bulbs
-
పేదల ఇళ్లల్లో.. ‘ఉచిత’ వెలుగులు
ఈ చిత్రంలో కనిపిస్తున్న వివాహిత పేరు.. జర్రిపోతుల పార్వతి. పెళ్లయిన పన్నెండేళ్ల నుంచి గున్నవానిపాలెం అగ్రహారంలో చిన్న ఇంటిలో ఉంటూ అవస్థలు పడుతోంది. సొంత ఇంటి కోసం గతంలో ఎంతో మంది నేతలకు, అధికారులకు విన్నవించినా ఫలితం శూన్యం. ఎట్టకేలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం అందడంతో సొంతింటి కలను నెరవేర్చుకుంది. విద్యుత్ శాఖ.. స్తంభాలు వేసి, వైర్లు లాగి ఆ ఇంటికి కనెక్షన్, మీటర్, బల్బులు ఉచితంగా అందించింది. ఎక్కడా ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వనవసరం లేకుండా పార్వతి సొంతింటిలో విద్యుత్ వెలుగులు ప్రసరించాయి. అమ్మఒడి సాయంతో పాటు తన పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్యను ఈ ప్రభుత్వం అందిస్తోందని పార్వతి సంతోషంతో చెబుతోంది. అనకాపల్లి జిల్లా లంకెలపాలెం విద్యుత్ సెక్షన్‌లోని మారేడుపూడి కాలనీ (బోణం గణేష్, అనకాపల్లి జిల్లా మారేడుపూడి కాలనీ నుంచి సాక్షి ప్రతినిధి) .. ఇలా ఒక్క పార్వతే కాదు.. ఎంతోమంది మహిళలు తమ కుటుంబంతో కలిసి జగనన్న ఇళ్లల్లో విద్యుత్ వెలుగుల మధ్య సంతోషంగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా అనకాపల్లి జిల్లా మారేడుపూడి కాలనీలో పర్యటించిన ‘సాక్షి’తో లబ్ధిదారులు తమ ఆనందాన్ని పంచుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీల్లో ఇళ్లకు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యుత్ సౌకర్యాలను కల్పిస్తూ పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నారని, అందుకు తామే నిదర్శనమని చెబుతున్నారు. పచ్చని ప్రకృతి నడుమ, ఎతైన కొండల మధ్య ఉన్న మారేడుపూడి కాలనీలో 67 విద్యుత్ సర్విసులను అక్కడ కొత్తగా నిర్మించిన ఇళ్లకు అందించారు. ఇందుకోసం కాలనీ మొత్తం విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. స్తంభం నుంచి ఇంటి వరకు సర్విసు వైరును సమకూర్చారు. మీటర్‌తో సహా అన్ని పరికరాలు, సర్విసును ఉచితంగా ఇచ్చారు. ఆ విద్యుత్ సదుపాయంతో అక్కడి ప్రజలు తమ కొత్త ఇంటిలో రంగురంగుల ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసుకుని మురిసిపోతున్నారు. తమకు ఈ భాగ్యం కల్పించిన సీఎం వైఎస్ జగన్‌కు చెమర్చిన కళ్లతో కృతజ్ఞతలు చెబుతున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా.. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద తొలి దశలో పేదలకు ప్రభుత్వం నిరి్మస్తున్న లేఔట్లలో ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కంలు)ల ద్వారా ముందుగా 14,49,133 సర్విసులకు విద్యుత్ సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కల్పిస్తోంది. ముఖ్యంగా లేఔట్లలో విద్యుత్ లైన్లు వేసి, పేదల ఇళ్లకు, బోర్లకు ఉచితంగా విద్యుత్ సర్విసులను అందిస్తోంది. ఈ పనులకు రూ.7,080 కోట్లు ఖర్చవుతోంది. ఇందులో మొదటి దశలో 10,741 లేఔట్లకు రూ.5,541.94 కోట్లతో విద్యుత్ సంస్థలు పనులు చేపట్టాయి. కోట్లాది రూపాయల ఖర్చుతో విద్యుత్ సౌకర్యం.. తూర్పు డిస్కంలో వాటర్ వర్క్స్‌కు సంబంధించి ఇప్పటివరకు 2,492 దరఖాస్తులు నమోదు కాగా రూ.50.36 కోట్లతో 2,386 బోర్లకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు అందించారు. లైన్ షిఫ్టింగ్ కోసం 76 ప్రాంతాలను గుర్తించారు. ఈ పనులకు రూ.1.85 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి పని మొదలుపెట్టారు. ఇక దక్షిణ డిస్కంలో రూ.49.17 కోట్లతో 2,555 బోర్లను విద్యుదీకరించారు. 435 ప్రాంతాల్లో లైన్లు మార్చడానికి రూ.9.73 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. జగనన్న కాలనీల్లో రెండు విధాలుగా విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. 550 ప్లాట్ల కంటే తక్కువ ఉన్న లేఔట్లకు ఓవర్ హెడ్, 550 ప్లాట్ల కంటే ఎక్కువగా ఉన్న లేఔట్లకు భూగర్భ విద్యుత్‌ను వేస్తున్నారు. ఇలా మొత్తం 389 లేఔట్లకు భూగర్భ, 9,678 లేఔట్లకు ఓవర్ హెడ్ విద్యుత్ అందిస్తున్నారు. ఓవర్ హెడ్ విద్యుదీకరణకు ఒక్కో ఇంటికి సగటున రూ.98,521 ఖర్చవుతుండగా, భూగర్భ విద్యుదీకరణకు ఒక్కో ఇంటికి సగటున రూ.1,32,284 ఖర్చవుతోంది. అందరం సంతోషంగా ఉన్నాం.. జగనన్న మాకు స్థలం ఇచ్చి.. ఇల్లు కట్టుకోవడానికి ఆరి్థక సాయం కూడా చేశారు. ఇంటికి విద్యుత్ సర్విసును కూడా ఉచితంగా అందించారు. మేం గతంలో పాతూరులో ఉమ్మడి కుటుంబంలో చాలా ఇబ్బందులు పడుతుండేవాళ్లం. ఇక్కడికి వచ్చాక నా భర్త, ఇద్దరు పిల్లలతో అందరం సంతోషంగా ఉన్నాం. –మౌనిక, మారేడుపూడి కాలనీ మా దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.. పదేళ్లుగా సాలోపల్లిపాలెంలో అద్దెకు ఉన్నాం. నా భర్త, ఇద్దరు పిల్లలతో అద్దె ఇంటిలో అవస్థలు పడ్డాం. సీఎం జగనన్న చలువ వల్ల మాకు సొంతిల్లు వచి్చంది. వీధి లైట్లు వేశారు. మా ఇంటికి ఉచితంగా కరెంటు మీటర్, బల్బు ఇచ్చారు. మా దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. –కనుమూరి దేవి, మారేడుపూడి కాలనీ ఉచితంగానే విద్యుత్ సర్విసులు.. పేదలందరికీ ఉచితంగా విద్యుత్ సర్విసులు అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. దానికి తగ్గట్టుగానే జగనన్న కాలనీల్లో ఉచితంగా మీటర్లు అమర్చుతున్నాం. ఇందుకు అవసరమైన సబ్ స్టేషన్లు నిర్మించి విద్యుత్ స్తంభాలు, లైన్లు వేస్తున్నాం. –ఎల్.మహేంద్రనాథ్,ఎస్ఈ విశాఖ సర్కిల్, ఏపీఈపీడీసీఎల్ తాగునీటి అవసరాలకూ త్వరితగతిన విద్యుత్.. జగనన్న కాలనీల్లో నిరంతరం విద్యుత్ సరఫరా అందించేందుకు అవసరమైన విద్యుత్ పంపిణీ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాం. అలాగే తాగునీటి అవసరాలకు బోర్లకు కూడా త్వరితగతిన విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నాం. కె.విజయానంద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇంధనశాఖ -
బల్బులు మార్చితే చాలు.. కోట్ల జీతం మీదే..!
జీవితాన్ని సౌకర్యవంతంగా గడపడానికి ఉద్యోగం తప్పనిసరి. ఏ ఉద్యోగం చేసినా పదో పాతికో సంపాదించగలం. బాగా శ్రమిస్తే కొందరైతే లక్షల వరకు చేరుకోగలరు. కానీ కేవలం బల్బులను మార్చుతూ కోట్లు సంపాదించగలరా? ఏ సంస్థ అయినా లైట్లు మార్చితే కోట్ల రూపాయల జీతం ఇస్తుందా? అవును ఇస్తుంది. కేవలం టవర్‌కు ఉండే లైట్లను మార్చితే కోట్ల రూపాయల జీతం సంపాదించవచ్చు. కాకపోతే.. ఆ టవర్ల ఎత్తు మామూలుగా ఉండదు మరి..! మామూలు టవర్లు కావు.. వందల మీటర్లు ఉండే ఎత్తైన సిగ్నల్ టవర్లపై పని చేయాలి. పైకి వెళ్లగానే కళ్లు తిరుగకుండా, ధైర్యంగా సన్నని కడ్డీలపై తిరుగాల్సి ఉంటుంది. బయట కనిపించే టవర్ల లాంటివి కావు ఇవి. ఎత్తుకు పోయేకొలది సన్నగా ఉంటాయి. చివరకు కేవలం సన్నని కడ్డీ మాత్రమే ఉంటుంది. ఈ టవర్లపై ఎక్కి లైట్లను మార్చాలి అంటే..భయంతో కూడిన పని. కేవలం ఒక తాడు మాత్రమే రక్షణగా ఉంటుంది. ఇలాంటి పనులు అందరూ చేయలేరు. ఇందుకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. శారీరకంగా దృఢంగా ఉండాల్సి ఉంటుంది. ఇలాంటి టవర్లపై పనిచేయగలిగే వారికి చాలా డిమాండ్ అంటుందట. కోట్లలో జీతాలు.. టవర్ ఎత్తు, అనుభవం, నైపుణ్యాన్ని బట్టి ఉద్యోగికి జీతం ఉంటుందట. కొందరికి గంటల చొప్పున ఉంటుంది. ఎంత తక్కువలో అయినా ఒక టవర్ ఎక్కి దిగడానికి కనీసం ఆరుగంటలైన పడుతుంది. 1500 మీటర్ల టవర్‌ను ఎక్కగలిగేవారికి దాదాపు 1 కోటి రూపాయలపైనే ఉంటుంది. ఉద్యోగంలో కొత్తగా చేరినవారికే గంటకు సరాసరిగా 17డాలర్ల వరకు ఇస్తారు. అయితే.. ప్రతీ ఆరునెలలకు ఒకసారి ఈ లైట్లను మారుస్తారట. అమెరికాలోని డకోటా నగరానికి చెందిన ఓ ట్విట్టర్ ఖాతాలో దీనికి సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. Every six months this man in South Dakota climbs this communication tower to change the light bulb. He is paid $20,000 per climb. pic.twitter.com/z9xmGqyUDd — Historic Vids (@historyinmemes) December 2, 2022 ఇదీ చదవండి:యూఎస్‌కి 17 ఏళ్ల పాటు చుక్కలు చూపించిన గణిత మేధావి మృతి -
Viral Video: కారులో వచ్చి బల్బులు ఎత్తుకెళ్లారు..
జైపూర్: నిఘా కెమెరాల కారణంగా ఇటీవల వింతైన దొంగతనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎవరూ చూడట్లేదు కదా అని పాలప్యాకెట్లు, బల్బులు ఎత్తుకెళ్తున్న సంఘటనల వీడియోలు వైరల్‌గా మారాయి. అలాంటి సంఘటనే రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలో జరిగింది. అయితే, ఇక్కడ దొంగలు ఏకంగా కారులో వచ్చి బల్బులు చోరీ చేశారు. తెల్ల రంగు ఆల్టో కారులో వచ్చిన దొంగల్లో ఇద్దరు క్షణాల్లో బల్బులను మాయం చేశారు. కారులో మరికొంత మంది ఉన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. తొలుత ఓ దుకాణం ముందు ఏర్పాటు చేసిన బల్బును దొంగలించేందుకు ప్రయత్నం చేశారు ఇద్దరు దొంగలు. సాధ్యం కాకపోవటంతో మరో దుకాణం వద్ద ఉన్న కుర్చీని తీసుకొచ్చి తమ పని తనాన్ని చూపించారు. ఈ సంఘటన జిల్లాలోని కోల్సియా గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. దొంగతనానికి పాల్పడుతున్న క్రమంలో ఏదో శబ్దం వినబడి దుకాణం యజమాని మహేంద్ర దూత్ నిత్రలేచాడు. బయటకి వచ్చి చూసేసరికి దొంగలు కారులో పరారయ్యారు. ఎదురుగా ఉన్న దుకాణం షటర్‌ను పగలగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు విని బయటకు వచ్చానని, తనను చూసి పరారయ్యారని తెలిపారు దూత్. మరోవైపు.. దుకాణంలో చోరీ చేసేందుకు ముందుగా బల్బులను తొలగించాలనుకున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: గవర్నర్ వైఖరిపై అధికార పార్టీ విస్తృతస్థాయి నిరసన -
ఆ దీపాలన్నీ స్త్రీలవే.. ఆ దీపాలూ స్త్రీలే
తమిళనాడులో కరువు ఊరు అది. సరిగా భుక్తి లేదు. చేయడానికి స్త్రీలు చేయదగ్గ పని లేదు. భర్త ఎలక్ట్రీషియన్. నీ పనే నేను చేస్తాను అంది ధనలక్ష్మి. ‘కరెంటు పని నువ్వు చేయలేవు’ అన్నాడు భర్త. ఆమె వినలేదు. వెదురుపుల్లలతో కట్టిన బొమ్మలకు సీరియల్ సెట్లు అమర్చడం నేర్చుకుంది. జాతరలు, తిరునాళ్ళు, పండగలకు సీరియల్ సెట్ల వెదురుబొమ్మలు కావాలి. ఆ పనిలో విపరీతమైన నైపుణ్యం సంపాదించింది. మిగిలిన ఆడవాళ్లకు కూడా ఆ పని నేర్పించింది. నేడు ‘అరసర్కుళం’ అనే ఊరు సీరియల్సెట్ల బొమ్మలకు ప్రసిద్ధి. ఆ దీపాలన్నీ స్త్రీలవే. ఆ దీపాలూ స్త్రీలే. తమిళనాడు తిరునల్వేలి ప్రాంతంలోని ఎండను, కరువును భరించడం కష్టం. ఉన్నట్టుండి జలుబు చేసినట్టు కొన్ని మేఘాలు చీదుతాయి. వాటికి ఏమైనా పండితే పండినట్టు. అయినా ముక్కు కారితే పంటలు పండుతాయా? ‘మా ఊరి పేరు అరసర్కుళం. అది మారుమూల. పంటలు లేక చాలామంది వలస పోతుంటారు. ఉన్నవారికి పని ఉండదు. రోజూ పట్నానికి పోయి పని చేసుకురావడానికి బస్సులు కూడా తిరగవు’ అంటుంది ధనలక్ష్మి. ఆమె ఇప్పుడు ఆ ఊరిలోని ‘ధనలక్ష్మి వైరింగ్ వర్క్స్’కు అధిపతి. ఆమె దగ్గర 50 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఆమె వల్ల ఉపాధి మార్గం తెలుసుకొని మరో 500 మంది జీవిక పొందుతున్నారు. ఇది ఇప్పటి పరిస్థితి. పదేళ్ల క్రితం కాదు. పదేళ్ల క్రితం... ధనలక్ష్మిది అరసర్కుళం ఊరే. అక్కడే పుట్టి పెరిగింది. ‘మాకు రెండున్నర ఎకరాల పొలం ఉంది. కాని వానలు లేకపోతే ఏమిటి చేయడం. అదంతా ఉత్త మట్టిగడ్డే కదా’ అంటుంది. తండ్రి ఆమెకు ప్రాయం రాగానే అదే ఊళ్లో ఉన్న అశోక్ అనే ఎలక్ట్రీషియన్‌కు ఇచ్చి పెళ్లి చేశాడు. ముగ్గురు కూతుళ్లు పుట్టారు. ‘మా ఆయన ఎలక్ట్రీషియన్. ఏదైనా డెకరేషన్ వస్తే లైట్లు వేస్తాడు. కాని రెండు మూడు వేల కంటే ఎక్కువ సంపాదించేవాడు కాదు’ అంటుంది ధనలక్ష్మి. తెలుగులో ప్రసిద్ధ రచయిత శ్రీరమణ ‘ధనలక్ష్మి’ అనే కథ రాశారు. అందులో ధనలక్ష్మి అనే ఇల్లాలు భర్తకు ఉన్న నిర్వహణాలోపాలను గ్రహించి తోడు నిలిచి అతడు వ్యాపారంలో వృద్ధిలోకి రావడానికి సహకరిస్తుంది. సరిగ్గా ఈ ధనలక్ష్మి కూడా భర్త అశోక్‌కు అలాగే అండగా నిలిచింది. ‘ఊళ్లో ఏ పనీ లేదు. నీ పనే నేను చేస్తా’ అందామె. అశోక్ ఉలిక్కి పడ్డాడు. ఎందుకంటే ఎలక్ట్రికల్ పనంటే కరెంటుతో వ్యవహారం. అది ఏమరుపాటుగా ఉంటే ప్రమాదం. అందుకే వద్దు అన్నాడు. ‘కాని నేను పట్టుపట్టాను. సాధించాను’ అంటుంది ధనలక్ష్మి. ఊళ్లో జాతర వస్తే... సరిగ్గా ఆ సమయంలోనే ఊళ్లో జాతర వచ్చింది. జాతరకు ఆ ప్రాంతంలో భారీ ఎత్తున సీరియల్ సెట్లతో వెలిగించిన అలంకరణలు చేస్తారు. వెదురుపుల్లతో దేవతల బొమ్మలు, పూలు, జంతువులు, పార్టీ గుర్తులు, రాజకీయ నాయకుల ముఖాలు కట్టి వాటికి సీరియల్లైట్లు అమర్చి వెలిగిస్తారు. వెదురుపుల్ల కట్టడంలో అశోక్ పని మంతుడు. కాని వాటికి సీరియల్లైట్లు బిగించడం శ్రమతో, నైపుణ్యంతో, ఓపికతో కూడిన పని. సీరియల్ సెట్లలో మధ్యలో ఒక లైట్ కాలిపోయినా మిగిలిన సెట్ వెలగదు. ఆ లైట్‌ను కొత్తది వేయాలి. లేదా వైర్‌ను జాయింట్ చేయాలి. ‘ఆ పనంతా నేను నేర్చుకుని మొదలెట్టాను’ అంటుంది ధనలక్ష్మి. భర్త వెదురు ఫ్రేమ్స్ కడితే ధనలక్ష్మి చకచకా సీరియల్ సెట్లు అమర్చేది. వెలిగిస్తే వెదురు కటౌట్ మిలమిలమని బ్రహ్మాండంగా వెలిగేది. అశోక్ ఆ జాతరలో లైట్లు వెలిగించి పేరు సంపాదించాడు. ధనలక్ష్మి హస్తవాసి మంచిదని నిరూపితం అయ్యింది. అందరు మహిళల కోసం తిరునల్వేలి జిల్లాలో ఆ మాటకొస్తే తమిళనాడులో ప్రతి ఊళ్లో ఏదో ఒక ఉత్సవం వేడుక జరుగుతూనే ఉంటాయి. వాటికి వెదురుపుల్లల సీరియల్సెట్ల కటౌట్స్ అవసరం. అవి తయారు చేసే కార్ఖానా పెడదామని ధనలక్ష్మి భర్తకు సూచించింది. ఊళ్లో ఉన్న ఒక ట్రస్టు సాయంతో లోన్ పొంది పని మొదలెట్టింది. భర్త మరికొందు మగపని వారు ఫ్రేమ్స్ తయారు చేస్తుంటే తను మరికొంతమంది మహిళలతో ఆ ఫ్రేమ్స్‌కు లైట్లు బిగించడం మొదలుపెట్టింది. ధనలక్ష్మి దగ్గరకు వస్తే రెడిమేడ్‌గా కావలిసిన కరెంటు బొమ్మలు దొరుకుతాయనే పేరు వచ్చింది. ఆ తర్వాత ధనలక్ష్మి చెన్నై నుంచి లైట్లు టోకున కొనుక్కొచ్చి సీరియల్ సెట్లను తయారు చేయడం కూడా ఆడవాళ్లకు నేర్చింది. సీరియల్ లైట్లు తామే తయారు చేసుకుని తామే కటౌట్స్‌కు అమర్చి మొత్తం కటౌట్‌ను అమ్మడం వల్ల వారికి లాభం బాగా రావడం మొదలెట్టింది. ‘ఇవాళ మా ఊరు పెద్ద సీరియల్ సెట్ల కేంద్రమే అయ్యింది’ అంటుంది ధనలక్ష్మి. తన వద్ద పనిచేస్తున్న మహిళలతో ధనలక్ష్మి ధనలక్ష్మి ముగ్గురు కుమార్తెల్లో పెద్ద కుమార్తెకు పెళ్లయ్యింది. ఆమె కంప్యూటర్ ద్వారా కావలసిన బొమ్మలు తీసి తల్లికి ఇస్తోంది. అల్లుడు ఊళ్లు తిరిగి ఆర్డర్లు తెస్తున్నాడు. ధనలక్ష్మి ధైర్యం లక్ష్మిని తెచ్చింది. మూడు వెలుగులు ఆరు కాంతులుగా ఆమె జీవితం వెలుగుతోంది. ఆరు వందల మంది స్త్రీలూ వెలుగుతున్నారు. చుట్టూ చీకటి కమ్ముకున్నప్పుడు కూడా వెలగొచ్చని వీరు చెబుతున్నారు – సాక్షి ఫ్యామిలీ -
కనిపించని బల్బులు వచ్చేస్తున్నాయి!
ఎల్ఈడీలు తెలుసుగా.. అతి తక్కువ కరెంటు ఖర్చుతో దీర్ఘకాలం పాటు బోలెడంత వెలుగునిచ్చే సరికొత్త బల్బులు. కాలిఫోర్నియా యూనివర్శిటీ (బెర్క్లీ) ఇంజినీర్లు తాజాగా ఇంకో కొత్త రకం ఎల్ఈడీలు తయారుచేశారు. కేవలం కొన్ని మిల్లీమీటర్ల పరిమాణంలో ఉండే ఈ కొత్త బల్బుల్ని ఆఫ్ చేసినప్పుడు పూర్తి పారదర్శకంగా ఉంటాయి. ఈ బల్బులో కేవలం మూడు పరమాణువుల మందంతో ఉండే అర్ధవాహకం (సెమీ కండక్టర్) పొర ఒకటి ఉంటుంది. అయితే ఏంటి అంటున్నారా? చాలా సింపుల్. ఈ సరికొత్త బల్బులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. టీవీలు, కంప్యూటర్లు, హోర్డింగులు వంటి అన్ని రకాల తెరలూ మాయమైపోతాయి. అదెలా అనొద్దు. ఆఫ్‌లో ఉన్నప్పుడు పారదర్శకంగా ఉంటాయని ముందే చెప్పుకున్నాం కదా.. అందుకన్నమాట! గాజు కిటికీలు, తలుపుల్లోపలే డిస్ప్లే తెరలను ఏర్పాటు చేసేందుకు ఈ కొత్త బల్బులు ఉపయోగపడతాయని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డెర్ హీన్ లీన్ తెలిపారు. బల్బులో వాడే మూడు పరమాణువుల మందమైన పొర నాలుగు రకాల పదార్థాలతో తయారు చేయవచ్చునని... ఒక్కోటి ఒక్కో ప్రాథమిక రంగును వెదజల్లుతుంది కాబట్టి... వీటిని నియంత్రించడం ద్వారా తెరపై మనకు నచ్చిన రంగును సృష్టించవచ్చునని వివరించారు. అతి పలుచగా ఉండే ఈ కొత్త బల్బులను మనిషి చర్మంపై పచ్చబొట్టు మాదిరిగా ఏర్పాటు చేసుకోవచ్చునని చెప్పారు. అయితే ఈ స్థాయిలో వీటిని ఉపయోగించుకునేందుకు మరికొంత సమయం పట్టవచ్చునని లీన్ స్పష్టం చేశారు. -
వెలుగులు ఇక నిరంతరం
పాడైన ఎల్ఈడీ బల్పుల మార్పునకు ప్రత్యేక కేంద్రాలు మండల కేంద్రం సెక్షన్ ఆఫీస్‌లో కౌంటర్ పెట్టిన ఏపీఈపీడీసీఎల్ లబ్ధిదారులకు ఉపసమనం జిల్లాలో 22.58 లక్షల ఎల్ఈడీ బల్బుల పంపిణీ మూడేళ్ల వరకు గ్యారెంటీ... పాడైతే ఎన్నిసార్లయినా మార్చుకునే వెలుసుబాటు ఆధార్, విద్యుత్ బిల్లు తీసుకెళితే చాలు.. పాడైన ఎల్ఈడీ బల్బులను ఇచ్చి కొత్తవి తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు లబ్ధిదారులు పాడైన బల్బులను మార్చుకోవాలంటే నియోజకవర్గ కేంద్రానికి వస్తున్నారు. అది కూడా కొద్ది రోజులు మాత్రమే ఈసేవలు అందించారు. దీని వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతుండడంతో శనివారం నుంచి ఆయా మండల కేంద్రాల్లో మార్చుకునే విధంగా విద్యుత్ అధికారులు చర్యలు చేపట్టారు. మండల కేంద్రంలోని సెక్షన్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. పని వేళల్లో ఎప్పుడైనా లబ్ధిదారులు పాడైన బల్బులను అక్కడ ఇచ్చి కొత్తవి తీసుకొవచ్చు. ఇందుకు పాత బల్బుతోపాటు లబ్ధిదారులు తమ ఆధార్ కార్డు, విద్యుత్ బిల్లు తీసుకురావాల్సి ఉంటుందని రాజమహేంద్రవరం డీఈ శ్యాంంబాబు తెలిపారు. - సాక్షి, రాజమహేంద్రవరం రేషన్‌కార్డు ప్రాతిపదికగా బల్బుల పంపిణీ గృహ అవసరాలకు సాధారణ బల్బులు వాడడం వల్ల విద్యుత్ వినియోగం పెరుగుతోంది. విద్యుత్ వాడకంలో మిగులు సాధించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన పథకం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఎనర్జీ ఎఫిషిఎన్సీ సర్వీస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్), విద్యుత్ పంపిణీ సంస్థల భాగస్వామ్యంతో ఎల్ఈడీ బల్బులను పింపిణీ చేసింది. రేషన్ కార్డు ప్రాతిపదికగా ప్రతి లబ్ధిదారుడుకి రూ.300 విలువైన ఎల్ఈడీ బల్బులను రూ.10 చొప్పున ఏపీఈపీడీసీఎల్ రెండు బల్బులు పంపిణీ చేసింది. జిల్లాలో 24 లక్షల 40 వేల బల్బులు పంపిణీ చేయాలన్న లక్ష్యంతో 2015 నవంబర్ 17న పింపిణీ కార్యక్రమం ప్రారంభించింది. ఇప్పటి వరకు 11,28,732 లబ్ధిదారులకు 22,57,283(93 శాతం) బల్బులును విద్యుత్ అధికారులు పంపిణీ చేశారు. పాడైతే కొత్త బల్బు మూడేళ్ల గ్యారెంటీతో ఏపీఈపీడీసీఎల్ అధికారులు ప్రతి గ్రామంలో బల్బులను పంపిణీ చేశారు. పగిలిపోవడం కాకుండా పాడైతే ఎప్పడైనా మార్చుకునే వెలుసుబాటు కల్పించారు. అయితే ఇప్పటి వరకు లబ్ధిదారులు బల్బులను మార్చుకునేందుకు నియోజకవర్గ కేంద్రానికి రావాల్సిన పరిస్థితి ఉండడంతో ఇబ్బందులు పడతున్నారు. ఈ నేపథ్యంలో మరింత ఉన్నతంగా సేవలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ప్రతి మండల కేంద్రంలోని సెక్షన్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. లబ్ధిదారుడు పాడైన తమ ఎల్ఈడీ బల్బులను ఇక్కడ మార్చుకోవచ్చు. ఇప్పటి వరకు నియోజకవర్గ కేంద్రాల్లో 37,659 బల్బులను పాడైన వాటి స్థానంలో మార్పు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక మండల కేంద్రాల్లో మార్పిడి కేంద్రాలు పెట్టడం వల్ల వినియోగదారులకు దూరాబారం నుంచి ఉపసమనం కలుగనుంది. త్వరలో టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు పాడైన ఎల్ఈడీ బల్బులను మార్చుకునేందుకు ఈఈఎస్ఎల్ సంస్థతో మండల కేంద్రంలోని సెక్షన్ కార్యాలయం వద్ద కౌంటర్లు పెట్టిస్తున్నాం. ఇప్పటి వరకు పలు డివిజన్లలో ఈ ప్రక్రియ ముగిసింది. లబ్ధిదారులు సమాచారం తెలుసుకునేందుకు త్వరలో టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయబోతున్నాం. పాడైన బల్బుతోపాటు ఆధార్, విద్యుత్‌బిల్లు తీసుకువచ్చి కొత్త బల్బు తీసుకెళ్లవచ్చు. - ఎస్ఎన్ ప్రసాద్, సూపరింటెండెంట్ ఇంజనీర్, ఏపీఈపీడీసీఎల్ -
కాంతివంతంగా..
పది మందికి ఉపాధి కల్పిస్తున్న గిరిజన యువతి.. ఎల్ఏడీ బల్బ్‌ల యూనిట్‌తో అద్భుతాలు సృష్టిస్తున్న వీరలక్ష్మి రాజవొమ్మంగి : గిరిజనులు అంటే కొండ చీపుర్లు, చింతకాయలు అమ్ముకొనేవారు కాదని, తాము కూడా పెద్దపెద్ద పరిశ్రమలు నెలకొల్పగలమని, పది మందికి ఉపాధి చూపగలమనే దృఢ నిశ్ఛయంతో ఉన్నారు. దీనికి నిదర్శనమే తూర్పు ఏజెన్సీ అడ్డతీగల మండలం బొడ్లంక గ్రామానికి చెందిన కొల్లపురెడ్డి వీరలక్ష్మి. ఈమె కాకినాడ జేఎన్టీయూలో బీటెక్ చదివారు. అంతకు ముందు ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్ వరకు రాజవొమ్మంగి బాలికల గురుకుల పాఠశాలలో చదివింది. రంపచోడవరంలో రూ.కోటితో ట్విలైట్ (ట్రైబుల్ విమన్ ఇన్స్టాల్డ్ లెడ్ ఇన్ ఐటీడీఏ ఆఫ్ రంపచోడవరం) పేరుతో బల్బ్‌ల అసెంబుల్డ్ యూనిట్‌ను స్థాపించింది. రంపచోడవరం ఐటీడీఏ, జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ ఈమెను ప్రోత్సహించి బ్యాంకులోన్ ఇప్పించారు. ప్రస్తుతం ఏపీఈపీడీసీఎస్ ద్వారా లక్ష బల్బ్‌లకు ఆఫర్ వచ్చిందని, ఈ నేపథ్యంలో ప్రతి పంచాయతీ పరిధిలో గిరిజన కుంటుంబానికి రెండు ఎల్ఈడీ బల్బ్‌లు రాయితీ ధరకు (రెండు బల్బ్‌లు రూ.20 మాత్రమే, అసలు ఖరీదు రూ.250) సరఫరా చేస్తున్నట్టు వీరలక్ష్మి చెబుతోంది. తాను ట్విలైట్ యూనిట్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ కాగా తనతో పాటు మరో 42 మంది చదువుకొన్న గిరిజన యువతులు ఈ కంపెనీ ద్వారా ఉపాధి పొందుతున్నారన్నారు. తామంతా సొసైటీగా (రంప గిరిజన మహిళా సమాఖ్య పారిశ్రామిక సహకార సంఘంగా) ఏర్పడి తక్కువ విద్యుత్ ఖర్చుతో ఎక్కువ కాంతినిచ్చే ఎల్ఈడీ బల్బ్‌లు, ట్యూబ్లైట్స్, స్ట్రీట్‌లైట్స్, విద్యుత్ లేనప్పుడు ఉపయోగించే ఎమర్జెన్సీ లైట్స్ తయారు చేస్తున్నామన్నారు. -
మహిళలు సీక్రెట్ కెమెరాలతో జాగ్రత్త !
-
ఎల్ఈడీ లైట్ల వల్ల మనకెంత ముప్పు?
న్యూయార్క్: వాతావరణ కాలుష్యం, ధ్వని కాలుష్యం మానవ ఆరోగ్యంపై ఎంతగా ప్రభావం చూపిస్తాయో వివిధ రకాల బల్బుల నుంచి వెలువడే కాంతి కిరణాలు కూడా వాటి స్థాయినిబట్టి అంతకన్నా ఎక్కువ ప్రభావాన్నే చూపిస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మనం సంప్రదాయబద్ధంగా వాడుతున్న సోడియం బల్బులకన్నా కూడా ఎల్ఈడీ బల్బులు మన ఆరోగ్యానికి ఎక్కువ హాని చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఎల్ఈడీ బల్బుల ద్వారా వెలువడే కాంతి రంగు ఉష్ణోగ్రత (కలర్ టెంపరేచర్) స్థాయినిబట్టి మన ఆరోగ్యానికి కలిగే హాని తీవ్రత ఆధారపడి ఉంటుంది. కలర్ టెంపరేచర్‌ను ‘కెల్విన్’లో కొలుస్తారు. థర్మోడైనమిక్ ధియరీని ఉపయోగించి రూపొందించిన కెల్విన్ స్కేల్ ద్వారా ఓ బల్బు నుంచి ఏ రంగు కాంతి ఎక్కువగా వెలువడుతుందో కొలుస్తారు. ప్రతి బల్బు నుంచి ఎరుపు, పసుపు, నీలి రంగు కాంతులు వెలువడుతాయి. ఓ బల్బు నుంచి నీలి రంగు కాంతి తరంగాలు ఎక్కువగా వెలువడినప్పుడు తెల్లటి వెలుతురు ఎక్కువగా ఉంటుంది. అంటే ఇతర సంప్రదాయక సోడియం బల్బులకన్నా ఫ్లోరెసెంట్, ఎల్ఈడీ బల్బుల నుంచే నీలి రంగు కాంతి ఎక్కువగా వెలువడుతుంది. ఈ నీలి రంగు కాంతి ఎక్కువగా ఉండడమే మన కళ్లకు, మన ఆరోగ్యానికి హానికరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మూడు వేల కెల్విన్ల సోడియం బల్బుకన్నా 3000 కెల్విన్ల ఎల్ఈడీ బల్బులో ఎక్కువగా నీలి కిరణాలు ఉంటాయి. ఈ కిరణాలు మానవులకు రెండు రకాలుగా హానిచేస్తాయి. నీలి కిరణాల వల్ల గ్లేరింగ్ ఎక్కువగా ఉంటుంది. ఎల్ఈడీ వీధి లైట్ల కారణంగా మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కళ్లలో ఎక్కువ గ్లేరింగ్ పడుతుంది. దీనివల్ల డ్రైవింగ్‌కు అవరోధం ఏర్పడుతోంది. ఇక రెండోరకంగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఎరుపు, పసుపు కాంతులకు భిన్నంగా నీలి రంగు కాంతి కంటి రెటీనాపై చిట్లిపోయి విస్తరిస్తుంది. ఫలితంగా రెటీనా దెబ్బతింటుంది. చూపు మందగిస్తుంది. మనం సుఖంగా నిద్రపోయేందుకు ఉపయోగపడే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని దెబ్బతీస్తుంది. ఫలితంగా నిద్రలేమి జబ్బు వస్తుంది. శరీరం మొత్తంగా చూస్తే మన శరీరంలో 24 గంటలపాటు కొనసాగే భౌతిక ప్రక్రియల సైకిల్ దెబ్బతింటుందని కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇంధనం ఆదా అవడమే కాకుండా డబ్బుకూడా ఆదా అవుతుండడంతో ఎక్కువ దే శాలు ఇప్పుడు ఎల్ఈడీ బల్బులనే ప్రోత్సహిస్తున్నాయి. భారత్ లాంటి దే శాల్లో ఈ బల్బులపై ప్రభుత్వం సబ్సిడీలు కూడా ఇస్తోంది. సాధారణంగా ఇంట్లోవాడే ఎల్ఈడీ, టీవీల్లో వాడే ఎల్ఈడీ బల్బుల్లో కలర్ టెంపరేచర్ ఎక్కువగా ఉండదుకనుక ప్రమాదమేమి లేదు. అయితే ఇంట్లోని ఎల్ఈడీ బల్బులను నేరుగా చూడకూడదు. నిద్రపోయేటప్పుడు ఎల్ఈడీ లైట్లను ఆర్పేయాల్సి ఉంటుంది. నిద్రపోయినప్పుడు కూడా ఎల్ఈడీ బల్బు వెలుగుతుంటే నీలి కిరణాలు మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తాయని కొంత మంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎక్కువ వరకు మనకు వీధిలోని ఎల్ఈడీ లైట్ల కాంతి వల్లే ముప్పు వాటిల్లుతుంది. అయితే వాటి తీవ్రత కూడా వాటిలోకి కెల్విన్ల స్థాయినిబట్టి ఉంటుంది. మూడు వేల కెల్విన్లకు మించితే ప్రమాదకరమని అమెరికా మెడికల్ అసోసియేషన్ నిర్ధారించింది. అందుకు అనుగుణంగా అమెరికా రాష్ట్ర, మున్సిపల్ ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. అమెరికా మున్పిపాలిటీలన్నీ ఇప్పుడు వీధుల్లో మూడువేల నుంచి నాలుగువేల కెల్విన్ల బల్బులను ఉపయోగిస్తున్నాయి. మూడువేల కెల్విన్లు అంటే 2,726 డిగ్రీల సెల్సియస్‌కు సమానం. మూడువేల కెల్విన్లకు మించిన వీధి లైట్లు వాడరాదని, వాటిలోని నీలి కాంతులను కాస్త నియంత్రించేందుకు బల్బుల చుట్టూ షేడ్స్ వాడాలని అమెరికా మెడికల్ అసోసియేషన్ తన మార్గదర్శకాల్లో సూచించింది. -
సౌర వెలుగులు ఇలా..
సామాన్య, మధ్య, ధనిక వర్గాలు తేడాలేకుండా అందరినీ వేధిస్తున్న కరెంటు కోతలకు ప్రత్యామ్నాయం సోలార్ సిస్టం. ఫ్యాన్లు, బల్బులు పనిచేయకుండానే బిల్లుల భారం మోపుతున్న నేపథ్యంలో సోలార్ వినియోగం ఇటీవల బాగా పెరిగింది. సోలార్ పరికరాల వాడకంపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. సోలార్ విద్యుత్ పొందేందుకు ఇంటినే ఉత్పాదక కేంద్రంగా మార్చుకుని విద్యుత్ బిల్లుల నుంచి ఉపశమనం పొందొచ్చు. సౌర వ్యవస్థ ఏర్పాటు, దరఖాస్తు చేసుకునే విధానం తదితర అంశాల సమాచారం మీకోసం.. - దోమ ♦ వినియోగదారులు విద్యుత్ శాఖ అధికారిక వెబ్సైట్ నుంచి సోలార్ రూప్‌టాప్ నెట్‌మీటరింగ్ దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవాలి. ♦ పూర్తి చేసిన దరఖాస్తును రూ.1000 ఫీజుతో సంబంధిత డివిజన్ ఇంజినీరుకు అందించాలి. ♦ దరఖాస్తు అందిన 15 రోజుల్లో సాధ్యాసాధ్యాలను పరిశీలించి సిబ్బంది అనుమతిస్తారు. ♦ వినియోగదారులు డిస్కం సూచించిన ఫార్మాట్లో ఒప్పందం కుదుర్చుకోవాలి. ఇది ఆరు నెలల పాటు చెల్లుబాటవుతుంది. ♦ అనుమతి పొందిన ఆరునెలల్లోపు సోలార్ రూఫ్ టాప్ ఫొటో వోల్టాయిక్ (ఎస్పీవీ) విధానాన్ని అమర్చుకొని డిస్కం అధికారులతో నిర్ధరించుకోవాలి. ♦ అధికారుల తనిఖీల్లో వినియోగదారులు స్థాపించిన పరికరాలు ప్రమాణాలకు తగినట్లుగా ఉన్నట్లయితే పది రోజుల్లో ఎస్పీవీ విధానాన్ని అనుసంధానం చేస్తారు. ♦ రాయితీ ప్రాసెసింగ్, విడుదలకు నెడ్‌క్యాప్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ♦ నేరుగా ఎంఎన్ఆర్ఐ చానెల్ భాగస్వామ్యం ద్వారా కూడా దీనిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఖర్చు ఇలా... ♦ 250 వాట్స్ సామర్థ్యం ఉన్న సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు రూ.38 వేలు ఖర్చవుతుంది. దీంతో 2 ఫ్యాన్లు, 2 ట్యూబ్‌లు, ఒక టీవీ నిరంతరం వాడినా 5 గంటల పాటు సరఫరా ఉంటుంది. ♦ 500 వాట్స్ సౌర వ్యవస్థ ఏర్పాటుకు రూ. 80 వేల వరకు ఖర్చవుతుంది. 3 ఫ్యాన్లు, 3 ట్యూబ్‌లు, ఒక టీవీ, ఒక కంప్యూటర్ 5 గంటల పాటు వాడుకోవచ్చు. ♦ కిలో వాట్ సౌరవ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే రోజుకు 4 యూనిట్లు అంటే 4000 వాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీనికి సుమారు రూ. 1.50 లక్షలు ఖర్చవుతుంది. ♦ 2 కిలో వాట్ల సామర్థ్యం ఉన్న సౌర వ్యవస్థ ఏర్పాటుకు రూ. 3 లక్షలు ఖర్చవుతుంది. ♦ 3 కిలో వాట్ల సామర్థ్యం ఉన్న సౌరవ్యవస్థ ఏర్పాటుకు రూ. 5 లక్షల వరకు ఖర్చవుతుంది. దీంతో 1.5 టన్ ఏసీ 5 గంటల పాటు పని చేస్తుంది. రాయితీ సౌకర్యం.. ♦ సౌర విద్యుత్ వాడకాన్ని ప్రోత్సహించేందుకు కే ంద్ర ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. ఎంఎన్ఆర్ఈ కింద 30 శాతం రాయితీని అందిస్తోంది. గృహ వినియోగదారులకు 250 వాట్స్ నుంచి 3 కిలో వాట్ సామర్థ్యం వరకు రాయితీ పొందే వీలుంది. వ్యాపార, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలకు 100 కేవీ సామర్థ్యం వరకు రాయితీ కల్పిస్తోంది. నెట్ మీటరింగ్ వ్యవస్థ అంటే.. ♦ సోలార్ రూఫ్ టాప్ ఫొటో వోల్టాయిక్(ఎస్పీవీ) విద్యుత్ ఉపకరణాల ద్వారా నెట్ మీటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఇందులో వినియోగదారుడు ఉత్పత్తి చేసే సౌర విద్యుత్‌లో సొంత వినియోగం పోగా మిగిలిన దాన్ని డిస్కంలు కొనుగోలు చేస్తాయి. విద్యుత్ నియంత్రణ మండలి నిర్ధరిత ధరను చెల్లిస్తుంది. -
షార్ట్ సర్క్యూట్‌తో పరికరాలు దగ్ధం
మెదక్ రూరల్ :దొంగ కరెంట్ వాడుతున్న క్ర మంలో గ్రామంలో షార్ట్ సర్క్యూట్ సంభవించి సుమారు 40 ఇళ్లలోని ఎలక్ట్రానిక్ పరికరాలు అగ్నికీలాల్లో తగలబడి పోయాయి. ఈ సంఘటన మండలంలోని గంగాపూర్‌లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రా మంలోని 3, 4వ వార్డుల్లో శుక్రవారం అర్ధరాత్రి ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ సంభవించింది. ఈ ఘటనలో ఇళ్లలోని బల్పులు, టీవీలు, కుక్కర్లతో పాటు ప్లగ్గులో పెట్టి ఉంచిన సెల్‌ఫోన్ చార్జర్లు కాలిపోయాయి. దొడ్లె కిరణ్ ఇంట్లో టీవీ కి మంటలు అంటుకుని పెద్దగా మం టలు లేచి ఇంట్లో నిలువ ఉంచిన ధాన్యం బస్తాలు, తలుపులకు మంటలు అంటుకుని ఇతర వస్తువులు కాలిపోయాయి. దీంతో ఆయా ఇళ్లను వదిలిన బాధితులు బయటకు పరుగులు పెట్టారు. అయితే.. ఈ రెండు వార్డులకు విద్యుత్ సరఫరా చేస్తున్న సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ట్రిప్ కావడంతో భారీ నష్టం తగ్గింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగా సుమారు రూ. లక్ష మేర నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. విషయం తెలుసుకున్న ట్రాన్స్‌కో లైన్‌మన్ యూసుఫ్ గ్రామానికి చేరుకుని కాలిన వైర్లను సరి చేశాడు. అయితే మీ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని లైన్‌మన్‌ను నిలదీశాడు. అక్రమంగా విద్యుత్‌ను వాడే వారిపై చర్యలు తీసుకునే అధికారం తనకు లేదని, ఈ విషయాన్ని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు.