ఛేంజ్ ఇస్తేనే మీటర్ ఎక్స్‌ఛేంజ్
♦ పాత విద్యుత్ మీటర్ మార్చేందుకు రూ.200 డిమాండ్
♦ అధికారులు, ఏజెన్సీ నిర్వాహకుల చేతివాటం
♦ ఆందోళన వ్యక్తం చేస్తున్న వినియోగదారులు
నెల్లూరు (టౌన్):
వెంకటాచలం మండలం కాకుటూరులో రాపూరు హరిబాబు నివాసం ఉంటున్నారు. ఇంటికి విద్యుత్ పాత మీటరు ఉండటంతో కొత్తగా వచ్చిన ఐఆర్‌డీఏ పోర్డ్ మీటరను అమర్చేందుకు ఏజెన్సీ నిర్వాహకులు గురు వారం ఇంటికి వచ్చారు. అయితే రూ. 200లు ఇస్తేనే కొత్త మీటరు బిగిస్తామని స్పష్టం చేశారు. డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించడంతో మీటరు మార్చకుండానే అక్కడ నుంచి వెళ్లి పోయారు. ఈ సమస్య ఒక హరిబాబుకే కాదు.. జిల్లాలోని ప్రతి విద్యుత్ వినియోగదారుడికీ ఉంది. రీడింగ్‌లో అక్రమాలను అరికట్టేందుకు విద్యుత్ శాఖ పాత మీటర్ల స్థానంలో కొత్త మీటర్లను బిగించాలని నిర్ణయించింది. రీడింగ్‌ను
పరికరం సహాయంతో స్కానింగ్ చేయడంతో కచ్చితమైన రీడింగ్ వస్తుందని విద్యుత్‌శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో పాత మీటర్ల స్థానంలో కొత్తగా ఐఆర్‌డీఏ పోర్డ్ మీటర్లును విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు జిల్లాకు పంపిణీ చేశారు. జిల్లాలోని గృహ సర్వీసులకు సంబంధించి చెడిపోయిన మీటర్లతో పాటు పని చేస్తున్న మీటర్ల స్థానంలో కొత్తగా వచ్చిన ఐఆర్‌డీఏ పోర్డ్ మీటర్లును మార్చే ప్రక్రియను చేపట్టారు. జిల్లాలో 9 లక్షల 60 వేలకు పైగా గృహ సర్వీసులు ఉన్నాయి. జిల్లాలో మీటర్లను మార్చే బాధ్యతను ఒక్కో డివిజన్‌లో ఒక్కో ఏజెన్సీకి అప్పగించారు. తొలుత ఒక మీటరు మార్పునకు రూ.20లు సంబంధిత కాంట్రాక్టర్లుకు విద్యుత్‌శాఖ చెల్లించే విధంగా ఒప్పందం చేసుకుంది. అయితే ఈ ధర సరిపోదని చెప్పడంతో మీటరు మార్పునకు రూ.70లను పెంచి ఆధర ప్రకారం చెల్లిస్తున్నారు.
మార్పునకు రూ.200లు
చెడిపోయినా, పాత మీటర్లు ఉన్నా వాటి స్థానంలో వినియోగదారుల నుంచి ఎలాంటి పైసా తీసుకోకుండా ఉచితంగా ఐఆర్‌డీఏ పోర్డ్ మీటరును మార్చాల్సి ఉంది. అయితే సంబంధిత ఏజెన్సీ కాంట్రాక్టర్లు మీటరు మార్పునకు వినియోగదారుడి నుంచి రూ.200లు వసూలు చేస్తుండటంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెల్లించే రూ.70లతో పాటు అదనంగా వినియోగదారుడు నుంచి రూ. 200లు వసూలు చేసి రెండు చేతులతో దోచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అధికారులు, కాంట్రాక్టర్లు కమ్మక్కు
మీటరు మార్పు విషయంలో కాంట్రాక్టర్లు వినియోగదారుల నుంచి అక్రమంగా వసూలు చేస్తున్న నగదులో అధికారులుకు కూడా వాటా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ వసూళ్లపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలువురు వినియోగదారులు వాపోతున్నారు. ఇంటికి వచ్చి నేరుగా డబ్బులు వసూలు చేసే ధైర్యం ఉందంటే వారికి అధికారుల అండ కూడా కచ్చితంగా ఉంటుందంటున్నారు. ప్రధానంగా మీటరు మార్పునకు గ్రామీణ ప్రాంతాలను ఎంచుకుని డిమాండ్ చేసి మరీ వసూళ్లు చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది వినియోగదారులు అడిగినంత డబ్బులు ఇచ్చి మీటరును మార్చుకుంటే డబ్బులు ఇవ్వని వినియోగదారులు మీటర్లు మాత్రం యథాతథంగానే ఉన్నా యని చెబుతున్నారు.
జిల్లాలో గృహాలకు ఉన్న 9 లక్షల 60వేలు మీటర్లకు సగం మంది దగ్గర రూ. 200లు వసూలు చేసినా రూ. 8 కోట్లుకు పైగానే వసూలవుతుందని విద్యుత్‌శాఖ అధికారులే చెప్పడం గమనార్హం. ఇప్పటికే జిల్లాలో ముమ్మరంగా మీటర్లు మార్చే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మీటరు మార్పునకు డబ్బు వసూలు చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవా లని వినియోగదారులు కోరుతున్నారు.
మీటరు మార్పునకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు
మీటర్లను మార్చేందుకు ఆయా డివిజన్లు వారీగా కాంట్రాక్టర్లకు అప్పగించాం. మీటరు మార్చినందుకు ఒక పైసా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. డబ్బు వసూలు చేస్తున్నారన్న విషయం తెలియదు. ఈ విషయంపై విచారణ జరిపి వసూలు చేస్తున్నారని తేలితే అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– కళాధరరావు, ఎస్‌ఈ ట్రాన్స్‌కో