=విద్యుత్ శాఖలో 13 వేల పోస్టుల భర్తీ
=కేఈఆర్‌సీ గ్రీన్ సిగ్నల్
=వీలైనంత త్వరగా నియామకాలు
=విద్యుత్ చౌర్యం అరికట్టడంపై దృష్టి
=20 రోజులు క్షేత్ర స్థాయిలో, పది రోజులు ఆఫీసులో ‘విజిలెన్స్’
=‘చౌర్యం’పై సమాచారమిచ్చే కాంట్రాక్టర్ల పేర్లు గోప్యం
=లైన్‌మెన్ నియామకంలో విద్యార్హత సడలింపు
=తాలూకాల్లో ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు కేంద్రాలు
=విద్యుత్ శాఖ మంత్రి డీకే శివకుమార్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోని విద్యుత్ శాఖలో ప్రస్తుతం 26 వేల పోస్టులు ఖాళీగా ఉండగా, వాటిలో 50 శాతాన్ని భర్తీ చేయడానికి కర్ణాటక విద్యుత్ నియంత్రణ సంఘం (కేఈఆర్‌సీ) అనుమతినిచ్చిందని ఆ శాఖ మంత్రి డీకే. శివకుమార్ తెలిపారు. కర్ణాటక లెసైన్స్‌డ్ కాంట్రాక్టర్ల సంఘం తీసుకొచ్చిన 2014 సంవత్సర సాంకేతిక డైరీని శుక్రవారం ఆయనిక్కడ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియామకాల ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభమవుతుందని చెప్పారు.
విద్యుత్ చౌర్యాన్ని అరికట్టడానికి అవసరమైన చర్యలను చేపట్టామని తెలిపారు. విజిలెన్స్ అధికారులు నెలలో 20 రోజులు క్షేత్ర స్థాయిలో, పది రోజులు ఆఫీసులో ఉండాలని సూచించామని వివరించారు. విద్యుత్ చౌర్యంపై ఎక్కువ సమాచారం కాంట్రాక్టర్ల వద్దే ఉంటుందని, కనుక తక్షణమే ఈ సమాచారాన్ని అధికారులకు చేరవేయాలని కోరారు. అలాంటి కాంట్రాక్టర్ల పేర్లను రహస్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలను స్థాపించే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమలు వృద్ధి చెందితే ఉపాధికి అవకాశం కలుగుతుందన్నారు. దరిమిలా రాష్ట్రం ఆదాయం పెరిగి గ్రామీణాభివృద్ధికి కూడా అవకాశం కలుగుతుందని తెలిపారు.
లైన్‌మెన్‌కు విద్యార్హత సడలింపు
రాష్ర్టంలో లైన్‌మెన్ నియామకానికి ఉన్న విద్యార్హతను సడలిస్తామని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం విధిగా ఐటీఐ ఉండాలనే నిబంధన ఉందని, దానిని ‘ఎనిమిది లేదా పదో తరగతి ఫెయిల్’ అని సడలిస్తామని చెప్పారు. ఐటీఐ అర్హతతో లైన్‌మెన్‌గా చేరిన వారిలో ఎక్కువ మంది కరెంటు స్తంభాలు ఎక్కడం లేదనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. దీని కోసం వేరే వారిని వినియోగించుకుంటున్నారని చెప్పారు. కనుక ఉత్తమ ఆరోగ్యంతో పాటు దేహ దారుఢ్యం కలిగిన ఎనిమిదో తరగతి ఫెయిలైన అభ్యర్థులను లైన్‌మెన్‌గా నియమించాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు.
తాలూకాల్లో ట్రాన్స్‌ఫార్మర్ రిపేరు కేంద్రాలు
రాష్ట్రంలోని ప్రతి తాలూకాలోను ట్రాన్స్‌ఫార్మర్ రిపేరు కేంద్రాలను ప్రారంభించాలని అధికారులకు సూచించినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం ట్రాన్స్‌ఫార్మర్ల రిపేర్లలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. కొత్త కేంద్రాల ఏర్పాటుపై వారంలోగా సమాచారం ఇవ్వాలని అధికారులకు సూచించామని చెప్పారు.
కరెంట్ కొలువులు
Published Sat, Feb 8 2014 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM
Advertisement
Advertisement