JLM Recruitment
-
మరో గుడ్‌న్యూస్.. త్వరలోనే జేఎల్ఎం పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన జేఎల్ఎం పోస్టుల భర్తీ ప్రక్రియను త్వరలోనే చేపడతామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (సీపీడీసీఎల్) సీఎండీ రఘుమారెడ్డి ప్రకటించారు. అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామని స్పష్టం చేశారు. కార్పొరేట్ కార్యాలయంలో సీపీడీసీఎల్ సాధించిన వార్షిక ప్రగతిని శుక్రవారం మీడియాకు వివరించారు. నీరు, విద్యుత్‌లను వృథా చేయకూడదని, పొదుపుగా వాడుకోవాలని సూచించారు. గతేడాది డిసెంబర్ 30న రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 10,724 మెగవాట్లు ఉండగా, శుక్రవారం రికార్డు స్థాయిలో 14,107 మెగావాట్లు నమోదైందని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో గతేడాది మార్చిలో 3,435 మెగావాట్లు నమోదైంది. 2023 మార్చి నాటికి 4,000 మెగావాట్లు దాటే అవకాశం ఉందని చెప్పారు. కొంతమంది రైతులు తమ మోటార్లకు ఆటోమెటిక్ స్టాటర్లు బిగించి అవసరం లేకపోయినా విద్యుత్ సహా నీటిని వృథా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వృథాను అరికట్టడం వల్ల లోటునే కాకుండా విద్యుత్ నష్టాలను అధిగమించొచ్చన్నారు. చదవండి: గ్రూప్–3లో 1,365 కొలువులు -
నిరుద్యోగులకు షాక్.. జేఎల్ఎం నోటిఫికేషన్ రద్దు!
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్)లో వెయ్యి జూనియర్ లైన్మెన్(జేఎల్ఎం) పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసినట్టు సంస్థ సీఎండీ జి.రఘుమారెడ్డి గురువారం ప్రకటించారు. ఈ పోస్టుల భర్తీకి త్వరలో మరో కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని వెల్లడించారు. ఈ పోస్టుల భర్తీకి గత జూలై 17న నిర్వహించిన రాత పరీక్షలో అవకతవకలు చోటు చేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర విద్యుత్ సంస్థలకు చెందిన కొందరు ఉద్యోగులు, మరికొంత మంది దళారులతో కలిసి పలువురు అభ్యర్థుల నుంచి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేసి పరీక్షా కేంద్రాల్లో వారికి సమాధానాలు చేరవేసినట్టు ఆరోపణలు వచ్చాయి. అప్పటికప్పుడు కొందరు విద్యు త్ అధికారులు, సిబ్బందిని రాచకొండ కమిషనరేట్ పోలీసులు విచారించి అరెస్టు చేశారు. మొత్తం 181 అభ్యర్థులకు సమాధానాలు చేరవేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. మరింత మంది అభ్యర్థులకు ఈ వ్యవహారంలో ప్రమేయం ఉండే అవకాశాలున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొంత మంది అభ్యర్థులు హైదరాబాద్‌లోని మింట్ కాంపౌండ్‌లో ఉన్న సంస్థ కార్యాలయం ఎదుట అప్పట్లో ధర్నాలు నిర్వహించారు. అభ్యర్థుల నుంచి వ చ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుంటూ జేఎల్ఎం పోస్టుల భర్తీకి గత మే 9న జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. నోటిఫికేషన్ రద్దుపై అభ్యర్థుల్లో అసంతృప్తి జేఎల్ఎం రాత పరీక్షను రద్దు చేసి మళ్లీ కొత్తగా నిర్వహించాలని తాము కోరితే ఏకంగా నోటిఫికేషన్ రద్దు చేయడం సరికాదని కొందరు జేఎల్ఎం అభ్యర్థులు పేర్కొంటున్నారు. మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ జారీ చేస్తే నియామక ప్రక్రియలో తీవ్ర జా ప్యం జరుగుతుందని, మళ్లీ ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘గాంధీ’లో అరుదైన శస్త్రచికిత్స: సినిమా చూపిస్తూ సర్జరీ చేసేశారు! -
జేఎల్ఎం ప్రశ్నాపత్రం లీక్ కేసులో పోలీసుల దూకుడు.. పలువురి అరెస్ట్!
హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ శాఖ జూనియర్ లైన్ మెన్ ప్రశ్నాపత్రం లీక్ కేసు దర్యాప్తులో వేగం పెంచారు పోలీసులు. దర్యాప్తు చేపట్టేందుకు టాస్క్‌ఫోర్స్, ఎస్వోటీ పోలీసులు రంగంలోకి దిగారు. ప్రశ్నాపత్రం లీక్ వెనుక విద్యుత్ శాఖ ఉద్యోగులే కీలక సూత్రదారులుగా గుర్తించారు. ఇప్పటికే.. ఏడీఈ ఫిరోజ్ ఖాన్, లైన్మెన్ శ్రీనివాస్‌లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. హైదరాబాద్, రాచకొండలో నమోదైన కేసుల్లో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని తెలిపారు. ఒక్కో ఉద్యోగానికి రూ.5లక్షలు.. ఒక్కో ఉద్యోగానికి రూ.5 లక్షల చొప్పున ఒప్పందం చేసుకున్నారని పోలీసులు తెలిపారు. అడ్వాన్స్‌గా ఒక్కొక్కరి నుంచి నిందితులు లక్ష రూపాయలు వసూలు చేశారని వెల్లడించారు. పరీక్షల్లో మైక్రోఫోన్ సహాయంతో సమాధానాలు అభ్యర్థులకు చేరవేసినట్లు చెప్పారు. ఇప్పటికే పోలీసుల అదుపులో పలువురు నిందితులు, అభ్యర్థులు ఉండగా.. వారిని విచారిస్తున్నారు. అయితే.. కీలక నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: నేరగాళ్లుకు కలిసోచ్చే వెబ్... పట్టు కోసం కసరత్తులు చేస్తున్న పోలీసులు -
సార్..ప్రోత్సాహంతో కార్మికులు లైన్‌మెన్లయ్యారు
విద్యుత్ సబ్ స్టేషన్లలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులు ప్రైవేట్ సిబ్బందిగానే నెట్టుకొస్తూ, అష్టకష్టాలు పడుతుంటే..అప్పటి సత్తుపల్లి ఏడీఈ జీవన్‌కుమార్ వారి వెన్నుతట్టారు. ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహించి, క్లాసులు చెప్పించి, పుస్తకాలు అందజేసి, పనుల్లో వెసులుబాటు కల్పించి వారికి మంచి జీవితం అందేలా చేశారు. నాటి కార్మికులు నేడు జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం)లుగా కొలువులు కొట్టి ఆనందంగా ఉండేలా చేసి.. కొత్త వెలుగులు పంచారు. సత్తుపల్లిటౌన్: ఈ నెల 6వ తేదీన విడుదలైన విద్యుత్‌శాఖ జేఎల్ఎం పోస్టులకు 13మంది ఎంపికయ్యారు. ఫలితాల్లో మెరిసిన వీరంతా గతేడాది తర్ఫీదు పొందినవారే కావడం విశేషం. ప్రస్తుతం మణుగూరు ఏడీఈగా విధులు నిర్వర్తిస్తున్న జీవన్‌కుమార్ గతంలో సత్తుపల్లిలో పనిచేస్తున్నప్పుడు ఆర్టిజన్ కార్మికులపై దృష్టి సారించారు. ఐటీఐ కోర్సుల తర్వాత పదేళ్లుగా పుస్తకాలకు దూరంగా విద్యుత్ సబ్ స్టేషన్లలో ఆపరేటర్లుగా, ఆన్‌మ్యాండ్ సిబ్బందిగా ఆర్టిజన్ కార్మికులు పని చేస్తున్నారు. దమ్మపేట, తల్లాడ, వేంసూరు, సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు సబ్ స్టేషన్లలో పనిచేసే 20 మంది ఈ ప్రైవేట్ విద్యుత్ కార్మికులంతా కలిసి గతేడాది జేఎల్ఎం పోస్టులకు సన్నద్ధమ య్యారు. వీరందరినీ అప్పటి ఏడీఈగా పని చేస్తున్న జీవన్‌కుమార్ ప్రోత్సహించి సత్తుపల్లిలోని విశ్వశాంతి విద్యాలయంలో ప్రత్యేక శిక్షణ తరగతులు ఇచ్చేందుకు ఒక వేదికను ఏర్పాటు చేశారు. పగలంతా విధులు కేటాయించి సాయంత్రం సమయంలో వెసులుబాటు కల్పించారు. ఈ సిబ్బందికి పోటీ పరీక్షల పుస్తకాలు, నోట్‌పుస్తకాలు కూడా వితరణగానే అందించి తోడ్పాటు నందించారు. ఏడీఈ జీవన్‌కుమార్ ఏం చేశారంటే.. నిత్యం విద్యుత్ శాఖ విధుల్లో తలమునకలై ఉండే అధికారులతో జేఎల్ఎం పోస్టుల ఎంపికకు సిబ్బందిని తయారు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ ఆర్టిజన్ కార్మికులు పదేళ్ల క్రితం వదిలిపెట్టిన పుస్తకాలను చేతబట్టి బీటెక్, ఎంటెక్ చేసిన అభ్యర్థులతో జేఎల్ఎం పోస్టులకు పోటీ పడాల్సి వచ్చింది. దీంతో డివిజన్లో అప్పటి ఏఈలుగా పని చేస్తున్న గణేష్, సుబ్రమణ్యం, మహేష్‌లతో పాటు సాయిస్ఫూర్తి, మదర్‌థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాలల్లో నిపుణులైన సబ్జెక్ట్ ప్రొఫెసర్లతో ప్రతి రోజూ శిక్షణా తరగతులు నిర్వహించారు. ఇలా నెలరోజుల పాటు క్లాసులకు హాజరయ్యేలా సిబ్బందికి వెసులుబాటు కల్పించి పోటీ పరీక్షలకు తయారయ్యేలా తర్ఫీదునిచ్చారు. ఎప్పటికప్పుడు మాక్ టెస్ట్‌లు, వారాంతపు పరీక్షలు కూడా నిర్వహిస్తూ వారిలో నైపుణ్యతను పెంపొందించారు. -
లైన్ తప్పినా.. నియామకం
సాక్షి, ఆదిలాబాద్: విద్యుత్‌శాఖ జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టులకు నిర్మల్ జిల్లాకు ఎంపికైన వారి జాబితాను ఆదిలాబాద్ ఎస్ఈ కార్యాలయంలో ప్రదర్శించారు. మూడు పేజీల్లో ఉన్న జాబితాలో ఒకదాంట్లో 73 పేర్లు ఉంటే.. మరోదాంట్లో 72 మాత్రమే ఉన్నాయి. అయితే ఇవి రెండు జాబితాలు కావు.. మొదటిది 73 పేర్లతో ప్రకటించిన తర్వాత వివాదం కావడంతో అందులో నుంచి రౌండప్ చేసిన ‘62వ నంబర్’ పైన ఉన్న పేరు తొలగించి మిగతా వారి పేర్లను, నంబర్లను పైకి తెచ్చారు. దీంతో మొదటి దాంట్లో 62వ నంబర్‌పై జె.శ్రావణ్‌కుమార్ పేరు ఉండగా, రెండో జాబితాలో మరో పేరు ఆ నంబర్‌పై ఉండటం గమనార్హం. జాదవ్ శ్రావణ్‌కుమార్..ఈ పేరు గుర్తుండే ఉంటుంది..జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) నియామకాల్లో పరీక్ష ఒకరిదైతే.. స్తంభం ఎక్కింది మరొకరు అనే విషయంలో విద్యుత్‌శాఖ అధికారులు ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఇతనిపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు కొంతమంది అభ్యర్థులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. కాగా విద్యుత్ శాఖాధికారులు ఈ అక్రమం తమపైకి రాకుండా ఒక అఫిడవిట్‌ను అప్పట్లో తెరపైకి తీసుకురావడం ద్వారా పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లారు. అందులో జూలై 3న ఓ వ్యక్తి ఆఫీసుకు వచ్చి తన ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వాలని అడిగాడు.. ఎందుకు వెనక్కి తీసుకుంటున్నావని అడిగితే సరైన సమాధానం ఇవ్వలేదు. తనకు జేఎల్ఎం పోస్టు వద్దని అఫిడవిట్‌ను స్వచ్ఛందంగా ఇచ్చాడు..అతని ప్రవర్తనను బట్టి అనుమానంతో జూన్ 21న స్తంభం ఎక్కిన వ్యక్తి ఇతనేనా..? అని వీడియోతో పోల్చి చూడగా ఆ వ్యక్తి సరిపోలేదని విద్యుత్ శాఖాధికారులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వ్యక్తికే పోస్టు.. స్తంభం ఎక్కిన వ్యక్తి మరో అతను కాగా, అఫిడ విట్ ఇచ్చి పోస్టు వద్దని చెప్పిన వ్యక్తే జాదవ్ శ్రావణ్‌కుమార్.. మళ్లీ ఈ పేరు మరోసారి తెర పైకి వచ్చింది. అప్పుడు కొంతమంది పోటీ అభ్యర్థులు జేఎల్ఎం పోస్టుల్లో అక్రమాలను పసిగట్టి అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా నిలదీయడంతో అప్పట్లో విద్యుత్ శాఖాధికారులు తప్పని పరిస్థితుల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన జరిగి నెలన్నర రోజులు గడిచిపోయాయి. విద్యుత్ శాఖాధికారులే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ తతంగం అక్కడికే ముగిసిపోయి తమకు న్యాయం జరుగుతుందని ఆశించారు. అయితే ఇటీవల ఉమ్మడి జిల్లాకు సంబంధించి జేఎల్ఎం పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆర్డర్ కాపీలను ఈనెల 6న ఇచ్చారు. ఆదిలాబాద్ విద్యుత్‌శాఖ నోడల్ కావడంతో ఇక్కడి ఎస్ఈ కార్యాలయం నుంచి నిర్మల్, మంచిర్యాల, కుమురంభీంఆసిఫాబాద్తోపాటు ఆదిలాబాద్ జిల్లాలో అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇస్తూ ఆర్డర్ కాపీలను సంబంధిత జిల్లాల ఎస్ఈలు, డీఈల ద్వారా పంపించారు. అయితే నిర్మల్ జిల్లాకు కేటాయించిన జేఎల్ఎం పోస్టుల్లో అప్పుడు లైన్ తప్పిన అభ్యర్థి జాదవ్ శ్రావణ్‌కుమార్ పేరు 62వ నంబర్లో వచ్చింది. పోస్టు వద్దని అఫిడవిట్ ఇచ్చిన ఆ వ్యక్తిని జాబితాలోకి ఎలా ఎక్కించారనేది అంతుచిక్కని అంశం. అతను జాబ్ వద్దని చెబుతూ అఫిడవిట్ ఇచ్చినా మరి అధికారులే బలవంతంగా ఈ పోస్టు అతనికి ఇవ్వజూశారా.. లేనిపక్షంలో ఇందులో అసలు తతంగం ఏమిటన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ విషయంలో కొంతమంది ఫిర్యాదు చేయడంతో మళ్లీ తేరుకున్న అధికారులు ఉన్న ఫలంగా జాబితాను మార్చి అందులో నుంచి 62వ నంబర్ జె.శ్రావణ్‌కుమార్ పేరు తొలగించి మరొకరి పేరు చేర్చారు. మంచి డిమాండ్.. ఉమ్మడి జిల్లాలో 439 జేఎల్ఎం పోస్టుల భర్తీ కోసం గతంలో రాత పరీక్ష రాసి అర్హత సాధించిన వారికి మూడు విడతల్లో స్తంభం ఎక్కే పరీక్షలను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనే నిర్వహించారు. కాగా ఈ పోస్టుకు మంచి డిమాండ్ ఉండడంతో విద్యుత్ శాఖలోని కొంతమంది సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు బాహటంగానే వినిపించాయి. గతంలో కాంట్రాక్ట్ పద్ధతిలో జేఎల్ఎం పోస్టులు భర్తీ చేసినా ఇవి రెగ్యులర్ పోస్టులు కావడంతో డిమాండ్ పెరిగింది. కొత్తగా నియమితులయ్యే జూనియర్ లైన్మెన్కు అలవెన్సులతో కలుపుకొని రూ.31వేలకు పైగా జీతం ఉంది. బేసిక్ పే రూ.24వేలకు పైగా ఉండటం గమనార్హం. ప్రభుత్వ కొలువు కావడం, మంచి జీతం ఉండడంతో విద్యుత్‌శాఖతో ఏదో రీతిన సంబంధం ఉన్నవారు దానిని సొమ్ము చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో పలువురు అభ్యర్థులు ఈ పోస్టును దక్కించుకునేందుకు అడ్డదారులు తొక్కారనే ఆరోపణలు లేకపోలేదు. సెలక్షన్ కమిటీ సభ్యులపైనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంలో ‘సాక్షి’లో జూలైలో వరుస కథనాలు ప్రచురించింది. కాగా జాబితాలో జె.శ్రావణ్‌కుమార్ పేరు ఉండడంపై నిర్మల్ డీఈ మధుసూదన్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా ఆదిలాబాద్ ఎస్ఈ కార్యాలయం నుంచి వచ్చిన జాబితాను తాము ప్రకటించామన్నారు. ఒక పేరు రిపీట్ కావడంతో తొలగించామని, దీంతో 73 మందికి గాను సవరించినజాబితాలో 72 పేర్లు ఉన్నాయని వివరించారు. -
2 వేల జేఎల్ఎం కొలువులు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో ఖాళీగా ఉన్న 2 వేల జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టులను రెండు విడతల్లో భర్తీ చేయాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. తొలి విడతగా వచ్చే నెల తొలి వారంలో 1,000 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేయనుంది. పోస్టుల భర్తీ ప్రతిపాదనలను ఈ నెలాఖరులో నిర్వహించే బోర్డు సమావేశంలో ఆమోదించాక వచ్చే నెల తొలి వారంలో నియామక ప్రకటన జారీ చేస్తామని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి. రఘుమారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. మహిళా అభ్యర్థులకు అవకాశం! జేఎల్ఎం పోస్టుల భర్తీలో తొలిసారిగా మహిళా కోటా అమలుచేసే అంశాన్ని టీఎస్ఎస్పీడీసీఎల్ పరిశీలిస్తోంది. విధి నిర్వహణలో భాగంగా జేఎల్ఎంలు విద్యుత్ స్తంభాలు ఎక్కి పని చేయాల్సి ఉండనుండటంతో ఇప్పటివరకు ఈ పోస్టుల భర్తీలో మహిళలకు అవకాశం కల్పించలేదు. అయితే జేఎల్ఎం పోస్టుల భర్తీలో సైతం మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని మహిళా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) జేఎల్ఎం పోస్టుల భర్తీకి ప్రకటన జారీచేయగా గణనీయ సంఖ్య లో మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. వారి దరఖాస్తులను సంస్థ యాజమాన్యం తిరస్కరించడంతో కొందరు మహిళా అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించి తమకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకొని రాత పరీక్షకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో త్వరలో జారీ చేయనున్న జేఎల్ఎం పోస్టుల నియామకాల్లో మహిళా అభ్యర్థులకు అవకాశం కల్పించే అంశాన్ని టీఎస్ఎస్పీడీసీఎల్ యాజమాన్యం పరిశీలిస్తోంది. ఈ విషయంలో న్యాయ నిపుణుల సలహాను కోరింది. మహిళా అభ్యర్థులకు అవకాశం కల్పించే అంశంపై సంస్థ యాజమాన్యం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎంపిక ప్రక్రియలో భాగమైన విద్యుత్ స్తంభాలు ఎక్కడంలో నైపుణ్యాన్ని పరిశీలించే పరీక్షను మహిళా అభ్యర్థులు సైతం నెగ్గాల్సి ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. విద్యుత్ స్తంభాలు ఎక్కి మరమ్మతు పనులు చేయడం జేఎల్ఎం విధుల్లో అత్యంత ప్రధానమైన విధిగా అధికారులు తెలిపారు. -
జేఎల్‌ఎంల నియామకాల్లో గందరగోళం
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఇటీవల జరిగిన విద్యుత్‌శాఖ జూనియర్ లైన్మన్ల (జేఎల్ఎం) నియామకాల్లో గందరగోళం చోటుచేసుకుంది. 151 మంది జేఎల్‌ఎంల నియామకాల్లో అంతర్లీనంగా ఏంజరిగిందో బయటకు రాకపోయినా అక్రమాలు జరిగాయని మాత్రం స్పష్టమవుతోంది. ఓపెన్ కేటగిరీ అర్థాన్నే విద్యుత్ శాఖాధికారులు మార్చివేసి నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. దీంతో అధికారుల తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై విద్యుత్ ఉద్యోగుల యూనియన్లు తమ పోరాటాలను ముమ్మరం చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కొత్తగా నియమించిన 39 మంది జేఎల్‌ఎంలను తొలగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. నియామకాల్లో అధికారుల అక్రమాల కారణంగా ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల్లో కనీసం వారంరోజులు కూడా ఆ ఆనందం లేకుండా పోయింది. ప్రస్తుతం అక్రమాలు వెలుగుచూడటంతో ‘ఆ..ఏముందిలే... నియమించిన వారిని తొలిగించి అర్హులను తీసుకుని నివేదిక మార్చివేస్తే సరి’...అని విద్యుత్ శాఖాధికారులు చాలా తేలిగ్గా తీసుకోవడాన్ని బట్టిచూస్తే.. వారు చేసిన అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనని భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకెళ్తే... జిల్లాలో 148 మంది జేఎల్‌ఎంలను నియమిస్తూ విద్యుత్‌శాఖ ఒంగోలు సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ) బి.జయభారతరావు ఈ నెల 18న ఉత్తర్వులిచ్చారు. మొత్తం 151 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా 3 బీసీ పోస్టులకు అభ్యర్థులు లేకపోవటంతో భర్తీ చేయలేదు. గతంలో జేఎల్‌ఎంల రిక్రూట్మెంట్ జరిగి రెండు సంవత్సరాలవుతుంది. అయితే, అధికారుల అవినీతి కారణంగా రెండేళ్ల నిరీక్షణ తర్వాత ఉద్యోగాలు పొందిన వారిలో అనేకమందికి చివరకు నిరాశే మిగిలింది. 2012 జనవరిలో జిల్లాలో ఖాళీగా ఉన్న జేఎల్ఎం పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ నోటిఫికేషన్ ప్రకారం విద్యుత్ సంస్థలో షిఫ్ట్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న వారితో పాటు అర్హత కలిగిన బయట వ్యక్తులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్పట్లో 3 వేలమందికిపైగా జేఎల్ఎం పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, వారికి 2012 ఏప్రిల్ 9 నుంచి 11వ తేదీ వరకు అర్హత పరీక్షలు నిర్వహించారు. దీనిపై అప్పట్లో ఇన్‌సర్వీసులో పనిచేస్తున్న వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు 2012 నవంబర్ 14న తిరిగి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఇన్సర్వీస్లోని సిబ్బంది వెయిటేజ్ మార్కులపై మళ్లీ కోర్టును ఆశ్రయించగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం 2013 డిసెంబర్లో ఇచ్చిన తీర్పు మేరకు నియామకాలకు గ్రీన్‌సిగ్నల్ పడింది. దీంతో ఎస్పీడీసీఎల్, సీఎండీ వారు జేఎల్ఎం ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నెల 6న జిల్లా అధికారులకు సూచనలిస్తూ ఉత్తర్వులిచ్చారు. తీరా నియామకాల్లో గందరగోళం జరిగి విద్యుత్ సంస్థలోని పలు యూనియన్లు పోరాటాలకు దిగాయి. 39 మందిని తొలిగించే అవకాశం... నిబంధనలకు విరుద్ధంగా జేఎల్‌ఎంల నియామకాలు జరిగాయని విద్యుత్‌శాఖలోని పలు యూనియన్లు పోరాటానికి దిగాయి. దీంతో ఇప్పటికే నియమించిన 39 మంది జేఎల్‌ఎంలను తొలగించేందుకు విద్యుత్ శాఖాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ ప్రక్రియ ప్రకారం నియామకాలు జరగాల్సి ఉండగా అధికారులు మాత్రం అందుకు భిన్నంగా చేశారు. దీనివల్లే సమస్య జటిలమైంది. ఓపెన్ కేటగిరి ఉద్దేశాన్నే అధికారులు మార్చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓపెన్ కేటగిరీకి రిజర్వేషన్ సౌకర్యం ఉన్న వారిని మినహాయించి ఇతర కులాల వారిని నియమించాలని అధికారులు భావించడం వల్లే సమస్య ఉత్పన్నమైంది. అంటే ఓపెన్ కేటగిరీని అగ్రవర్ణాల వారిగా భావించడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఓపెన్ కేటగిరీలో మెరిట్ మార్కులు వచ్చిన వారిని తీసుకోవాల్సిందిపోయి అధికారులు అడ్డగోలుగా వ్యవహరించి నియామకాలు చేపట్టారు. అత్యధిక మార్కులు వచ్చిన వారిని సైతం ఓపెన్ కేటగిరీ కింద కాకుండా రిజర్వేషన్ ద్వారా నియమించారు. మొత్తం 921 మంది అర్హత సాధించగా వారిలో 151 మందిని తీసుకోవాల్సి ఉంది. అందుకుగానూ 60.55 శాతం మార్కుల నుంచి 71.72 శాతం మార్కుల వరకు ఉన్న వారిని తీసుకోవాలని నిర్ణయించారు. వాస్తవానికి 71.72 శాతం మార్కులు వచ్చిన అభ్యర్థికి ఓపెన్ కేటగిరీలో మొదటి అభ్యర్థిగా నియామకం జరపాలి. అలాంటిది 71.72 శాతం మార్కులు వచ్చిన అభ్యర్థిని ఓపెన్ కేటగిరీ కింద కాకుండా రిజర్వేషన్ కేటగిరీ కింద ఎంపిక చేశారు. ఇలా మొత్తం 39 మందిని నియమించటంతో అధికారుల తీరుపై అనుమానం వచ్చి యూనియన్ల నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో చేసేదిలేక ఆ 39 మందిని తొలగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.