పంచాయతీలకు ఎల్‌ఈడీ షాక్‌! | Led shock for panchayats | Sakshi
Sakshi News home page

పంచాయతీలకు ఎల్‌ఈడీ షాక్‌!

Published Tue, Jan 9 2018 3:28 AM | Last Updated on Tue, Jan 9 2018 3:28 AM

Led shock for panchayats - Sakshi

సాక్షి, అమరావతి: కాదేదీ కవితకనర్హం అని కవి చెప్పిన మాట. కానీ కాదేదీ అవినీతికనర్హం అని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పెద్దలు రుజువు చేస్తున్నారు. ఇసుక నుంచి ఇరిగేషన్‌ వరకు, మట్టి నుంచి మద్యం వరకు, సోలార్‌ టెండర్ల నుంచి బొగ్గు కొనుగోళ్ల వరకు.. చివరకు గుడి భూములను కూడా వదలకుండా అన్నిటినీ అవినీతిమయం చేసిన సర్కారు పెద్దలు చివరకు గ్రామ పంచాయతీలనూ వదల్లేదు. ఎల్‌ఈడీ వీధి దీపాల పేరుతో పంచాయతీలపై మోయలేని గుదిబండను మోపి అందులో కమీషన్లను కొట్టేస్తున్నారు.  

గ్రామాల్లోని వీధి దీపాలుగా ఇప్పుడున్న ట్యూబ్‌లైట్లు, సాధారణ బల్బుల స్థానంలో ఎల్‌ఈడీ బల్బులను ఏర్పాటు చేసుకోవాలంటూ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేశ్‌ జారీ చేసిన ఉత్తర్వులు పంచాయతీల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఈ ఎల్‌ఈడీ బల్బుల కుంభకోణం.. పంచాయతీలపై అప్పుల భారాన్ని మోపుతూ.. ప్రయివేటు కంపెనీలకు కాసులను, ప్రభుత్వ పెద్దలకు కమీషన్లను కురిపిస్తోంది.  
 
రూ.900 బల్బుకు రూ. 4,570 
గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న వీధి దీపాల స్థానంలో ఎల్‌ఈడీ బల్బులను ఏర్పాటు చేసినందుకు ఆయా గ్రామ పంచాయతీ ప్రతి నెలా కరెంట్‌ బిల్లులు యదావిధిగా చెల్లిస్తూనే లైట్‌ ఏర్పాటు చేసిన కాంట్రాక్టరుకు ఒక్కొక్క బల్బుకు ప్రతి ఏటా రూ.457 చొప్పున పదేళ్ల పాటు అంటే రూ. 4,570 చెల్లించాలట. ఇప్పటికే అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న గ్రామ పంచాయతీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఈడీ గుదిబండను మోపుతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఏడాదిలోగా అన్ని గ్రామ పంచాయతీలలో ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటు పూర్తి కావాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి లోకేశ్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రూ.900 పెట్టుబడి పెట్టి ఒక్క ఎల్‌ఈడీ లైటు ఏర్పాటు చేస్తే ఏడాదికి రూ.457 చొప్పున రేండేళ్లలోనే ఆ కాంట్రాక్టరు చేతికి పెట్టుబడి వచ్చేస్తుంది. మరో 8 ఏళ్లపాటు లాభాలందుకుంటారు. అలా పదేళ్లలో కాంట్రాక్టరు చేతికి రూ.4,570లు చేరతాయి.  
 
సర్కారు పెద్దలకు భారీగా కమీషన్‌.. 
మార్కెట్‌లో ఒక్కొక్క 24 వాట్ల ఎల్‌ఈడీ బల్బు ధర సుమారు రూ.900 ఉంది. టోకున కొంటారు కాబట్టి ఇంకా తక్కువకే లభించే అవకాశం ఉంది.  38 లక్షల బల్బులకుగాను పదేళ్లలో రూ. 1,736 కోట్లు పంచాయతీలు చెల్లిస్తాయి. ఇందులో పెట్టుబడి, వడ్డీలు, నిర్వహణ ఖర్చులు అన్నీ రూ.736 కోట్లు తీసేసినా పదేళ్లలో ప్రయివేటు కాంట్రాక్టర్లకు మిగిలేది రూ.1,000 కోట్లకు పైమాటే. అందులో పెద్దమొత్తంలో సర్కారు పెద్దలకు దశలవారీగా కమీషన్ల రూపంలో చెల్లించేందుకు ఒప్పందం కుదిరిందని పంచాయతీరాజ్‌ శాఖలో వినిపిస్తోంది. 
 
మొత్తం 38 లక్షల బల్బులు  
రాష్ట్రంలో 12,918 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటిలో 29,89,630 విద్యుత్‌ స్తంభాలు ఉన్నాయి. గ్రామాల్లో కొత్తగా మరో 8 లక్షల విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేసి, మొత్తం 38 లక్షల స్తంభాలకు ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చిన్న గ్రామ పంచాయతీలో కూడా రెండు వందలకు పైనే విద్యుత్‌ స్తంభాలు ఉండే పరిస్థితి.  
 
నెడ్‌క్యాప్, ఈఎస్‌ఎస్‌ఎల్‌లతో ఒప్పందం 
ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటు ప్రక్రియ కోసం... నెడ్‌క్యాప్, ఈఎస్‌ఎస్‌ఎల్‌ సంస్థలతో  పంచాయతీరాజ్‌ శాఖ ఒప్పందం చేసుకుంది. నెడ్‌క్యాప్, ఈఎస్‌ఎస్‌ఎల్‌ సంస్థలు ప్రైవేట్‌ కాంట్రాక్టర్లను నియమించుకొని, అన్ని గ్రామాల్లో ఏడాది కాలంలోనే ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేయాల్సి ఉంది. తొలివిడతగా తూర్పుగోదావరిలో సూర్య కంపెనీ, విశాఖ జిల్లాలో తేజ కంపెనీ ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేయనున్నాయి. గ్రామాల్లో ఏర్పాటు చేసే 24 వాట్ల ఎల్‌ఈడీ బల్బు ఒక్కో దానికి ఏటా రూ.457 చొప్పున పదేళ్ల పాటు క్రమం తప్పుకుండా గ్రామ పంచాయతీ చెల్లించాల్సి ఉంది. (గ్రామ కూడలి ప్రాంతాల్లో 75 వాట్ల ఎల్‌ఈడీ బల్బు ఏర్పాటు చేసుకుంటే ఒక్కొక్క బల్బుకు చెల్లించాల్సిన మొత్తం కూడా ఆ మేరకు పెరుగుతుంది.)  
 
ఒక్కో పంచాయతీకి ఏటా రూ.లక్ష అప్పే 
ఒక్కొక్క స్తంభానికి ఎల్‌ఈడీ బల్బు ఏర్పాటు చేసినందుకు రూ.457 చొప్పున 200 స్తంభాలకు సంబంధిత పంచాయతీ ఏటా రూ.లక్ష వరకు చెల్లించాల్సి ఉంటుంది. పదేళ్ల పాటు పంచాయతీ ఈ మొత్తాన్ని క్రమం తప్పకుండా చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 12,918 గ్రామ పంచాయతీల్లో 10,500 గ్రామ పంచాయతీలు మైనర్‌ పంచాయతీలే. కేంద్రం 14వ ఆర్థిక సంఘం పేరిట గ్రామ పంచాయతీలకు నేరుగా ఇచ్చే నిధులను కలుపుకొన్నా కూడా ఒక్కొక్క మైనర్‌ పంచాయతీ ఏడాది ఆదాయం ఐదారు లక్షలకు ఆటు ఇటుగానే ఉంటుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement