
జీఐ సబ్ స్టేషన్‌లో పనులు పరిశీలిస్తున్న విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు, టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలి గ్యాస్ ఇన్సులేటెడ్ ఆధారిత సబ్‌స్టేషన్ (జీఐఎస్) ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే సబ్‌స్టేషన్‌లోని పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల చార్జింగ్ ప్రక్రియ పూర్తయింది. సీఎం కేసీఆర్ టైమ్ ఇవ్వడమే ఆలస్యం.. రాయదుర్గంలోని ఈ అత్యాధునిక సబ్‌స్టేషన్ అందుబాటులోకి రానుంది. దీనివల్ల హైదరాబాద్ నగరవాసులకు మరో 30 ఏళ్ల వరకు విద్యుత్ సరఫరా విషయంలో ఎలాంటి ఢోకా ఉండదు. విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి బుధవారం ఈ సబ్‌స్టేషన్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
ఐటీ, అనుబంధ సంస్థల అవసరాలను గుర్తించి..
రాయదుర్గం, గచ్చిబౌలి, మాదాపూర్, నానక్‌రాంగూడ, హైటెక్‌సిటీ, బంజారాహిల్స్ పరిసరాల్లో కొత్తగా అనేక ఐటీ కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. ఐటీ, అనుబంధ కంపెనీలు, హోటళ్లు, ఆస్పత్రులు, ఇతర వ్యాపార, వాణిజ్య సంస్థలు వెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఇక్కడ అవసరమైన సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మూడేళ్ల క్రితం ఔటర్ రింగ్‌రోడ్డుకు సమీపంలోని రాయదుర్గంలో టీఎస్ ట్రాన్స్‌కో రూ.1,400 కోట్లతో దేశంలోనే తొలిసారిగా గ్యాస్ ఇన్సులేటెడ్ ఆధారిత సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు శంకుస్థాపన చేసింది.
ఒకే చోట నాలుగు సబ్‌స్టేషన్లు
సాధారణంగా సంప్రదాయ విధానంలో 400 కేవీ సామర్థ్యం గల సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలంటే 20 ఎకరాల భూమి అవసరమవుతుంది. గచ్చిబౌలి వంటి ఖరీదైన ప్రదేశంలో అంతభూమి దొరికే పరిస్థితి లేదు. దీంతో తక్కువ విస్తీర్ణంలో ఏర్పాటు చేసుకునే అత్యాధునిక గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయా లని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేవలం ఐదెకరాల విస్తీర్ణంలో 400 కేవీ సబ్‌స్టేషన్‌తో పాటు 220 కేవీ, 130 కేవీ, 33 కేవీ సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయడం గమనార్హం. ఇందులో ప్రధానమైంది 400 కేవీ సబ్‌స్టేషన్ కాగా మిగ తావి కూడా సిద్ధమయ్యాయి. అలాగే ఇక్కడ 500 మెగావాట్ల సామర్థ్యం గల రెండు పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి నగరానికి వెయ్యి మెగావాట్ల సామర్థ్యం ఉన్న విద్యుత్‌ను సరఫరా చేసే వీలుంది.
ఒక్క క్షణం కూడా కరెంట్ పోదు: జగదీశ్‌రెడ్డి
మూడేళ్ల క్రితం పనులు మొదలు పెట్టాం. కరోనా వల్ల వరుస లాక్‌డౌన్‌లకు తోడు ఆర్థిక సంక్షోభం వంటి అనేక సవాళ్లు ఎదుర్కొన్నాం. అయినా ఏ ఒక్క రోజు కూడా పనులు ఆపలేదు. హైదరాబాద్‌లో రానున్న 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఆ సామర్థ్యం మేరకు విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. ఒక్క క్షణం కూడా కరెంట్ పోకుండా ఏర్పాట్లు చేశాం. త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ సబ్‌స్టేషన్‌ను ప్రారంభిస్తాం.
Comments
Please login to add a commentAdd a comment