ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఇటీవల జరిగిన విద్యుత్‌శాఖ జూనియర్ లైన్‌మన్ల (జేఎల్‌ఎం) నియామకాల్లో గందరగోళం చోటుచేసుకుంది. 151 మంది జేఎల్‌ఎంల నియామకాల్లో అంతర్లీనంగా ఏంజరిగిందో బయటకు రాకపోయినా అక్రమాలు జరిగాయని మాత్రం స్పష్టమవుతోంది. ఓపెన్ కేటగిరీ అర్థాన్నే విద్యుత్ శాఖాధికారులు మార్చివేసి నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. దీంతో అధికారుల తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై విద్యుత్ ఉద్యోగుల యూనియన్లు తమ పోరాటాలను ముమ్మరం చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కొత్తగా నియమించిన 39 మంది జేఎల్‌ఎంలను తొలగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. నియామకాల్లో అధికారుల అక్రమాల కారణంగా ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల్లో కనీసం వారంరోజులు కూడా ఆ ఆనందం లేకుండా పోయింది. ప్రస్తుతం అక్రమాలు వెలుగుచూడటంతో ‘ఆ..ఏముందిలే... నియమించిన వారిని తొలిగించి అర్హులను తీసుకుని నివేదిక మార్చివేస్తే సరి’...అని విద్యుత్ శాఖాధికారులు చాలా తేలిగ్గా తీసుకోవడాన్ని బట్టిచూస్తే.. వారు చేసిన అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనని భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకెళ్తే... జిల్లాలో 148 మంది జేఎల్‌ఎంలను నియమిస్తూ విద్యుత్‌శాఖ ఒంగోలు సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్‌ఈ) బి.జయభారతరావు ఈ నెల 18న ఉత్తర్వులిచ్చారు. మొత్తం 151 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా 3 బీసీ పోస్టులకు అభ్యర్థులు లేకపోవటంతో భర్తీ చేయలేదు. గతంలో జేఎల్‌ఎంల రిక్రూట్‌మెంట్ జరిగి రెండు సంవత్సరాలవుతుంది.
అయితే, అధికారుల అవినీతి కారణంగా రెండేళ్ల నిరీక్షణ తర్వాత ఉద్యోగాలు పొందిన వారిలో అనేకమందికి చివరకు నిరాశే మిగిలింది. 2012 జనవరిలో జిల్లాలో ఖాళీగా ఉన్న జేఎల్‌ఎం పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ నోటిఫికేషన్ ప్రకారం విద్యుత్ సంస్థలో షిఫ్ట్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న వారితో పాటు అర్హత కలిగిన బయట వ్యక్తులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్పట్లో 3 వేలమందికిపైగా జేఎల్‌ఎం పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, వారికి 2012 ఏప్రిల్ 9 నుంచి 11వ తేదీ వరకు అర్హత పరీక్షలు నిర్వహించారు. దీనిపై అప్పట్లో ఇన్‌సర్వీసులో పనిచేస్తున్న వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు 2012 నవంబర్ 14న తిరిగి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఇన్‌సర్వీస్‌లోని సిబ్బంది వెయిటేజ్ మార్కులపై మళ్లీ కోర్టును ఆశ్రయించగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం 2013 డిసెంబర్‌లో ఇచ్చిన తీర్పు మేరకు నియామకాలకు గ్రీన్‌సిగ్నల్ పడింది. దీంతో ఎస్‌పీడీసీఎల్, సీఎండీ వారు జేఎల్‌ఎం ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నెల 6న జిల్లా అధికారులకు సూచనలిస్తూ ఉత్తర్వులిచ్చారు. తీరా నియామకాల్లో గందరగోళం జరిగి విద్యుత్ సంస్థలోని పలు యూనియన్లు పోరాటాలకు దిగాయి.
39 మందిని తొలిగించే అవకాశం...
నిబంధనలకు విరుద్ధంగా జేఎల్‌ఎంల నియామకాలు జరిగాయని విద్యుత్‌శాఖలోని పలు యూనియన్లు పోరాటానికి దిగాయి. దీంతో ఇప్పటికే నియమించిన 39 మంది జేఎల్‌ఎంలను తొలగించేందుకు విద్యుత్ శాఖాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ ప్రక్రియ ప్రకారం నియామకాలు జరగాల్సి ఉండగా అధికారులు మాత్రం అందుకు భిన్నంగా చేశారు. దీనివల్లే సమస్య జటిలమైంది. ఓపెన్ కేటగిరి ఉద్దేశాన్నే అధికారులు మార్చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓపెన్ కేటగిరీకి రిజర్వేషన్ సౌకర్యం ఉన్న వారిని మినహాయించి ఇతర కులాల వారిని నియమించాలని అధికారులు భావించడం వల్లే సమస్య ఉత్పన్నమైంది.
అంటే ఓపెన్ కేటగిరీని అగ్రవర్ణాల వారిగా భావించడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఓపెన్ కేటగిరీలో మెరిట్ మార్కులు వచ్చిన వారిని తీసుకోవాల్సిందిపోయి అధికారులు అడ్డగోలుగా వ్యవహరించి నియామకాలు చేపట్టారు. అత్యధిక మార్కులు వచ్చిన వారిని సైతం ఓపెన్ కేటగిరీ కింద కాకుండా రిజర్వేషన్ ద్వారా నియమించారు. మొత్తం 921 మంది అర్హత సాధించగా వారిలో 151 మందిని తీసుకోవాల్సి ఉంది. అందుకుగానూ 60.55 శాతం మార్కుల నుంచి 71.72 శాతం మార్కుల వరకు ఉన్న వారిని తీసుకోవాలని నిర్ణయించారు. వాస్తవానికి 71.72 శాతం మార్కులు వచ్చిన అభ్యర్థికి ఓపెన్ కేటగిరీలో మొదటి అభ్యర్థిగా నియామకం జరపాలి. అలాంటిది 71.72 శాతం మార్కులు వచ్చిన అభ్యర్థిని ఓపెన్ కేటగిరీ కింద కాకుండా రిజర్వేషన్ కేటగిరీ కింద ఎంపిక చేశారు. ఇలా మొత్తం 39 మందిని నియమించటంతో అధికారుల తీరుపై అనుమానం వచ్చి యూనియన్ల నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో చేసేదిలేక ఆ 39 మందిని తొలగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
జేఎల్‌ఎంల నియామకాల్లో గందరగోళం
Published Sat, Jan 25 2014 6:04 AM | Last Updated on Wed, Sep 5 2018 2:06 PM
Advertisement
Advertisement