సాక్షి, అమరావతి: ఇది రైతు ప్రభుత్వం.. రైతే రాజనే ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు రైతుల సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్నాయి. అయితే దీన్ని తట్టుకోలేని పచ్చ పత్రిక ఈనాడు కట్టుకథ అల్లింది. వైఎస్సార్‌సీపీ 2019లో అధికారంలోకి రాగానే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై పరిమితిని ఎత్తివేసింది. ఈ నిజాన్ని దాని పెట్టి ‘కొత్త కనెక్షన్లు గగనమే’ శీర్షికతో ఈనాడు దినపత్రిక బుధవారం తప్పుడు వార్తను ప్రచురించింది. ఈ వార్తలో వాస్తవం లేదని ఆంధ్రప్రదేశ్ మద్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీ ఎల్) సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి స్పష్టం చేశారు. సీఎండీ వెల్లడించిన వాస్తవాలిలా ఉన్నాయి..
ఆరోపణ: మైలవరం పంచాయతీకి చెందిన రైతు వెంకటరెడ్డి తన చేనుకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం మూడేళ్ల క్రితం ఒకసారి, ఆరేడు నెలల క్రితం మరోసారి దరఖాస్తు చేశాడు. అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తామన్నా చేయలేదు. ఆరు నెలలుగా ఆన్‌లైన్ సేవలను నిలిపివేశారు.
వాస్తవం: ప్రతిపాదనలు రూపొందించడంలో జాప్యం వల్ల విద్యుత్ సర్వీసు మంజూరు కాలేదన్నది పచ్చి అబద్ధం. ప్రాధాన్యతా క్రమంలో అంచనా వ్యయాన్ని రూపొందిస్తున్నారు. ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియను కొద్ది రోజులు నిలిపేయడం సర్వసాధారణం. నిజానికి ఫిబ్రవరి వరకూ అంచనా వ్యయం చెల్లించిన వాటన్నిటికీ విద్యుత్ సర్వీసులు మంజూరు చేశారు. మరో వారంలో కొత్తగా ఆన్‌లైన్ నమోదు మళ్లీ మొదలవుతుంది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ.
ఆరోపణ: దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ విద్యుత్ లైను, ట్రాన్స్‌ఫార్మర్లు యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేస్తామని విద్యుత్ శాఖ అధికారులు గతేడాది ప్రకటించారు. చాలావరకు గత అర్జీలను పరిష్కరించి అంతకుముందు వరకూ ఆమోదంలో ఉన్న వారికి సర్వీసులు మంజూరు చేశారు. కొత్తగా దరఖాస్తులు పెట్టుకోవచ్చని పేర్కొన్నా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.
వాస్తవం: చెప్పినట్లుగానే దరఖాస్తుదారులకు సర్వీసులు మంజూరు చేశారని ఈనాడే రాసింది. 2019 వరకు ప్రతి జిల్లాలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పరిమితికి మించి మంజూరు చేసుకునే అవకాశం ఉండేది కాదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆ పరిమితిని సవరించి దరఖాస్తుదారులందరికీ సత్వరమే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని ఆదేశించింది. కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని తదనుగుణంగా అంచనా వ్యయం చెల్లించే అవకాశం ఉంది. విద్యుత్ నియంత్రికలు, స్తంభాలు, వైర్లు ఏర్పాటు చేసి ఎప్పటి కనెక్షన్లను అప్పుడే మంజూరు చేసి విద్యుత్ సరఫరా అందిస్తున్నారు.
ఆరోపణ: ఏడాది వయసున్న మామిడి మొక్కలను కాపాడుకోవడానికి మోటారు తప్పనిసరి కావడంతో ప్రభుత్వ దయాదాక్షిణ్యాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇది ఆ ఒక్క రైతు పరిస్థితే కాదు. జిల్లావ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్న వేలాది కర్షకుల దుస్థితి.
వాస్తవం: ఏపీసీపీడీసీఎల్ 2019లో ఏర్పాటై నప్పటికీ.. 2014 నుంచి ఇప్పటివరకు అంచనా వ్యయం చెల్లించినవారందరికీ పరిమితి లేకుండా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేసింది. ఇలా పెండింగ్‌లో ఉన్న 84,085 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను ఇచ్చింది. కనెక్షన్లకు సంబంధించి విద్యుత్ స్తంభాలు, వైర్లు, విద్యుత్ నియంత్రికలను కూడా ఏర్పాటు చేసి రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తోంది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు పగటిపూటే తొమ్మిది గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందిస్తోంది. దీనికి అనుగుణంగా వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు హై ఓల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం (హెచ్‌వీడీఎస్) పథకం కింద 16 కేవీఏ సామర్థ్యం కలిగిన ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో 25 కేవీఏ సామర్థ్యం గల కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తోంది.
101 కొత్త 33/11 కేవీఏ సబ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా వ్యవసాయ విద్యుత్ వినియోగదా రులకు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేయడంతో వ్యవసాయ మోటార్లు కాలిపోవడం, రైతులు విద్యుత్ ప్రమాదాల బారిన పడటం వంటివి తగ్గిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment