
సాక్షి, హైదరాబాద్: కరోనా కేవలం ఆరోగ్య రంగంపైనే కాదు.. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్)పైనా ప్రభావం చూపింది. కోవిడ్ కారణంగా గత రెండేళ్ల నుంచి అనేక పరిశ్రమలు, హోటళ్లు, సినిమాహాళ్లు, ఐటీ అనుబంధ సంస్థలు, విద్యా సంస్థలు, హాస్టళ్లు మూతపడ్డాయి. విదేశాలకు ఎగుమతి, దిగుమతులు నిలిచిపోవడంతో ఉన్నవి కూడా ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించాయి. పరిశ్రమలో పది యూనిట్లు ఉంటే.. అయిదు యూనిట్లతో సరిపెట్టుకున్నాయి. ఫలితంగా గత ఏడాదితో పోలిస్తే ఈసారి విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గింది. 2019 మే నెల సగటు విద్యుత్ వినియోగం 70 ఎంయూ ఉండగా, 2020లో ఇది 60 ఎంయూకు తగ్గింది.
తాజాగా ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో రోజు సగటు కరెంట్ వినియోగం 55 ఎంయూకి పడిపోయింది. ఫలితంగా సంస్థ నెలకు సగటున రూ.25 నుంచి రూ.30 కోట్ల చొప్పున అదనపు రెవెన్యూను కోల్పోవాల్సి వచ్చింది. ఈ రెండు వేసవి కాలాల్లో డిస్కం రూ.400 కోట్ల వరకు నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.
కనెక్షన్లు పెరిగినా..
గ్రేటర్‌లో 50 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో ఏడు లక్షల వాణిజ్య కనెక్షన్లు, 50 వేల పారిశ్రామిక కనెక్షన్లు ఉన్నాయి. 45 లక్షలకుపైగా గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. నగరంలో నెలకు కొత్తగా రెండు వేల గృహ విద్యుత్ కనెక్షన్లు వచ్చి చేరుతుంటాయి. గృహ వినియోగదారుల కన్నా.. వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులే సంస్థకు కీలకం.
గృహ విద్యుత్ చార్జీలతో పోలిస్తే.. వాణిజ్య సంస్థలు వాడే కరెంట్ యూనిట్ చార్జీ ఎక్కువ. లాక్ డౌన్ కారణంగా ఐటీ అనుబంధ కంపెనీలు సహా సినిమా హాళ్లు, హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. ఎగుమతి దిగుమతులు నిలిచి పోవడంతో చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలు ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా తగ్గించుకున్నాయి.
ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం ఇవ్వడంతో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు పని చేయకపోవడంతో విద్యుత్ వినియోగం తగ్గిపోయింది. వినియోగదారుల నుంచి రావాల్సిన రెవెన్యూ తగ్గిపోయి సంస్థ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.
అంచనాలు తలకిందులు
సాధారణంగా వర్షాకాలం, శీతాకాలంతో పోలిస్తే వేసవిలో విద్యుత్ వినియోగం ఎక్కువగా నమోదవుతుంది. గృహాల్లోనే కాకుండా వాణిజ్య సంస్థల్లోనూ ఏసీల వినియోగం పెరిగి కరెంట్ ఎక్కువ వినియోగం అవుతుంది. జులై నుంచి ఫిబ్రవరి వరకు నెలకు 150 నుంచి 200 యూనిట్లు వాడే సగటు వినియోగదారులు మార్చి నుంచి జూన్ చివరి వరకు 300 నుంచి 350 యూనిట్ల వరకు ఖర్చు చేస్తుంటారు.
ఈ మేరకు డిస్కం ఈ వేసవిలోనూ భారీగా కరెంట్ వినియోగం జరుగుతుందని అంచనా వేసింది. రోజు సగటు వినియోగం 75 ఎంయూలకు చేరుకుంటుందని భావించింది. సెకండ్‌వేవ్ ఉద్ధృతి కారణంగా ప్రభుత్వం ఈ వేసవిలోనూ లాక్‌డౌన్ ప్రకటించింది. 2020 మే నెలలో రోజు సగటు వినియోగం 60 ఎంయూలు ఉండగా, 2021 మేలో 55 ఎంయూలే నమోదైంది. లాక్‌డౌన్ కారణంగా గృహ వినియోగం పెరిగినప్పటికీ.. వాణిజ్య వినియోగం తగ్గడంతో సంస్థకు నష్టాలు తప్పలేదు.
వినియోగం తగ్గింది..
ఈ వేసవిలో రోజు సగటు వినియోగం 75 ఎంయులకు చేరుకుంటుందని అంచనా వేశాం. కానీ లాక్‌డౌన్‌కు తోడు గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది ఎండ తీవ్రత కూడా తక్కువగా ఉంది. ఉక్కపోత అధికంగా లేకపోవడంతో వినియోగదారులు ఏసీల వినియోగాన్ని తగ్గించడంతో ఆదాయం రాలేదు.
– శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్, ఆపరేషన్స్, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్
మినిమం చార్జీ చెల్లిస్తున్నాం
కోవిడ్ కారణంగా గత ఏడాది మార్చిలో థియేటర్లు మూతపడ్డాయి. ప్రదర్శనలున్నప్పుడు నెలకు సగటున రూ.60 వేలు కరెంట్ బిల్లు చెల్లించేవాళ్లం. ప్రస్తుతం సినిమాలు లేకపోవడంతో నెలకు మినిమం చార్జీ కింద రూ.30 వేల వరకు చెల్లిస్తున్నాం.
– శ్రీనివాసరెడ్డి, మేనేజర్, సుదర్శన్ థియేటర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్
Comments
Please login to add a commentAdd a comment