
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్)లో 1,000 జూనియర్ లైన్‌మెన్ (జేఎల్‌ఎం) పోస్టుల భర్తీకి త్వరలో కొత్త నోటిఫికేషన్ జారీ కానుంది. సబ్ ఇంజనీర్ పోస్టులకు ఎంపిౖకైన అభ్యర్థులకు సోమవారం నియామక పత్రాలను అందజేయడంతో ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ దాదాపుగా ముగిసింది. దీంతో జేఎల్‌ఎం నోటిఫికేషన్ జారీపై సంస్థ యాజమాన్యం కసరత్తు ప్రారంభించనుందని అధికారవర్గాలు తెలిపాయి.
ఈ నెలాఖరులోగా లేదా వచ్చే నెల తొలివారంలో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. వాస్తవానికి వెయ్యి జేఎల్‌ఎం పోస్టుల భర్తీకి గత మే 9న సంస్థ యాజమాన్యం నోటిఫికేషన్ జారీ చేసి, జూలై 17న రాతపరీక్ష నిర్వహించింది. అయితే రాత పరీక్షలో అవకతవకలు చోటు చేసుకోవడంతో ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేసినట్టు గత ఆగస్టు 25న సంస్థ యాజమాన్యం ప్రకటించింది.
రాష్ట్ర విద్యుత్ సంస్థలకు చెందిన కొందరు ఉద్యోగులు ఏకంగా 181 మంది అభ్యర్థుల నుంచి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేసి పరీక్షా కేంద్రాల్లో వారికి సమాధానాలు చేరవేసినట్టు నిర్ధారణ కావడంతో యాజమాన్యం పరీక్ష రద్దుకు నిర్ణయం తీసుకుంది. ఈ పోస్టుల భర్తీకి మరోసారి నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించింది. ఇదిలా ఉండగా, కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత అభ్యర్థులు మళ్లీ ఫీజులు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment