సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ నష్టాల్లో కుమురం భీం ఆసిఫాబాద్ డివిజన్ అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ విద్యుత్ సాంకేతిక, వాణిజ్య నష్టాల మొత్తం (ఏటీ అండ్ సీ లాసె స్) 51.08 శాతంగా నమోదైంది. విద్యుత్ ట్రాన్స్‌మిషన్, డి స్ట్రిబ్యూషన్ నష్టాలు 11.41శాతమే ఉన్నప్పటికీ, విద్యుత్ బిల్లులు వసూళ్లు 55శాతమే జరగడంతో ఆసిఫాబాద్ ఏటీ అండ్ సీ నష్టాల్లో అగ్ర స్థానంలో నిలిచింది.
సాంకేతిక లోపా లు, విద్యుత్ చౌర్యంతో జరిగే విద్యుత్ నష్టాలతో పాటు విద్యుత్ బిల్లుల జారీ/వసూల్లో జరిగే లోపాలు, వసూలు కాని మొండి బకాయిలతో జరిగే నష్టాల మొత్తాన్ని కలిపి విద్యుత్ రంగ పరిభాషలో ‘ఏటీ అండ్ సీ లాసెస్’గా పేర్కొంటారు. హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్, ఆస్మాన్‌గఢ్, బేగం బజార్‌తో పాటు గజ్వేల్, సిద్దిపేట డివిజన్లలో ఎప్పటిలాగే భారీ విద్యుత్ నష్టాలు నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లో 32– 35 శాతం వరకు ‘ఏటీ అండ్ సీ’నష్టాలుండడం గమనార్హం. 2022 జనవరి 1 నుంచి మార్చి 31 మధ్య కాలానికి సంబంధించి దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్/ఎన్పీడీసీఎల్)లు కేంద్రానికి సమర్పించిన త్రైమా సిక విద్యుత్ ఆడిట్ నివేదికల్లో ఈ విషయాన్ని వెల్లడించాయి.
ప్రతి మూడు నెలలకు ఎనర్జీ ఆడిట్
బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) ఆదేశాల మేరకు సబ్ స్టేషన్లు, ఫీడర్లు, ట్రాన్స్‌ఫార్మర్లకు మీటర్లను బిగించి ప్రతి మూడు నెలలకోసారి ఎనర్జీ ఆడిట్‌ని రాష్ట్ర డిస్కంలు నిర్వహిస్తున్నాయి. విద్యుత్ డివిజన్లు/సర్కిళ్ల వారీగా ఎంత విద్యుత్ సరఫరా చేశారు? ఎంత చౌర్యం/సాంకేతిక నష్టాలు జరిగాయి ? ఎంత మేర విద్యుత్‌కు ఎంత మేర బిల్లులు జారీ చేశారు? ఎంత వసూలయ్యాయి? అన్న వివరాలతో త్రైమాసిక, వార్షిక ఆడిట్ నివేదికలను డిస్కంలు సమర్పించాల్సి ఉంటుంది.
చార్మినార్ డివిజన్ పరిధిలో 35.73 శాతం ఏటీ అండ్ సీ నష్టాలు నమోదయ్యాయి. ఇక్కడ 198.78 మిలియన్ యూనిట్ల (ఎంయూల) విద్యుత్‌ను సరఫరా చేయగా.. 122.73 ఎంయూల మీటర్డ్ సేల్స్ (వినియోగదారులు వాడినట్టుగా మీటర్లలో నమోదైన లెక్క) మాత్రమే జరిగాయి. మిగతా 76.04ఎంయూ (38శాతం) ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్(టీ అండ్ డీ) నష్టాలు వచ్చాయి.
సాంకేతిక లోపాలు, విద్యుత్ చౌర్యంతో జరిగే నష్టాలను కలిపి విద్యుత్ రంగ పరిభాషలో ‘ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ (టీ అండ్ డీ) నష్టాలు’అంటారు. ఇక రూ.85.19 కోట్ల బిల్లులకుగాను రూ.88.68 కోట్లు (104 శాతం) వసూలయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విద్యుత్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలో బకాయిపడడంతో గజ్వేల్, సిద్దిపేట డివిజన్లు ప్రతి సారి ఏటీఅండ్‌సీ నష్టాల్లో టాప్‌లో ఉంటున్నాయి.
ఆడిట్ నివేదికలో తప్పుడు లెక్కలు..
కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలో 98.56శాతం ఏటీఅండ్‌సీ నష్టాలున్నట్టు టీఎస్‌ఎన్పీడీసీఎల్ యాజమాన్యం తప్పుడు గణాంకాలను కేంద్రానికి సమర్పించిన నివేదికలో పొందుపర్చింది. టీఅండ్‌సీ నష్టాలు 8.29శాతమే ఉండగా, బిల్లుల వసూళ్లు 99శాతం ఉండడంతో ఈ ప్రాంతంలో ఏటీఅండ్‌సీ నష్టాలు తక్కువ మొత్తంలో ఉండే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment