ఏసీబీకి చిక్కిన అవినీతి చేప
-
రూ. 25 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ట్రాన్స్‌కో ఏడీఈ గంగాధర్
-
బాధితుడు గోన్‌గొప్పుల్‌కు చెందిన రైతు
భీమ్‌గల్ :
ఏసీబీ వలలో అవినీతి చేప చిక్కింది. భీమ్‌గల్ మండలంలో ట్రాన్స్‌కో ఏడీఈగా పనిచేస్తున్న చెలిమెల గంగాధర్‌ను మంగళవారం సాయంత్రం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ నరేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గోన్‌గొప్పుల్ గ్రామానికి చెందిన రైతు వంజరి హన్మాండ్లు, ఆయన సతీమణి వంజరి శారదలు ఈ ఏడాది జనవరిలో 25 కేవీ అదనపు ట్రాన్స్‌ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి మార్చి నెలలో ట్రాన్స్‌ఫార్మర్ మంజూరైంది. అయితే నిజామాబాద్‌లోని స్టోర్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు దీనికి సంబంధించిన సామాగ్రి విడుదల కోసం ఏడీఈ గంగాధర్ రూ. 50 వేలు లంచం డిమాండ్ చేశాడు. అయితే బాధిత రైతు అంత మొత్తం ఇచ్చుకోలేనన్నా ససేమిరా అన్నాడు. దీంతో రూ. 25 వేలకు బేరం కుదుర్చుకుని ఏసీబీని ఆశ్రయించాడు. వారి పర్యవేక్షణలో మంగళవారం సాయంత్రం భీమ్‌గల్ పట్టణానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏడీఈ కార్యాలయంలో రూ. 25 వేల నగదును ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. కెమికల్ ఎగ్జామినేషన్‌లో నిందితుడి ఎడమ చేతి వేలిముద్రలు సరిపోయాయని, అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ దాడిలో ఏసీబీ సీఐ రఘునాథ్, ఎస్సై ఖుర్షీద్ సిబ్బంది పాల్గొన్నారు.