బాబు గత హయాంలో అనవసర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు
అప్పుడు అప్పుల పాలై నేటికీ వడ్డీలకు కొత్త అప్పులు చేస్తున్న విద్యుత్ సంస్థలు
ప్రజలపైనా చార్జీల భారం..వ్యవసాయానికి క్రాప్ హాలిడే బాబు పుణ్యమే
పరిశ్రమలకు వారంలో రెండు రోజులు పవర్ హాలిడే
జగన్ హయాంలో ప్రజలకు నిరంతర విద్యుత్..అభివృద్ధి బాటలో విద్యుత్ సంస్థలు
రైతులకు పగలే 9 గంటలు కరెంటు ఇచ్చిన జగన్ ప్రభుత్వం
జగన్ హయాంలో 34,181 మిలియన్ యూనిట్లకు పెరిగిన ఉత్పత్తి సామర్థ్యం
ఫలితంగా విద్యుత్ పంపిణీ సంస్థలకు తగ్గిన విద్యుత్ కొనుగోలు ఖర్చు
సాక్షి, అమరావతి: 2014– 2019 పాలనలో చంద్రబాబు చేసిన పాపాలు రాష్ట్ర ప్రజలకు, విద్యుత్ సంస్థలకు శాపాలుగా మారి నేటికీ వెంటాడుతున్నాయి. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ రంగానికి చేసిన అనవసర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కారణంగా విద్యుత్ సంస్థలు నేటికీ తేరుకోలేకపోతున్నాయి. విద్యుత్ కొనుగోలు ఖర్చులతో పాటు, పాత అప్పులకు వడ్డీలు కట్టేందుకు కొత్త అప్పులు చేయాల్సి వస్తోంది. ఆ భారం అంతిమంగా విద్యుత్ వినియోగదారులపైనే పడుతోంది.
ఈ విషయాన్ని గుర్తించిన (2019–2024) నాటి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విద్యుత్ సంస్థలను బలోపేతం చేసేందుకు అనేక చర్యలు చేపట్టింది. విద్యుత్ సంస్థలకు ఆర్థికంగా చేయూతనిచ్చింది. ప్రజలపై చార్జీల భారం పడకూడదని భావించి, ఉత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరిచింది. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరాతోపాటు, వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందుబాటులో ఉంచడంపై ప్రధానంగా దృష్టి సారించింది. అనుకున్నట్లుగానే ఐదేళ్లలో గత ప్రభుత్వం విద్యుత్ రంగంలో విప్లవాత్మక వృద్ధిని సాధించింది.
పెట్టుబడుల సాధనతో పాటు, డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ను అందించి, దేశంలోనే ఆదర్శంగా నిలిచి రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డులను సైతం అందుకుంది. కానీ 2024లో మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రాగానే విద్యుత్ చార్జీల పిడుగు ప్రజల నెత్తిన పడింది. పాలన చేపట్టిన వంద రోజులకే సర్ధుబాటు పేరుతో దాదాపు రూ.17 వేల కోట్లకు పైగానే ప్రజలపై భారం వేసింది.
జగన్‌కు.. చంద్రబాబుకు చాలా తేడా
2018–19తో పోల్చితే 2023–24 నాటికి విద్యుత్ రంగంలో వృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీ జెన్‌కో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం చంద్రబాబు దిగిపోయే నాటికి 7,213 మెగావాట్ల ఉంటే అది జగన్ హయాంలో 8,789 మెగావాట్లకు పెరిగింది. ఇందులో కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్‌డీఎస్‌టీపీఎస్)లోని 800 మెగావాట్ల యూనిట్, నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లోని 800 మెగావాట్ల యూనిట్ ఉన్నాయి.
చంద్రబాబు హయాంలో మొత్తం విద్యుత్ ఉత్పత్తి 2018–19లో 27,197 మిలియన్ యూనిట్లు ఉంటే జగన్ హయాంలో 2023– 24లో 34,181 మిలియన్ యూనిట్లుగా ఉంది. అంటే 6,984 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి పెరిగింది. అలాగే ఏపీ జెన్‌కో లాభాలు 2018–19లో రూ.2,044 కోట్లు ఉంటే, 2023–24లో రూ.2,469 కోట్లుగా ఉంది. అదే ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీపీడీసీఎల్)వి అయితే చంద్రబాబు సమయంలో కేవలం రూ.1,565 కోట్లు ఉంటే, జగన్ హయాంలో రూ.6,240 కోట్లకు చేరాయి.
నిలువునా ముంచేసిందే చంద్రబాబు..
రాష్ట్రంలో 2015–19 మధ్య 30,742 మిలియన్ యూనిట్లు మిగులు విద్యుత్ రాష్ట్రంలో ఉండేది. ఈ మొత్తం మిగులు విద్యుత్‌ను చంద్రబాబు బ్యాక్‌డౌన్ (వృథా) చేయించారు. అవసరం లేకపోయినా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)లను అధిక ధరలకు కుదుర్చుకున్నారు. నిజానికి రెన్యూవబుల్ పవర్ పర్చేస్ ఆబ్లిగేషన్ (ఆర్‌పీపీఓ) నిబంధనల ప్రకారం.. మొత్తం విద్యుత్‌లో పునరుత్పాదక విద్యుత్‌ను 5 నుంచి 11 శాతం తీసుకోవాలి.
కానీ.. చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా 23 శాతం పునరుత్పాదక విద్యుత్‌ను అత్యధిక ధరలకు కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు చేసుకుంది. యూనిట్ రూ 2.40కు లభిస్తున్న బొగ్గు ఆధారిత విద్యుత్‌ను వృథాచేసి, రూ.5కు బయట కొనుగోలు చేసింది. అదే సమయంలో పవన విద్యుత్‌ను యూనిట్‌కు ఏకంగా రూ.4.84కు తీసుకుంది. అప్పట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.3.54కు బదులు రూ.8.90 వెచ్చించారు. వీటికి ఫిక్స్‌డ్ చార్జీలు అదనం.
ఇలా దాదాపు 8 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల విద్యుత్ సంస్థలపై 25 ఏళ్లపాటు ఏటా అదనంగా రూ.3,500 కోట్ల భారం పడుతోంది. ఈ భారాలను పూడ్చుకోవడానికి డిస్కంలు ప్రజలపై విద్యుత్ చార్జీలు వేస్తున్నాయి. చంద్రబాబు గత హయాంలో ఏపీఈఆర్సీకి సమర్పించకుండా దాదాపు రూ.20 వేల కోట్ల ట్రూ అప్ భారాన్ని మిగిల్చారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే మళ్లీ ఇంధన సర్దుబాటు చార్జీలు వేసి ప్రజలకిచ్చిన మాట తప్పుతున్నారు.
బాబు పాలనలో చీకట్లు.. జగన్ హయాంలో వెలుగులు..
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 61,347 మిలియన్ యూనిట్లు ఇవ్వడానికే ఆపసోపాలు పడి పరిశ్రమలకు వారంలో రెండు రోజులు పవర్ హాలిడేలు విధించేవారు. విద్యుత్ కోతల వల్ల రైతులు క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన పరిస్థితులు కల్పించారు. వ్యవసాయానికి రోజులో నాలుగైదు గంటలే ఇచ్చేవారు. అది కూడా రాత్రి సమయంలో ఇవ్వడం వల్ల రైతులు ప్రాణాలు పోగొట్టుకునేవారు.
విద్యుత్ కోసం పొలాల్లో పడిగాపులు కాస్తూ రైతులు ప్రాణాలు పోగొట్టుకున్న ఈ చీకటి రోజుల నుంచి విముక్తి కలిగించాలని.. రానున్న 30 ఏళ్లలో అన్నదాతలకు విద్యుత్ కష్టాలు లేకుండా చేయాలని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) నుంచి 7 వేల మెగావాట్లు తీసుకుని వ్యవసాయ రంగానికి అందించాలని నాటి సీఎం వైఎస్ జగన్ సంకల్పించారు. సరాసరి విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్‌కు రూ.5.10 ఉంటే, సెకీ నుంచి యూనిట్ రూ.2.49కే వచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. దీంతో దాదాపు రూ.3,750 కోట్లు రాష్ట్రానికి ఆదా అవుతుంది.
దే విధంగా జగన్ హయాంలో 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే అర్హులైన ఎస్సీ,ఎస్టీ కుటుంబాలకు గత ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను అందజేసింది. అలాగే వెనుకబడిన వర్గాల కుటుంబాలు, ధోబీఘాట్‌లు, హెయిర్ కటింగ్ సెలూన్‌లు, చేనేత కార్మికులు, లాండ్రీలు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వృత్తిపరమైన స్వర్ణకార దుకాణాలకు ఉచిత, సబ్సిడీతో విద్యుత్‌ను సరఫరా చేసింది. చంద్రబాబు రాకతో వీటన్నింటికీ మంగళం పాడడంతో మళ్లీ ఏపీలో ఆనాటి చీకటి రోజులు మొదలవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment