందని ఊహాజనితమైన లెక్కలు చూపించి, డిమాండ్‌ను ఏడాదికి 65 వేల మిలియన్ యూనిట్లకు లెక్కగట్టింది. దీనికోసం తనకు నచ్చిన, కమిషన్లు ఇచ్చే ప్రైవేటు ప్రాజెక్టుల నుంచి విద్యుత్‌ను అత్యధికంగా కొనుగోలు చేసింది. మార్కెట్లో యూనిట్ రూ.2కు లభిస్తున్నా, విద్యుత్ సంస్థలు మాత్రం సగటున యూనిట్ రూ.5 పైనే కొనుగోలు చేశాయి. రాష్ట్రానికి అవసరమైన 49 వేల మిలియన్ యూనిట్లలో 38,325 మిలియన్ యూనిట్లను ఏపీ జెన్‌కో థర్మల్, హైడల్ ద్వారా ఉత్పత్తి చేసే వీలుంది.
ఈ విద్యుత్ సగటున రూ.4 లోపే లభిస్తుంది. కానీ జెన్‌కో విద్యుత్‌ను ఏటా సగటున 22 వేల మిలియన్ యూనిట్లకే పరిమితం చేశారు. ప్రతీ సంవత్సరం 25 వేల మిలియన్ యూనిట్ల మేర ప్రైవేటు విద్యుత్‌ను కొనుగోలు చేశారు. దీనివల్ల ప్రతి ఏటా రూ.12 వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైంది. ఇందులో భారీ ఎత్తున ప్రభుత్వ పెద్దలకు ముడుపుల రూపంలో అందినట్టు ఆరోపణలున్నాయి.
బొగ్గునూ బొక్కేశారు..
అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో విదేశీ బొగ్గు కాంట్రాక్టులను పొడిగించడం, ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ధరలు తగ్గినా పాత రేట్లకే కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం వెనుక ప్రభుత్వ పెద్దలకు భారీగా ముడుపులు అందాయనే ఆరోపణలున్నాయి. దాదాపు 3.5 మిలియన్ టన్నుల బొగ్గును అవసరం లేకున్నా ఆర్డర్లు ఇవ్వడం వల్ల రూ.755 కోట్ల మేర అవినీతి జరిగిందనే విమర్శలొచ్చాయి. ఆ తర్వాత కృష్ణపట్నంకు లక్ష టన్నుల బొగ్గు ఆర్డర్లు ఇవ్వడం, మరికొన్ని ప్లాంట్లకు విదేశీ బొగ్గు దిగుమతికి జరిగిన గోల్‌మాల్‌లో రూ.400 కోట్ల మేర అవినీతి జరిగినట్టు విమర్శలున్నాయి.
– వనం దుర్గాప్రసాద్, సాక్షి, అమరావతి
Comments
Please login to add a commentAdd a comment