![electricity consumption is steadily increasing in Telangana](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/TOWERS.jpg.webp?itok=eOMxrzN0)
2025–26లో రాష్ట్రానికి విద్యుత్ లభ్యత 1,23,631 మిలియన్ యూనిట్లు
అవసరాలు 98,319 ఎంయూ మాత్రమే.. 25,312 ఎంయూ మేర మిగులు
ఈ విద్యుత్ విలువ సుమారు రూ.14,022.84 కోట్లు..
ఒప్పందాల మేరకు కొనకపోయినా ఫిక్స్‌డ్ చార్జీలు చెల్లించాల్సిందే.. ప్రజలపైనే ఆ భారం!
అవసరాల్లో వినియోగదారులకు చేరేది 87,384 ఎంయూ మాత్రమే
మిగతా 10,934 యూనిట్లు సాంకేతిక–వాణిజ్య నష్టాలే..
ఈఆర్సీకి సమర్పించిన ఏఆర్‌ఆర్ నివేదికలో డిస్కంల వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరం 2025–26లో ఏకంగా 25,312 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్ మిగిలిపోనుంది. వచ్చే ఏడాది రాష్ట్ర విద్యుత్ అవసరాలు 98,319 ఎంయూగా అంచనా వేయగా.. 1,23,631 ఎంయూ విద్యుత్ లభ్యత ఉండనుంది. ఇప్పటికే కుదుర్చుకున్న/భవిష్యత్తులో చేసుకోనున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల మేరకు ఇంత భారీగా విద్యుత్ సమకూరనుంది. కొనుగోలు చేసే విద్యుత్‌లో రాష్ట్ర అవసరాలు పోగా 25,312 ఎంయూ మిగిలిపోనుంది. సగటున యూనిట్‌కు రూ.5.54 ధర లెక్కన మిగులు విద్యుత్ విలువ రూ.14,022.84 కోట్లు అవుతోంది. అదనంగా ఉందనే ఉద్దేశంతో మిగులు విద్యుత్‌ను కొనుగోలు చేయకపోయినా... ఒప్పందాల మేరకు విద్యుదుత్పత్తి సంస్థలకు ఫిక్స్‌డ్ చార్జీలు చెల్లించాల్సిందే.
అంటే డిస్కంలపై, పరోక్షంగా రాష్ట్ర ప్రజలపై భారం పడినట్టే అవుతుందని విద్యుత్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర విద్యుత్ అవసరాలు 98,318 ఎంయూ కాగా.. డిస్కంలు రాష్ట్రంలోని వినియోగదారులకు విక్రయించనున్న మొత్తం విద్యుత్ 87,384 ఎంయూ మాత్రమే. మిగతా 10,934 ఎంయూ విద్యుత్‌ను డిస్కంలు ‘సాంకేతిక, వాణిజ్య నష్టాల (ఏటీ అండ్ సీ లాసెస్)’రూపంలో నష్టపోనున్నాయి. ఈ నష్టాల విలువ సుమారు రూ.6,057.43 కోట్లు కావడం గమనార్హం. దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఇటీవల రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ)కి సమర్పించిన ‘వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్‌ఆర్) 2025–26’లో వెల్లడించిన వివరాలు ఈ వాస్తవాలను స్పష్టం చేస్తున్నాయి.
రూ.20,151 కోట్ల విద్యుత్ సబ్సిడీ అవసరం
రాష్ట్రంలో విద్యుత్ సరఫరా కోసం 2025–26లో రూ.65,849 కోట్లు వ్యయం కానుండగా.. ప్రస్తుత విద్యుత్ చార్జీలతో డిస్కంలకు రూ.45,698 కోట్లే ఆదాయం అందుతుంది. అయినా విద్యుత్ చార్జీలు పెంచకుండా ప్రస్తుత చార్జీలనే కొనసాగించాలని డిస్కంలు ప్రతిపాదించాయి. దీనితో మిగిలిన రూ.20,151 కోట్ల ఆదాయ లోటును భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీలను పెంచక తప్పదని.. లేకుంటే డిస్కంలు గట్టెక్కే అవకాశాలు ఉండవని విద్యుత్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రూ.64,227 కోట్లకు పైగా నష్టాల్లో ఉన్న డిస్కంలు ఆర్థికంగా మరింత కుంగిపోతాయని పేర్కొంటున్నాయి.
భారీగా పెరిగిన కాస్ట్ ఆఫ్ సర్విస్!
విద్యుత్ కొనుగోలు చేసేందుకు డిస్కంలు మొత్తంగా రూ. 50,572 కోట్లను ఖర్చు చేయనున్నాయి. అంటే విద్యు దుత్పత్తి కంపెనీలకు ఒక్కో యూనిట్‌కు సగటున రూ.5.54 చెల్లించనున్నాయి. అయితే వినియోగదారులకు సరఫరా చేసేసరికి వ్యయం యూనిట్‌కు రూ.7.54కు చేరుతోంది. ఇలా విద్యుత్‌ను వినియోగదారులకు చేర్చే సరికి అయ్యే వ్యయాన్ని విద్యుత్ రంగ పరిభాషలో ‘కాస్ట్ ఆఫ్ సర్విస్’అంటారు. విద్యుత్ ఉద్యోగుల జీతభత్యాలు, విద్యుత్ పంపిణీ వ్యవస్థ నిర్వహణ, పర్యవేక్షణ వ్యయాలు, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు, ఇతర వ్యయాలన్నీ ఇందులో కలసి ఉంటాయి. అంటే సగటున ఒక్కో యూనిట్‌కు రూ.2 చొప్పున పెరిగిపోయినట్టు కాస్ట్ ఆఫ్ సర్విస్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎనీ్పడీసీఎల్) కాస్ట్ ఆఫ్ సర్వీస్ ఏకంగా యూనిట్‌కు రూ.8.28గా ఉండటం ఆందోళనకరమని విద్యుత్ ఉద్యోగులు అంటున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) కాస్ట్ ఆఫ్ సర్విస్ యూనిట్‌కు రూ.7.26గా ఉండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment