లైన్‌ తప్పినా.. నియామకం  | Fraud Done Regarding Junior Lineman Posts In Adilabad | Sakshi
Sakshi News home page

లైన్‌ తప్పినా.. నియామకం 

Published Thu, Sep 12 2019 10:09 AM | Last Updated on Thu, Sep 12 2019 10:09 AM

Fraud Done Regarding Junior Lineman Posts In Adilabad - Sakshi

ఆదిలాబాద్‌లో జరిగిన స్తంభం ఎక్కే పరీక్షలో అభ్యర్థులు (ఫైల్‌)

సాక్షి, ఆదిలాబాద్‌: విద్యుత్‌శాఖ జూనియర్‌ లైన్‌మెన్‌ (జేఎల్‌ఎం) పోస్టులకు నిర్మల్‌ జిల్లాకు ఎంపికైన వారి జాబితాను ఆదిలాబాద్‌ ఎస్‌ఈ కార్యాలయంలో ప్రదర్శించారు. మూడు పేజీల్లో ఉన్న జాబితాలో ఒకదాంట్లో 73 పేర్లు ఉంటే.. మరోదాంట్లో 72 మాత్రమే ఉన్నాయి. అయితే ఇవి రెండు జాబితాలు కావు.. మొదటిది 73 పేర్లతో ప్రకటించిన తర్వాత వివాదం కావడంతో అందులో నుంచి రౌండప్‌ చేసిన ‘62వ నంబర్‌’ పైన ఉన్న పేరు తొలగించి మిగతా వారి పేర్లను, నంబర్లను పైకి తెచ్చారు. దీంతో మొదటి దాంట్లో 62వ నంబర్‌పై జె.శ్రావణ్‌కుమార్‌ పేరు ఉండగా, రెండో జాబితాలో మరో పేరు ఆ నంబర్‌పై ఉండటం గమనార్హం.

జాదవ్‌ శ్రావణ్‌కుమార్‌..ఈ పేరు గుర్తుండే ఉంటుంది..జూనియర్‌ లైన్‌మెన్‌ (జేఎల్‌ఎం) నియామకాల్లో పరీక్ష ఒకరిదైతే.. స్తంభం ఎక్కింది మరొకరు అనే విషయంలో విద్యుత్‌శాఖ అధికారులు ఆదిలాబాద్‌ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఇతనిపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు కొంతమంది అభ్యర్థులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. కాగా విద్యుత్‌ శాఖాధికారులు ఈ అక్రమం తమపైకి రాకుండా ఒక అఫిడవిట్‌ను అప్పట్లో తెరపైకి తీసుకురావడం ద్వారా పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్లారు.

అందులో జూలై 3న ఓ వ్యక్తి ఆఫీసుకు వచ్చి తన ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌ ఇవ్వాలని అడిగాడు.. ఎందుకు వెనక్కి తీసుకుంటున్నావని అడిగితే సరైన సమాధానం ఇవ్వలేదు. తనకు జేఎల్‌ఎం పోస్టు వద్దని అఫిడవిట్‌ను స్వచ్ఛందంగా ఇచ్చాడు..అతని ప్రవర్తనను బట్టి అనుమానంతో జూన్‌ 21న స్తంభం ఎక్కిన వ్యక్తి ఇతనేనా..? అని వీడియోతో పోల్చి చూడగా ఆ వ్యక్తి సరిపోలేదని విద్యుత్‌ శాఖాధికారులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆ వ్యక్తికే పోస్టు..
స్తంభం ఎక్కిన వ్యక్తి మరో అతను కాగా, అఫిడ విట్‌ ఇచ్చి  పోస్టు వద్దని చెప్పిన వ్యక్తే జాదవ్‌ శ్రావణ్‌కుమార్‌.. మళ్లీ ఈ పేరు మరోసారి తెర పైకి వచ్చింది. అప్పుడు కొంతమంది పోటీ అభ్యర్థులు జేఎల్‌ఎం పోస్టుల్లో అక్రమాలను పసిగట్టి అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా నిలదీయడంతో అప్పట్లో విద్యుత్‌ శాఖాధికారులు తప్పని పరిస్థితుల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన జరిగి నెలన్నర రోజులు గడిచిపోయాయి. విద్యుత్‌ శాఖాధికారులే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ తతంగం అక్కడికే ముగిసిపోయి తమకు న్యాయం జరుగుతుందని ఆశించారు. అయితే ఇటీవల ఉమ్మడి జిల్లాకు సంబంధించి జేఎల్‌ఎం పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆర్డర్‌ కాపీలను ఈనెల 6న ఇచ్చారు.

ఆదిలాబాద్‌ విద్యుత్‌శాఖ నోడల్‌ కావడంతో ఇక్కడి ఎస్‌ఈ కార్యాలయం నుంచి నిర్మల్, మంచిర్యాల, కుమురంభీంఆసిఫాబాద్‌తోపాటు ఆదిలాబాద్‌ జిల్లాలో అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇస్తూ ఆర్డర్‌ కాపీలను సంబంధిత జిల్లాల ఎస్‌ఈలు, డీఈల ద్వారా పంపించారు. అయితే నిర్మల్‌ జిల్లాకు కేటాయించిన జేఎల్‌ఎం పోస్టుల్లో అప్పుడు లైన్‌ తప్పిన అభ్యర్థి జాదవ్‌ శ్రావణ్‌కుమార్‌ పేరు 62వ నంబర్‌లో వచ్చింది. పోస్టు వద్దని అఫిడవిట్‌ ఇచ్చిన ఆ వ్యక్తిని జాబితాలోకి ఎలా ఎక్కించారనేది అంతుచిక్కని అంశం.

అతను జాబ్‌ వద్దని చెబుతూ అఫిడవిట్‌ ఇచ్చినా మరి అధికారులే బలవంతంగా ఈ పోస్టు అతనికి ఇవ్వజూశారా.. లేనిపక్షంలో ఇందులో అసలు తతంగం ఏమిటన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ విషయంలో కొంతమంది ఫిర్యాదు చేయడంతో మళ్లీ తేరుకున్న అధికారులు ఉన్న ఫలంగా జాబితాను మార్చి అందులో నుంచి 62వ నంబర్‌ జె.శ్రావణ్‌కుమార్‌ పేరు తొలగించి మరొకరి పేరు చేర్చారు. 

మంచి డిమాండ్‌..
ఉమ్మడి జిల్లాలో 439 జేఎల్‌ఎం పోస్టుల భర్తీ కోసం గతంలో రాత పరీక్ష రాసి అర్హత సాధించిన వారికి మూడు విడతల్లో స్తంభం ఎక్కే పరీక్షలను ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోనే నిర్వహించారు. కాగా ఈ పోస్టుకు మంచి డిమాండ్‌ ఉండడంతో విద్యుత్‌ శాఖలోని కొంతమంది సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు బాహటంగానే వినిపించాయి. గతంలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో జేఎల్‌ఎం పోస్టులు భర్తీ చేసినా ఇవి రెగ్యులర్‌ పోస్టులు కావడంతో డిమాండ్‌ పెరిగింది. కొత్తగా నియమితులయ్యే జూనియర్‌ లైన్‌మెన్‌కు అలవెన్సులతో కలుపుకొని రూ.31వేలకు పైగా జీతం ఉంది. బేసిక్‌ పే రూ.24వేలకు పైగా ఉండటం గమనార్హం.

ప్రభుత్వ కొలువు కావడం, మంచి జీతం ఉండడంతో విద్యుత్‌శాఖతో ఏదో రీతిన సంబంధం ఉన్నవారు దానిని సొమ్ము చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో పలువురు అభ్యర్థులు ఈ పోస్టును దక్కించుకునేందుకు అడ్డదారులు తొక్కారనే ఆరోపణలు లేకపోలేదు. సెలక్షన్‌ కమిటీ సభ్యులపైనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంలో ‘సాక్షి’లో జూలైలో వరుస కథనాలు ప్రచురించింది. కాగా జాబితాలో జె.శ్రావణ్‌కుమార్‌ పేరు ఉండడంపై నిర్మల్‌ డీఈ మధుసూదన్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా ఆదిలాబాద్‌ ఎస్‌ఈ కార్యాలయం నుంచి వచ్చిన జాబితాను తాము ప్రకటించామన్నారు. ఒక పేరు రిపీట్‌ కావడంతో తొలగించామని, దీంతో 73 మందికి గాను సవరించినజాబితాలో 72 పేర్లు ఉన్నాయని వివరించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement