స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ. 2 లక్షలు డిమాండ్
రూ. 50 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు
మేడ్చల్‌రూరల్: స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ. 2 లక్షలు డిమాండ్ చేసిన ఏఎస్‌ఐని ఏసీబీ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. ఏసీబీ డీఏస్పీ శ్రీధర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్‌కు చెందిన శర్మ మేడ్చల్ మండలం, గౌడవెళ్లి గ్రామ పరిధిలోని సాకేత్ ప్రణమ్‌లో విల్లా కొనుగోలు చేశాడు. అందులో ఇంటీరియర్ పనుల కోసం సరూర్‌నగర్‌కు చెందిన విశ్వనాథ్‌తో రూ.8 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్‌గా రూ.4 లక్షలు చెల్లించాడు. సగం పనులు పూర్తి చేసిన విశ్వనాథ్ మిగిలిన డబ్బులు ఇవ్వాలని కోరగా, అందుకు శర్మ నిరాకరించడంతో విశ్వనాథ్ పనులు నిలిపివేశాడు.
ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో శర్మ రెండు నెలల క్రితం మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో విశ్వనాథ్‌పై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నార్సింగిలో అతడిని అదుపులోకి తీసుకుని మేడ్చల్ పీఎస్‌కు తీసుకువచ్చారు. కేసు దర్యాప్తు చేస్తున్న ఏఎస్‌ఐ మధుసూదన్ స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు, ఇరువర్గాల మధ్య సయోద్య కుదిర్చేందుకు విశ్వనాథ్‌ను రూ.2 లక్షలు డిమాండ్ చేశాడు. అందులో భాగంగా మొదట రూ.10 వేలు తీసుకున్నాడు. మిగతా మొత్తాన్ని విడతల వారీగా ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 5న రూ.50 వేలు తీసుకురావాలని ఏఎస్‌ఐ ఫోన్ చేయడంతో విశ్వనాథ్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు.
వారి సూచన మేరకు సోమవారం స్టేషన్‌కు వచ్చి డబ్బులు ఇస్తానని ఏఎస్‌ఐకి చెప్పాడు. పథకం ప్రకారం మాటు వేసిన ఏసీబీ అధికారులు సోమవారం విశ్వనాథ్ ఏఎస్‌ఐ మధుసూదన్‌రావుకు స్టేషన్ ఆవరణ వెనుక నగదు అందజేస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడి నుంచి రూ.50 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన అధికారులు ఏఎస్‌ఐని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఈ విషయంలో ఇతర అధికారుల ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment