గంగారాం మృతదేహం, ఆంజనేయులు (ఫైల్)
నిజామాబాద్ నాగారం: కుక్కలు రెండు ప్రాణాలను బలిగొన్నాయి. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఏడీఈని కుక్కలు వెంటాడగా, తప్పించుకునేందుకు పరుగెత్తిన ఆయన గుండెపోటుతో మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం శెట్‌పల్లికి చెందిన గంగారాం (55) కామారెడ్డిలో ఏడీఈగా విధులు నిర్వర్తిస్తున్నారు. నిజామాబాద్ మహాలక్ష్మీనగర్‌లో నివాసముంటున్న ఆయన.. రోజూ కామారెడ్డికి వెళ్లి వస్తున్నారు. మంగళవారం రాత్రి విధులు ముగించుకుని నిజామాబాద్‌కు వచ్చిన గంగారాం.. నడుచుకుంటూ ఇంటికి వస్తుండగా కుక్కలు ఆయన వైపు దూసుకొచ్చాయి. దీంతో భయపడి పరుగులు పెట్టారు. వేగంగా పరుగెత్తిన గంగారాం.. ఇంటి గేటు ముందరకు రాగానే కుప్పకూలి పోయారు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
మరో ఘటనలో..
కుక్క దాడి చేయగా, పట్టుతప్పి కిందపడి తలకు తీవ్ర గాయాలు కావడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. నిజామాబాద్ కోటగల్లి సమీపంలోని మైసమ్మ వీధికి చెందిన వేముల ఆంజనేయులు (49) బస్వాగార్డెన్ ఫంక్షన్ హాలు మేనేజర్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం ఫంక్షన్ హాలులోకి కుక్క రావడంతో తరిమేందుకు యత్నించారు. కుక్క ఆంజనేయులుపై దాడి చేసి, వేలిని కొరికేసింది. ఈ క్రమంలో పట్టు తప్పి కింది పడిపోయిన ఆంజనేయులు తలకు బలమైన గాయాలయ్యాయి. అతడ్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే కోమాలోకి వెళ్లాడు. బుధవారం అతడు బ్రెయిన్‌డెడ్ అయి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment