కాంతివంతంగా..
పది మందికి ఉపాధి కల్పిస్తున్న గిరిజన యువతి..
ఎల్‌ఏడీ బల్బ్‌ల యూనిట్‌తో అద్భుతాలు సృష్టిస్తున్న వీరలక్ష్మి
రాజవొమ్మంగి : గిరిజనులు అంటే కొండ చీపుర్లు, చింతకాయలు అమ్ముకొనేవారు కాదని, తాము కూడా పెద్దపెద్ద పరిశ్రమలు నెలకొల్పగలమని, పది మందికి ఉపాధి చూపగలమనే దృఢ నిశ్ఛయంతో ఉన్నారు. దీనికి నిదర్శనమే తూర్పు ఏజెన్సీ అడ్డతీగల మండలం బొడ్లంక గ్రామానికి చెందిన కొల్లపురెడ్డి వీరలక్ష్మి. ఈమె కాకినాడ జేఎన్‌టీయూలో బీటెక్ చదివారు. అంతకు ముందు ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్ వరకు రాజవొమ్మంగి బాలికల గురుకుల పాఠశాలలో చదివింది. రంపచోడవరంలో రూ.కోటితో ట్విలైట్ (ట్రైబుల్ విమన్ ఇన్‌స్టాల్డ్ లెడ్ ఇన్ ఐటీడీఏ ఆఫ్ రంపచోడవరం) పేరుతో బల్బ్‌ల అసెంబుల్డ్ యూనిట్‌ను స్థాపించింది. రంపచోడవరం ఐటీడీఏ, జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ ఈమెను ప్రోత్సహించి బ్యాంకులోన్ ఇప్పించారు. ప్రస్తుతం ఏపీఈపీడీసీఎస్ ద్వారా లక్ష బల్బ్‌లకు ఆఫర్ వచ్చిందని, ఈ నేపథ్యంలో ప్రతి పంచాయతీ పరిధిలో గిరిజన కుంటుంబానికి రెండు ఎల్‌ఈడీ బల్బ్‌లు రాయితీ ధరకు (రెండు బల్బ్‌లు రూ.20 మాత్రమే, అసలు ఖరీదు రూ.250) సరఫరా చేస్తున్నట్టు వీరలక్ష్మి చెబుతోంది. తాను ట్విలైట్ యూనిట్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ కాగా తనతో పాటు మరో 42 మంది చదువుకొన్న గిరిజన యువతులు ఈ కంపెనీ ద్వారా ఉపాధి పొందుతున్నారన్నారు. తామంతా సొసైటీగా (రంప గిరిజన మహిళా సమాఖ్య పారిశ్రామిక సహకార సంఘంగా) ఏర్పడి తక్కువ విద్యుత్ ఖర్చుతో ఎక్కువ కాంతినిచ్చే ఎల్‌ఈడీ బల్బ్‌లు, ట్యూబ్‌లైట్స్, స్ట్రీట్‌లైట్స్, విద్యుత్ లేనప్పుడు ఉపయోగించే ఎమర్జెన్సీ లైట్స్ తయారు చేస్తున్నామన్నారు.