రైతులందరికీ విద్యుత్‌ కనెక్షన్లు | CM KCR orders to employees over electricity connections to farmers | Sakshi
Sakshi News home page

రైతులందరికీ విద్యుత్‌ కనెక్షన్లు

Published Wed, Oct 26 2016 2:08 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

రైతులందరికీ విద్యుత్‌ కనెక్షన్లు - Sakshi

రైతులందరికీ విద్యుత్‌ కనెక్షన్లు

ఏడు నెలల్లో అందజేయాలని అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం
97 వేల పెండింగ్‌ దరఖాస్తులకు త్వరలో మోక్షం
పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతోనే కనెక్షన్లు
రైతులు విద్యుత్‌ కార్యాలయాల చుట్టూ తిరగొద్దు
కనెక్షన్‌ ఎప్పుడిస్తారనే దానిపై రైతులకే లేఖలు
మంజూరులో అవినీతి, అక్రమాలను సహించబోం
రూపాయి లంచం తీసుకున్నా ఊరుకోబోమని హెచ్చరిక
విద్యుత్, కొత్త జిల్లాల పరిస్థితిపై ముఖ్యమంత్రి సమీక్ష
జిల్లాల్లో యూనిట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలివ్వాలని సూచన


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. వచ్చే ఏడు నెలల్లోగా, పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతోనే కనెక్షన్లు ఇవ్వాలని విద్యుత్‌ అధికారులకు సూచించారు. దాదాపు ఐదేళ్లుగా రైతులు వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్నారని సీఎం పేర్కొన్నారు. ఆ ఎదురుచూపులకు స్వస్తి పలికేందుకు.. కనెక్షన్ల మంజూరులో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మంగళవారం  క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ విద్యుత్‌ అంశంపై కేసీఆర్‌ సమీక్ష జరిపారు. జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ గోపాల్‌రావు తదితరులు  ఇందులో పాల్గొన్నారు.

వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల కోసం రాష్ట్రంలో 97 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, ఐదేళ్ల నుంచి అవి పేరుకుపోతున్నాయని అధికారులు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు నివేదించారు. అందరికీ కనెక్షన్లు ఇవ్వాలంటే దాదాపు రూ.600 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం... డిమాండ్‌కు అనుగుణంగా కనెక్షన్లు ఇవ్వకపోవడంతో ఎవరు డబ్బులిస్తే వారికే కనెక్షన్లు ఇచ్చే దందా నడుస్తోందని మండిపడ్డారు. దీనిని సహించబోమని హెచ్చరించారు. ఒక్క రూపాయీ లంచం లేకుండా, రైతులు విద్యుత్‌ కార్యాలయాల చుట్టూ తిరక్కుండా, ప్రజాప్రతినిధుల సిఫారసులేవీ లేకుండానే వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు అందితే ఈ అక్రమాలకు తెరపడుతుందన్నారు. పెండింగ్‌లో ఉన్న 97 వేల దరఖాస్తులతో పాటు రాబోయే నెలల్లో వచ్చే అవకాశమున్న మరో 20–30 వేల దరఖాస్తులను కూడా కలుపుకొని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఏడు నెలల వ్యవధిలో ఈ పనులన్నీ పూర్తి చేయాలని సూచించారు.

కొత్త కనెక్షన్లకు షెడ్యూల్‌.. రైతుకు లేఖలు
ఎవరికి ఎప్పుడు కనెక్షన్‌ వస్తుందో తెలియని అనిశ్చితిని తొలగించే చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం కేసీఆర్‌ సూచించారు. మండలాల వారీగా కనెక్షన్లు ఎప్పుడు ఇస్తారో షెడ్యూల్‌ రూపొందించాలని, ఆ వివరాలను గ్రామ పంచాయతీ నోటీసు బోర్డులపై పెట్టాలని చెప్పారు. అంతేగాకుండా నిర్ణీత సమాచారంతో రైతులకు లేఖలు రాయాలని సూచించారు. షెడ్యూల్‌ రూపొందించిన తర్వాత కనెక్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలన్నారు.

విద్యుత్‌కు ఢోకా లేదు
రాష్ట్రంలో రైతులతో సహా ఏ వర్గం కూడా కరెంటు కోసం ఇబ్బందులు పడవద్దని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ఎండాకాలంలో కూడా కరెంటు కోత లేకుండా ఇప్పట్నుంచే ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. రబీలో రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌ అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పది వేల మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉన్నా తట్టుకునేలా రూ.2,450 కోట్లతో కొత్త సబ్‌స్టేçÙన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్యవసాయ డిమాండ్‌కు తగినట్లుగా విద్యుత్‌ సరఫరా ఉండాలని ఆదేశించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే బోర్ల వినియోగం తగ్గుతుందని.. ప్రాజెక్టుల లిఫ్ట్‌లకు విద్యుత్‌ అవసరం పెరుగుతుందని సీఎం పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. చెడిపోయిన ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో వెంటనే మరో ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణలో 5.46 లక్షల వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయని.. దానికి 4 శాతం అదనంగా రోలింగ్‌ స్టాక్‌ పెడుతున్నామని వెల్లడించారు. ఎక్కడ సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని సూచించారు.

కొత్త జిల్లాల్లో కార్యాలయాలపై ప్రణాళిక
కొత్త జిల్లాల్లో తప్పనిసరిగా ఏయే ప్రభుత్వ కార్యాలయాలుండాలి, ఏయే యూనిట్లను నెలకొల్పాలనేది నిర్ణయించి.. ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. దాంతోపాటు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు సంబంధించి ఏమేం ఉండాలో ప్రణాళిక రూపొందించాలని సూచించారు. కొత్త జిల్లాల్లో పరిస్థితిపై మంగళవారం కేసీఆర్‌ సమీక్షించారు. ప్రతి జిల్లాలో నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రం ఉండాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కేంద్రం నుంచి జిల్లా యూనిట్‌గా ఏమేం సాధించుకోవచ్చో ప్రత్యేకంగా ప్రతిపాదనలు తయారు చేయాలని, సంబంధిత వివరాలతో కేంద్రానికి నివేదిక పంపించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా యూనిట్‌గా అమలు చేసే పథకాలను గుర్తించాలన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ పూర్తయినందున అధికారులు పూర్తిస్థాయిలో పరిపాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల, లక్ష్మారెడ్డి, మండలి విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీలు కేశవరావు, జితేందర్‌రెడ్డి, మల్లారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద, రాజేందర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement