గడువు రోజులను సగానికి సగం తగ్గించిన కేంద్రం
విద్యుత్ వాహనాలకు ప్రత్యేక విద్యుత్ కనెక్షన్‌కు అవకాశం
వినియోగదారుల హక్కులు రూల్స్, 2020కి సవరణ
సాక్షి, అమరావతి : కొత్త ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఇకపై మరింత వేగంగా రానుంది. ఇప్పటి వరకూ అమల్లో ఉన్న నిబంధనల మేరకు ఉన్న గడువును కేంద్రం తగ్గించింది. సగానికి పైగా రోజులను కుదిస్తూ తాజాగా ఉత్తర్వులిచ్చింది. ఇందు కోసం విద్యుత్ చట్టం, 2003లోని సెక్షన్ 176 ప్రకారం విద్యుత్ (వినియోగదారుల హక్కులు) రూల్స్, 2020లో సవరణలు చేసింది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఈ కొత్త నిబంధన ప్రకారం.. మహా నగరాల్లో(మెట్రోపాలిటన్) నివసించే వారు మూడు రోజుల నుంచి గరిష్టంగా ఏడు రోజుల్లోనే విద్యుత్ కనెక్షన్‌లు పొందొచ్చు.
మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లో 15 రోజుల నుంచి ఏడు రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 30 రోజుల నుంచి 15 రోజులకు గడువు తగ్గిస్తూ మార్పులు చేశారు. ఇక కొండ ప్రాంతాలున్న గ్రామీణ ప్రాంతాలు కొత్త కనెక్షన్లు గానీ, ఇప్పటికే ఉన్న కనెక్షన్లలో మార్పులుగానీ చేసుకోవడానికి కనీస వ్యవధి 30 రోజులుగా నిర్ణయించారు. తాజా నిబంధనల మేరకు ఎలక్ట్రిక్ వాహనాలకు(ఈవీ) ఇంటి వద్దే చార్జింగ్ పెట్టుకోవడానికి ప్రత్యేక విద్యుత్ కనెక్షన్ పొందొచ్చు.
పీఎం సూర్య ఘర్ పథకంలో భాగంగా ఏడాదిలో కోటి గృహాలకు రూఫ్‌టాప్ సోలార్‌ను ఏర్పాటు చేస్తామని, ప్రతి నెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తామని కేంద్రం ఇటీవల ప్రకటించింది. దీనికి తోడ్పాటుగా భవనాలపై రూఫ్‌టాప్ సోలార్ పీవీ సిస్టంల ఏర్పాటుకు డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ కాల పరిమితినీ 30 నుంచి 15 రోజులకు తగ్గించారు.
నాణ్యమైన సేవలు.. వినియోగదారుల హక్కు
కనెక్షన్ కోసం దరఖాస్తు చేసిన వారికి విద్యుత్ సరఫరా చేయడం ప్రతి డిస్కం ప్రాథమిక విధిగా కొత్త నిబంధనలో స్పష్టం చేశారు. అలాగే డిస్కంల నుంచి నాణ్యమైన సేవలను పొందడం వినియోగదారుల హక్కుగా నిబంధనల్లో పేర్కొన్నారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులొస్తే ఫిర్యాదు అందిన తేదీ నుంచి ఐదు రోజుల్లోపు అదనపు మీటర్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని కేంద్రం ఇచ్చిన నిబంధనల్లో స్పష్టం చేశారు.
కో–ఆపరేటివ్ గ్రూప్ హౌసింగ్ సొసైటీలు, బహుళ అంతస్థుల భవనాలు, కాలనీల్లో నివసిస్తున్న వారు విద్యుత్ పంపిణీ సంస్థ నుంచి వ్యక్తిగత విద్యుత్ సర్విసులు పొందొచ్చు.. లేదా మొత్తం ప్రాంగణానికి సింగిల్ పాయింట్ కనెక్షన్ తీసుకోవచ్చు. అయితే మీటర్ లేకుండా కనెక్షన్ ఇవ్వకూడదని షరతు విధించారు. సాధ్యమైనంత వరకూ స్మార్ట్ ప్రీ పెయిడ్ మీటర్లు పెట్టాలని, బిల్లులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ముందుగా కూడా చెల్లించొచ్చని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment