కోటేశ్వరాస్త్రంపై కదలిక | TSSPDCL Took Corrective Action On Corruption | Sakshi
Sakshi News home page

కోటేశ్వరాస్త్రంపై కదలిక

Published Wed, Apr 14 2021 2:11 PM | Last Updated on Wed, Apr 14 2021 2:11 PM

TSSPDCL Took Corrective Action On Corruption - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌)లో బినామీలకు నామినేషన్లపై పనులు కట్టబెట్టడానికి సంబంధించి సంస్థ అదనపు డివిజనల్‌ ఇంజనీర్‌ (ఏడీఈ) డి.కోటేశ్వరరావు బహిర్గతం చేసిన అవినీతి భాగోతంపై దృష్టి సారించిన సంస్థ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సదరు సర్వీస్‌ కోడ్‌ను సాఫ్ట్‌వేర్‌ నుంచి తొలగించడంతో పాటు అవినీతికి ఆస్కారం లేకుండా వ్యయ పరిమితులు విధించింది.  

ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఆధారాలతో సహా.. 
కోటేశ్వరరావు 2020 ఫిబ్రవరి 4న ఫేస్‌బుక్‌ లైవ్‌ నిర్వహించి.. సంస్థలో ట్రాన్స్‌ఫార్మర్లకు రక్షణ కంచె ఏర్పాటు, చెట్ల కొమ్మలు నరికివేత పనుల్లో రూ.వందల కోట్ల అవినీతి జరిగిందని ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకొచ్చారు. దోపిడీకి పాల్పడుతున్న కొందరు విద్యుత్‌ ఇంజనీర్ల పేర్లను సైతం బహిర్గతం చేశారు. దీనిపై ‘సాక్షి’అప్పట్లోనే కథనం ప్రచురించింది. ఈ అవినీతి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో కోటేశ్వరరావుపై యాజమాన్యం సస్పెన్షన్‌ వేటు వేసింది. అయితే జాతీయ ఎస్టీ కమిషన్‌ జోక్యంతో సస్పెన్షన్‌ తొలిగింది. అదే సమయంలో ఆయన బహిర్గతం చేసిన అవినీతి సంస్థ యాజమాన్యంలో కదలికను తీసుకొచ్చింది.  

అవినీతి ఇలా జరిగింది.. 
ట్రాన్స్‌ఫార్మర్లకు రక్షణ కంచె ఏర్పాటు కోసం ’సాప్‌’సాఫ్ట్‌వేర్‌లో ఒకే సరీ్వస్‌ కోడ్‌ (ఎస్‌డబ్ల్యూఆర్‌ 21693) ద్వారా ఒకే రకమైన పనికి వేర్వేరు రేట్లతో అడ్డగోలుగా ఎలా అంచనాలు పెంచి దోపిడీకి పాల్పడ్డారన్న అంశాన్ని కోటేశ్వరరావు ఆధారాలతో సహా బహిర్గతం చేశారు. వందలాది పనుల అంచనాలను బయటపెట్టారు. గాల్వనైజ్డ్‌ ఐరన్‌ మెష్‌ (ఇనుప కంచె)తో ఫెన్సింగ్‌ ఏర్పాటు కోసం ఒక ప్రాంతంలోని డివిజనల్‌ ఇంజనీర్‌ (డీఈ) చదరపు అడుగుకు రూ.54 (100 శాతం)తో అంచనాలు తయారుచేస్తే, మరో ప్రాంతంలోని డీఈ రూ.125 (231 శాతం అధికం), ఇంకో ప్రాంతంలోని డీఈ రూ.284 (526 శాతం అదనం), మరో ప్రాంతంలోని డీఈ రూ.384 (711 శాతం అదనం) చొప్పున అంచనాలు రూపొందించారని బయటపెట్టారు. ఒక ట్రాన్స్‌ఫార్మర్‌కు 120–130 చదరపు అడుగుల కంచె ఏర్పాటుకు రూ.20 వేలలోపు ఖర్చు కావాల్సి ఉండగా, కొందరు ఇంజనీర్లు ఈ రకంగా రూ.60 వేల వరకు అంచనాలను పెంచేశారు. ఇలా అడ్డగోలుగా అంచనాలు పెంచి 48 మంది కాంట్రాక్టర్లకు రూ.1,344 కోట్లు చెల్లించారని వివరించారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో జరిగిన పని విలువ రూ.144 కోట్లు మాత్రమే అని తెలిపారు. ఈ విధంగా ట్రాన్స్‌ఫార్మర్లకు కంచె ఏర్పాటు పేరుతో రూ.1,200 కోట్ల అవినీతి జరిగిందని ఆయన సీఎం కేసీఆర్, సీఎస్, ఇంధన శాఖలకు లేఖలు సైతం రాశారు. అయితే, ఈ అవినీతిలో బాధ్యులైన ఇంజనీర్లలో కొందరికి మాత్రమే షోకాజ్‌ నోటీసులు ఇచ్చిన సంస్థ యాజమాన్యం తూతూమంత్రంగా విచారణ నిర్వహించి సంస్థకు ఎలాంటి నష్టం జరగలేదని తేలి్చందనే విమర్శలున్నాయి. అయితే అడ్డగోలు అంచనాలు బయటపడిన నేపథ్యంలో జాగ్రత్తపడిన సంస్థ యాజమాన్యం సదరు సరీ్వస్‌ కోడ్‌ను సాఫ్ట్‌వేర్‌ నుంచి తొలగించింది. దీంతోపాటు ఒక ట్రాన్స్‌ఫార్మర్‌కు కంచె ఏర్పాటు వ్యయంపై రూ.20 వేల గరిష్ట పరిమితి విధించింది.  

చెట్ల కొమ్మల్లోనూ కొట్టేశారు! 
వర్షాకాలంలో గాలివానలకు చెట్ల కొమ్మలు విద్యుత్‌ తీగలపై విరిగిపడి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగిస్తుంటాయి. దీంతో ఏటా రెండు మూడుసార్లు 11 కేవీ విద్యుత్‌ లైన్లపై నుంచి వెళ్లే చెట్ల కొమ్మలను సంస్థ యాజమాన్యం కొట్టి వేయిస్తుంటుంది. అయితే చెట్ల కొమ్మలు కొట్టడం పేరుతో కొందరు విద్యుత్‌ ఇంజనీర్లు అడ్డగోలుగా ఏటా రూ.కోట్లలో బిల్లులు చేసుకుంటున్నారని కూడా కోటేశ్వరరావు బయటపెట్టారు. దీంతో ఒక ఫీడర్‌ పరిధిలో చెట్ల కొమ్మలు నరకడానికి ఏడాదికి గరిష్టంగా రూ.20 వేలలోపు మాత్రమే ఖర్చు చేసేలా సంస్థ యాజమాన్యం మరో వ్యయ పరిమితి విధించింది. దీంతో ఏడాదిలో ఎన్నిసార్లు చెట్ల కొమ్మలు నరికినా ఒక ఫీడర్‌ పరిధిలో ఇకపై రూ.20 వేలు మాత్రమే బిల్లు రానుంది. గతంలో ఒక ఫీడర్‌ పరిధిలో రూ.80 వేల నుంచి రూ.90 వేల వరకు అడ్డగోలుగా బిల్లులు చేసుకునేవారు. రాజేంద్రనగర్‌ డివిజన్‌లో పనిచేసిన ఒక డీఈ ఏకంగా రూ.4 కోట్లను చెట్ల కొమ్మలు నరికివేత పేరుతో ఒక ఏడాదిలో బిల్లులు చేసుకున్నారు. ప్రస్తుతం వ్యయ పరిమితి విధించడంతో ఒక్కో ఫీడర్‌ పరిధిలో కనీసం రూ.50 వేలు ఆదా కానున్నాయి. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ పరిధిలో 7,440 పీడర్లు ఉండగా, కొమ్మల నరికివేత పనుల్లో ఏటా సంస్థకు రూ.37.20 కోట్లు ఆదా కానున్నాయి.  

అక్రమాలు జరిగినందుకే దిద్దుబాటు.. 
ట్రాన్స్‌ఫార్మర్లకు కంచె ఏర్పాటు, చెట్ల కొమ్మలు నరికివేత పనుల్లో అవినీతిని తాను బయటపెట్టడం వల్లే డిస్కం చర్యలు చేపట్టిందని, మార్పులు సాధ్యమయ్యాయని కోటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ విషయాన్ని తన సరీ్వస్‌ బుక్‌లో ఎంట్రీ చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి సైతం తీసుకెళ్లాలని ఇటీవల సంస్థ యాజమాన్యానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు ఈ మార్పులు చేశారంటే, గతంలో చెల్లించిన బిల్లులు అక్రమమైనవేనని తేలినట్టేనని ఆయన దరఖాస్తులో పేర్కొనడం 
గమనార్హం. 

ఇదీ అవినీతి 
ఒక ట్రాన్స్‌ఫార్మర్‌కు కంచె ఏర్పాటుకు రూ.20 వేల లోపు ఖర్చు కావాల్సి ఉండగా రూ.60 వేల వరకు అంచనాలు పెంచేసిన ఇంజనీర్లు. ఈ విధంగా 48 మంది కాంట్రాక్టర్లకు ఏకంగా రూ.1,200 కోట్ల సంస్థ సొమ్మును దోచిపెట్టేశారు. 

ఇలా దిద్దుబాటు 
సదరు సరీ్వస్‌ కోడ్‌ను సాఫ్ట్‌వేర్‌ నుంచి సంస్థ తొలగించింది. దీంతోపాటు ఒక ట్రాన్స్‌ఫార్మర్‌కు కంచె ఏర్పాటు వ్యయంపై రూ.20 వేల గరిష్ట పరిమితి విధించింది. అంటే ఎక్కడా రూ.20 వేలకు మించి ఖర్చు పెట్టడానికి వీల్లేదన్నమాట.  

ఇదీ అవినీతి 
వర్షాకాలంలో విద్యుత్‌ తీగలపై చెట్ల కొమ్మలు పడకుండా ఏటా రెండుసార్లు కొమ్మలు కొట్టేసే పనుల్లో కూడా కోట్లు కొట్టేశారు. గతంలో ఒక్క ఫీడర్‌ పరిధిలోనే రూ.80 వేల నుంచి రూ.90 వేల వరకు అడ్డగోలుగా బిల్లులు చేసుకునేవారు. 

ఇలా దిద్దుబాటు 
ఒక ఫీడర్‌ పరిధిలో చెట్ల కొమ్మలు నరకడానికి ఏడాదికి గరిష్టంగా రూ.20 వేల లోపే ఖర్చు చేసేలా సంస్థ వ్యయ పరిమితి విధించింది. ఇకపై ఏడాదిలో ఎన్నిసార్లు చెట్ల కొమ్మలు నరికినా ఫీడర్‌ పరిధిలో రూ.20 వేలే బిల్లు రానుంది.

2020 ఫిబ్రవరి 4వ తేదీన ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతున్న ఏడీఈ కోటేశ్వరరావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement