ఈ చిత్రంలో కనిపిస్తున్న వివాహిత పేరు.. జర్రిపోతుల పార్వతి. పెళ్లయిన పన్నెండేళ్ల నుంచి గున్నవానిపాలెం అగ్రహారంలో చిన్న ఇంటిలో ఉంటూ అవస్థలు పడుతోంది. సొంత ఇంటి కోసం గతంలో ఎంతో మంది నేతలకు, అధికారులకు విన్నవించినా ఫలితం శూన్యం. ఎట్టకేలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం అందడంతో సొంతింటి కలను నెరవేర్చుకుంది.
విద్యుత్ శాఖ.. స్తంభాలు వేసి, వైర్లు లాగి ఆ ఇంటికి కనెక్షన్, మీటర్, బల్బులు ఉచితంగా అందించింది. ఎక్కడా ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వనవసరం లేకుండా పార్వతి సొంతింటిలో విద్యుత్ వెలుగులు ప్రసరించాయి. అమ్మఒడి సాయంతో పాటు తన పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్యను ఈ ప్రభుత్వం అందిస్తోందని పార్వతి సంతోషంతో చెబుతోంది.
అనకాపల్లి జిల్లా లంకెలపాలెం విద్యుత్ సెక్షన్‌లోని మారేడుపూడి కాలనీ
(బోణం గణేష్, అనకాపల్లి జిల్లా మారేడుపూడి కాలనీ నుంచి సాక్షి ప్రతినిధి)
.. ఇలా ఒక్క పార్వతే కాదు.. ఎంతోమంది మహిళలు తమ కుటుంబంతో కలిసి జగనన్న ఇళ్లల్లో విద్యుత్ వెలుగుల మధ్య సంతోషంగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా అనకాపల్లి జిల్లా మారేడుపూడి కాలనీలో పర్యటించిన ‘సాక్షి’తో లబ్ధిదారులు తమ ఆనందాన్ని పంచుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీల్లో ఇళ్లకు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యుత్ సౌకర్యాలను కల్పిస్తూ పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నారని, అందుకు తామే నిదర్శనమని చెబుతున్నారు.
పచ్చని ప్రకృతి నడుమ, ఎతైన కొండల మధ్య ఉన్న మారేడుపూడి కాలనీలో 67 విద్యుత్ సర్విసులను అక్కడ కొత్తగా నిర్మించిన ఇళ్లకు అందించారు. ఇందుకోసం కాలనీ మొత్తం విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. స్తంభం నుంచి ఇంటి వరకు సర్విసు వైరును సమకూర్చారు. మీటర్‌తో సహా అన్ని పరికరాలు, సర్విసును ఉచితంగా ఇచ్చారు. ఆ విద్యుత్ సదుపాయంతో అక్కడి ప్రజలు తమ కొత్త ఇంటిలో రంగురంగుల ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేసుకుని మురిసిపోతున్నారు. తమకు ఈ భాగ్యం కల్పించిన సీఎం వైఎస్ జగన్‌కు చెమర్చిన కళ్లతో కృతజ్ఞతలు చెబుతున్నారు.
ఖర్చుకు వెనుకాడకుండా..
నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద తొలి దశలో పేదలకు ప్రభుత్వం నిరి్మస్తున్న లేఔట్లలో ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కంలు)ల ద్వారా ముందుగా 14,49,133 సర్విసులకు విద్యుత్ సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కల్పిస్తోంది. ముఖ్యంగా లేఔట్లలో విద్యుత్ లైన్లు వేసి, పేదల ఇళ్లకు, బోర్లకు ఉచితంగా విద్యుత్ సర్విసులను అందిస్తోంది. ఈ పనులకు రూ.7,080 కోట్లు ఖర్చవుతోంది. ఇందులో మొదటి దశలో 10,741 లేఔట్లకు రూ.5,541.94 కోట్లతో విద్యుత్ సంస్థలు పనులు చేపట్టాయి.
కోట్లాది రూపాయల ఖర్చుతో విద్యుత్ సౌకర్యం..
తూర్పు డిస్కంలో వాటర్ వర్క్స్‌కు సంబంధించి ఇప్పటివరకు 2,492 దరఖాస్తులు నమోదు కాగా రూ.50.36 కోట్లతో 2,386 బోర్లకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు అందించారు. లైన్ షిఫ్టింగ్ కోసం 76 ప్రాంతాలను గుర్తించారు. ఈ పనులకు రూ.1.85 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి పని మొదలుపెట్టారు. ఇక దక్షిణ డిస్కంలో రూ.49.17 కోట్లతో 2,555 బోర్లను విద్యుదీకరించారు. 435 ప్రాంతాల్లో లైన్లు మార్చడానికి రూ.9.73 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.
జగనన్న కాలనీల్లో రెండు విధాలుగా విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. 550 ప్లాట్ల కంటే తక్కువ ఉన్న లేఔట్లకు ఓవర్ హెడ్, 550 ప్లాట్ల కంటే ఎక్కువగా ఉన్న లేఔట్లకు భూగర్భ విద్యుత్‌ను వేస్తున్నారు. ఇలా మొత్తం 389 లేఔట్లకు భూగర్భ, 9,678 లేఔట్లకు ఓవర్ హెడ్ విద్యుత్ అందిస్తున్నారు. ఓవర్ హెడ్ విద్యుదీకరణకు ఒక్కో ఇంటికి సగటున రూ.98,521 ఖర్చవుతుండగా, భూగర్భ విద్యుదీకరణకు ఒక్కో ఇంటికి సగటున రూ.1,32,284 ఖర్చవుతోంది.
అందరం సంతోషంగా ఉన్నాం..
జగనన్న మాకు స్థలం ఇచ్చి.. ఇల్లు కట్టుకోవడానికి ఆరి్థక సాయం కూడా చేశారు. ఇంటికి విద్యుత్ సర్విసును కూడా ఉచితంగా అందించారు. మేం గతంలో పాతూరులో ఉమ్మడి కుటుంబంలో చాలా ఇబ్బందులు పడుతుండేవాళ్లం. ఇక్కడికి వచ్చాక నా భర్త, ఇద్దరు పిల్లలతో అందరం సంతోషంగా ఉన్నాం.
–మౌనిక, మారేడుపూడి కాలనీ
మా దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు..
పదేళ్లుగా సాలోపల్లిపాలెంలో అద్దెకు ఉన్నాం. నా భర్త, ఇద్దరు పిల్లలతో అద్దె ఇంటిలో అవస్థలు పడ్డాం. సీఎం జగనన్న చలువ వల్ల మాకు సొంతిల్లు వచి్చంది. వీధి లైట్లు వేశారు. మా ఇంటికి ఉచితంగా కరెంటు మీటర్, బల్బు ఇచ్చారు. మా దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.
–కనుమూరి దేవి, మారేడుపూడి కాలనీ
ఉచితంగానే విద్యుత్ సర్విసులు..
పేదలందరికీ ఉచితంగా విద్యుత్ సర్విసులు అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. దానికి తగ్గట్టుగానే జగనన్న కాలనీల్లో ఉచితంగా మీటర్లు అమర్చుతున్నాం. ఇందుకు అవసరమైన సబ్ స్టేషన్లు నిర్మించి విద్యుత్ స్తంభాలు, లైన్లు వేస్తున్నాం. –ఎల్.మహేంద్రనాథ్,ఎస్‌ఈ విశాఖ సర్కిల్, ఏపీఈపీడీసీఎల్
తాగునీటి అవసరాలకూ త్వరితగతిన విద్యుత్..
జగనన్న కాలనీల్లో నిరంతరం విద్యుత్ సరఫరా అందించేందుకు అవసరమైన విద్యుత్ పంపిణీ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాం. అలాగే తాగునీటి అవసరాలకు బోర్లకు కూడా త్వరితగతిన విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నాం. కె.విజయానంద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇంధనశాఖ
Comments
Please login to add a commentAdd a comment