ఎల్‌ఈడీ లైట్ల వల్ల మనకెంత ముప్పు? | LED lights can damage your eyes? | Sakshi
Sakshi News home page

ఎల్‌ఈడీ లైట్ల వల్ల మనకెంత ముప్పు?

Published Mon, Jun 27 2016 4:46 PM | Last Updated on Mon, Sep 4 2017 3:33 AM

ఎల్‌ఈడీ లైట్ల వల్ల మనకెంత ముప్పు?

ఎల్‌ఈడీ లైట్ల వల్ల మనకెంత ముప్పు?

న్యూయార్క్: వాతావరణ కాలుష్యం, ధ్వని కాలుష్యం మానవ ఆరోగ్యంపై ఎంతగా ప్రభావం చూపిస్తాయో వివిధ రకాల బల్బుల నుంచి వెలువడే కాంతి కిరణాలు కూడా వాటి స్థాయినిబట్టి అంతకన్నా ఎక్కువ ప్రభావాన్నే చూపిస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మనం సంప్రదాయబద్ధంగా వాడుతున్న సోడియం బల్బులకన్నా కూడా ఎల్‌ఈడీ బల్బులు మన ఆరోగ్యానికి ఎక్కువ హాని చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఎల్‌ఈడీ బల్బుల ద్వారా వెలువడే కాంతి రంగు ఉష్ణోగ్రత (కలర్ టెంపరేచర్) స్థాయినిబట్టి మన ఆరోగ్యానికి కలిగే హాని తీవ్రత ఆధారపడి ఉంటుంది.

 కలర్ టెంపరేచర్‌ను ‘కెల్విన్’లో కొలుస్తారు. థర్మోడైనమిక్ ధియరీని ఉపయోగించి రూపొందించిన కెల్విన్ స్కేల్ ద్వారా ఓ బల్బు నుంచి ఏ రంగు కాంతి ఎక్కువగా వెలువడుతుందో కొలుస్తారు. ప్రతి బల్బు నుంచి ఎరుపు, పసుపు, నీలి రంగు కాంతులు వెలువడుతాయి. ఓ బల్బు నుంచి నీలి రంగు కాంతి తరంగాలు ఎక్కువగా వెలువడినప్పుడు తెల్లటి వెలుతురు ఎక్కువగా ఉంటుంది. అంటే ఇతర సంప్రదాయక సోడియం బల్బులకన్నా ఫ్లోరెసెంట్, ఎల్‌ఈడీ బల్బుల నుంచే నీలి రంగు కాంతి ఎక్కువగా వెలువడుతుంది. ఈ నీలి రంగు కాంతి ఎక్కువగా ఉండడమే మన కళ్లకు, మన ఆరోగ్యానికి హానికరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మూడు వేల కెల్విన్ల సోడియం బల్బుకన్నా 3000 కెల్విన్ల ఎల్‌ఈడీ బల్బులో ఎక్కువగా నీలి కిరణాలు ఉంటాయి. ఈ కిరణాలు మానవులకు రెండు రకాలుగా హానిచేస్తాయి. నీలి కిరణాల వల్ల గ్లేరింగ్ ఎక్కువగా ఉంటుంది. ఎల్‌ఈడీ వీధి లైట్ల కారణంగా మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కళ్లలో ఎక్కువ గ్లేరింగ్ పడుతుంది. దీనివల్ల డ్రైవింగ్‌కు అవరోధం ఏర్పడుతోంది. ఇక రెండోరకంగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఎరుపు, పసుపు కాంతులకు భిన్నంగా నీలి రంగు కాంతి కంటి రెటీనాపై చిట్లిపోయి విస్తరిస్తుంది. ఫలితంగా రెటీనా దెబ్బతింటుంది. చూపు మందగిస్తుంది. మనం సుఖంగా నిద్రపోయేందుకు ఉపయోగపడే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని దెబ్బతీస్తుంది. ఫలితంగా నిద్రలేమి జబ్బు వస్తుంది. శరీరం మొత్తంగా చూస్తే మన శరీరంలో 24 గంటలపాటు కొనసాగే భౌతిక ప్రక్రియల సైకిల్ దెబ్బతింటుందని కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

 ఇంధనం ఆదా అవడమే కాకుండా డబ్బుకూడా ఆదా అవుతుండడంతో ఎక్కువ దే శాలు ఇప్పుడు ఎల్‌ఈడీ బల్బులనే ప్రోత్సహిస్తున్నాయి. భారత్ లాంటి దే శాల్లో ఈ బల్బులపై ప్రభుత్వం సబ్సిడీలు కూడా ఇస్తోంది. సాధారణంగా ఇంట్లోవాడే ఎల్‌ఈడీ, టీవీల్లో వాడే ఎల్‌ఈడీ బల్బుల్లో కలర్ టెంపరేచర్ ఎక్కువగా ఉండదుకనుక ప్రమాదమేమి లేదు. అయితే ఇంట్లోని ఎల్‌ఈడీ బల్బులను నేరుగా చూడకూడదు. నిద్రపోయేటప్పుడు ఎల్‌ఈడీ లైట్లను ఆర్పేయాల్సి ఉంటుంది. నిద్రపోయినప్పుడు కూడా ఎల్‌ఈడీ బల్బు వెలుగుతుంటే నీలి కిరణాలు మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తాయని కొంత మంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 ఎక్కువ వరకు మనకు వీధిలోని ఎల్‌ఈడీ లైట్ల కాంతి వల్లే ముప్పు వాటిల్లుతుంది. అయితే వాటి తీవ్రత కూడా వాటిలోకి కెల్విన్ల స్థాయినిబట్టి ఉంటుంది. మూడు వేల కెల్విన్లకు మించితే ప్రమాదకరమని అమెరికా మెడికల్ అసోసియేషన్ నిర్ధారించింది. అందుకు అనుగుణంగా అమెరికా రాష్ట్ర, మున్సిపల్ ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. అమెరికా మున్పిపాలిటీలన్నీ ఇప్పుడు వీధుల్లో మూడువేల నుంచి నాలుగువేల కెల్విన్ల బల్బులను ఉపయోగిస్తున్నాయి. మూడువేల కెల్విన్లు అంటే 2,726 డిగ్రీల సెల్సియస్‌కు సమానం. మూడువేల కెల్విన్లకు మించిన వీధి లైట్లు వాడరాదని, వాటిలోని నీలి కాంతులను కాస్త నియంత్రించేందుకు బల్బుల చుట్టూ షేడ్స్ వాడాలని అమెరికా మెడికల్ అసోసియేషన్ తన మార్గదర్శకాల్లో సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement