సాక్షి, అమరావతి : రాజధాని ప్రాంత ఓటర్ల మనసుల్లోంచి భావోద్వేగం తన్నుకొస్తోంది. బీడుబారిన భూముల సాక్షిగా రైతన్నల కన్నీటి కథలు విన్పిస్తున్నాయి. ఉపాధి లేని రైతు కూలీల కడుపుమంట అడుగడుగునా సాక్షాత్కరిస్తోంది. గ్రాఫిక్స్ మాయాజాలంలో మోసపోయిన కసి ప్రజల్లో కనిపిస్తోంది. కార్పొరేట్ శక్తుల కరకు పాదాల కింద నలిగిపోయిన నిరుద్యోగుల ఆశలు ఆగ్రహావేశాలు రగులుస్తున్నాయి. కాల్‌మనీ సెక్స్ రాకెట్ క్రూరత్వానికి బలైన అమాయకుల ఆక్రందనల ఎర్రటి జీర బాధితుల కళ్లలో కదలాడుతోంది. అవినీతి.. అన్యాయం.. అరాచకం.. అభద్రత వంటి అంశాలెన్నో రాజధాని ఓటరు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఐదేళ్లుగా పంటి బిగువున నొక్కిపట్టిన ఆవేశం ఎన్నికల వేళ ఎగిసిపడుతోంది. తాయిలాలతో ప్రజాగ్రహాన్ని అడ్డుకోవాలనుకునే ప్రభుత్వ వైఖరిపై రాజధాని ప్రాంత జిల్లా ఓటర్లు ఏమంటున్నారో తెలుసుకునేందుకు ‘సాక్షి’ బృందం రోడ్ షో నిర్వహించింది. వెలగపూడి కేంద్రంగా వంద కిలోమీటర్ల పరిధిలోని ఓటర్లను పలకరించగా.. సర్కారు తీరుపై అడుగడుగునా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి.
అభివృద్ధా..! అదెక్కడ?
రాజధానికి వెళ్లే దారిలో.. ఉండవలి సెంటర్ దగ్గర హాట్‌హాట్‌గా సాగుతున్న చర్చను ‘సాక్షి’ బృందం గమనించింది. ఈ ప్రాంతం మంగళగిరి నియోజకవర్గ పరిధిలోనిది. రాజధానిలో చోటుచేసుకున్న అక్రమాలే అజెండాగా పోరాడుతున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆర్కే.. ముఖ్యమంత్రి కొడుకు కావడమే అర్హతగా చెప్పుకునే లోకేష్ బరిలో ఉన్నారు. వాడీవేడిగా సాగిన చర్చల్లోకి వెళ్లినప్పుడు.. ‘ఇక్కడ అభివృద్ధి ఏంటో మనకు తెలుసు. బయటోడికేం తెలుసు! గ్రాఫిక్స్‌తో మాయ చేస్తున్నారు కదా?’ టీ తాగుతూనే మండిపడ్డాడు ముక్తేశ్వరరావు. ‘పర్మినెంట్ బిల్డింగ్ ఒక్కటన్నా కట్టారాండీ! ఏమీ చేయకుండా.. అన్నీ పూర్తి చేసేశామని చెబుతున్నారు. దారుణం కాదా! ఎందుకెయాలండీ ఆయనకు ఓటు?’ అన్నాడు ఐనవోలు రామారావు. అందరూ కసిగానే అడుగుతున్నారు. ఐదేళ్లుగా వాళ్లు పడే అవస్థలకు అద్దం పట్టాయి. పక్కనే రాజధాని ఉన్నా ఉద్యోగం లేదని చెప్పేవాళ్లు కొందరైతే.. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగి పేదలు ఇల్లు కూడా కట్టుకోలేని దుస్థితిని ఇంకొందరు నిరసించారు.
కూలీలను మోసం చేస్తారా?
రాయపూడికి వెళ్లినప్పుడు ఓ ఇంట్లో పెద్ద ఎత్తున రైతు కూలీలు సమావేశం కావడం కనిపించింది. వ్యవసాయ భూములన్నీ రాజధానికివ్వడంతో వాళ్లంతా ఉపాధి కోల్పోయారు. భూసేకరణ చట్టం ప్రకారం వాళ్లకూ పరిహారం ఇవ్వాలి. రాజధాని పరిసర ప్రాంతాల్లో 20 వేల మంది ఇలాంటి వాళ్లున్నారు. ‘ఏంటండీ.. మేమేం పాపం చేశాం. మాకు ఉపాధి పరిహారం ఇవ్వరా!. అదేమని అడిగితే మేం వైఎస్సార్ సీపీ వాళ్లం అంటున్నారు. అసలు మేం ఏ పార్టీనో ఎవరికి తెలుసు?’ కోటేశ్వరరావు స్వరం పెంచి మాట్లాడాడు.
‘అసలు వాళ్లిచ్చే రూ. 2500 ఏమూలకొస్తున్నాయి? పంట భూముల్ని పాడు చెయ్యకుండా ఉంటే ప్రతి ఇంటికీ పని దొరికేది’ మరో గళం నుంచి వచ్చిన మాటిది. అక్కడ చేరిన వందమందీ ఆవేశంగా మాట్లాడే ప్రయత్నమే చేస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని ఎంతమాత్రం సమర్థించడం సరికాదన్న ఏకాభిప్రాయమే వ్యక్తమమైంది. ఆ చర్చ అలా కొనసాగుతుండగానే ముందుకెళ్లాం. రాయపూడి దాటి అమరావతికి వెళ్లే దారిలో ఎడారిగా మారిన పొలాన్ని చూస్తూ శంకరయ్య అనే రైతు కన్పించాడు. ఆయన్ను కదిలిస్తే.. ‘ఈ రాజధాని కోసం నా భూమిని బలవంతంగా తీసుకున్నారయ్యా. పొలం లేకపోవడంతో మా పిల్లలు ఎక్కడెక్కడికో వెళ్లారు. పచ్చగా ఉండే ఈ భూమి బీడు పడింది’ కంట్లో నీటి సుడులు తిరుగుతుంటే.. జీరబోయిన గొంతుతో అన్నాడాయన.
పెద్దలా.. గద్దలా?
తుళ్లూరు, బోరుపాలెం మధ్య ఓ చోట యువకులు క్రికెట్ ఆడుతున్నారు. ప్రస్తుత ఎన్నికలపై వాళ్లను కదిలించినప్పుడు.. ‘మేమంతా బీటెక్, ఎంటెక్ చదివాం. ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. రాజధాని వచ్చి మాకేంటి లాభం. మా భూములన్నీ రాజధాని కోసం లాక్కున్నారు. మా పొలాల పక్కనే మంత్రులు, టీడీపీ నాయకులు కొనుక్కున్నారు. వాళ్లవి మాత్రం తీసుకోలేదు. ఊళ్లో ఏదైనా అంటే టీడీపీ వాళ్లు గూండాల్లా విరుచుకుపడుతున్నారు’ అని చెప్పారు వినీత్, సత్య ప్రకాశ్, కిరణ్ వర్మ, సుందర్ కృష్ణ. ‘ఇక్కడ పోలీసులు, గూండాలు ఏకమయ్యారు. ఎవరేం మాట్లాడినా దాడి చేస్తున్నారు. ఎలక్షన్లొచ్చాయి కదా ఇప్పుడు బుద్ధి చెబుతాం’ అన్నారు వాళ్లు. ‘జగన్ వస్తాడని, మాకు మంచి జరుగుతుందనే ఆశ ఉంది సార్.. ఆయనొస్తే రాజధాని తీసేస్తాడని టీడీపీ వాళ్లు అంటున్నారు. అదేం జరగదని మాకు తెలుసు’ అన్నాడు రాధాకృష్ణ. ‘మా వూరు పేరు ప్రచారం చేసుకుంటున్న ఈ ప్రభుత్వం చూడండి.. కనీసం మరుగుదొడ్లన్నా కట్టిందా?’ అని ప్రశ్నించారు అమరావతికి చెందిన కంభంపాటి.
ఒట్టేసి చెబుతున్నాం.. మార్పునకే ఓటు
సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల దగ్గర విచిత్ర అనుభవం ఎదురైంది. ఓ చోట డ్వాక్రా మహిళలు సమావేశమయ్యారు. టీం లీడర్ చేతిలో కొన్ని చెక్కులున్నాయి. వాటిని చూపిస్తూ ఆమె ‘ఇవి పసుపు–కుంకుమ చెక్కులు. ఇవి తీసుకునే ప్రతి ఒక్కరూ చంద్రబాబుకే ఓటేస్తానని ప్రమాణం చెయ్యాలి’ అంది. ఆ మాటపై ధనమ్మ, సుగుణ, శాంతలక్ష్మి ఒంటి కాలిపై లేచారు. ఈ మాటలతో కంగుతిన్న టీం లీడర్ ఎవరి చెక్కులు వాళ్ళకు ఇచ్చేసి అక్కడి నుంచి జారుకుంది. అదే ఊళ్లో మరోచోట అన్నదాత సుఖీభవపై రైతులు చర్చించుకుంటున్నారు. అక్కడికెళ్లి వాళ్లలో కొంతమందిని ప్రశ్నించగా.. ‘జగన్ రైతు భరోసా అన్నాడు కాబట్టే చంద్రబాబు సుఖీభవ అనే మాటెత్తాడు. వైఎస్సార్ రైతులకు ఇంతకన్నా ఎంతో మేలు చేశాడు. దానికి ప్రతిఫలంగా ఆయన కొడుక్కి అవకాశం ఇస్తే సరి’ అన్నాడు రఘురామయ్య.
పాపాల పుట్ట.. అగ్రిగోల్డ్ చిట్టా
చిలకలపూరిపేటలో పుల్లారావు అరాచకాలను ప్రతి వ్యక్తీ ప్రశ్నిస్తున్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు కాజేసిన వైనాన్ని, దళితుల భూములను సైతం మింగేసే ఆయన రాక్షసత్వాన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సుబ్బయ్యతోట ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడి మహిళలు టీడీపీ అరాచకాలను రోడ్ షో బృందానికి చూపించే ప్రయత్నం చేశారు. ఆ రాత్రి జనావాసాల మధ్యే టీడీపీ నేతలు మద్యం పంపిణీ చేస్తున్నారు. ‘చూడండి సార్.. వాళ్లు ఎంత తెగించారో. మహిళలు బయటకు రాలేకపోతున్నారు. పుల్లారావు వెంట తిరిగే రౌడీ గ్యాంగ్ వీళ్లంతా’ అని ఆవేశంగా చెప్పారు అక్కడి మహిళలు (పేర్లు వెల్లడించేందుకు ఇష్టపడలేదు). ‘ఈ ఎన్నికల్లోనైనా ఈ పరిస్థితి మారాలి. కొత్త ప్రభుత్వం రావాలి’ అని ఆకాంక్షించారు.
పిడికెడు మెతుకులకూ కరువే
విజయవాడలోని సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్‌లో కొంతమంది యువత చర్చించుకుంటుండగా.. రోడ్ షో బృందం వారితో మాట కలిపింది. ‘రాజధాని వచ్చి ఏం లాభం సార్. ఐదేళ్లలో ఒక్క నోటిఫికేషన్ వచ్చిందా? పోటీ పరీక్షల నిమిత్తం రూ.వేలకు వేలు ఖర్చు చేస్తున్నాం. అదిగో నోటిఫికేషన్.. ఇదిగో నోటిఫికేషన్ అంటున్నారు. ఇంత మోసం ఎక్కడైనా ఉంటుందా’ అన్నాడు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అరుణ్. ‘సార్.. ఇక్కడ అద్దెకు ఉండాలన్నా కుదరడం లేదు. వేలల్లో అద్దెలున్నాయి. ప్రభుత్వం అవినీతిని ప్రోత్సహిస్తోందే తప్ప, యువకులను పట్టించుకోవడం లేదు’ అన్నాడు శరత్. ‘నిరుద్యోగ భృతి పేరుతో మాయ చేయడం తప్ప, చిత్తశుద్ధిగా ఉద్యోగాల కల్పించడమే లేదు’ అన్నాడు విష్ణు. అదే సమయంలో అక్కడకు వచ్చిన ఓ రిక్షా కార్మికుడు ‘ఉద్యోగం లేక నా కొడుకు కూలి పనికి పోతున్నాడు సార్’ అన్నాడు. ‘మంచి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. నవరత్నాలు అమలైతే ప్రతి వారికీ మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది’ అంటూ ఊరూవాడా ప్రభుత్వ వ్యతిరేకతపై సాగుతున్న చర్చను పరిశీలిస్తూ సాక్షి బృందం ముందుకెళ్లింది.
ఏమిచ్చినా.. ఐదేళ్ల అరాచకం మానిపోతుందా?
నర్సరావుపేట నియోజకవర్గం ఉప్పలపాడులో ఓ చెట్టు దగ్గర హాట్‌హాట్‌గా చర్చ సాగుతోంది. చంద్రబాబు పథకాలపైనే వారు మాట్లాడుకుంటున్నారు. కొద్దిసేపు గమనించిన తర్వాత వాళ్లను కదిలిస్తే మనసులో బయటపెట్టారు. ‘ఇప్పుడు అన్నదాత సుఖీభవ అంటున్నాడు. పసుపు–కుంకుమ ఇస్తున్నాడు. నిరుద్యోగ భృతి.. పెన్షన్‌పెంపు అంటున్నాడు. అధికారంలోకి వచ్చినప్పుడే ఆయన ఇవన్నీ ఎందుకు చేయలేదు? ఐదేళ్లుగా జన్మభూమి కమిటీలు చుక్కలు చూపించాయి. పెన్షన్లు ఇవ్వాలంటే లంచం. ప్రభుత్వ పథకాలు ఏదడిగినా ముడుపులే. ఎదురు తిరిగితే కేసులు.. వేధింపులు. ఇప్పుడాయన ఎన్ని తాయిలాలు ఇచ్చినా ఐదేళ్లపాటు మేం పడిన బాధలు ఎలా మరిచిపోతాం? చావో రేవో ఈసారి ప్రజల పక్షాన నిలబడే వాళ్లకే ఓట్లేస్తాం’ శరభయ్య, సక్కులు, పోచం భద్రయ్య, రమణయ్య అన్న మాటలివి. ‘ఇసుక, మట్టి అన్నీ అమ్ముకున్నారు. ఇక్కడ కోడెల కుటుంబం దౌర్జన్యంగా ప్రవర్తిస్తోంది. ఇంకా వాళ్లను గెలిపిస్తామా?’ అన్నాడు రవిచంద్ర. ‘ఏడాదికి పైగా జగన్ పాదయాత్ర చూశాం. తొమ్మిదేళ్లుగా ఆయన పోరాటాలు గమనిస్తున్నాం. ఒక్క అవకాశం ఇవ్వాలనేది ప్రజల నిర్ణయం’ అంటూ చర్చకు ముక్తాయింపు ఇచ్చారు మనోహర్.
కాల్‌మనీ రాక్షసులకు బుద్ధి చెప్పాల్సిందే
విజయవాడలోని చిట్టినగర్ ప్రాంతంలో ఓ పార్టీ నేతలు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. ఓ ఇంటి దగ్గర ఉద్విగ్న వాతావరణం నెలకొంది. వచ్చిన నాయకులను ఉద్దేశిస్తూ అంటోందామె.. ‘వాళ్ళు రాక్షసులయ్యా. మా పిల్ల జీవితాన్ని పాడు చేశారు. అప్పు కట్టలేదని కాల్‌మనీ రాకెట్‌లోకి దించారు. వ్యభిచార కూపంలోకి నెట్టి వ్యాపారం చేశారు. పోలీసులోళ్లకు చెప్పినా పట్టించుకోలేదు. జగన్ ఈ విషయాన్ని బయటకు తెచ్చాడు’ కన్నీటి పర్యంతమవుతూ చెప్పిందామె. ‘అందుకే వాళ్లను ఓడించాలి’ అక్కడకొచ్చిన నాయకుడు చెబుతుండగానే ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. ‘ఇంకా వదులుతామా! వాడు ఎమ్మెల్సీ కావచ్చు. ఇంకేదన్నా కానీ.. ఓడిస్తామన్నా! ఈ పేటలో ఓట్లన్నీ వాడికి వ్యతిరేకంగానే వేయిస్తాం’ అందామె. కాల్‌మనీ ఊబిలో చిక్కుకున్న ఈ ప్రాంతంలో ఇప్పటికీ టీడీపీ నేతల ఆగడాలు సాగుతున్నాయని అక్కడి మహిళలు సువర్చల, బిందు, సుగుణ చెప్పారు.
రైతు కూలీలను మోసగించారు
రాజధాని ప్రాంతంలో రైతు కూలీలనూ చంద్రబాబు మోసం చేశాడు. పరిహార భృతిగా ఇచ్చే రూ.2,500 టీడీపీ వాళ్లకే ఇచ్చారు. వైఎస్సార్ సీపీ ముద్రేసి మమ్మల్ని దూరంగా పెట్టారు. ప్రభుత్వం ఇలా చెయ్యొచ్చా? – జానీ, రైతు కూలీ, రాయపూడి
పరువు తీస్తున్నారు
అమరావతి పరువు తీస్తున్నారు కదయ్యా. రాజధాని కట్టడం దేవుడెరుగు? పర్యాటక ప్రాంతమైన అమరావతిలో కనీసం టాయ్‌లెట్స్ కూడా లేవు. ఇదేనా పాలన? మార్పు రావాలయ్యా?
– కంభంపాటి సమాధానం, అమరావతి
ఉద్యోగులకు మంచి రోజులొచ్చినట్టే
సీపీఎస్ రద్దు విషయంలో ఉద్యోగుల మనోభావాలను జగన్ అర్థం చేసుకోవడం ఆనందంగా ఉంది. అందరికంటే ముందే ఈ విషయంలో ఆయన స్పందించారు. అధికారంలోకి వస్తే ఉద్యోగులకు మంచి రోజులు వచ్చినట్టే.
– ఎ.చంద్రశేఖర్ రెడ్డి, ప్రభుత్వ ఉద్యోగి, సత్తెనపల్లి
అభివృద్ధి అంటే గ్రాఫిక్స్ కాదు
రాజధాని పేరుతో గ్రాఫిక్స్ మాయాజాలం చేయడం కాదు. రాజధాని అభివృద్ధిపై జగన్‌కు నిజమైన విజన్ ఉంది. యువత భవిష్యత్‌ను తీర్చిదిద్దాలనే ఆకాంక్ష ఆయనకు ఉంది.
– గుర్రం ఉమ, కొత్త ఓటరు, సత్తెనపల్లి
వైఎస్ అడక్కుండానే ఇచ్చారు
ఎన్నికల ముందు ఏవేవో పథకాలు అంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంతకన్నా మంచి పథకాలను అడక్కుండానే ఇచ్చాడు. అలాంటి వ్యక్తి రుణం ఆంధ్ర ప్రజలు తీర్చుకోవద్దా?
– అంకమరావు, పెట్లూరివారిపాలెం, నర్సరావుపేట నియోజకవర్గం
Comments
Please login to add a commentAdd a comment