సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లకు మీటర్ల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈ ఆర్సీ)కి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్) వివరణ ఇచ్చింది. మీటర్ల ఏర్పాటు కోసం రూ.93 కోట్ల రుణమివ్వాలని గతేడాది జూలై 22న గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (ఆర్‌ఈసీ)కు ప్రతిపాదనలు పంపామ ని.. ఆ రుణం మంజూరయ్యాక మీటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపింది.
అయితే దీనిపై ఆర్‌ఈసీ నుంచి ఇంకా స్పందన రాలేదని పేర్కొంది. రాష్ట్రంలో అన్ని వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లకు నిర్దేశిత గడువులోగా మీటర్లు బిగించి, వ్యవసాయ విద్యుత్ వినియోగాన్ని కచ్చితంగా లెక్కించాలని గతంలో రాష్ట్ర ఈఆర్సీ ఆదేశించింది. ఈ అంశంలో పురోగతిని తెలియజేయాలని ఇటీవల ఈఆర్సీ కోరగా.. తాజాగా టీఎస్‌ఎస్పీడీసీఎల్ బదులిచ్చింది.
తగ్గిన వ్యవసాయ విద్యుత్ వినియోగం
రాష్ట్రంలో భారీ ఎత్తిపోతల పథకాలు చేపట్టిన నేపథ్యంలో కాల్వల కింద సాగు పెరిగి బోరుబావుల కింద వ్యవసాయ విద్యుత్ వినియోగం క్రమంగా తగ్గుతోందని రాష్ట్ర డిస్కంలు వెల్లడించాయి. ఇదే సమయంలో ఎత్తిపోతల పథకాల విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని వివరించాయి.
►దక్షిణ తెలంగాణలోని 5 ఉమ్మడి జిల్లాల పరిధిలో 2021–22 తొలి అర్ధవార్షికంలో 5,410 మిలియన్ యూనిట్ల (ఎంయూ) వ్యవసాయ విద్యుత్ వినియోగం జరగ గా.. 2022–23తొలి అర్ధవార్షికంలో 5,105 ఎంయూల వినియోగం జరిగిందని టీఎస్‌ఎస్పీడీసీఎల్ తెలిపింది. తమ సంస్థ పరిధిలో దాదాపు 6% వ్యవసాయ విద్యుత్ వినియోగం తగ్గిందని తెలిపింది. 2023– 24లో ఎత్తిపోతల పథకాల వినియోగం 105% పెరగనుందని అంచనా వేసింది.
►ఉత్తర తెలంగాణలోని ఐదు ఉమ్మడి జిల్లాల పరిధిలో 2021–22 తొలి అర్ధ వార్షికంలో 2,938 ఎంయూల వ్యవసాయ విద్యుత్ వినియోగం జరగగా.. 2022–23 తొలి అర్ధ వార్షికంలో 2,809 ఎంయూల వినియోగం మాత్రమే జరిగిందని ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ ఎన్పీడీసీఎల్) తెలిపింది. తమ సంస్థ పరి ధిలో దాదాపు 4% వ్యవసాయ విద్యుత్ వినియోగం తగ్గిందని ఈఆర్సీకి నివేదించింది. ఉత్తర తెలంగాణలో 2023–24లో ఎత్తిపోతల పథకాల విద్యుత్ వినియోగం 287% పెరగనుందని అంచనా వేసింది.
►2023–24కి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్‌ఆర్)లో వ్యవసాయ విద్యుత్ అవసరాల అంచనాలను తగ్గించడంపై ఈఆర్సీ వివరణ కోరగా.. డిస్కంలు ఈ వివరాలు ఇచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment