
పవర్ షాక్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: విద్యుత్ వినియోగదారులకు త్వరలో చార్జీల షాక్ కొట్టనుంది. చార్జీలను పెంచుతూ విద్యుత్ పంపిణీ సంస్థలు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి. త్వరలో ఈ చార్జీల పెంపునకు సర్కారు సైతం అధికారికంగా ఆమోదముద్ర వేయనుంది. దీంతో జిల్లాలోని వినియోగదారులపై రూ.185.07కోట్ల భారం పడనుంది. చార్జీల పెంపు ప్రక్రియను పలు శ్లాబులుగా విభజించి పంపిణీ సంస్థలు వాత పెట్టనున్నాయి. అయితే 100 యూనిట్లు వాడే వినియోగదారులకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. మిగతా అన్ని కేటగిరీలపైనా చార్జీల భారం పడనుంది.
పెంచిన చార్జీలు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతంలో 21,52,737 విద్యుత్ కనెక్షన్లున్నాయి. ఇందుకు ప్రతిరోజు 23.5 మిలియన్ యూనిట్ల విద్యుత్తును సరఫరా చేస్తున్నట్లు ట్రాన్స్‌కో అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఇందు లో గృహావసరాలకు 6.11 మిలియన్ యూనిట్లు, పరిశ్రమలకు 5.17 మిలియన్ యూనిట్లు, వ్యవసాయానికి 7.05 మిలియన్ యూనిట్లు, ఇతర అవసరాలకు 5.17 యూనిట్లు సరఫరా చేస్తున్నారు. విద్యుత్ పంపిణీ ద్వారా జిల్లా నుంచి పంపిణీ సంస్థకు వార్షికాదాయం రూ.3,214.36 కోట్లు సమకూరుతుంది. తాజాగా చార్జీలను పెంచనుండడంతో జిల్లా నుంచి అదనంగా రూ.185.07 కోట్ల ఆదాయం డిస్కంలకు పెరగనుంది. ఈ లెక్కన పంపిణీ సంస్థ జిల్లా నుంచి ఆరు శాతం ఆదాయం అధికం కానుంది.
విభజించి.. వడ్డించి..
తాజాగా విద్యుత్ చార్జీల పెంపులో వంద యూనిట్లలోపు వాడే వినియోగదారులకు చార్జీలో పెంపు లేదు. కానీ అంతకు ఒక్క యూనిట్ ఎక్కువ వాడినా చార్జీలు పెరగనున్నాయి. పంపిణీ సంస్థలు ప్రతిపాదించిన గణాంకాల ప్రకారం.. నెలకు 150 యూనిట్లు వాడే వినియోగదారుడికి ప్రస్తుతం రూ.440 బిల్లు వస్తుంది. తాజా పెంపుతో ఈ బిల్లు రూ.457.50కు పెరగనుంది. 200 యూనిట్లు వినియోగిస్తున్న వారికి ప్రస్తుత బిల్లు రూ.620 వస్తుండగా.. పెంపు ప్రక్రియతో ఈ బిల్లు రూ.645కు చేరనుంది. నెలకు 200 యూనిట్లు దాటితే నెలబిల్లులో రూ.50, అదేవిధంగా 250 యూనిట్లు దాటితే నెల వారీ బిల్లులో రూ.70 పెరుగుతుంది. ఇలా కేటగిరీల వారీగా విభజించి వినియోగదారులకు వాతలు పెట్టింది.