- మంత్రి డి.కె.శివకుమార్
- పహణిలో మార్పులు చేసే అధికారం తహశీల్దార్లకు : సీఎం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ అక్రమ కనెక్షన్లను క్రమబద్ధీకరించడానికి త్వరలోనే సర్క్యులర్‌ను జారీ చేయనున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివ కుమార్ తెలిపారు. శాసన సభలో సోమవారం జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ రాష్ర్టంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న విద్యుత్‌ను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయానికి దశలవారీ ఏడు గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని చెప్పారు.
కాగా రైతుల భూములకు సంబంధించి పహణిలో మార్పులు చేసే అధికారాన్ని తహసిల్దార్లకు అప్పగిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ వెంటనే ఈ అధికారాన్ని తహసిల్దార్లకు దఖలు పడేలా ఆదేశాలను జారీ చేస్తామన్నారు.
అంతకు ముందు జేడీఎస్ సభ్యుడు బాలకృష్ణ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, పహణిలో మార్పులు, చేర్పుల అధికారం ప్రస్తుతం సహాయ కమిషనర్లకు మాత్రమే ఉన్నందున, రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గతంలో మాదిరి తహసిల్దార్లే ఈ మార్పులు చేసి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.