శిక్షణ తరగతుల్లో విద్యుత్‌శాఖ ఆర్టిజన్ కార్మికులకు క్లాస్ చెబుతున్న ఏడీఈ జీవన్‌కుమార్ (ఫైల్)
విద్యుత్ సబ్ స్టేషన్లలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులు ప్రైవేట్ సిబ్బందిగానే నెట్టుకొస్తూ, అష్టకష్టాలు పడుతుంటే..అప్పటి సత్తుపల్లి ఏడీఈ జీవన్‌కుమార్ వారి వెన్నుతట్టారు. ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహించి, క్లాసులు చెప్పించి, పుస్తకాలు అందజేసి, పనుల్లో వెసులుబాటు కల్పించి వారికి మంచి జీవితం అందేలా చేశారు. నాటి కార్మికులు నేడు జూనియర్ లైన్‌మెన్ (జేఎల్‌ఎం)లుగా కొలువులు కొట్టి ఆనందంగా ఉండేలా చేసి.. కొత్త వెలుగులు పంచారు.
సత్తుపల్లిటౌన్: ఈ నెల 6వ తేదీన విడుదలైన విద్యుత్‌శాఖ జేఎల్‌ఎం పోస్టులకు 13మంది ఎంపికయ్యారు. ఫలితాల్లో మెరిసిన వీరంతా గతేడాది తర్ఫీదు పొందినవారే కావడం విశేషం. ప్రస్తుతం మణుగూరు ఏడీఈగా విధులు నిర్వర్తిస్తున్న జీవన్‌కుమార్ గతంలో సత్తుపల్లిలో పనిచేస్తున్నప్పుడు ఆర్టిజన్ కార్మికులపై దృష్టి సారించారు. ఐటీఐ కోర్సుల తర్వాత పదేళ్లుగా పుస్తకాలకు దూరంగా విద్యుత్ సబ్ స్టేషన్లలో ఆపరేటర్లుగా, ఆన్‌మ్యాండ్ సిబ్బందిగా ఆర్టిజన్ కార్మికులు పని చేస్తున్నారు. దమ్మపేట, తల్లాడ, వేంసూరు, సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు సబ్ స్టేషన్లలో పనిచేసే 20 మంది ఈ ప్రైవేట్ విద్యుత్ కార్మికులంతా కలిసి గతేడాది జేఎల్‌ఎం పోస్టులకు సన్నద్ధమ య్యారు. వీరందరినీ అప్పటి ఏడీఈగా పని చేస్తున్న జీవన్‌కుమార్ ప్రోత్సహించి సత్తుపల్లిలోని విశ్వశాంతి విద్యాలయంలో ప్రత్యేక శిక్షణ తరగతులు ఇచ్చేందుకు ఒక వేదికను ఏర్పాటు చేశారు. పగలంతా విధులు కేటాయించి సాయంత్రం సమయంలో వెసులుబాటు కల్పించారు. ఈ సిబ్బందికి పోటీ పరీక్షల పుస్తకాలు, నోట్‌పుస్తకాలు కూడా వితరణగానే అందించి తోడ్పాటు నందించారు.
ఏడీఈ జీవన్‌కుమార్ ఏం చేశారంటే..
నిత్యం విద్యుత్ శాఖ విధుల్లో తలమునకలై ఉండే అధికారులతో జేఎల్‌ఎం పోస్టుల ఎంపికకు సిబ్బందిని తయారు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ ఆర్టిజన్ కార్మికులు పదేళ్ల క్రితం వదిలిపెట్టిన పుస్తకాలను చేతబట్టి బీటెక్, ఎంటెక్ చేసిన అభ్యర్థులతో జేఎల్‌ఎం పోస్టులకు పోటీ పడాల్సి వచ్చింది. దీంతో డివిజన్‌లో అప్పటి ఏఈలుగా పని చేస్తున్న గణేష్, సుబ్రమణ్యం, మహేష్‌లతో పాటు సాయిస్ఫూర్తి, మదర్‌థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాలల్లో నిపుణులైన సబ్జెక్ట్ ప్రొఫెసర్లతో ప్రతి రోజూ శిక్షణా తరగతులు నిర్వహించారు. ఇలా నెలరోజుల పాటు క్లాసులకు హాజరయ్యేలా సిబ్బందికి వెసులుబాటు కల్పించి పోటీ పరీక్షలకు తయారయ్యేలా తర్ఫీదునిచ్చారు. ఎప్పటికప్పుడు మాక్ టెస్ట్‌లు, వారాంతపు పరీక్షలు కూడా నిర్వహిస్తూ వారిలో నైపుణ్యతను పెంపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment