పోలవరం నిన్నటి కల.. నేటి పగటి కల | Chandrababu Thousands Crores of Rupees Have Been Damaged in The Name of Polavaram | Sakshi
Sakshi News home page

పోలవరం నిన్నటి కల.. నేటి పగటి కల

Published Tue, Apr 9 2019 7:35 AM | Last Updated on Tue, Apr 9 2019 7:35 AM

Chandrababu  Thousands Crores of Rupees Have Been Damaged in The Name of Polavaram - Sakshi

సాక్షి,  పోలవరం :  పోలవరం... ఐదు కోట్ల ఆంధ్రుల దశాబ్దాల కల.. ఆ స్వప్నం సాకారం చేసేందుకు నాడు వైఎస్‌ ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కాని గత ఐదేళ్లుగా చంద్రబాబు పాలనలో పోలవరం పునాదుల స్థాయి దాటలేదు.ప్రాజెక్టు పనులు నత్తను మరిపిస్తుంటే.. అదిగో పోలవరం.. ఇదిగో పూర్తయిందంటూ.. చెప్పేవన్నీ మోసపూరిత మాటలే..! రేపటి నుంచి పొలాలకు నీళ్లే అంటూ.. ఎన్నికల వేళ ప్రజలను మభ్యపెట్టడం మరీ దారుణం.. పోలవరం పేరిట వేలకు వేల కోట్లు దండుకుంటూ.. అసువుగా అబద్ధాలు చెప్పడం నివ్వెరపరుస్తోంది. కేంద్రం పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును తన చేతుల్లోకి తీసుకొన్న చంద్రబాబు కమీషన్ల కక్కుర్తి పోలవరానికి శాపంగా మారింది. ...ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు.. నత్తను మరిపిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనుల సచిత్రాలివిగో..!!

జలాశయం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..

అప్పుడే బీటలు వారిన డయాఫ్రం వాల్‌ 
ఇదిగో పై ఫోటోలు చూశారా.. పోలవరం జలాశయం పనుల్లో భాగంగా 2454 మీటర్ల పొడవుతో, 53.32 మీటర్ల ఎత్తుతో ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌(ఈసీఆర్‌ఎఫ్‌)ను ఇక్కడే నిర్మించాలి. 194.6 టీఎంసీలు నిల్వ చేసేది ఈసీఆర్‌ఎఫ్‌లోనే.. ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణంలో ఇప్పటివరకూ పునాది (డయా ఫ్రమ్‌ వాల్‌) పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఆ పునాది పనులూ నాసిరకంగానే చేశారు. వర్షాకాలంలో వచ్చిన చిన్నపాటి వరదలకే పునాది గోడలు బీటలు వారి.. కొన్ని చోట్ల శిథిలమయ్యాయి.

ఎగువ కాఫర్‌ డ్యామ్‌..  ఎప్పటికి పూర్తయ్యేనో..!

ఈ ఫోటోలో మీరు చూస్తున్నది.. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు... ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణానికి వీలుగా గోదావరి నదిని స్పిల్‌ మీదుగా మళ్లించడానికి ఎగువన 2454 మీటర్ల పొడవున కాఫర్‌ డ్యామ్‌ నిర్మించాలి. దీన్నే 41.5 మీటర్ల ఎత్తుతో నిర్మించి, గ్రావిటీ ద్వారా కాలువలకు నీటిని విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణంలో 72.56 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులకుగాను.. ఇప్పటిదాకా 21.51 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులు మాత్రమే చేశారు. నత్తనడకన పనులు సాగుతుండటంతో.. మిగతా 51.05 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులు పూర్తకావడానికి ఎంతకాలం పడుతుందో అంచనాకు అందడంలేదు.

తాబేలుకు తాత.. ఈ దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు..

ఇదిగో ఈ ఫోటో చూశారా.. దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు.. ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణానికి వీలుగా దిగువ నుంచి గోదావరి వరద జలాలు చేరకుండా దిగువన మరో కాఫర్‌ డ్యామ్‌ను 1660 మీటర్ల పొడవు, 30.5 మీటర్ల ఎత్తుతో నిర్మించాలి. ఈ పనుల్లో 26.84 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులకుగానూ.. 4.47 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులు మాత్రమే చేశారు. మిగతా 22.37 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులు తాబేలు నడకను తలపిస్తున్నాయి..  

నత్తను మరిపిస్తున్న స్పిల్‌వే పనులు..

ఈ ఫోటోలో మీరు చూస్తున్నది.. పోలవరం జలాశయం స్పిల్‌ వే. వరద జలాలను దిగువకు విడుదల చేయడానికి 1054.4 మీటర్ల పొడవున 53.32 మీటర్ల ఎత్తుతో నిర్మించాలి. స్పిల్‌వేకు 25.72 మీటర్ల వద్ద(క్రస్ట్‌ లెవల్‌) 48 చోట్ల.. 16 మీటర్ల వెడల్పు,  20 మీటర్ల ఎత్తు అంటే 45.72 మీటర్ల వరకూ(ఎఫ్‌ఆర్‌ఎల్‌) గేట్లు ఏర్పాటు చేయాలి. ఈ స్పిల్‌ వే పనుల్లో 38.88 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులకుగానూ.. 26.28 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులు చేశారు. మరో 12.60 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులు చేయాలి. స్పిల్‌ వేకు 48 గేట్లకుగానూ ఒక చోట మాత్రమే కేవలం స్కిన్‌ ప్లేట్‌ను అమర్చారు. ఒక్కో గేటును అమర్చడానికి 30 నుంచి 35 రోజుల సమయం పడుతుంది. గేట్లు ఎత్తడానికి దించడానికి వీలుగా ఒక్కో గేటుకు రెండు చొప్పున 96 హైడ్రాలిక్‌ హాయిస్ట్‌లను అమర్చాలి. వాటిని జర్మనీ నుంచి దిగుమతి చేసుకోలేదు.  

ఆంధ్రప్రదేశ్‌కు అన్నపూర్ణ నామధేయాన్ని సుస్థిరం చేయాలన్న లక్ష్యంతో.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2005లో పోలవరం ప్రాజెక్టును చేపట్టి రూ.5,135.87 కోట్లతో 44.84 శాతం పనులు పూర్తి చేశారు. కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించడానికి సన్నద్ధమవుతున్న క్రమంలోనే మహానేత వైఎస్‌ అమరుడయ్యారు. 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో.. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. వంద శాతం ఖర్చుతో తామే పూర్తి చేస్తామని పునర్విభజన చట్టం సెక్షన్‌ 90(1) ద్వారా హామీ ఇచ్చింది. ప్రాజెక్టును పూర్తి చేయడానికి స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌గా పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)ని కేంద్రం ఏర్పాటు చేసి.. ఆ సంస్థతో ఒప్పందం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కానీ.. పీపీఏతో ఒప్పందం చేసుకోకుండా.. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను తమకు అప్పగించాలని చంద్రబాబు పట్టుబట్టడంతో.. సెప్టెంబరు 7, 2016న పోలవరం నిర్మాణ బాధ్యతలను కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది.

పోలవరం.. నామినేషన్‌..

పోలవరం హెడ్‌ వర్క్స్‌లో ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ పునాది(డయా ఫ్రమ్‌ వాల్‌)కే పరిమితమైన దుస్థితి..  

  • చంద్రబాబు పోలవరం నిర్మాణ బాధ్యతలు దక్కించుకున్న మరుసటి రోజే.. హెడ్‌ వర్క్స్‌ అంచనా వ్యయాన్ని రూ.4054 కోట్ల నుంచి రూ.5,535.41 కోట్లకు పెంచేసి.. కాంట్రాక్టర్, టీడీపీ ఎంపీ అయిన రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌కి రూ.1481.41 కోట్ల ప్రయోజనం చేకూర్చారు. ఆ తర్వాత హెడ్‌ వర్క్స్‌లో మట్టి పనులను త్రివేణి, కాంక్రీట్‌ పనులు పెంటా, ఫూట్జ్‌మీస్టర్, డయా ఫ్రమ్‌ వాల్‌ పనులు ఎల్‌ అండ్‌ టీ–బావర్, జెట్‌ గ్రౌటింగ్‌ పనులు కెల్లర్, గేట్ల పనులు బీకెమ్‌కు సబ్‌ కాంట్రాక్టు కింద అప్పగించి.. కమీషన్‌లు వసూలు చేసుకున్నారు. 
  • రాయపాటి సబ్‌ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో వారు పనులు చేయకుండా చేతులెత్తేశారు. దాంతో.. రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ని 60సీ నిబంధన కింద తప్పించి.. మిగిలిన పనులు(2015–16 ధరల ప్రకారం రూ.3,498.12 కోట్లు)ను నవయుగకు నామినేషన్‌ పద్ధతిలో కట్టబెట్టేశారు. తాజాగా సవరించిన అంచనాల ప్రకారం– ఆ పనుల విలువ రూ.8,773.37 కోట్లు కావడం గమనార్హం. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమీషన్‌లు చేతులు మారాయి.
  • పోలవరం కుడి కాలువలో 177.9 కిలోమీటర్లకు గానూ 145 కిలోమీటర్ల పొడవున లైనింగ్‌తో సహా.. ఎడమ కాలువ పనుల్లో 210.92 కిలోమీటర్లకు 134 కిలోమీటర్ల పనులు లైనింగ్‌తో సహా దివంగత సీఎం వైఎస్‌ పూర్తి చేశారు. మట్టి పనులు అధిక శాతం అప్పట్లోనే పూర్తయ్యాయి. కానీ.. చంద్రబాబు కుడి కాలువ పనుల అంచనా వ్యయాన్ని రూ.2,240.86 కోట్ల నుంచి రూ.4,375.77 కోట్లకు.. ఎడమ కాలువ పనులు రూ.1,954.74 కోట్ల నుంచి రూ. 3,645.15 కోట్లకు పెంచేశారు. కుడి కాలువలో పాత కాంట్రాక్టర్లపై వేటు వేసి పనులన్నీ బొల్లినేని శీనయ్యకు.. ఎడమ కాలువలో ఏడు ప్యాకేజీల కాంట్రాక్టర్లపై వేటు వేసి ఆర్థిక మంత్రి యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్‌ యాదవ్, సూర్య కన్‌స్ట్రక్షన్, బీఎస్సార్‌ వంటి సంస్థలకు నామినేషన్‌ పద్ధతిలో అప్పగించి భారీ ఎత్తున కమీషన్‌లు దండుకున్నారు. 
  • జలాశయం నుంచి కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేయడానికి హెడ్‌ రెగ్యులేటర్‌లు.. కుడి వైపున రెండు టన్నెల్‌లు.. ఎడమ వైపు ఒక టన్నెల్‌ తవ్వాలి. కుడి వైపున అనుసంధానం పనులు 74.81 శాతం, ఎడమ వైపున అనుసంధానం పనులు 48.51 శాతమే పూర్తయ్యాయి.
  • గత 58 నెలల్లో పోలవరం ప్రాజెక్టు కోసం రూ.11,069.21 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో రూ.మూడు వేల కోట్లకుపైగా దోచేశారు. పనులు పూర్తిగా నాసిరకంగా ఉన్నాయి. గతేడాది మార్చి నాటికే రూ.1853 కోట్లు దోచేసినట్లు కాగ్‌ తన నివేదికలో పేర్కొనడం ఇందుకు నిదర్శనం.

భూసేకరణ, పునరావాసంలోనూ దోపిడీ

పోలవరం ప్రాజెక్టుస్పిల్‌ ఛానల్‌ నిర్మాణ ప్రాంతం 

  • పోలవరం జలాశయంలో ముంపునకు గురయ్యే భూమి, కుడి, ఎడమ కాలువల తవ్వకంకోసం లక్ష ఎకరాలకుపైగా భూమిని 2009 నాటికే సర్కారు‡ సేకరించింది. కుడి కాలువలో పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో నాలుగు మండలాలకు చెందిన కొందరు రైతులతో కేసులు వేయించి.. పనులకు ఆటంకం కలిగించారు  చంద్రబాబు.  2015లో ఆ భూములకు ఎకరానికి రూ.52.60 లక్షల చొప్పున సుమారు 1330 ఎకరాలకు రూ.700 కోట్ల పరిహారం ఇచ్చి.. ఇందులో సగానికిపైగా కమీషన్‌ల రూపంలో కాజేశారు.
  • పోలవరం జలాశయంలో ముంపునకు గురయ్యే భూమిలో గతంలో సేకరించిన భూమినే మళ్లీ సేకరించినట్లు చూపి రూ.400 కోట్లకుపైగా దోచేశారు. ముంపు గ్రామాలకు చెందిన 1,05,601 నిర్వాసిత కుటుంబాలకుగానూ 3,922 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారు. పునరావాస కాలనీలు, గృహాల నిర్మాణ పనులను కోటరీ కాంట్రాక్టర్లకు అప్పగించి.. నాసిరకంగా పనులు చేసి భారీ ఎత్తున దోచేశారు. భూసేకరణ, పునరావాసానికి చేసిన వ్యయంలో రూ.వెయ్యి కోట్లకుపైగా దోచేశారు.
  • రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన సొమ్ములో రూ.6,727.26 కోట్లు కేంద్రం విడుదల చేసింది. వాటికి లెక్కలు చెబితే మిగతా రూ.4,341.95 కోట్లు విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. కాని లెక్కలు చెబితే అక్రమాలు బట్టబయలవుతాయనే నెపంతో రాష్ట్ర ప్రభుత్వం మిన్నకుండిపోయింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement