సాక్షి, హైదరాబాద్: వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చేసే మొత్తం వ్యయ్యాన్ని విద్యుత్ బిల్లుల రూపంలో రాబట్టుకోవాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. మొత్తం వ్యయాన్ని రాబట్టుకునే క్రమంలో వినియోగదారుల విద్యుత్ చార్జీలను ఎప్పటికప్పుడు పెంచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ నెల 10న విద్యుత్ (సవరణ) నిబంధనలు–2024ను ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తదుపరి ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన ఆదాయానికి సంబంధించిన అంచనాలను సంబంధిత రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి ప్రతి ఏటా నవంబర్‌లోగా డిస్కంలు సమర్పించాల్సి ఉంటుంది.
దాన్ని పరిశీలించిన తర్వాత ఆదాయ అవసరాల మొత్తాన్ని ఈఆర్సీ ఆమోదిస్తుంది. ఈ మేరకు ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సిన విద్యుత్ చార్జీలను సైతం ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే ఈఆర్సీ ప్రకటించాల్సి ఉంటుంది. ఇకపై ఈఆర్సీ ఆమోదించే ఆదాయ అవసరాల మొత్తం, ప్రకటించిన టారిఫ్‌తో వచ్చే ఆదాయ అంచనాల మొత్తం మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండరాదని గజిట్‌లో కేంద్రం స్పష్టం చేసింది. ఒకవేళ వ్యత్యాసం ఉన్నా, 3 శాతానికి మించరాదని ఆదేశించింది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో మాత్రమే ఈ విషయంలో మినహాయింపు ఉంటుందని తెలిపింది.
లేట్ పేమెంట్ సర్‌చార్జీతో..
విద్యుదుత్పత్తి కంపెనీలకు గడువులోగా బిల్లులు చెల్లించనందుకు డిస్కంలపై విధించే లేట్ పేమెంట్ సర్‌చార్జీతో ఈ ఆదాయ వ్యత్యాసాన్ని కలిపి రానున్న మూడేళ్లలో మూడు సమ వాయిదాల్లో వసూలు చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ గజిట్ అమల్లోకి రాకముందు నాటి ఆదాయ వ్యత్యాసాలను, లేట్‌పేమెంట్ సర్‌చార్జీలను మాత్రం వచ్చే ఏడేళ్లలో ఏడు సమ వాయిదాల్లో వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవాలని చెప్పింది.
సొంత ట్రాన్స్‌మిషన్ లైన్లకు లైసెన్స్ అక్కర్లేదు
ఏదైనా విద్యుదుత్పత్తి కంపెనీ/కాప్టివ్ విద్యుత్ ప్లాంట్/ఎనర్జీ స్టోరేజీ సిస్టం అవసరాల కోసం ప్రత్యేక ట్రాన్స్‌మిషన్ లైన్లను ఏర్పాటు చేసుకోవడం, నిర్వహించడం, గ్రిడ్‌కు అనుసంధానం చేయడం కోసం ఇకపై ప్రత్యేకంగా లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే, వాటి సామర్థ్యం అంతర్రాష్ట్ర ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ పరిధిలో 25 మెగావాట్లు, రాష్ట్ర అంతర్గత ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ పరిధిలో 15 మెగావాట్లలోబడి ఉండాలి. ఇందుకు సాంకేతిక ప్రమాణాలు, మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది.
అదనపు సర్‌చార్జీ బాదుడు వద్దు
దీర్ఘకాలిక ఓపెన్ యాక్సెస్ వినియోగదారులపై విధించే అదనపు సర్‌చార్జీలతో పోలిస్తే స్వల్ప కాలిక ఓపెన్ యాక్సెస్ వినియోగదారులపై విధించే అదనపు సర్‌చార్జి 110 శాతానికి మించి ఉండరాదు. అన్ని రకాల ఓపెన్ యాక్సెస్ వినియోగదారులపై విధించే అదనపు సర్‌చార్జీలు.. డిస్కంలు కొనుగోలు చేసే విద్యుత్‌కు సంబంధించిన ఫిక్స్‌డ్ ధరలకు మించకుండా ఉండాలి.
కరెంట్ బిల్లులు పెంచాల్సిందే!
Published Fri, Jan 12 2024 4:48 AM | Last Updated on Fri, Jan 12 2024 12:58 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment