హైదరాబాద్: విద్యుత్ సిబ్బంది లంచగొండితనం, ఏటా వందల మంది రైతులు, కాంట్రాక్టు ఉద్యోగుల మృతికి కారణమవుతున్న విద్యుదాఘాతాలు, ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులో తీవ్ర జాప్యం.. వేళాపాల లేని విద్యుత్ సరఫరా.. ప్రభుత్వ రాయితీల్లో కోత.. తదితర అంశాలపై రైతు సంఘాలు, ప్రజాసంఘాల ప్రతినిధులు, వినియోగదారులు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(టీఎస్‌ఎస్‌పీడీసీఎల్)పై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా సంస్థ పనితీరులో ఏ మాత్రం మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
2015-16 సంవత్సరంలో విద్యుత్ చార్జీల పెంపు కోసం ఎస్‌పీడీసీఎల్ సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్)పై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్‌సీ) శుక్రవారం ఆర్టీసీ కళాభవన్‌లో నిర్వహించిన బహిరంగ విచారణలో డిస్కంల పనితీరుపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిస్కంల పద్ధతిలో మార్పు రాకుంటే ఈ విచారణలు ఎందుకని, వచ్చే ఏడాది నుంచి మానుకోవాలని ఈఆర్‌సీ చెర్మైన్ ఇస్మాయిల్ అలీ ఖాన్, సభ్యులు హెచ్ శ్రీనివాసులు, ఎల్.మనోహర్‌రెడ్డి ఎదుట వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.