ఏడీఈ వేధింపులు భరించలేకపోతున్నా..  | Telangana: Transco AE Employee Jumped Into The Pond In Warangal District | Sakshi
Sakshi News home page

ఏడీఈ వేధింపులు భరించలేకపోతున్నా.. 

Published Wed, Dec 15 2021 1:56 AM | Last Updated on Wed, Dec 15 2021 1:56 AM

Telangana: Transco AE Employee Jumped Into The Pond In Warangal District - Sakshi

ఖిలా వరంగల్‌: ‘విద్యుత్‌ ఏడీఈ వేధింపులు భరించలేకపోతున్నా.. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటున్నా’.. అంటూ తోటి ఉద్యోగులకు వాట్సాప్‌లో మెసెజ్‌ పెట్టి చెరువులోకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు ఓ ఏఈ. మత్స్యకారులు అతన్ని కాపాడి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన వరంగల్‌ జిల్లా ఖిలావరంగల్‌ మండలం తిమ్మాపురం గ్రామశివారు బెస్తం చెరువు వద్ద మంగళవారం జరిగింది.

బంధువులు, స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్‌ శంభునిపేట ప్రాంతం రంగశాయిపేట చెందిన కుంట శ్రీధర్‌ విద్యుత్‌శాఖలో పోర్ట్‌ వరంగల్‌ సెక్షన్‌ ఏఈగా విధులు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా ఆ శాఖ ఉన్నతాధికారి (ఏడీఈ ) పనుల్లో నిరంతరం వేధింపులకు గురి చేస్తుండటంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలో శ్రీధర్‌ మంగళవారం మధ్యాహ్నం  ఆ మేరకు శాఖ ఉద్యోగులందరికీ వాట్సాప్‌ సందేశాలు పెట్టారు.

అనంతరం 3గంటల సమయంలో తిమ్మాపురం బెస్తం చెరువులో దూకారు. గమనించిన మత్స్యకారులు మరబోటు సాయంతో ఏఈని కాపాడి ఒడ్డుకు చేర్చారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న అతన్ని స్థానికులు హనుమకొండలోని రోహిణి ఆస్పత్రికి తరలించారు. 24గంటలు దాటితే తప్ప అతని ఆరోగ్య పరిస్థితిపై ఏమీ చెప్పలేమని వైద్యులు చెప్పినట్లు సమాచారం. ఏఈకి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.    

వేధింపులతో గతంలోనూ ఒకరి మృతి?  
గతంలోనూ ఇదే ఏడీఈ వేధింపులతో లైన్‌ఇన్‌స్పెక్టర్‌ గుండెపోటుతో మృతి చెందినట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో ఏడీఈని వదిలి ఇతరులపై యాజమాన్యం చర్యలు తీసుకుంది. అ అధికారిని మాత్రం ఆదే స్థానంలో కొనసాగించడంతో మరో ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి కారకుడయ్యాడని ట్రాన్స్‌కో ఉద్యోగులే చెబుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement