వచ్చే ఏడాది 43% మిగులు విద్యుత్‌! | ERC public hearing on proposals of discoms on November 22 | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాది 43% మిగులు విద్యుత్‌!

Published Mon, Sep 4 2023 4:33 AM | Last Updated on Mon, Sep 4 2023 4:33 AM

ERC public hearing on proposals of discoms on November 22 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అవసరానికి మించి విద్యుత్‌ కొనుగోళ్ల కోసం రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు భారీ ఎత్తున చేసుకున్న దీర్ఘకాలిక ఒప్పందాలు... వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర ప్రజలకు గుదిబండగా మారబోతున్నాయని విద్యుత్‌రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో భారీ ఎత్తున మిగులు విద్యుత్‌ ఉండనుందని, దీంతో అవసరం లేని విద్యుత్‌కు పెద్ద మొత్తంలో స్థిర చార్జీలు (ఫిక్స్‌డ్‌ చార్జీలు) చెల్లించక తప్పదని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ముందు అభ్యంతరం వ్యక్తం చేశారు.

విద్యుదుత్పత్తి కేంద్రాలను బ్యాకింగ్‌ డౌన్‌ చేసి ఉత్పత్తిని తగ్గించుకోవడం, పూర్తిగా నిలుపుదల చేయడం తప్పదని స్పష్టం చేశారు. 2024–25లో ఏకంగా 43.24 శాతం, 2025–26లో 41.97 శాతం, 2026–27లో 34.13 శాతం, 2027–28లో 26.29 శాతం, 2028–29లో 15.22 శాతం మిగులు విద్యుత్‌ ఉండనుందని సెంటర్‌ ఫర్‌ పవర్‌ స్టడీస్‌ కన్వినర్‌ ఎం.వేణుగోపాల్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు.

2024–29, 2029–34 మధ్య కాలంలో రాష్ట్రంలో ఉండనున్న విద్యుత్‌ డిమాండ్‌ అంచనాలు, విద్యుత్‌ విక్రయాల అంచనాలు, ఆ మేరకు సరఫరా చేసేందుకు విద్యుత్‌ కొనుగోళ్ల ప్రణాళికలు, పెట్టుబడి ప్రణాళికలతో కూడిన తమ వనరులు, వ్యాపార ప్రణాళికలను ఇటీవల రాష్ట్ర డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాయి.

దీనిపై ఈఆర్సీ అన్ని వర్గాల నుంచి అభ్యంతరాలను ఆహ్వానించగా ఎం.వేణుగోపాల్‌రావు రాతపూర్వకంగా అభ్యంతరం తెలియజేశారు. కొత్త ఎత్తిపోతల పథకాల విద్యుత్‌ అవసరాలు ఏటేటా క్రమంగా పెరగనున్నందున మిగులు విద్యుత్‌ సమస్యే ఉండదంటూ డిస్కంలు సమరి్థంచుకోవడాన్ని కొట్టిపడేశారు. ఎత్తిపోతల పథకాలకు ఎంత విద్యుత్‌ అవసరమో డిస్కంలు ప్రతిపాదించలేదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలకు అనుమతులు జారీ చేసే ముందు ఈఆర్సీ సమగ్ర పరిశీలన జరపాలని సూచించారు.  

ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్ల ధర ఎంత? 
వ్యవసాయం మినహా అన్ని కేటగిరీల కనెక్షన్లకు 2025 నుంచి ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లను బిగించాలని కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలులో భాగంగా రివాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ స్కీం (ఆర్డీఎస్‌ఎస్‌)లో చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్టు డిస్కంలు ఈఆర్సీకి తమ వనరుల ప్రణాళికలో వెల్లడించాయి.

2024–29 మధ్య కాలంలో ఎల్టీ మీటర్లకు ప్రీపెయిడ్‌ మీటర్లకు రూ. 348 కోట్లు, హెచ్‌టీ ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లకు రూ. 305 కోట్లు అవసరమని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీసీఎల్‌) నివేదించింది. ఎల్టీ మీటర్లకు రూ.116 కోట్లు, హెచ్‌టీ మీటర్లకు రూ.10.94 కోట్లు అవసరమని ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎన్పీడీసీఎల్‌) ప్రతిపాదించింది.

ఈ మీటర్ల ధర ఎంత? ఏ విధంగా ఈ ధరలను ఖరారు చేశారో తెలపాలని వేణుగోపాల్‌రావు డిస్కంలను ప్రశ్నించారు. కాగా, ఈఆర్సీ గత శుక్రవారం నిర్వహించిన బహిరంగ విచారణకు సరైన సమాచారంతో డిస్కంలు రాకపోవడంతో పలువురు నిపుణులు చేసిన వి జ్ఞప్తి మేరకు ఈ నెల 22న విచారణ నిర్వహించాలని ఈఆర్సీ నిర్ణయించింది. ఆలోగా పూర్తి వివరణలను సమర్పించాలని డిస్కంలను ఆదేశించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement