![TSSPDCL Release 2000 JLM Posts Soon - Sakshi](/styles/webp/s3/article_images/2018/04/13/jlm.jpg.webp?itok=GpGtCoWz)
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్)లో ఖాళీగా ఉన్న 2 వేల జూనియర్ లైన్‌మెన్ (జేఎల్‌ఎం) పోస్టులను రెండు విడతల్లో భర్తీ చేయాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. తొలి విడతగా వచ్చే నెల తొలి వారంలో 1,000 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేయనుంది. పోస్టుల భర్తీ ప్రతిపాదనలను ఈ నెలాఖరులో నిర్వహించే బోర్డు సమావేశంలో ఆమోదించాక వచ్చే నెల తొలి వారంలో నియామక ప్రకటన జారీ చేస్తామని టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ జి. రఘుమారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.
మహిళా అభ్యర్థులకు అవకాశం!
జేఎల్‌ఎం పోస్టుల భర్తీలో తొలిసారిగా మహిళా కోటా అమలుచేసే అంశాన్ని టీఎస్‌ఎస్పీడీసీఎల్ పరిశీలిస్తోంది. విధి నిర్వహణలో భాగంగా జేఎల్‌ఎంలు విద్యుత్ స్తంభాలు ఎక్కి పని చేయాల్సి ఉండనుండటంతో ఇప్పటివరకు ఈ పోస్టుల భర్తీలో మహిళలకు అవకాశం కల్పించలేదు. అయితే జేఎల్‌ఎం పోస్టుల భర్తీలో సైతం మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని మహిళా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్) జేఎల్‌ఎం పోస్టుల భర్తీకి ప్రకటన జారీచేయగా గణనీయ సంఖ్య లో మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. వారి దరఖాస్తులను సంస్థ యాజమాన్యం తిరస్కరించడంతో కొందరు మహిళా అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించి తమకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకొని రాత పరీక్షకు హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో త్వరలో జారీ చేయనున్న జేఎల్‌ఎం పోస్టుల నియామకాల్లో మహిళా అభ్యర్థులకు అవకాశం కల్పించే అంశాన్ని టీఎస్‌ఎస్పీడీసీఎల్ యాజమాన్యం పరిశీలిస్తోంది. ఈ విషయంలో న్యాయ నిపుణుల సలహాను కోరింది. మహిళా అభ్యర్థులకు అవకాశం కల్పించే అంశంపై సంస్థ యాజమాన్యం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎంపిక ప్రక్రియలో భాగమైన విద్యుత్ స్తంభాలు ఎక్కడంలో నైపుణ్యాన్ని పరిశీలించే పరీక్షను మహిళా అభ్యర్థులు సైతం నెగ్గాల్సి ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. విద్యుత్ స్తంభాలు ఎక్కి మరమ్మతు పనులు చేయడం జేఎల్‌ఎం విధుల్లో అత్యంత ప్రధానమైన విధిగా అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment