
ఎల్‌ఈడీలు తెలుసుగా.. అతి తక్కువ కరెంటు ఖర్చుతో దీర్ఘకాలం పాటు బోలెడంత వెలుగునిచ్చే సరికొత్త బల్బులు. కాలిఫోర్నియా యూనివర్శిటీ (బెర్క్‌లీ) ఇంజినీర్లు తాజాగా ఇంకో కొత్త రకం ఎల్‌ఈడీలు తయారుచేశారు. కేవలం కొన్ని మిల్లీమీటర్ల పరిమాణంలో ఉండే ఈ కొత్త బల్బుల్ని ఆఫ్ చేసినప్పుడు పూర్తి పారదర్శకంగా ఉంటాయి. ఈ బల్బులో కేవలం మూడు పరమాణువుల మందంతో ఉండే అర్ధవాహకం (సెమీ కండక్టర్) పొర ఒకటి ఉంటుంది. అయితే ఏంటి అంటున్నారా? చాలా సింపుల్. ఈ సరికొత్త బల్బులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. టీవీలు, కంప్యూటర్లు, హోర్డింగులు వంటి అన్ని రకాల తెరలూ మాయమైపోతాయి. అదెలా అనొద్దు. ఆఫ్‌లో ఉన్నప్పుడు పారదర్శకంగా ఉంటాయని ముందే చెప్పుకున్నాం కదా.. అందుకన్నమాట!
గాజు కిటికీలు, తలుపుల్లోపలే డిస్‌ప్లే తెరలను ఏర్పాటు చేసేందుకు ఈ కొత్త బల్బులు ఉపయోగపడతాయని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డెర్ హీన్ లీన్ తెలిపారు. బల్బులో వాడే మూడు పరమాణువుల మందమైన పొర నాలుగు రకాల పదార్థాలతో తయారు చేయవచ్చునని... ఒక్కోటి ఒక్కో ప్రాథమిక రంగును వెదజల్లుతుంది కాబట్టి... వీటిని నియంత్రించడం ద్వారా తెరపై మనకు నచ్చిన రంగును సృష్టించవచ్చునని వివరించారు. అతి పలుచగా ఉండే ఈ కొత్త బల్బులను మనిషి చర్మంపై పచ్చబొట్టు మాదిరిగా ఏర్పాటు చేసుకోవచ్చునని చెప్పారు. అయితే ఈ స్థాయిలో వీటిని ఉపయోగించుకునేందుకు మరికొంత సమయం పట్టవచ్చునని లీన్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment