ADE
-
ఏడీఈ వేధింపులు భరించలేకపోతున్నా..
ఖిలా వరంగల్: ‘విద్యుత్ ఏడీఈ వేధింపులు భరించలేకపోతున్నా.. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటున్నా’.. అంటూ తోటి ఉద్యోగులకు వాట్సాప్‌లో మెసెజ్ పెట్టి చెరువులోకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు ఓ ఏఈ. మత్స్యకారులు అతన్ని కాపాడి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం తిమ్మాపురం గ్రామశివారు బెస్తం చెరువు వద్ద మంగళవారం జరిగింది. బంధువులు, స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ శంభునిపేట ప్రాంతం రంగశాయిపేట చెందిన కుంట శ్రీధర్ విద్యుత్‌శాఖలో పోర్ట్ వరంగల్ సెక్షన్ ఏఈగా విధులు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా ఆ శాఖ ఉన్నతాధికారి (ఏడీఈ ) పనుల్లో నిరంతరం వేధింపులకు గురి చేస్తుండటంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలో శ్రీధర్ మంగళవారం మధ్యాహ్నం ఆ మేరకు శాఖ ఉద్యోగులందరికీ వాట్సాప్ సందేశాలు పెట్టారు. అనంతరం 3గంటల సమయంలో తిమ్మాపురం బెస్తం చెరువులో దూకారు. గమనించిన మత్స్యకారులు మరబోటు సాయంతో ఏఈని కాపాడి ఒడ్డుకు చేర్చారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న అతన్ని స్థానికులు హనుమకొండలోని రోహిణి ఆస్పత్రికి తరలించారు. 24గంటలు దాటితే తప్ప అతని ఆరోగ్య పరిస్థితిపై ఏమీ చెప్పలేమని వైద్యులు చెప్పినట్లు సమాచారం. ఏఈకి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వేధింపులతో గతంలోనూ ఒకరి మృతి? గతంలోనూ ఇదే ఏడీఈ వేధింపులతో లైన్ఇన్స్పెక్టర్ గుండెపోటుతో మృతి చెందినట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో ఏడీఈని వదిలి ఇతరులపై యాజమాన్యం చర్యలు తీసుకుంది. అ అధికారిని మాత్రం ఆదే స్థానంలో కొనసాగించడంతో మరో ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి కారకుడయ్యాడని ట్రాన్స్‌కో ఉద్యోగులే చెబుతున్నారు. -
కోటేశ్వరాస్త్రంపై కదలిక
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో బినామీలకు నామినేషన్లపై పనులు కట్టబెట్టడానికి సంబంధించి సంస్థ అదనపు డివిజనల్ ఇంజనీర్ (ఏడీఈ) డి.కోటేశ్వరరావు బహిర్గతం చేసిన అవినీతి భాగోతంపై దృష్టి సారించిన సంస్థ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సదరు సర్వీస్ కోడ్‌ను సాఫ్ట్వేర్ నుంచి తొలగించడంతో పాటు అవినీతికి ఆస్కారం లేకుండా వ్యయ పరిమితులు విధించింది. ఫేస్బుక్ లైవ్‌లో ఆధారాలతో సహా.. కోటేశ్వరరావు 2020 ఫిబ్రవరి 4న ఫేస్బుక్ లైవ్ నిర్వహించి.. సంస్థలో ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ కంచె ఏర్పాటు, చెట్ల కొమ్మలు నరికివేత పనుల్లో రూ.వందల కోట్ల అవినీతి జరిగిందని ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకొచ్చారు. దోపిడీకి పాల్పడుతున్న కొందరు విద్యుత్ ఇంజనీర్ల పేర్లను సైతం బహిర్గతం చేశారు. దీనిపై ‘సాక్షి’అప్పట్లోనే కథనం ప్రచురించింది. ఈ అవినీతి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో కోటేశ్వరరావుపై యాజమాన్యం సస్పెన్షన్ వేటు వేసింది. అయితే జాతీయ ఎస్టీ కమిషన్ జోక్యంతో సస్పెన్షన్ తొలిగింది. అదే సమయంలో ఆయన బహిర్గతం చేసిన అవినీతి సంస్థ యాజమాన్యంలో కదలికను తీసుకొచ్చింది. అవినీతి ఇలా జరిగింది.. ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ కంచె ఏర్పాటు కోసం ’సాప్’సాఫ్ట్‌వేర్‌లో ఒకే సరీ్వస్ కోడ్ (ఎస్డబ్ల్యూఆర్ 21693) ద్వారా ఒకే రకమైన పనికి వేర్వేరు రేట్లతో అడ్డగోలుగా ఎలా అంచనాలు పెంచి దోపిడీకి పాల్పడ్డారన్న అంశాన్ని కోటేశ్వరరావు ఆధారాలతో సహా బహిర్గతం చేశారు. వందలాది పనుల అంచనాలను బయటపెట్టారు. గాల్వనైజ్డ్ ఐరన్ మెష్ (ఇనుప కంచె)తో ఫెన్సింగ్ ఏర్పాటు కోసం ఒక ప్రాంతంలోని డివిజనల్ ఇంజనీర్ (డీఈ) చదరపు అడుగుకు రూ.54 (100 శాతం)తో అంచనాలు తయారుచేస్తే, మరో ప్రాంతంలోని డీఈ రూ.125 (231 శాతం అధికం), ఇంకో ప్రాంతంలోని డీఈ రూ.284 (526 శాతం అదనం), మరో ప్రాంతంలోని డీఈ రూ.384 (711 శాతం అదనం) చొప్పున అంచనాలు రూపొందించారని బయటపెట్టారు. ఒక ట్రాన్స్ఫార్మర్కు 120–130 చదరపు అడుగుల కంచె ఏర్పాటుకు రూ.20 వేలలోపు ఖర్చు కావాల్సి ఉండగా, కొందరు ఇంజనీర్లు ఈ రకంగా రూ.60 వేల వరకు అంచనాలను పెంచేశారు. ఇలా అడ్డగోలుగా అంచనాలు పెంచి 48 మంది కాంట్రాక్టర్లకు రూ.1,344 కోట్లు చెల్లించారని వివరించారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో జరిగిన పని విలువ రూ.144 కోట్లు మాత్రమే అని తెలిపారు. ఈ విధంగా ట్రాన్స్ఫార్మర్లకు కంచె ఏర్పాటు పేరుతో రూ.1,200 కోట్ల అవినీతి జరిగిందని ఆయన సీఎం కేసీఆర్, సీఎస్, ఇంధన శాఖలకు లేఖలు సైతం రాశారు. అయితే, ఈ అవినీతిలో బాధ్యులైన ఇంజనీర్లలో కొందరికి మాత్రమే షోకాజ్ నోటీసులు ఇచ్చిన సంస్థ యాజమాన్యం తూతూమంత్రంగా విచారణ నిర్వహించి సంస్థకు ఎలాంటి నష్టం జరగలేదని తేలి్చందనే విమర్శలున్నాయి. అయితే అడ్డగోలు అంచనాలు బయటపడిన నేపథ్యంలో జాగ్రత్తపడిన సంస్థ యాజమాన్యం సదరు సరీ్వస్ కోడ్‌ను సాఫ్ట్వేర్ నుంచి తొలగించింది. దీంతోపాటు ఒక ట్రాన్స్ఫార్మర్కు కంచె ఏర్పాటు వ్యయంపై రూ.20 వేల గరిష్ట పరిమితి విధించింది. చెట్ల కొమ్మల్లోనూ కొట్టేశారు! వర్షాకాలంలో గాలివానలకు చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపై విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిస్తుంటాయి. దీంతో ఏటా రెండు మూడుసార్లు 11 కేవీ విద్యుత్ లైన్లపై నుంచి వెళ్లే చెట్ల కొమ్మలను సంస్థ యాజమాన్యం కొట్టి వేయిస్తుంటుంది. అయితే చెట్ల కొమ్మలు కొట్టడం పేరుతో కొందరు విద్యుత్ ఇంజనీర్లు అడ్డగోలుగా ఏటా రూ.కోట్లలో బిల్లులు చేసుకుంటున్నారని కూడా కోటేశ్వరరావు బయటపెట్టారు. దీంతో ఒక ఫీడర్ పరిధిలో చెట్ల కొమ్మలు నరకడానికి ఏడాదికి గరిష్టంగా రూ.20 వేలలోపు మాత్రమే ఖర్చు చేసేలా సంస్థ యాజమాన్యం మరో వ్యయ పరిమితి విధించింది. దీంతో ఏడాదిలో ఎన్నిసార్లు చెట్ల కొమ్మలు నరికినా ఒక ఫీడర్ పరిధిలో ఇకపై రూ.20 వేలు మాత్రమే బిల్లు రానుంది. గతంలో ఒక ఫీడర్ పరిధిలో రూ.80 వేల నుంచి రూ.90 వేల వరకు అడ్డగోలుగా బిల్లులు చేసుకునేవారు. రాజేంద్రనగర్ డివిజన్లో పనిచేసిన ఒక డీఈ ఏకంగా రూ.4 కోట్లను చెట్ల కొమ్మలు నరికివేత పేరుతో ఒక ఏడాదిలో బిల్లులు చేసుకున్నారు. ప్రస్తుతం వ్యయ పరిమితి విధించడంతో ఒక్కో ఫీడర్ పరిధిలో కనీసం రూ.50 వేలు ఆదా కానున్నాయి. టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలో 7,440 పీడర్లు ఉండగా, కొమ్మల నరికివేత పనుల్లో ఏటా సంస్థకు రూ.37.20 కోట్లు ఆదా కానున్నాయి. అక్రమాలు జరిగినందుకే దిద్దుబాటు.. ట్రాన్స్ఫార్మర్లకు కంచె ఏర్పాటు, చెట్ల కొమ్మలు నరికివేత పనుల్లో అవినీతిని తాను బయటపెట్టడం వల్లే డిస్కం చర్యలు చేపట్టిందని, మార్పులు సాధ్యమయ్యాయని కోటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ విషయాన్ని తన సరీ్వస్ బుక్‌లో ఎంట్రీ చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి సైతం తీసుకెళ్లాలని ఇటీవల సంస్థ యాజమాన్యానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు ఈ మార్పులు చేశారంటే, గతంలో చెల్లించిన బిల్లులు అక్రమమైనవేనని తేలినట్టేనని ఆయన దరఖాస్తులో పేర్కొనడం గమనార్హం. ఇదీ అవినీతి ఒక ట్రాన్స్ఫార్మర్కు కంచె ఏర్పాటుకు రూ.20 వేల లోపు ఖర్చు కావాల్సి ఉండగా రూ.60 వేల వరకు అంచనాలు పెంచేసిన ఇంజనీర్లు. ఈ విధంగా 48 మంది కాంట్రాక్టర్లకు ఏకంగా రూ.1,200 కోట్ల సంస్థ సొమ్మును దోచిపెట్టేశారు. ఇలా దిద్దుబాటు సదరు సరీ్వస్ కోడ్‌ను సాఫ్ట్వేర్ నుంచి సంస్థ తొలగించింది. దీంతోపాటు ఒక ట్రాన్స్ఫార్మర్కు కంచె ఏర్పాటు వ్యయంపై రూ.20 వేల గరిష్ట పరిమితి విధించింది. అంటే ఎక్కడా రూ.20 వేలకు మించి ఖర్చు పెట్టడానికి వీల్లేదన్నమాట. ఇదీ అవినీతి వర్షాకాలంలో విద్యుత్ తీగలపై చెట్ల కొమ్మలు పడకుండా ఏటా రెండుసార్లు కొమ్మలు కొట్టేసే పనుల్లో కూడా కోట్లు కొట్టేశారు. గతంలో ఒక్క ఫీడర్ పరిధిలోనే రూ.80 వేల నుంచి రూ.90 వేల వరకు అడ్డగోలుగా బిల్లులు చేసుకునేవారు. ఇలా దిద్దుబాటు ఒక ఫీడర్ పరిధిలో చెట్ల కొమ్మలు నరకడానికి ఏడాదికి గరిష్టంగా రూ.20 వేల లోపే ఖర్చు చేసేలా సంస్థ వ్యయ పరిమితి విధించింది. ఇకపై ఏడాదిలో ఎన్నిసార్లు చెట్ల కొమ్మలు నరికినా ఫీడర్ పరిధిలో రూ.20 వేలే బిల్లు రానుంది. 2020 ఫిబ్రవరి 4వ తేదీన ఫేస్బుక్ లైవ్‌లో మాట్లాడుతున్న ఏడీఈ కోటేశ్వరరావు -
దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ ఏడీఈ సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎస్పీడీసీఎల్)లో కాంట్రాక్టు పనుల అప్పగింత తీరును ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమ వేదిక ‘ఫేస్బుక్’తో పాటు పత్రికలో ప్రకటనలు చేసిన ఏడీఈ డి.కోటేశ్వర్‌రావును సస్పెండ్ చేస్తున్న ట్లు సంస్థ ప్రకటించింది. సంస్థ సీఎండీ రఘుమారెడ్డి తరపున రెండు రోజుల క్రితం జారీ చేసిన ఉత్తర్వులు తాజాగా వెలుగులోకి వచ్చాయి.వాటిలో పేర్కొన్న వివరాల ప్రకారం టీఎస్ఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయం హెచ్ఆర్ విభాగం ఏడీఈ డి.కోటేశ్వర్రావు ఇటీవల సంస్థ ద్వారా రూ.30 కోట్లు విలువ చేసే 4,769 ట్రాన్స్ఫార్మర్ కంచె పనులకు ప్రదీప్ ఎలక్ట్రానిక్స్ అనే కాంట్రాక్టరుకు అప్పగించడాన్ని ప్రశ్నించారు. రేట్లను పెంచుతూ వాటిని అప్పగించడంపై సామాజిక మాధ్యమ వేదిక ‘ఫేస్బుక్’లో సుదీర్ఘ ప్రసం గాన్ని పోస్ట్ చేస్తూ, సంస్థకు చెందిన కొందరు ఇంజనీర్లపై ఆరోపణలు చేశారు. దీనిపై సంస్థ యాజమాన్యం మౌనం వహించడాన్ని ప్రశ్ని స్తూ చేసిన ప్రకటన ప్రచురితమైంది. ఇలా సంస్థ నియమావళిని ఉల్లంఘించారని భావి స్తూ కోటేశ్వర్‌రావును సస్పెండ్ చేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ అభియోగాలు అమల్లో ఉన్నంత కాలం ఏడీఈ కోటేశ్వర్రావు హెడ్‌క్వార్టర్‌ను అనుమతి లేకుండా విడిచి వెళ్లరాదని ఆదేశించారు. నేను నష్టపోయినా పరవాలేదు : ఏడీఈ కాంట్రాక్టు పనులను నామినేషన్ పద్ధతిలో ఒకే కాంట్రాక్టరుకు అప్పగించడాన్ని ప్రశ్నించిన తనపై సస్పెన్షన్ వేటు వేయడంపై కోటేశ్వర్రావు స్పందించారు. వ్యక్తిగతంగా నష్టపోయినా సంస్థను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. గతంలో తన పనితీరుకు మెచ్చి సంస్థ విజిలెన్స్ విభాగం అవార్డు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్న తాను, ప్రస్తుతం బాధపడుతున్నానని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు వాస్తవాలు చేరేలా చూడాలని ఓ ప్రకటనలో కోటేశ్వర్రావు కోరారు. కాగా అక్రమాలను వెలుగులోకి తెచ్చే విజిల్ బ్లోయర్స్‌కు రక్షణ కల్పిస్తూ గతంలో టీఎస్ఎస్పీడీసీఎల్ యాజమాన్యం తెచ్చిన ‘విజిల్ మెకానిజమ్ పాలసీ’ని ఉల్లంఘిస్తూ కోటేశ్వర్‌రావును సస్పెండ్ చేశారని ‘విజల్ బ్లోయర్’సంస్థ విమర్శించింది. -
వెంటాడిన మృత్యువు
నిజామాబాద్ నాగారం: కుక్కలు రెండు ప్రాణాలను బలిగొన్నాయి. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఏడీఈని కుక్కలు వెంటాడగా, తప్పించుకునేందుకు పరుగెత్తిన ఆయన గుండెపోటుతో మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం శెట్పల్లికి చెందిన గంగారాం (55) కామారెడ్డిలో ఏడీఈగా విధులు నిర్వర్తిస్తున్నారు. నిజామాబాద్ మహాలక్ష్మీనగర్‌లో నివాసముంటున్న ఆయన.. రోజూ కామారెడ్డికి వెళ్లి వస్తున్నారు. మంగళవారం రాత్రి విధులు ముగించుకుని నిజామాబాద్‌కు వచ్చిన గంగారాం.. నడుచుకుంటూ ఇంటికి వస్తుండగా కుక్కలు ఆయన వైపు దూసుకొచ్చాయి. దీంతో భయపడి పరుగులు పెట్టారు. వేగంగా పరుగెత్తిన గంగారాం.. ఇంటి గేటు ముందరకు రాగానే కుప్పకూలి పోయారు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరో ఘటనలో.. కుక్క దాడి చేయగా, పట్టుతప్పి కిందపడి తలకు తీవ్ర గాయాలు కావడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. నిజామాబాద్ కోటగల్లి సమీపంలోని మైసమ్మ వీధికి చెందిన వేముల ఆంజనేయులు (49) బస్వాగార్డెన్ ఫంక్షన్ హాలు మేనేజర్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం ఫంక్షన్ హాలులోకి కుక్క రావడంతో తరిమేందుకు యత్నించారు. కుక్క ఆంజనేయులుపై దాడి చేసి, వేలిని కొరికేసింది. ఈ క్రమంలో పట్టు తప్పి కింది పడిపోయిన ఆంజనేయులు తలకు బలమైన గాయాలయ్యాయి. అతడ్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే కోమాలోకి వెళ్లాడు. బుధవారం అతడు బ్రెయిన్‌డెడ్ అయి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. -
ఏసీబీకి చిక్కిన అవినీతి చేప
రూ. 25 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ట్రాన్స్‌కో ఏడీఈ గంగాధర్ బాధితుడు గోన్‌గొప్పుల్‌కు చెందిన రైతు భీమ్‌గల్ : ఏసీబీ వలలో అవినీతి చేప చిక్కింది. భీమ్‌గల్ మండలంలో ట్రాన్స్‌కో ఏడీఈగా పనిచేస్తున్న చెలిమెల గంగాధర్‌ను మంగళవారం సాయంత్రం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ నరేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గోన్‌గొప్పుల్ గ్రామానికి చెందిన రైతు వంజరి హన్మాండ్లు, ఆయన సతీమణి వంజరి శారదలు ఈ ఏడాది జనవరిలో 25 కేవీ అదనపు ట్రాన్స్ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి మార్చి నెలలో ట్రాన్స్ఫార్మర్ మంజూరైంది. అయితే నిజామాబాద్‌లోని స్టోర్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు దీనికి సంబంధించిన సామాగ్రి విడుదల కోసం ఏడీఈ గంగాధర్ రూ. 50 వేలు లంచం డిమాండ్ చేశాడు. అయితే బాధిత రైతు అంత మొత్తం ఇచ్చుకోలేనన్నా ససేమిరా అన్నాడు. దీంతో రూ. 25 వేలకు బేరం కుదుర్చుకుని ఏసీబీని ఆశ్రయించాడు. వారి పర్యవేక్షణలో మంగళవారం సాయంత్రం భీమ్‌గల్ పట్టణానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏడీఈ కార్యాలయంలో రూ. 25 వేల నగదును ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. కెమికల్ ఎగ్జామినేషన్‌లో నిందితుడి ఎడమ చేతి వేలిముద్రలు సరిపోయాయని, అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ దాడిలో ఏసీబీ సీఐ రఘునాథ్, ఎస్సై ఖుర్షీద్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన ఎలక్ట్రిసిటీ ఏడీఈ
బనగానపల్లె: కర్నూలు జిల్లా బనగానపల్లె ఎలక్ట్రసిటీ ఏడీఈ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఎలక్ట్రసిటీ క్రాంట్రాక్ట్కు సంబంధించిన రూ.4 లక్షల బిల్లులు చెల్లించేందుకు ఏడీఈ సుధాకర్ రావు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఎలక్ట్రసిటీ కాంట్రాక్టర్ కిషోర్ బాబు నుంచి సుధాకర్ తన ఇంట్లో రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సుధాకర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏసీబీ వలలో ఏడీఈ
భీమడోలు(ప.గో): విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి రైతు నుంచి లంచం తీసుకుంటూ విద్యుత్ అధికారి పట్టుబడ్డాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు ఏపీఈపీడీసీఎల్ కార్యలయంలో జరిగింది. మండలానికి చెందిన రైతు సీవీ.కిషోర్ బోరుబావికి విద్యుత్ కనెక్షన్ కోసం భీమడోలు ఏడీఈ డి.ఆదినారాయణను సంప్రదించారు. దానికి ఏడీఈ 80 వేలు లంచం ఇవ్వాల్సిందిగా కోరారు. అంత ఇవ్వలేనన్న రైతు చివరకు 50 వేలకు బేరం కుదుర్చుకొని ఆ విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలియజేశాడు. పధకం ప్రకారం మంగళవారం కార్యలయంలో ఏడీఈ ఆదినారాయణ లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు.