సౌర వెలుగులు ఇలా..
సామాన్య, మధ్య, ధనిక వర్గాలు తేడాలేకుండా అందరినీ వేధిస్తున్న కరెంటు కోతలకు ప్రత్యామ్నాయం సోలార్ సిస్టం. ఫ్యాన్లు, బల్బులు పనిచేయకుండానే బిల్లుల భారం మోపుతున్న నేపథ్యంలో సోలార్ వినియోగం ఇటీవల బాగా పెరిగింది. సోలార్ పరికరాల వాడకంపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. సోలార్ విద్యుత్ పొందేందుకు ఇంటినే ఉత్పాదక కేంద్రంగా మార్చుకుని విద్యుత్ బిల్లుల నుంచి ఉపశమనం పొందొచ్చు. సౌర వ్యవస్థ ఏర్పాటు, దరఖాస్తు చేసుకునే విధానం తదితర అంశాల సమాచారం మీకోసం.. - దోమ
♦ వినియోగదారులు విద్యుత్ శాఖ అధికారిక వెబ్‌సైట్ నుంచి సోలార్ రూప్‌టాప్ నెట్‌మీటరింగ్ దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవాలి.
♦ పూర్తి చేసిన దరఖాస్తును రూ.1000 ఫీజుతో సంబంధిత డివిజన్ ఇంజినీరుకు అందించాలి.
♦ దరఖాస్తు అందిన 15 రోజుల్లో సాధ్యాసాధ్యాలను పరిశీలించి సిబ్బంది అనుమతిస్తారు.
♦ వినియోగదారులు డిస్కం సూచించిన ఫార్మాట్‌లో ఒప్పందం కుదుర్చుకోవాలి. ఇది ఆరు నెలల పాటు చెల్లుబాటవుతుంది.
♦ అనుమతి పొందిన ఆరునెలల్లోపు సోలార్ రూఫ్ టాప్ ఫొటో వోల్టాయిక్ (ఎస్‌పీవీ) విధానాన్ని అమర్చుకొని డిస్కం అధికారులతో నిర్ధరించుకోవాలి.
♦ అధికారుల తనిఖీల్లో వినియోగదారులు స్థాపించిన పరికరాలు ప్రమాణాలకు తగినట్లుగా ఉన్నట్లయితే పది రోజుల్లో ఎస్‌పీవీ విధానాన్ని అనుసంధానం చేస్తారు.
♦ రాయితీ ప్రాసెసింగ్, విడుదలకు నెడ్‌క్యాప్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.
♦ నేరుగా ఎంఎన్‌ఆర్‌ఐ చానెల్ భాగస్వామ్యం ద్వారా కూడా దీనిని ఏర్పాటు చేసుకోవచ్చు.
ఖర్చు ఇలా...
♦ 250 వాట్స్ సామర్థ్యం ఉన్న సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు రూ.38 వేలు ఖర్చవుతుంది. దీంతో 2 ఫ్యాన్లు, 2 ట్యూబ్‌లు, ఒక టీవీ నిరంతరం వాడినా 5 గంటల పాటు సరఫరా ఉంటుంది.
♦ 500 వాట్స్ సౌర వ్యవస్థ ఏర్పాటుకు రూ. 80 వేల వరకు ఖర్చవుతుంది. 3 ఫ్యాన్లు, 3 ట్యూబ్‌లు, ఒక టీవీ, ఒక కంప్యూటర్ 5 గంటల పాటు వాడుకోవచ్చు.
♦ కిలో వాట్ సౌరవ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే రోజుకు 4 యూనిట్లు అంటే 4000 వాట్‌ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీనికి సుమారు రూ. 1.50 లక్షలు ఖర్చవుతుంది.
♦ 2 కిలో వాట్‌ల సామర్థ్యం ఉన్న సౌర వ్యవస్థ ఏర్పాటుకు రూ. 3 లక్షలు ఖర్చవుతుంది.
♦ 3 కిలో వాట్‌ల సామర్థ్యం ఉన్న సౌరవ్యవస్థ ఏర్పాటుకు రూ. 5 లక్షల వరకు ఖర్చవుతుంది. దీంతో 1.5 టన్ ఏసీ 5 గంటల పాటు పని చేస్తుంది.
రాయితీ సౌకర్యం..
♦ సౌర విద్యుత్ వాడకాన్ని ప్రోత్సహించేందుకు కే ంద్ర ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. ఎంఎన్‌ఆర్‌ఈ కింద 30 శాతం రాయితీని అందిస్తోంది. గృహ వినియోగదారులకు 250 వాట్స్ నుంచి 3 కిలో వాట్ సామర్థ్యం వరకు రాయితీ పొందే వీలుంది. వ్యాపార, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలకు 100 కేవీ సామర్థ్యం వరకు రాయితీ కల్పిస్తోంది.
నెట్ మీటరింగ్ వ్యవస్థ అంటే..
♦ సోలార్ రూఫ్ టాప్ ఫొటో వోల్టాయిక్(ఎస్‌పీవీ) విద్యుత్ ఉపకరణాల ద్వారా నెట్ మీటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఇందులో వినియోగదారుడు ఉత్పత్తి చేసే సౌర విద్యుత్‌లో సొంత వినియోగం పోగా మిగిలిన దాన్ని డిస్కంలు కొనుగోలు చేస్తాయి. విద్యుత్ నియంత్రణ మండలి నిర్ధరిత ధరను చెల్లిస్తుంది.