బత్తలపల్లి: ఎస్సీ కాలనీల్లో గృహావసరాలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం. అయితే.. 200 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగించారంటూ అధికారులు కనెక్షన్లు కట్ చేసిన సంఘటన శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలంలోని పోట్లమర్రి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోట్లమర్రి ఎస్సీ కాలనీవాసులు తెలిపిన సమాచారం మేరకు..కాలనీలో 20 మందికి పైగా లబ్ధిదారుల ఇళ్లకు 200 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగం జరిగిందని, వీరంతా రూ.5 వేల నుంచి రూ.8వేల వరకు బకాయిలు పడ్డారని ఆదివారం విద్యుత్ అధికారులు దాదాపు 12 మంది గ్రామానికి చేరుకుని కనెక్షన్లు కట్ చేశారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2020 సంవత్సరంలో కూడా ఇలాగే సమస్య ఎదురైతే అప్పటి అనంతపురం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించుకున్నామన్నారు. అప్పటి నుంచి ఎటువంటి ఇబ్బందులూ లేవని, ఇప్పుడు మరోసారి అదేవిధంగా అధిక బిల్లులు వచ్చాయని విద్యుత్ అధికారులు కనెక్షన్లు కట్ చేశారని వాపోయారు. అప్పటి విద్యుత్ బిల్లులు కూడా ఇప్పుడు చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారని, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి సోమవారం తీసుకువెళతామని తెలిపారు.