బిల్లింగ్ స్టేటస్‌పై రివ్యూల విస్మరణ
కరెంట్ వాడకపోయినా.. మినిమం పేరుతో భారీ వడ్డన
ఫిర్యాదులకు స్పందించని శివారు సర్కిళ్ల ఇంజినీర్లు
లబోదిబోమంటున్న విద్యుత్ వినియోగదారులు
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ సర్కిల్ జీడిమెట్ల డివిజన్ ప్రగతినగర్ సెక్షన్ బాచుపల్లిలోని ఓ అపార్ట్‌మెంటులో విద్యుత్ లైన్‌మన్ మీటర్ రీడింగ్ నమోదు చేయకుండానే డోర్‌లాక్ పేరుతో మినిమం బిల్లు జారీ చేశారు. ఆగస్టులో 5 యూనిట్లకు బిల్లు ఇచ్చారు. సెప్టెంబర్‌లో ఇవ్వలేదు. అక్టోబర్‌లో మాత్రం ఏకంగా రూ.3,667 బిల్లు జారీ చేశారు. సదరు వినియోగదారుడు బాచుపల్లి ఏఈని ఫోన్‌లో సంప్రదించేందుకు యత్నించగా ఆయన స్పందించకపోవడంతో బాధితుడు కార్పొరేట్ కార్యాలయంలోని ఉన్నతాధికారులను ఆశ్రయించాల్సి వచ్చింది.
హబ్సిగూడ సర్కిల్ కీసర డివిజన్ నారపల్లి సెక్షన్ పరిధిలోని ఓ వినియోగదారుడి ఇంట్లోని విద్యుత్ మీటర్‌కు ఒక నెలలో బిల్ కన్‌జమ్షన్, మరో నెలలో మీటర్ స్టకప్ అని నమోదు చేశారు. ఫలితంగా ఆయన ఇంటి నెలవారీ బిల్లు రూ.2 వేలు దాటింది. ఒక వైపు కరెంట్ వినియోగం జరగలేదంటూనే..మరో వైపు మినిమం బిల్లు పేరుతో అధిక బిల్లు జారీ చేశారు. కనీసం బిల్ స్టేటస్‌ను కూడా పట్టించుకోలేదు. వినియోగదారుడు ఈ లోపాన్ని గుర్తించి సంబంధిత సెక్షన్ అధికారులకు ఫిర్యాదు చేసినా కనీస స్పందన కూడా లేదు.
ఆజామాబాద్ డివిజన్‌లోని రామాలయం సెక్షన్ పరిధిలో ఓ వినియోగదారుడి ఇంట్లో కరెంట్ మీటర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. గత నాలుగు నెలలుగా స్టకప్‌లోనే ఉంది. రీడింగ్ నమోదు కావడంలేదు. వెంటనే ఆ మీటర్ స్థానంలో కొత్తది ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆపరేషన్స్ విభాగం డీఈ, ఏడీఈ, ఏఈలు ప్రతినెలా బిల్‌స్టేటస్‌పై రివ్వూ్యలు నిర్వహించాల్సి ఉంది. కానీ ఇక్కడి అధికారులు అవేవీ పట్టించుకోకపోవడం, క్షేత్రస్థాయి లైన్‌మెన్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో సదరు వినియోగదారుడు నెలకు రూ.1,500కు పైగా బిల్లు చెల్లించాల్సి వస్తోంది.
..ఇలా మేడ్చల్, హబ్సిగూడ సర్కిళ్ల పరిధిలోనే కాదు శివారులోని సరూర్‌నగర్, సైబర్‌సిటీ, రాజేంద్రనగర్ సర్కిళ్లలోనూ ఇదే తంతు కొనసాగుతోంది. ఆపరేషన్ విభాగంలోని ఇంజినీర్ల నిర్లక్ష్యంతో వినియోగదారులు నష్టపోతున్నారు.
నెలకు రాబడి రూ.1,800 కోట్లు
గ్రేటర్ పరిధిలో 60 లక్షలకుపైగా విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో 52 లక్షల మంది గృహ విద్యుత్ వినియోగదారులు, మరో 8లక్షల మంది వాణిజ్య వినియోగదారులు ఉన్నా రు. పారిశ్రామిక, ఇతర కనెక్షన్లు మరో 2 లక్షల వరకు ఉన్నట్లు సమాచారం. వీరి ద్వారా సంస్థకు ప్రతి నెలా రూ.1,600 కోట్ల నుంచి రూ.1,800 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతోంది.
వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు డిస్కం.. అన్ని డివిజన్ల పరిధిలోనూ రెండు బృందాలను ఏర్పాటు చేసింది. విపత్తుల నిర్వహణ, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, సాంకేతిక సమస్యల పునరుద్ధరణ కోసం సెంట్రల్ బ్రేక్ డౌన్ (సీబీడీ) గ్యాంగ్‌ను ఏర్పాటు చేసింది. అదేవిధంగా కొత్త కనెక్షన్ల జారీ, లైన్లకు అంచనాలు రూపొందించడం, మీటర్ రీడింగ్, రెవెన్యూ వసూళ్ల కోసం ఆపరేషన్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో సీబీడీ గ్యాంగ్‌లు చురుగ్గా పని చేస్తున్నాయి.
ఆపరేషన్ విభాగం పనితీరు అధ్వానం
భారీ వర్షాలు, వరదలు, ఈదురు గాలులతో చోటు చేసుకున్న నష్టాలను గంటల వ్యవధిలోనే సీబీడీ గ్యాంగ్‌లు పునరుద్ధరిస్తున్నాయి. కానీ ఆపరేషన్ విభాగంలోని డీఈలు, ఏడీఈలు, ఏఈలు, లైన్‌మెన్లు మాత్రం ఆఫీసు దాటి బయటికి రావడం లేదు. ముఖ్యమైన మీటర్ రీడింగ్‌కు ఒక నెలలో రెగ్యులర్ లైన్‌మెన్లు, ఏఈలు, ఏడీఈలు వెళ్లాల్సి ఉంది. మరో నెలలో కాంట్రాక్టు కార్మికులతో రీడింగ్ నమోదు చేయాల్సి ఉంది. కానీ ప్రతి నెలా కాంట్రాక్ట్ మీటర్ రీడర్లు మినహా ఆపరేషన్ విభాగంలోని జేఎల్‌ఎంలు, ఏఈలు, ఏడీఈలు మాత్రం రీడింగ్‌కు వెళ్లడంలేదు.
చదవండి: ఎంఎంటీఎస్ రైళ్లపై ఎందుకీ నిర్లక్ష్యం?
లైన్ల నిర్వహణ, విద్యుత్ చౌర్యం, రెవెన్యూ వసూళ్లపైనే కాదు.. కనీసం మీటర్ స్టేటస్‌పై రివ్వు్యలు కూడా నిర్వహించడం లేదు. డిస్కంలో కీలకమైన సైబర్ సిటీ, సరూర్‌నగర్, రాజేంద్రనగర్, మేడ్చల్ సర్కిళ్ల పరిధిలోని ఆపరేషన్ విభాగంలోని ఇంజినీర్ల అలసత్వం కారణంగా ఆయా ప్రాంతాల్లోని వినియోగదారులు నష్టపోతున్నారు. చేతికందుతున్న బిల్లులను చూసి.. లబోదిబోమంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment