సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసలే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లను కొందరు అధికారులు, సిబ్బంది మరింతగా ముంచుతున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. నాగర్‌కర్నూల్ డివిజన్ పరిధిలో ఏకంగా 10,783 విద్యుత్ కనెక్షన్లకు జీరో యూనిట్ల వినియోగంతో బిల్లులు జారీ చేస్తున్నట్లు సంస్థ విజిలెన్స్ విభాగం విచారణలో తేలింది. దీంతో సంస్థ ప్రతి నెలా రూ. లక్షల్లో ఆదాయాన్ని నష్టపోయినట్లు వెల్లడైంది.
అయితే ఆయా బిల్లుల వాస్తవ మొత్తాలను వినియోగదారుల నుంచి కొందరు అధికారులు, సిబ్బంది వసూలు చేసుకొని జేబులో వేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) చైర్మన్ తన్నీరు శ్రీరంగారావుకు జి.సత్యనారాయణ అనే న్యాయవాది చేసిన ఫిర్యాదుతో ఈ అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా ప్రతి విద్యుత్ కనెక్షన్‌కు ఒక మీటర్, ఆ మీటర్‌కు ఒక విశిష్ట సంఖ్య ఉంటుంది. కానీ ఒకే మీటర్ నంబర్‌తో 10,783 సర్విసు కనెక్షన్లు ఉన్నట్లు విజిలెన్స్ తేల్చినట్లు సమాచారం.
2,788 కనెక్షన్లపైనే విచారణ..
ఈఆర్సీ సూచనలతో టీఎస్‌ఎస్పీడీసీఎల్ విజిలెన్స్ విభాగంతో విచారణ జరిపించింది. 10,783 సర్వీసు కనెక్షన్లలో 2,788 కనెక్షన్లను మాత్రమే విజిలెన్స్ విభాగం తనఖీ చేయగలిగింది. సిబ్బంది కొరతతో మిగిలిన కనెక్షన్లను తనిఖీ చేయలేకపోయింది.
తనఖీ చేసిన 2,788 కనెక్షన్లలో కేవలం 687 కనెక్షన్లకే మీటర్లున్నాయని, మిగిలిన 2101 కనెక్షన్లకు మీటర్లు లేవని గుర్తించింది. తనిఖీ చేసిన కనెక్షన్లకు సంబంధించి తప్పుడు మీటర్ రీడింగ్‌ను నమోదు చేసి బిల్లులు జారీ చేయడంతో సంస్థ రూ. 9.32 లక్షల ఆదాయాన్ని నష్టపోయినట్టు నిర్ధారించింది.
10,783 కనెక్షన్లలో ఏకంగా 4,842 కనెక్షన్లకు మీటర్లే లేవని నాగర్‌కర్నూల్ డీఈ మరో నివేదికలో టీఎస్‌ఎస్పీడీసీఎల్‌కు తెలియజేశారు. ఒక్క నాగర్‌కర్నూల్ డివిజన్ పరిధిలోనే ఈ పరిస్థితి బయటపడగా రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా అవకతవకతలతో డిస్కంలు రూ. వందల కోట్ల మేర ఆదాయాన్ని నష్టపోతున్నాయని ఆరోపణలున్నాయి.
41 మందిపై చర్యలకు ఆదేశం..
నాగర్‌కర్నూల్ డివిజన్‌లో వెలుగు చూసిన భారీ అక్రమాల్లో స్థానికంగా పనిచేసే 41 మంది ఓఅండ్‌ఎం విభాగం అధికారులు, సిబ్బంది, మరో ముగ్గురు అకౌంట్స్ విభాగం అధికారులను బాధ్యులుగా విజిలెన్స్ విభాగం తేల్చింది. ఈ నివేదిక ఆధారంగా 14 మంది ఏఈలు, నలుగురు ఏడీఈలు, మరొక డీఈపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీఎండీ జి.రఘుమారెడ్డి ఆదేశించారు.
వారి బాధ్యతారాహిత్యం, విధుల్లో నిర్లక్ష్యంతోనే మీటర్ రీడర్లు అక్రమాలకు పాల్పడ్డారని, వారితోపాటు ప్రైవేటు మీటర్ రీడింగ్ ఏజెన్సీపైనా చర్యలు తీసుకోవాలన్నారు. అయితే ఈ వ్యవహారంలో ఇంకా ఎవరినీ సస్పెండ్ చేయలేదని అధికార వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment