free electricity scheme
-
ఉచిత విద్యుత్‌కు ఆదిబట్ల నుంచే అడుగులు
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రభుత్వ విద్యా సంస్థలకు అమలు చేయనున్న ఉచిత విద్యుత్ పథకం.. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల ప్రాథమిక పాఠశాల నుంచి శనివారం ప్రారంభం కానుంది. ఈ స్కూల్లో 5వ తరగతి విద్యార్థిని ఎన్.అంజలి ‘ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందించాలని నా మనవి’అంటూ 9 డిసెంబర్ 2023న ముఖ్యమంత్రికి రాసిన ఉత్తరం ఇందుకు స్ఫూర్తిగా నిలిచింది. 23 జూలై 2024న అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ అందిస్తామని సర్కారు కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు సంబంధిత శాఖల విభాగాధిపతులకు ఆదేశాలు జారీ చేసింది.నా ఆశయం నెరవేరింది ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంట్ ఇవ్వాలని నేను గతేడాది డిసెంబర్ నెలలో మా ఉపాధ్యాయుల సహకారంతో ముఖ్యమంత్రికి లేఖ రాశా. దీనిపై స్పందించిన ప్రభుత్వం సానుకూల ప్రకటనతోపాటు అమలు చేయడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం నేను ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నా. – ఎన్.అంజలి, విద్యార్థిని, ఆదిబట్ల -
కోటి ఇళ్లకు 300 యూనిట్లు ఉచిత విద్యుత్!
రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ల ద్వారా దేశంలోని కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో స్పష్టం చేసింది. 2024-25 పూర్తి స్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రవేశపెట్టారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్లో చేసిన ప్రకటనకు అనుగుణంగా, రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా కోటి గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించడానికి ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.గ్రీన్ గ్రోత్ , పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడానికి అనేక చర్యలను ప్రకటించిన ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో రూఫ్‌టాప్ సోలార్ స్కీమ్‌కు విశేష స్పందన వచ్చినట్లు చెప్పారు. ఈ పథకానికి ఇప్పటివరకు 1.28 కోట్ల రిజిస్ట్రేషన్లు, 14 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు.ఆ ఉచిత సౌర విద్యుత్ పథకం ద్వారా ఆయా కుటుంబాలకు సంవత్సరానికి రూ. 15,000-18,000 కోట్ల వరకు ఆదా అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. అంతేకాకుండా మిగులు విద్యుత్‌ను పంపిణీ సంస్థలకు విక్రయించవచ్చు. సప్లయి, ఇన్స్టాలేషన్, మెయింటెనెన్స్ చేసే క్రమంలో అనేక మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంటోంది. -
రేషన్‌కార్డే ప్రామాణికం! లేకపోతే నో
సాక్షి, హైదరాబాద్: ఆరు గ్యారంటీలలో భాగంగా ఈ నెలలోనే అమలు చేయాలని భావిస్తున్న మరో రెండు గ్యారంటీలపై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లోనే రూ.500కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ (గృహజ్యోతి) హామీల అమలు ప్రక్రియ ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా ఈ రెండు హామీలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపికకు రేషన్‌కార్డు (ఆహార భద్రతా కార్డు)నే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందుకోసం సంబంధిత అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు కూడా ప్రారంభించింది. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌కు సంబంధించి విద్యుత్ శాఖ, రూ 500కు గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే ప్రక్రియపై పౌరసరఫరాల శాఖ విధి విధానాలు రూపొందిస్తున్నాయి. ఇప్పటికే ప్రజాపాలనలో భాగంగా ప్రజల నుంచి దరఖాస్తులు అందినప్పటికీ, నేరుగా వినియోగదారుల నుంచి అర్హతకు సంబంధించిన పత్రాలు తీసుకోవాలని ఆయా శాఖలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించిన ప్రక్రియను మంగళవారం నుంచే ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. కోత తప్పదా? రాష్ట్రంలో 1.28 కోట్ల డొమెస్టిక్ (గృహ వినియోగ) గ్యాస్ కనెక్షన్లు ఉండగా, 1.23 కోట్ల గృహావసర విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో ప్రభుత్వ పథకాలకు అర్హులను ఎంపిక చేసేందుకు ప్రస్తుతం రేషన్‌కార్డునే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద జారీ అయిన ఆహార భద్రతా కార్డులు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆహార భద్రతా కార్డులు కలిపి 90,14,263 రేషన్‌కార్డులు ఉన్నాయి. ప్రభుత్వం వీరందరికీ రెండు గ్యారంటీలను అమలు చేయాల్సి వస్తే ఎలాంటి అభ్యంతరాలు, నిబంధనలు లేకుండా అమలు చేయాలి. కానీ దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలనే అర్హులుగా పరిగణించాలని భావిస్తే మాత్రం గణనీయంగా కోత తప్పదని ఓ అధికారి తెలిపారు. ఈ పరిస్థితుల్లో లబ్ధిదారుడి ఆర్థిక, సామాజిక స్థితి గతులను కూడా పరిగణనలోకి తీసుకొని రెండు గ్యారంటీలను అమలు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే వచ్చిన ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా లబ్ధిదారుల ఆర్థిక స్థితిగతులను అంచనా వేసే కార్యక్రమం ఓవైపు సాగుతుండగా, విద్యుత్ శాఖ, పౌరసరఫరాల శాఖ తరఫున మరోసారి లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ సాగనున్నట్లు సమాచారం. బిల్లులు ఎవరు కడితే వారి పేరుపైనే.. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని అమలు చేసేందుకు మంగళవారం నుంచే విద్యుత్ శాఖ రంగంలోకి దిగనుంది. ఈనెల కరెంటు బిల్లు లెక్కలు తీసుకునేందుకు వచ్చే వ్యక్తి బిల్లు కోసం వచ్చినప్పుడే మీటర్ నంబర్ యాక్టివేట్ అవుతుంది. ఆ బిల్లుకు సంబంధించి ఉన్న ఇంటి యజమాని ఆధార్, రేషన్‌కార్డు (ఆహారభద్రతా కార్డు), ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు ఎంట్రీ చేసే కార్యక్రమం కొనసాగనుంది. ఒకవేళ ఇంటి యజమాని కాకుండా అద్దెకు ఉన్న వ్యక్తులు కరెంటు బిల్లులు చెల్లిస్తున్నట్టయితే, ఆ కిరాయిదారు పేరు మీద మీటర్‌ను యాక్టివేట్ చేస్తారు. రేషన్‌కార్డు లేని వారి నుంచి వివరాలు తీసుకోరు. ఈ వివరాలతో పాటు ప్రజాపాలన కింద వచ్చిన దరఖాస్తుల్లోని వివరాలు కూడా పరిశీలించి ప్రభుత్వం అర్హులను ఎంపిక చేయనుంది. ఉచిత విద్యుత్ పథకానికి ఏటా రూ.4 వేల కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసినట్లు తెలిసింది. ఏడాదికి ఆరు సిలిండర్లు! గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి.. సిలిండర్ బుక్ చేసినప్పుడు డెలివరీ కోసం వచ్చిన వ్యక్తి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కేవైసీ తరహాలో లబ్ధిదారుల వివరాలను సేకరించడంతో పాటు గ్యాస్ సిలిండర్, ఆధార్, రేషన్‌కార్డు నంబర్లను తీసుకుంటారు. వీటితో పాటు ఆర్థిక స్థోమతను అంచనా వేయడానికి కుటుంబ వివరాలను కూడా తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఇలావుండగా ఒక కుటుంబానికి సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు రూ.500 చొప్పున సరఫరా చేయాలనే అంశంపై స్పష్టత రావలసి ఉంది. అయితే ఒక పేద కుటుంబానికి ఏడాదికి 6 సిలిండర్లు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. సంవత్సరానికి 6 సిలిండర్లు రూ.500 చొప్పున ఇచ్చినా రేషన్‌కార్డుల లెక్క ప్రకారం ఏడాదికి రూ.3,245 కోట్లు సబ్సిడీ రూపంలో వెచ్చించాల్సి వస్తుందని అంచనా. అయితే దీనికి సంబంధించి ఇంకా విధి విధానాలు ఖరారు కాలేదు. అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించనుంది. -
త్వరలోనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు
సాక్షి, హైదరాబాద్: త్వరలోనే గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీ నెరవేరబోతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. హామీల అమలుపై సమీక్షలు జరిపి వంద రోజుల్లో అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. మంగళవారం గాంధీభవన్‌కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు గుల్ల చేసిందని, అందుకే హామీల అమలులో కొంత జాప్యం జరుగుతోందని చెప్పారు. ఇక, కరెంటు బిల్లులు కోమటిరెడ్డి ఇంటికి పంపాలన్న మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో జగదీశ్‌రెడ్డి పాత్ర కూడా ఉందని, ఆయన జైలుకెళ్లడం ఖాయమని, ఆయన తోపాటు కేటీఆర్, కవితలకూ జైలు తప్పదన్నారు. 200 యూ నిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వకపోతే కరెంటు బిల్లులు తమకు పంపాలని బీఆర్ఎస్ ప్రజలను రెచ్చగొడుతోందని, రూ.3,016 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన కేసీ ఆర్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, తాము నిరుద్యోగులను ఇలాగే రెచ్చగొట్టి ఉంటే కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చేవారా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం అక్రమాల నిగ్గు తేల్చే పనిలో ఉన్నామని, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అన్ని అక్రమాలపై విచారణ జరుగుతోందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ చీలికలు, పీలికలు అవుతుందని, ఒక్క పార్లమెంట్ స్థానంలో కూడా బీఆర్ఎస్ గెలవదని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. -
బీఆర్ఎస్ సర్కార్ ధోబీ ఘాట్లకు కరెంటు బిల్లులు చెల్లించలేదు
సాక్షి, హైదరాబాద్: లాండ్రీలు, ధోబీఘాట్లు, హెయిర్ కటింగ్ సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగిస్తామని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గత ప్రభుత్వం 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించిందని, అందుకయ్యే వ్యయాన్ని మాత్రం డిస్కంలకు చెల్లించలేదని మంత్రి పేర్కొన్నారు. అయితే బకాయిల పేరిట విద్యుత్ కనెక్షన్ తొలగించొద్దని డిస్కంలకు మంత్రి సూచించారు. ఈ విద్యుత్ బిల్లుల బకాయిలు చెల్లించడానికి నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖను కోరుతామన్నారు. ఈ ఏడాది జనవరి మూడోతేదీ వరకు వాషర్‌మె న్లో లబ్ధిదారులు 76,060 మంది కాగా, బకాయిలు రూ.78.55 కోట్లు అని, నాయీ బ్రాహ్మణ లబ్ధిదారులు 36,526 మంది కాగా, బకాయిలు రూ.12.34 కోట్లు ఉన్నాయన్నారు. -
స్మార్ట్ మీటర్లతో విద్యుత్ నష్టాలకు చెక్
సాక్షి, అమరావతి: స్మార్ట్ మీటర్ల వల్ల విద్యుత్ నష్టాలను అరికట్టవచ్చని.. సరఫరా వ్యయాన్ని తగ్గించవచ్చని కేంద్ర విద్యుత్ శాఖ తాజాగా వెల్లడించింది. ఈ మీటర్లను పెట్టడం వల్ల ఎనర్జీ ఆడిటింగ్, అకౌంటింగ్‌కు అవకాశం ఉంటుందని తెలిపింది. అందుకే వ్యవసాయ, వాణిజ్య, గృహ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు అమర్చాలని రాష్ట్రాలకు సూచించినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2025 మార్చి నాటికి దేశమంతటా.. కేంద్ర విద్యుత్ శాఖ ప్రతిపాదిత పంపిణీ వ్యవస్థ పునరుద్దీకరణ పథకం(ఆర్డీఎస్ఎస్)లో భాగంగా విద్యుత్ స్మార్ట్‌మీటర్ల బిగింపు ప్రక్రియ దేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు ఏపీలోనూ జరుగుతోంది. ఇప్పుడు ఉన్న దాదాపు 1.80 కోట్ల మంది (వ్యవసాయేతర) వినియోగదారులలో నెలకు 200 యూనిట్ల వరకు వినియోగించేవారిని మినహాయించి మిగిలిన వారికి స్మార్ట్ మీటర్లు బిగించాలని డిస్కంలు ప్రతిపాదించాయి. అలాగే ‘ఆర్డీఎస్ఎస్’లో భాగంగా 2025 మార్చి నాటికి దేశమంతటా అన్ని రాష్ట్రాలూ స్మార్ట్ విద్యుత్ మీటర్లు పెట్టాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు 2019లోనే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఒక రెగ్యులేషన్ ఇచ్చింది. దాని ప్రకారం ఏపీలో 18.56 లక్షల వ్యవసాయ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు అమర్చాలని ప్రభుత్వం 2020వ సంవత్సరంలో ఆదేశాలిచ్చింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్ల ప్రక్రియ 50 శాతం నుంచి 100 శాతం వరకు పూర్తయ్యింది. అయితే స్మార్ట్ మీటర్లపై అనేక అపోహలు, విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం తాజాగా వివరణ ఇచ్చింది. రైతులపై పైసా కూడా భారం పడదు.. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఇచ్చే విద్యుత్‌ను కచ్చితత్వంతో లెక్కించలేకపోవడం వల్ల ఇంధన ఆడిట్ కష్టమవుతోంది. వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్ పథకం ద్వారా ఎంత వినియోగం జరుగుతుందో తెలుసుకోవడానికి, లబ్ధిదారులకు నగదు బదిలీ కింద ప్రతి నెలా సబ్సిడీ రూపంలో ఎంత మొత్తం చెల్లించాలనే సమాచారం కోసం.. వ్యవసాయ కనెక్షన్లకు బిగించే స్మార్ట్ మీటర్లు ఉపయోగపడతాయి. అలాగే విద్యుత్ ప్రమాదాల నుంచి రైతులను రక్షించేందుకు అలైడ్ మెటీరియల్‌ను ఉచితంగా అందిస్తారు. ఈ ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. వినియోగదారులపై గానీ, విద్యుత్ సంస్థలపై గానీ ఒక్క పైసా కూడా భారం పడదు. ‘ఆర్డీఎస్ఎస్’కు ఏపీ డిస్కంలు ఎంపికైనట్టు కేంద్రం ప్రకటించింది. తద్వారా మీటరుకు రూ.1,350 వరకు గ్రాంట్ పొందే అవకాశం ఏర్పడింది. స్మార్ట్ మీటర్ల సరఫరా, నిర్వహణ, ఆపరేషన్ బాధ్యత మొత్తం సర్వీస్ ప్రొవైడర్లదేనని కేంద్రం వివరించింది. స్మార్ట్‌మీటర్లతో ఉపయోగాలు.. మన రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య భవనాలు, పరిశ్రమలతో పాటు విద్యుత్ పంపిణీ ట్రాన్స్ఫార్మర్లకు, 11కేవి ఫీడర్లకు అన్నింటికీ కలిపి 42 లక్షల స్మార్ట్ మీటర్లను బిగించేందుకు డిస్కంలు చర్యలు చేపట్టాయి. గృహాలకు స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు పెట్టడం వల్ల సమయానుసార(టైం ఆఫ్ డే) టారిఫ్ విధానంలో పాల్గొనే అవకాశం వస్తుంది. విద్యుత్ కొనుగోలు ధరలు తక్కువగా ఉండే సమయంలో వారి వినియోగాన్ని పెంచుకుని టారిఫ్ లాభం పొందే అవకాశం ఉంది. అలాగే బిల్లును ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఆ బిల్లు మొత్తాన్ని ఒకేసారి కాకుండా అవసరాలకు అనుగుణంగా చెల్లించవచ్చు. విద్యుత్ సరఫరా చేసే సమయం, విద్యుత్ నాణ్యత తెలుసుకోవచ్చు. విద్యుత్ చౌర్యాన్ని అరికట్టవచ్చు. ఈ మీటర్ల పెట్టుబడిలో దాదాపు 40 శాతం వరకు రాయితీ లభిస్తుంది. రైతులకు అభ్యంతరం లేదు స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల వ్యవసాయ బోరు పనితీరు మెరుగుపడుతుంది. మోటార్ కాలిపోకుండా ఉంటుంది. ఇప్పటికంటే మెరుగైన విద్యుత్ వస్తుందని విద్యుత్ శాఖ సిబ్బంది మాకు వివరించారు. దీంతో మీటర్ పెట్టడానికి మా లాంటి రైతులందరూ ముందుకు వస్తున్నారు. మీటర్‌తో పాటు రక్షణ పరికరాలు అందించడం బాగుంది. మాకు 8 బోర్లు ఉన్నాయి. స్మార్ట్ మీటర్ వల్ల ఏ సర్వీసునూ తొలగించలేదు. – బొల్లారెడ్డి రామకృష్ణారెడ్డి, రైతు, వీరంపాలెం, పశ్చిమగోదావరి జిల్లా -
కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాదికి 11 వేల కోట్ల రూపాయలను ఉచిత కరెంట్ కోసం ఖర్చు చేస్తున్నామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. శనివారం సాయంత్రం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో కాంగ్రెస్‌పై, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. ‘‘రేవంత్‌రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారు. మూడు గంటల కరెంట్ చాలని అంటున్నారు. తెలంగాణలో ఉన్నది చిన్న, సన్నకారు రైతులే.. కాబట్టి 3 గంటల కరెంట్ చాలని రేవంత్ అంటున్నారు. రైతులకు రేవంత్ క్షమాపణలు చెప్పాలి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 3-4 గంటలకు మించి కరెంట్ వచ్చిందా?. బీఆర్ఎస్ అంటే పంట కోతలు.. కాంగ్రెస్ అంటే కరెంట్ కోతలు. కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలా? ఆలోచించుకోండి’’ అని తెలంగాణ రైతులను ఉద్దేశించి కేటీఆర్ పిలుపు ఇచ్చారు. ‘‘ధరణితో రైతులకు ఎంతో మేలు జరిగింది. పెండింగ్ ప్రాజెక్టులను త్వరగతిన పూర్తి చేసుకున్నాం. కాంగ్రెస్ పాలనలో రైతులు గోస పడ్డారు. రైతులకు అండగా నిలిచిన కేసీఆర్ కావాలా? కాంగ్రెస్ కావాలా?. మీటర్లు పెట్టాలని కేంద్రం బెదిరిస్తోంది. ఉచిత విద్యుత్ వద్దంటున్న కాంగ్రెస్ నేతల్ని ఊరి పొలిమేర అవతలకు తరిమి కొట్టండి’’ అని ప్రజలకు కేటీఆర్ పిలుపు ఇచ్చారు. -
ఉచిత విద్యుత్ వైఎస్సార్ మానస పుత్రిక
సాక్షి, హైదరాబాద్: రైతులకు ఉచిత విద్యుత్ పథకం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మానస పుత్రిక అని.. దేశం ఆయన లేని లోటును ఎదుర్కుంటోందని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నారు. వైఎస్సార్ ఉండి ఉంటే ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులపై పోరాడేవారని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో కాంగ్రెస్ నాయకులు కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి రూపొందించిన ‘రైతే రాజైతే.. వ్యవసాయం పండుగే’ పుస్తకావిష్కరణ సభ జరిగింది. దిగ్విజయ్ ఆ పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. వైఎస్సార్‌తో తనకు విడదీయరాని అనుబంధం ఉందని.. వైఎస్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని దిగ్విజయ్ పేర్కొన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడంతోపాటు 40లక్షల ఎకరాలకు సాగునీరందించే జలయజ్ఞంకు శ్రీకారం చుట్టారని చెప్పారు. వైఎస్ సంక్షేమ పాలనను అమలు చేస్తాం: రేవంత్ రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి.. వైఎస్ సంక్షేమ పాలనను అమలు చేస్తామని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చెప్పారు. నాడు వైఎస్ వేసిన పునాదులే కాంగ్రెస్‌ను నడిపిస్తున్నాయన్నారు. మహా నేత వైఎస్సార్ తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కార్యకర్తలతో ప్రేమను ఎలా పెంచుకోవాలో వైఎస్సార్ దగ్గర నేర్చుకున్నానని చెప్పారు. వైఎస్ పాలన చిరస్మరణీయం: రఘువీరా ♦ రాజుల కాలంలో శ్రీకృష్ణదేవరాయుల పాలన, ప్రజాస్వామ్యంలో వైఎస్ పాలన చిరస్మరణీయమని మాజీ మంత్రి రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. రైతును రాజును చేయడం కోసం తపించారని చెప్పారు. ♦ జస్టిస్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ పాలనలో ఆర్థిక, వ్యవసాయ విధానాలు అందరికీ ఆదర్శమన్నారు. సుదీర్ఘ కాలం పోరాడి సీఎం అయిన వ్యక్తి కాబట్టి అందరి అభిప్రాయాలను గౌరవించేవారని చెప్పారు. ♦ వైఎస్‌తో విపక్షాలు విభేదించినా గౌరవించేవారని సీపీఐ నేత నారాయణ గుర్తు చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజల మంచి కోసం వైఎస్సార్ ముందడుగు వేసేవారని సీనియర్ పాత్రికేయుడు సాయినాథ్ పేర్కొన్నారు. గాంధీభవన్‌లో వైఎస్సార్‌కు ఘన నివాళి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా శనివారం గాంధీభవన్‌లో ఘనంగా నివాళులు అర్పించారు. సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వైఎస్ రైతు పక్షపాతి అని, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాల ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన చేసిన సంక్షేమ సంతకం చెరిగిపోనిదని ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి పేర్కొన్నారు. కాగా.. హైదరాబాద్‌లోని పంజాగుట్ట సర్కిల్, సిటీ సెంటర్ చౌరస్తా, పలు ఇతర ప్రాంతాల్లోని వైఎస్ విగ్రహాలకు కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. -
కర్ణాటకలో "గృహ జ్యోతి" ఉచిత విద్యుత్ పథకం ప్రారంభం
కర్ణాటక: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన ఐదు ప్రధాన వాగ్దానాల్లో గృహ జ్యోతి కూడా ఒకటి. ఈ పథకం కింద లబ్దిదారులైన వారికి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు సబ్సీడీ అందించనుంది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మేరకు పథకానికి అర్హులైనవారిని ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్ లైన్లోనూ దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆహారం, విద్య, ఆరోగ్యం తోపాటు ఇతర నిత్యావసరాల ధరలు మిన్నంటుతున్న నేపథ్యంలో ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉచిత విద్యుత్ సబ్సీడీని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. మిగతా నాలుగు వాగ్దానాలతో పాటు ఉచిత విద్యుత్ సబ్సీడీ పాచిక కూడా పారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సొంతం చేసుకుంది. ఎన్నికల్లో చెప్పినట్లుగానే కర్ణాటక ప్రభుత్వం గృహ జ్యోతి పథకానికి శ్రీకారం చుట్టింది. లబ్దిదారులైన వారికి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును అందించనుంది. జూన్ 18 న మొదలైన దరఖాస్తు ప్రక్రియలో ఇప్పటికే 51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. సగటు నెలవారీ వినియోగం కంటే విద్యుత్తు వినియోగం తక్కువగా ఉన్న వినియోగదారులు అందరూ ఈ పథకానికి అర్హులేనని.. 200 యూనిట్ల కంటే తక్కువ వినియోగించుకునే వారికందరికీ ఈ సబ్సీడీ లభిస్తుందని.. 200 యూనిట్ల కంటే ఎక్కువగా వినియోగించుకునేవారు మాత్రం పూర్తి బిల్లును చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది ప్రభుత్వం. దరఖాస్తు చేసుకోవడమెలా? కర్ణాటక సేవాసంధు పోర్టల్ లోకి వెళ్లి కరెంటు బిల్లులో ఉన్నట్లుగా ఆధార్ కార్డు, కస్టమర్ ఐడి స్కాన్ చేసిన కాపీలను అప్లోడ్ చెయ్యాలి. ఆఫ్‌లైన్‌లో కూడా గృహ జ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. "బెంగుళూరు వన్", "గ్రామ వన్", "కర్ణాటక వన్" సెంటర్లకు వెళ్లి అక్కడ కూడా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది కర్ణాటక ప్రభుత్వం. ఇది కూడా చదవండి: డ్యూటీ టైమైపోయిందని విమానాన్ని మధ్యలోనే వదిలేసిన పైలెట్లు -
AP: రైతులు పైసా చెల్లించక్కర్లేదు
సాక్షి, అమరావతి: రైతులకు పగటి పూట 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంపై ప్రజల్లో అనేక అపోహలు సృష్టించేందుకు కొందరు అదే పనిగా ప్రయత్నాలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు.. కె.సంతోషరావు, జె.పద్మజనార్దనరెడ్డి, హెచ్.హరనాథరావు మండిపడ్డారు. సర్వీసులు తొలగిస్తారని, బిల్లులు వసూలు చేస్తారని తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడిన డిస్కంల సీఎండీలు ఉచిత విద్యుత్ పథకం వల్ల ఏ ఒక్క విద్యుత్ సర్వీసునూ తొలగించబోమని, ఒకరి పేరు మీద ఎన్ని సర్వీసులున్నా ఇబ్బంది లేదని స్పష్టం చేస్తున్నారు. సీఎండీలు ఇంకా ఏమన్నారంటే.. రైతులకు నాణ్యమైన విద్యుత్ పొందే హక్కు.. రాష్ట్రంలో దాదాపు 18 లక్షల వ్యవసాయ సర్వీసులకు స్మార్ట్ ఎనర్జీ మీటర్లను అమర్చాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికయ్యే ఖర్చును సబ్సిడీగా ప్రభుత్వమే భరిస్తుంది. రైతులు తమ జేబు నుంచి ఒక్క పైసా చెల్లించనవసరం లేదు. ప్రస్తుతం రైతుల పేరిట ఉన్న బ్యాంక్ ఖాతాలతో సంబంధం లేకుండా ప్రభుత్వమే కొత్త ఖాతాలు తెరిపిస్తుంది. వినియోగం ఆధారంగా వ్యవసాయ సబ్సిడీ మొత్తాన్ని ఖాతాలకు జమ చేస్తుంది. ఆ తర్వాత ఆ మొత్తం విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు బదిలీ అవుతుంది. దీంతో నాణ్యమైన విద్యుత్‌ను పొందే హక్కు రైతులకు లభిస్తుంది. బిల్లులు సకాలంలో చెల్లించలేకపోయినా రైతులకు విద్యుత్ సరఫరాను నిరాటంకంగా అందించాలని, కనెక్షన్లు తొలగించకూడదని ప్రభుత్వం స్పష్టంగా విద్యుత్ సంస్థలను ఆదేశించింది. కౌలు రైతులు కూడా యథావిధిగా ఉచిత విద్యుత్ పొందొచ్చు. నిరంతర విద్యుత్ సరఫరాకే మీటర్ల అమరిక ట్రాన్స్ఫార్మర్లు కాలిపోకుండా ఉండాలన్నా, సబ్ స్టేషన్లపై లోడ్ ఎక్కువై లోఓల్టేజ్ సమస్య రాకుండా ఉండాలన్నా, రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా జరగాలన్నా మీటర్లు అమర్చాలి. మీటరు బిగించడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వం, మీటర్లు కాలిపోయినా, పనిచేయకపోయినా, దొంగతనానికి గురైనా, మరమ్మతు ఖర్చులు మొత్తం విద్యుత్ కంపెనీలు భరిస్తాయి. ఏ ఒక్క సర్వీసునూ తొలగించరు.. ప్రస్తుతం ఉన్న ఏ ఒక్క విద్యుత్ సర్వీసునూ తొలగించరు. ఒక వినియోగదారుడి పేరిట ఇన్ని కనెక్షన్లే ఉండాలనే నిబంధన ఏదీ లేదు. ఎక్కువ కనెక్షన్లు ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రస్తుత యజమాని పేరిట సర్వీసు కనెక్షన్ల పేరు మార్చుకోవాలన్నా చేసుకోవచ్చు. అనధికార, అదనపు లోడు కనెక్షన్లన్నీ క్రమబద్ధీకరిస్తారు. అవి కూడా వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంలోకి వస్తాయి. పేర్ల మార్పు ప్రక్రియ కోసం, బ్యాంకు ఖాతాలు తెరవడానికి రైతులు ఎవరి దగ్గరకూ వెళ్లనవసరం లేదు. డిస్కం, గ్రామ సచివాలయ సిబ్బందే రైతుల వద్దకు వచ్చి అవసరమైన మార్పులు చేర్పులు చేస్తారు. రైతులకు విద్యుత్ షాకులు ఉండవు మీటర్ రీడింగ్ కోసం మోటారు దగ్గరకు లైన్మెన్లు రావడం వల్ల విద్యుత్ సమస్య ఏదైనా ఉంటే అతడి దృష్టికి తెచ్చి తక్షణమే పరిష్కరించుకోవచ్చు. రీడింగ్‌ను బట్టి పంపు, మోటారు పనిచేసే విధానాన్ని తెలుసుకుని మెరుగుపరుచుకోవచ్చు. ఎంత లోడు వాడుతున్నారో ఖచ్చితంగా తెలియడం వల్ల ఆ మేరకు విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు పటిష్టం చేసుకోవచ్చు. అనధికార కనెక్షన్లు ఉండవు. ఎర్త్ వైరు, పైపులను ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాటు చేయడం వల్ల రైతులు విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోకుండా కాపాడవచ్చు. -
ఉచిత విద్యుత్‌తో రైతుల ఇంట సంక్రాంతి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకంతో రైతుల ఇంట నిజమైన సంక్రాంతి వెలుగులు నింపుతోందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బలంగా విశ్వసిస్తారని తెలిపారు. దీనిలో భాగంగా ప్రవేశపెట్టిన వ్యవసాయానికి వైఎస్సార్ 9 గంటల ఉచిత విద్యుత్ పథకాన్ని సమర్ధంగా అమలు చేయాలని ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా, ముఖ్యంగా వ్యవసాయానికి విద్యుత్‌పై ఇంధన శాఖ అధికారులతో మంత్రి గురువారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ‘రాష్ట్రంలో 18.37 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఏటా 12 వేల మిలియన్ యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.8,400 కోట్లు ఖర్చు చేస్తోంది. పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన 3–ఫేజ్ విద్యుత్ సరఫరాకు 6,663 వ్యవసాయ ఫీడర్లను మెరుగుపరచడానికి రూ.1,700 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుతం యూనిట్ రూ.4.39కు కొంటున్నాం. రానున్న 25 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్‌ను కొనసాగించడానికి వ్యయాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) సౌర విద్యుత్‌ను యూనిట్ రూ.2.49కే ఇస్తోంది. దీనివల్ల ఏటా దాదాపు రూ.3,230 కోట్లు ఆదా అవుతుంది’ అని మంత్రి చెప్పారు. ఉచిత విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ సప్లై కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిందని ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ చెప్పారు. -
మరపురాని మహానేత.. మా రాజన్న
వైఎస్సార్ మన మధ్య భౌతికంగా లేకపోవచ్చు.. కానీ, తనదైన పాలనతో ప్రతి ఒక్కరి హృదయాల్లో మాత్రం చెరగని ముద్ర వేశారు. ఆయన రూపకల్పన చేసిన సంక్షేమం రెండు తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధికి బాటలు వేసింది. ఆయన పేరు తలుచుకోగానే స్వచ్ఛమైన చిరునవ్వు కళ్ల ముందు మెదలుతుంది. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా.. నమస్తే తమ్ముడూ.. నమస్తే.. నమస్తే.. అన్న మాటలు ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. సాక్షి, అమరావతి : ‘వైఎస్సార్’.. తెలుగువాడి హృదయాల్లో చెక్కు చెదరని పేరు.. ఆ అక్షరాలు వింటే తెలుగు నేల పులకిస్తుంది.. పచ్చని పైరు నాట్యం చేస్తుంది.. పేదోడి మనసు ఉప్పొంగుతుంది.. అక్క చెల్లెమ్మల్లో కొత్త ఆనందం కనిపిస్తుంది.. రైతు మోములో తొలకరి సాక్షాత్కరిస్తుంది.. బడుగు బలహీనులకు కొండంత ధైర్యం వస్తుంది.. దగాపడ్డ గుండె గొంతుకకు భరోసా దక్కుతుంది.. ప్రజల గుండెల్లో ‘రాజ’న్నగా ముద్రవేసుకున్న వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతీక్షణం ప్రజలకే అంకితం చేశారు. ప్రజల పక్షాన్నే పోరాడారు. ప్రజాసంక్షేమమే పునాదిగా పనిచేశారు. ‘రాజన్న’ మాట చెబితే తప్పడు.. ఎన్ని అడ్డంకులెదురైనా మడమ తిప్పడు.. అన్నది ప్రజలు చెప్పే మాట. ఢిల్లీని సైతం ధిక్కరించి తన జనం కోసం నిలబడ్డ ధీరుడు. ఆయనే ఓ ధైర్యం రాష్ట్రంలో వెన్నుపోటు రాజకీయాలు రాక్షస క్రీడ ఆడుతున్న తరుణంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో విపక్ష నేతగా జనం వాణి గట్టిగా వినిపించారు. అప్పటి టీడీపీ దోపిడీ పాలనపై నిప్పులు చెరిగారు. ఆ చీకటి పాలనతో నిరాశ నిస్పృహల్లో ఉన్న ప్రజలకు భరోసా ఇచ్చేందుకు రాజన్న జనం బాటపట్టారు. మండుటెండలో ఆయన సాగించిన 1,475 కిలోమీటర్ల పాదయాత్రలో జనం గుండె తలుపుతట్టారు. నేనున్నానని కొండంత భరోసా కల్పించారు. అలాగే, ‘వ్యవసాయం దండగ’ అని పరిహసించిన ఆనాటి పాలకుల చేష్టలకు దిగాలు పడ్డ రైతును ఓదార్చారు. జబ్బు చేస్తే ఇల్లూ వాకిలీ అమ్ముకునే సామాన్య జనం దయనీయ స్థితికి చలించిపోయారు. చదువు కోసం అప్పులపాలయ్యే కుటుంబాల దీనగాధలు విన్నారు. ఇలా నడిచొచ్చిన నాయకుడికి యావత్ తెలుగు జాతి నీరాజనాలు పట్టింది. 2004లో అత్యధిక మెజారిటీతో అక్కున చేర్చుకుని అందలం ఎక్కించింది. రాజన్నే ‘గుండె’బలం పేదోడికి జబ్బొస్తే ఇల్లూ వాకిలీ అమ్ముకోవడమే రాజన్న సీఎం అయ్యే వరకూ ఉన్న పరిస్థితి. పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం దక్కే విప్లవాత్మక పథకం ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. లక్షల మంది జీవితాల్లో ఈ పథకం వెలుగు నింపింది. క్యాన్సర్, గుండె జబ్బులు, న్యూరో, గర్భకోశ వ్యాధులు.. ఇలా 942 జబ్బులను ఈ పథకంలో చేర్చారు. రూ.1,400 కోట్లు పథకానికి వెచ్చించారు. చిన్నారుల్లో వినికిడి లోపం సరిచేసేందుకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ కోసం ఒక్కొక్కరికీ రూ.6.5 లక్షలు వెచ్చించిన ఘనత ఆయనదే. కాల్ చేస్తే ‘కుయ్.. కుయ్.. కుయ్..’ మంటూ ప్రత్యక్షమయ్యే 108 అంబులెన్స్‌లు.. 104 వైద్య సేవలు.. ఇవన్నీ ఆయన తెచ్చిపెట్టినవే. పేదోడి ఇంట్లో మహానేత ముద్ర సొంతిల్లు కల వైఎస్వల్లే సాధ్యమైందని చాలామంది చెప్పుకుంటారు. 2004 వరకూ కేవలం రూ.500 కోట్లున్న గృహ నిర్మాణ బడ్జెట్‌ను 2009 నాటికి ఆయన రూ.5వేల కోట్లకు తీసుకెళ్లారు. కేవలం ఐదేళ్లలోనే 47 లక్షల ఇళ్లు నిర్మించి దేశానికే ఆదర్శంగా నిలిచారు. వృద్ధాప్యం భారమన్న వాదనను వైఎస్ దూరం చేశారు. పెన్షన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితిని మార్చారు. 16 లక్షలున్న పెన్షన్లను 71 లక్షలకు పెంచి అర్హులందరికీ అందేలా చేశారు. అక్షర భిక్ష పెట్టిన నేత డాక్టర్, ఇంజనీర్ వంటి పెద్ద చదువులు పేదవాడి సొంతమైతేనే ఆర్థిక దుస్థితి మారుతుందని వైఎస్ బలంగా నమ్మారు. ఈ నేపథ్యంలోనే విప్లవాత్మకమైన ఫీజు రీ యింబర్స్‌మెంట్ పథకాన్ని తీసుకొచ్చారు. 11 లక్షల మంది బీసీలకు, 5 లక్షల ఎస్సీ, 1.8 లక్షల ఎస్టీలకు, 7.5 లక్షల మైనారిటీ విద్యార్థులకు ఈ పథకం పెద్ద చదువులకు అవకాశం కల్పించింది. ఈ పథకంవల్ల ఎంతోమంది పెద్ద చదువులకు వెళ్లారు. ఇదే కాదు.. అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్ నిజమైన అన్నగా నిలబడ్డారు. ఆర్థిక స్వావలంబన దిశగా పావలా వడ్డీ రుణ పథకాన్ని దిగ్విజయంగా అమలుచేశారు. ఆయన హయాంలో 85 లక్షల మందికి రూ.7 వేల కోట్లు అందాయి. ఫలితంగా స్వయం సహాయ సంఘాలు వైఎస్ కాలంలో బలమైన శక్తులుగా అవతరించాయి. స్వర్ణయుగానికి నాంది మే 14, 2004న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మరుక్షణమే రైతు పక్షపాతిగా ముద్ర వేసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారమే ఉచిత విద్యుత్ ఫైల్‌పై సంతకం చేశారు. అప్పటి నుంచి దాదాపు 35 లక్షల పంపుసెట్లకు పైగా ఉచిత విద్యుత్ అమలైంది. రూ.400 కోట్లతో మొదలైన వ్యవసాయ సబ్సిడీ క్రమంగా ఏడాదికి రూ.6 వేల కోట్లకు చేరినా ఉచితం హామీ చెక్కుచెదరలేదు. కరెంట్ చార్జీలు కట్టలేమన్న రైతుపై టీడీపీ ప్రభుత్వం పాశవికంగా పెట్టిన కేసులన్నీ ఎత్తేశారు. రూ.1,100 కోట్ల రైతు విద్యుత్ బకాయిలు ఒక్క సంతకంతో మాఫీ చేశారు. అప్పులపాలైన రైతన్నను రుణ విముక్తుల్ని చేశారు. నాణ్యమైన విత్తు, ఎరువు కోసం దిగ్గజ కంపెనీలతో రైతు కోసం పోరాడిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు. రాజన్న పాలనలో మద్దతు రేటు పెరిగింది. తక్కువ వడ్డీ రుణాలతో దళారుల చెర నుంచి రైతు విముక్తి పొందాడు. -
రైతుల ఖాతాల్లోకి రూ.4.23 కోట్లు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకం కింద రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం రూ.4,23,10,183 జమ చేసింది. వ్యవసాయ సబ్సిడీని రైతుల ఖాతాల్లోకి ప్రత్యక్షంగా బదిలీ చేసి, అక్కడి నుంచి విద్యుత్ పంపిణీ సంస్థకు పంపనున్నారు. ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లాలో అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నవంబర్ నెల వ్యవసాయ విద్యుత్ బిల్లుల మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి మళ్లించారు. ఈ మేరకు ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి శుక్రవారం జీవో జారీ చేశారు. -
ఉచిత విద్యుత్.. మరింత పకడ్బందీగా..
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకం ఇక నుంచి మరింత సమర్థవంతంగా పనిచేయనుంది. క్షేత్రస్థాయి నివేదికల తర్వాత విద్యుత్ సంస్థలు కచ్చితమైన ప్రణాళికలతో ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే 6,663 వ్యవసాయ ఫీడర్లను బలోపేతం చేశారు. గృహ, వ్యవసాయ విద్యుత్ ఫీడర్లను విడగొట్టి లోవోల్టేజీ సమస్య రాకుండా చేశారు. రూ.6610.5 కోట్లతో చేపట్టిన కొత్త ప్రాజెక్టులూ దాదాపు పూర్తికావచ్చాయి. ఈ రబీ నుంచే వంద శాతం ఫీడర్ల ద్వారా విద్యుత్ ఇస్తున్న విద్యుత్ శాఖ.. వచ్చే ఖరీఫ్ నుంచి మరింత సమర్థవంతంగా ఫీడర్లను పనిచేయించే లక్ష్యంతో ఉంది. పెరుగుతున్న డిమాండ్ అధికారిక అంచనాల ప్రకారం.. రాష్ట్రంలో ఏటా 20 శాతం విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. వ్యవసాయానికి 9 గంటల పగటి విద్యుత్ ఇస్తున్న నేపథ్యంలో పీక్ అవర్స్‌లో గ్రిడ్‌పై ఎక్కువ డిమాండ్ ఉంటోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త సబ్స్టేషన్లు, లైన్ల విస్తరణ చేపట్టారు. విద్యుత్ సంస్థలు రూ.6,610.5 కోట్లతో మొత్తం 85 కొత్త ప్రాజెక్టులు దాదాపు పూర్తికానున్నాయి. ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, విద్యుత్ లైన్ల పొడిగింపు, అత్యధిక సామర్థ్యంగల హైపవర్ కండక్టర్ల ఏర్పాటు ఇందులో ముఖ్యమైనవి. ట్రాన్స్‌కో, తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు (ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్), డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టు (ప్రకృతి వైపరీత్యాలప్పుడు ఉపయోగపడేది), విశాఖ, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (వీసీఐసీ), గ్రీన్ ఎనర్జీ కారిడార్ (జీఈసీ) కొత్త ప్రాజెక్టుల్లో ప్రధానంగా ఉన్నాయి. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ (ఐబీఆర్డీ), ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ), ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఈ ప్రాజెక్టులకు రుణ సదుపాయం కల్పిస్తున్నాయి. వ్యవసాయ విద్యుత్ కోసమే ప్రభుత్వం 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పుతోంది. ఈ విద్యుత్‌ను రైతుకు చేరవేసే దిశగా గ్రిడ్‌ను బలోపేతం చేస్తున్నారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా నాణ్యమైన ఉచిత విద్యుత్ అందుతుందని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. నెట్వర్క్ బలోపేతం తర్వాత క్షేత్రస్థాయి పరిశీలన కూడా చేశామని ఆయన వివరించారు. -
విద్యుత్ నగదు బదిలీకి రూ.8,353 కోట్లు
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలవుతున్న వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరింత పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా చేపట్టిన రైతు ఖాతాల్లోకే నగదు బదిలీ ప్రక్రియ వేగవంతమైంది. క్షేత్రస్థాయిలో సేకరించిన వ్యవసాయ విద్యుత్ లోడ్ లెక్కల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా రూ.8,353.7 కోట్ల మేర విద్యుత్ సబ్సిడీని రైతులకు ఇవ్వాలని లెక్కించారు. ఇప్పటివరకు విద్యుత్ సబ్సిడీ లెక్కకు శాస్త్రీయత కొరవడింది. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోతోంది. జిల్లాలు, రైతుల వారీగా పొలంలోని పంపుసెట్ సామర్థ్యం, విద్యుత్ వినియోగం, ఇవ్వాల్సిన సబ్సిడీ వివరాలతో ప్రభుత్వానికి సమరి్పంచేందుకు ఇంధనశాఖ అధికారులు నివేదిక రూపొందించారు. చిత్తూరు జిల్లాకు రూ.1,421 కోట్లు ► రాష్ట్రవ్యాప్తంగా 17,54,906 వ్యవసాయ పంపుసెట్లున్నాయి. ఇవి 1,15,55,553 అశ్వశక్తి సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఈ మొత్తానికి ఏటా రూ.8,353.7 కోట్లు ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. ఇంతకాలం ఈ మొత్తాన్ని డిస్కమ్‌లకు అందించేవాళ్లు. ఇకనుంచి ఈ సొమ్ము రైతుల ఖాతాల్లోకి వెళుతుంది. ► చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 18,52,479 హెచ్‌పీ విద్యుత్ లోడ్ ఉంది. ఈ జిల్లాలో మొత్తం 2,89,544 పంపుసెట్లున్నాయి. ఈ జిల్లాకు సంవత్సరానికి రూ. 1421 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం ఇవ్వనుంది. ► తర్వాత స్థానంలో అనంతపురం జిల్లా ఉంది. ఇక్కడ 2,72,607 పంపుసెట్లు 18,20,367 అశ్వశక్తి సామర్థ్యంతో ఉన్నాయి. వీటికి రూ.1,396.4 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం చెల్లించబోతోంది. శ్రీకాకుళంలో ఇప్పటికే చెల్లింపులు ► వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ ప్రత్యక్ష నగదు బదిలీ విధానం ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఇందుకోసం వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగిస్తున్నారు. పథకం ఉద్దేశాన్ని రైతులకు వివరిస్తున్నారు. ► శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. జిల్లాలో ఉన్న 31,526 పంపుసెట్లలో 25వేల పంపుసెట్లకు మీటర్లు బిగించారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల సబ్సిడీని రైతుల ఖాతాల్లో జమచేశారు. -
రైతులకు విద్యుత్ ఎప్పటికీ ఉచితమే
సాక్షి, అమరావతి: వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆ హామీ అమలు ఫైలుపై తొలి సంతకం చేసిన ఘనత దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. అప్పటి వరకు రైతులకున్న విద్యుత్ చార్జీల బకాయిలు రూ.1,100 కోట్లను కూడా మాఫీ చేశారన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో గురువారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ‘ఉచిత విద్యుత్– నగదు బదిలీ’ అంశంపై జరిగిన చర్చలో సీఎం వైఎస్ జగన్ మంత్రులతో చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకాన్ని.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నీరుగార్చాయి. టీడీపీ సర్కార్ హయాంలో పగటి పూట 9 గంటల పాటు కరెంటు ఇచ్చే పరిస్థితులే లేవు. మనం అధికారంలోకి వచ్చినప్పుడు పరిశీలిస్తే.. దాదాపు 40 శాతం ఫీడర్లలో పగటి పూట 9 గంటలు కరెంటు ఇవ్వడానికి మౌలిక సదుపాయాలే లేవు. ఈ పరిస్థితులను మార్చడానికి, ఫీడర్ల ఏర్పాటు, అప్‌గ్రేడేషన్ పనుల కోసం రూ.1,700 కోట్లు కేటాయించాం. దీని వల్ల ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 89 శాతం ఫీడర్లలో పగటిపూటే 9 గంటలపాటు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం. మిగిలిన చోట్ల కూడా వేగంగా పనులు పూర్తి చేసి రబీ నాటికి పూర్తి స్థాయిలో 9 గంటలపాటు పగటి పూటే కరెంటు ఇస్తాం. 2019 మార్చి 31 నాటికి చంద్రబాబు ఉచిత విద్యుత్ పథకం కింద డిస్కంలకు డబ్బులు ఇవ్వకుండా దాదాపు రూ.8 వేల కోట్లు బకాయిపెట్టారు. మనం అధికారంలోకి వచ్చాక ఆ డబ్బు మొత్తం చెల్లించాం. ఈ డబ్బులు కట్టడమే కాకుండా నాణ్యమైన కరెంటు ఇవ్వడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలూ తీసుకున్నాం. స్థిరంగా నిరంతరాయంగా ఉచిత విద్యుత్ ► రైతుల విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే 30 నుంచి 35 సంవత్సరాలపాటు ఉచిత విద్యుత్ పథకానికి ఎలాంటి ఢోకా రానివ్వకుండా 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ కోసం ప్రయత్నాలు ప్రారంభించాం. ► తద్వారా యూనిట్ కరెంటు రూ.2.5 కే ప్రభుత్వానికి వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నాం. దీని వల్ల ప్రభుత్వంపై భారం తగ్గుతుంది. ఉచిత విద్యుత్ పథకం స్థిరంగా, నిరంతరాయంగా కొనసాగడానికి ఇది దోహదం చేస్తుంది. రైతుల కోసమే ఈ సోలార్ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నాం. రైతులపై ఒక్క పైసా భారం పడదు ► కొత్తగా తీసుకొస్తున్న సంస్కరణల వల్ల ఉచిత విద్యుత్ రూపేణా ఎంత వాడుతున్నాం.. ఎంత ఖర్చు చేస్తున్నామో తెలుస్తుంది. ప్రభుత్వం ప్రత్యేక ఖాతాల్లోకి వేసే డబ్బును రైతులే డిస్కంలకు చెల్లిస్తారు. ► నాణ్యమైన కరెంట్ పగటి పూట 9 గంటల పాటు రాకపోతే రైతులు డిస్కంలను నిలదీయొచ్చు. సంబంధిత అధికారులను ప్రశ్నించవచ్చు. దీని వల్ల జవాబుదారీతనం, బాధ్యత పెరుగుతాయి. అధికారులకు కూడా రైతుల పట్ల జవాబుదారీతనం పెరుగుతుంది. దీని వల్ల చంద్రబాబు ప్రభుత్వంలా బకాయి పెట్టే పరిస్థితులు ఉండవు. స్కీంను నిర్వీర్యం చేసే పరిస్థితులూ రావు. ► ప్రతినెలా రైతులకు డబ్బులు పడతాయి. ఆ డబ్బులు డిస్కంలకు వెళతాయి. దీనివల్ల డిస్కంల ఆర్థిక పరిస్థితులు కూడా బాగుంటాయి. ఎఫ్ఆర్బీఎం నిబంధనల్లో భాగంగా నాలుగు అంశాలను రాష్ట్రాలు పాటించాల్సి ఉంటుంది. అందులో ఉచిత విద్యుత్ పథకంలో సంస్కరణలు ఒకటి. మనది మనసున్న, రైతుల పక్షపాత ప్రభుత్వం. రైతులకు ఒక్క పైసాకూడా నష్టం జరగదు. ఉచిత విద్యుత్‌పై పేటెంట్ మహానేతదే ► రైతులకు ఉచిత విద్యుత్ పథకం మీద ఎవరికైనా పేటెంట్ ఉందంటే.. అది మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిదే. అందుకనే దీనికి వైస్సార్ ఉచిత విద్యుత్ పథకంగా పేరు పెడుతున్నాం. ► మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులను ఆదుకునే విషయంలో ఒక అడుగు ముందుకు వేస్తే.. మనం మరో రెండు, మూడు అడుగులు ముందుకు వేస్తున్నాం. ఆయన ప్రవేశపెట్టిన పథకాలను మరింత మెరుగ్గా ప్రజలకు అందిస్తున్నాం. ఫీజు రియింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాం. ఆ డబ్బును బ్యాంకులు మినహాయించుకోవు ► విద్యుత్ శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కాల్ సెంటర్ కూడా పెడతాం. రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారు. రైతులు ఎన్ని యూనిట్లు కాలిస్తే.. అన్ని యూనిట్లకూ ప్రభుత్వం డబ్బు ఇస్తుంది. ► ఉచిత విద్యుత్ పథకం కింద ప్రభుత్వం బదిలీ చేసే నగదును బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ మినహాయించుకోలేవు. మీటర్లకయ్యే ఖర్చును డిస్కంలు, ప్రభుత్వం భరిస్తాయి. రైతులకు ఎలాంటి భారం ఉండదు. ► ఏడాదికి దాదాపు రూ.8 వేల కోట్లకుపైగా ఉచిత విద్యుత్ కోసం ఖర్చు అవుతుంది. దీనికయ్యే పూర్తి బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రతి ఏటా ఒక్కో రైతుకు దాదాపు రూ.49,600కు పైగా ఉచిత విద్యుత్ కింద ఖర్చు అవుతుంది. ► ఉచిత విద్యుత్ పథకంలో సంస్కరణలు, దీనిపై వచ్చే సందేహాలకు పూర్తి స్థాయిలో సమాధానాలు ఇస్తూ అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించాం. గ్రామ సచివాలయాల్లో దీనికి సంబంధించిన సమాచారం ఉంచాలని చెప్పాం. ఈ పథకాన్ని శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తాం. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుంది. ► రైతులకు ఇప్పుడున్న కనెక్షన్లలో ఒక్కటి కూడా తొలగించం. రైతులకు ఎవరికైనా వర్తించకపోతే వారి కనెక్షన్లను రెగ్యులరైజ్ చేస్తాం. ఒక్క కనెక్షన్ కూడా రద్దవుతుందన్న మాట రాకూడదని అధికారులకు చాలా స్పష్టంగా చెప్పాం. మనం మేనిఫెస్టోలో 9 గంటల పాటు ఉచిత విద్యుత్ పగటి పూట ఇస్తామని హామీ ఇచ్చాం. ఆ మాటను అక్షరాల అమలు చేస్తాం. -
పగలే.. ‘జల’జలా..
సాక్షి, రాజానగరం (తూర్పు గోదావరి): గతంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన వెంటనే మెట్ట రైతులకు ఇచ్చిన మాట ప్రకారం.. వ్యవసాయ మోటార్లకు ఉచిత విద్యుత్ అందిస్తూ, తొలి సంతకం చేశారు. ఆ తరువాత వ్యవసాయం గురించి, రైతుల సంక్షేమం గురించి ఆలోచించిన నాథుడే లేడు. రోజుకు తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారనే పేరే కానీ అది ఎప్పుడు వస్తుందో తెలియని అయోమయ స్థితిలో రైతులు ఇబ్బందులు పడుతూ వచ్చారు. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా విద్యుత్ సరఫరా చేయడంతో కొంతమంది రైతులు మోటార్లు ఆన్ చేసేందుకు పొలాలకు వెళ్లి, పాము కాట్లకు గురై మృత్యువాత పడిన సంఘటనలున్నాయి. ఈ పరిస్థితుల్లో గత ఏడాది ప్రజాసంకల్ప పాదయాత్ర నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి పలు ప్రాంతాల్లోని రైతులు తమ కష్టాలు ఏకరువు పెట్టారు. ఆ సందర్భంగా తాను అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయ మోటార్లకు పగటి సమయంలోనే రోజుకు 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చి, ముఖ్యమంత్రి అయిన ఆయన.. ఆ హామీ నిలబెట్టుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. దీనివలన పూర్తి మెట్ట ప్రాంతంగా ఉన్న రాజానగరం నియోజకవర్గంలోని రైతులకు ఎనలేని ప్రయోజనం కలుగుతోంది. ప్రస్తుతానికి సాంకేతిక ఇబ్బందులు లేనిచోట జగన్ ప్రభుత్వం పగటి పూటే రోజుకు 9 గంటలు విద్యుత్ అందిస్తూండగా, అవకాశం లేనిచోట అడ్డంకులను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటోంది. నియోజకవర్గంలోని రాజానగరం, కోరుకొండ, సీతానగరం మండలాల్లో 8,250 వ్యవసాయ విద్యుత్ మోటార్లు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 1,51,965 ఎకరాలకు సాగునీరు అందుతోంది. కోరుకొండలో సాంకేతిక అవరోధాలు కోరుకొండ మండలంలో సుమారు 2,300 వ్యవసాయ విద్యుత్ మోటార్లున్నాయి. వీటి ద్వారా 28,750 ఎకరాలకు సాగు నీరు అందుతోంది. ఇక్కడ కూడా వరితో పాటు మొక్కజొన్న, మిర్చి, కూరగాయలు పండిస్తూంటారు. ఏటిపట్టుకు, మెట్ట ప్రాంతానికి మధ్యన ఉన్న ఈ మండలంలోని రైతులు సాగునీటికి ఎక్కువగా బోర్ల పైనే ఆధారపడుతున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే ఇక్కడ పంటలు పండుతాయి. లేకుంటే బోర్లున్న ప్రాంతాల్లోనే సాగు జరుగుతూంటుంది. మండలంలో ప్రస్తుతం జగన్ ప్రభుత్వం ప్రకటించినవిధంగా వ్యవసాయ మోటార్లకు పగటిపూట తొమ్మిది గంటల విద్యుత్ అందించలేకపోతున్నారు. సాంకేతికపరమైన సమస్యలున్నందున, వాటిని నివారించే వరకూ ఇది సాధ్యం కాదని ఏఈ రవికుమార్ తెలిపారు. అందుకు అనుగుణంగా ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లు వేసేందుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. సీతానగరం మండలంలో వరితో పాటు మొక్కజొన్న, మిర్చి, అరటి, కూరగాయలు సాగు చేస్తూంటారు. గోదావరి చెంతనే ఉన్న ఈ మండలానికి భూగర్భ జలాలతో పాటు తొర్రిగెడ్డ, కాటవరం ఎత్తిపోతల పథకాల ద్వారా సాగు నీరు అందుతుంది. మండలంలో మొత్తం 1,236 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. వీటి ద్వారా సుమారు 22 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఉచిత విద్యుత్ పథకం అమలులోకి వచ్చిన తరువాత ఈ ప్రాంతంలో బోర్ల సంఖ్య పెరగడంతో ఆ మేరకు సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. జగన్ ప్రభుత్వం ప్రకటించిన విధంగా పురుషోత్తపట్నం, ముగ్గళ్ల సబ్స్టేషన్ల పరిధిలోని వ్యవసాయ మోటార్లకు పగటి పూట తొమ్మిది గంటల విద్యుత్ సరఫరాను ఇప్పటికే ప్రారంభించారు. వీటి ద్వారా సుమారు 820 వ్యవసాయ కనెక్షన్లకు పగటి పూటే విద్యుత్ సరఫరా అవుతోంది. మిర్తిపాడు సబ్‌స్టేషన్ పరిధిలో సాంకేతిక అవరోధాలు ఉండడంతో ప్రస్తుతం ఈ విధానం అమలుకు నోచుకోవడం లేదు. అడ్డంకులను అధిగమించే ప్రయత్నంలో ఉన్నామని ఏఈ త్రిమూర్తులు తెలిపారు. పాతాళగంగే ప్రధానాధారం పూర్తి మెట్ట ప్రాంతంగా ఉన్న రాజానగరం మండలంలో సాగుకు భూగర్భ జలాలే ఆధారం. ప్రతి సీజన్లోనూ బోర్లున్న రైతులు జిల్లాలో అందరికంటే ముందుగా వరి సాగుకు శ్రీకారం చుడతారు. ఆ క్రమంలో కోతలు కూడా ముందుగానే చేపడుతూంటారు. మండలంలో సుమారు 4,700 వ్యవసాయ విద్యుత్ మోటార్లు ఉన్నాయి. వీటి ద్వారా 86,950 ఎకరాలకు సాగునీరు అందుతోంది. మండలంలోని రాజానగరం, సంపత్‌నగరం గ్రామాల్లో ఉన్న సబ్స్టేషన్ల ద్వారా వ్యవసాయ మోటార్లకు విద్యుత్ సరఫరా జరుగుతోంది. సంపత్‌నగరం ఏఈ ఎస్.శ్రీనివాసరావు మాట్లాడుతూ సంపత్‌నగరం సబ్‌స్టేషన్ పరిధిలోని దివాన్‌చెరువు సబ్‌స్టేషన్ ద్వారా 13 మోటార్లకు ఈ నెల 17 నుంచి పగటి పూట 9 గంటల విద్యుత్ అందిస్తున్నట్టు తెలిపారు. అలాగే కొండగుంటూరు సబ్‌స్టేషన్ ద్వారా కొండగుంటూరు, నామవరం, కడియం మండలం జేగురుపాడు ఆవల్లో 94 మోటార్లకు విద్యుత్ అందిస్తున్నామన్నారు. సంపత్‌నగరం సబ్‌స్టేషన్ ద్వారా నామవరం, జి.యర్రంపాలెం, పాతతుంగపాడు, కొండగుంటూరుపాకలులోని 480 మోటార్లకు 9 గంటల విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ, ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ వివిధ ఫీడర్ల ద్వారా తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని వివరించారు. రాజానగరం విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో ప్రస్తుతం ఇది అమలు జరగడం లేదని ఏఈ సుబ్రహ్మణ్యం చెప్పారు. తొమ్మిది గంటల విద్యుత్ సరఫరాకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేనందున ప్రస్తుతం ఇవ్వలేకపోతున్నామన్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు ప్రతిపాదనలు పంపామన్నారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా త్వరలోనే తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేసేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. -
సాకారమవుతున్న రైతు కల.. సాగుకు కొత్త కళ
సాక్షి, అమరావతి, ఒంగోలు, కాకినాడ: రైతన్నకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఏపీ ప్రభుత్వం నాంది పలికింది. వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ అందించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే వైఎస్ జగన్ తన హామీపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీంతో ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. సాధ్యాసాధ్యాలపై ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహించారు. అంతిమంగా సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల వ్యవసాయ విద్యుత్ ఫీడర్లలో 9 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరాకు ప్రయోగాత్మకంగా సన్నాహాలు చేస్తున్నారు. ఏకబిగిన వ్యవసాయ క్షేత్రాలకు విద్యుత్ ఇవ్వడం వల్ల గ్రిడ్‌పై ఏ విధమైన ప్రభావం ఉంటుంది? ట్రాన్స్ఫార్మర్ల పనితీరు, విద్యుత్ లభ్యతపై ప్రభావం వంటి అంశాలను ముందుగా పరిశీలిస్తారు. ఇందులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. క్షేత్ర స్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఎక్కడెక్కడ ట్రాన్స్ఫార్మర్ల కెపాసిటీ పెంచాలి? వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను విభజించాలి? లోడ్ పడకుండా సాఫీగా సరఫరా చేసేందుకు ఏం చేయాలి? తదితర విషయాలపై నివేదిక రూపొందిస్తారు. దీనిపై అధ్యయనం అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 9 గంటల నిరంతర విద్యుత్ పథకం అమలులోకి వస్తుంది. 18 లక్షల మంది రైతులకు ఆనందం రాష్ట్రంలో 18 లక్షల ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. వీటికి పగలు, రాత్రి నిర్ణీత సమయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో కూలీలు ఉన్నప్పుడు విద్యుత్ లేకపోవడంతో పనులు జరగడం లేదు. అర్ధరాత్రి విద్యుత్ ఉన్నా కూలీలు లేకపోవడంతో ఉపయోగం ఉండటం లేదు. చీకట్లో బోర్లు ఆన్ చేసేందుకు వెళ్తూ రైతన్నలు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ పరిస్థితిని పాదయాత్రలో ప్రత్యక్షంగా చూసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే పగటి పూట 9 గంటల విద్యుత్ అందిస్తానని భరోసా ఇచ్చారు. వాస్తవానికి వేసవి మినహా ఇతర కాలాల్లో పగటిపూట విద్యుత్ డిమాండ్ సాధారణంగానే ఉంటుంది. వ్యవసాయానికి విద్యుత్ ఇచ్చినా గ్రిడ్‌పై పెద్దగా లోడ్ పడదు. కానీ రాత్రిపూట ఇవ్వడం వల్ల, అదే సమయంలో గృహ విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండి అధిక లోడ్‌తో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. దీంతో వారాల తరబడి విద్యుత్ సరఫరా లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇక నుంచి ఈ బాధలు ఉండవని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తోంది. రెండు షిఫ్టుల్లో సరఫరా! తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ పథకంపై రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆదివారం ఉన్నతాధికారులతో వేర్వేరుగా సమీక్షించారు. వాస్తవ పరిస్థితిని ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్ మంత్రి బాలినేనికి వివరించారు. రాష్ట్రంలో 11కేవీ వ్యవసాయ ఫీడర్లు 6,663 ఉన్నాయని, ఇందులో కేవలం 1,712 (26 శాతం) ఫీడర్లకు మాత్రమే అదనంగా మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు. అదనపు అత్యధిక సామర్థ్యం గల 16 సబ్ స్టేషన్లు (ఈహెచ్‌టీ), 32 కెపాసిటర్ బ్యాంకులు, 52 పవర్ ట్రాన్స్ఫార్మర్లు, 112 కిలోమీటర్ల అదనపు హై ఓల్టేజీ లైన్లు వేయాల్సి ఉందన్నారు. దీనికి రూ.1,700 కోట్ల నిధులు అవసరమని వివరించారు. ప్రస్తుతం 26 శాతం వ్యవసాయ ఫీడర్లు పగలు 5 గంటలు, రాత్రి 4 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నాయని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొంతమందికి, ఉదయం 9 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మరో దఫా విద్యుత్ ఇచ్చే ప్రతిపాదనలను మంత్రి వద్ద ఉంచారు. కాగా, మంత్రి బాలినేని ఒంగోలులో విలేకరులతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు గృహ వినియోగానికి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తున్నామని చెప్పారు. ఆక్వా రైతులకు సబ్సిడీ ధరలపై కరెంటు ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ముఖ్యమంత్రి జగన్ పీపీఏల విషయాన్ని ఇటీవల తిరుపతిలో ప్రధాని దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారని చెప్పారు. దీంతో పీపీఏలపై సమీక్షించి కొనుగోలు ధరలు అడ్డగోలుగా ఉంటే వాటిని సవరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ సరఫరాకు కొత్తగా మౌలిక సదుపాయాలు అవసరం లేని ప్రాంతాల్లో ముందుగా ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి కన్నబాబు అధికారులకు సూచించారు. -
పగటి పూటే 9 గంటల విద్యుత్
సాక్షి, అమరావతి: రైతన్నల కష్టాలు తీరబోతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి వ్యవసాయానికి పగటి పూటే తొమ్మిది గంటల విద్యుత్ అందించబోతున్నారు. ఈ మేరకు ఎప్పటి నుంచి తొమ్మిది గంటల విద్యుత్ ఇస్తారో ఆ తేదీని ఖరారు చేయాలని సోమవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో సీఎం సంబంధిత విభాగాన్ని ఆదేశించారు. ఇందులో భాగంగా ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నేతృత్వంలో ఈ అంశంపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితిని అధికారులు పరిశీలించారు. ఈ నెల 13న ఎప్పటి నుంచి పగటి పూట తొమ్మిది గంటల విద్యుత్‌ను ఇవ్వనున్నారో ప్రకటించనున్నారు. రాష్ట్రంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మినహా అన్ని జిల్లాల్లోనూ దఫాల వారీగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. పగలు కంటే రాత్రే ఎక్కువగా విద్యుత్ ఇస్తుండటంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కూలీలు దొరికే సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల రైతుకు ఎలాంటి ప్రయోజనం లభించడం లేదు. వ్యవసాయ క్షేత్రాలను సమగ్రంగా తడుపుకోలేని దుస్థితి ఉంది. రాత్రిపూట కరెంటు ఇస్తుండటంతో రైతులు నిద్ర మానుకుని పొలాల్లో కాపు కాయాల్సి వస్తోంది. ఈ క్రమంలో చీకట్లో విష పురుగుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంతమంది చీకట్లో అస్తవ్యస్తంగా ఉన్న కరెంట్ తీగల వల్ల కరెంట్ షాకుకు గురై మరణిస్తున్నారు. దీన్ని పూర్తిగా మార్చాలని వైఎస్ జగన్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి అనుగుణంగానే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. టీడీపీ పాలనలో ప్రచారాస్త్రంగానే ఉచిత విద్యుత్ ఉచిత విద్యుత్ పథకం గత టీడీపీ ప్రభుత్వంలో ప్రచారాస్త్రంగానే మిగిలిపోయింది. ఎక్కడా చిత్తశుద్ధితో అమలు కాలేదు. నాలుగున్నరేళ్లు రోజుకు 7 గంటలు విద్యుత్ ఇచ్చామని గత ప్రభుత్వం చెప్పుకుంది. అయితే, ఇది కేవలం కాగితాల్లో లెక్కలకే పరిమితమైంది. వ్యవసాయ రంగానికి ఏటా 23,020 మిలియన్ యూనిట్ల విద్యుత్ కావాల్సి ఉండగా 13,480 మిలియన్ యూనిట్లు ఇచ్చి టీడీపీ సర్కార్ చేతులు దులుపుకుంది. నిరంతరాయంగా పగటి పూట విద్యుత్ సరఫరా చేయాలంటే ఇప్పుడున్న విద్యుత్ సరఫరా వ్యవస్థలో మార్పు తేవాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచడంతోపాటు సబ్స్టేషన్లను మరింత బలోపేతం చేయాలి. గత ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోలేదు. కేవలం ముడుపులు అందే విద్యుత్ లైన్లపైనే శ్రద్ధ పెట్టి నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులు అప్పగించింది. ఇక ఈ పరిస్థితి పూర్తిగా మారబోతోంది. రైతన్నలకు అవసరమైన విద్యుత్ సరఫరా బలోపేతానికే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ దిశగా అవసరమైన చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు వెళ్లాయి. డిస్కమ్‌లను ముంచేసిన బాబు పాలన విద్యుత్ పంపిణీ సంస్థలు (ఏపీ డిస్కమ్స్) వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్ భారాన్ని ప్రభుత్వమే భరించాలి. ఈ మొత్తాన్ని సబ్సిడీగా డిస్కమ్‌లకు ఇవ్వాల్సి ఉంటుంది. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అరకొరగా సబ్సిడీ ఇస్తూ డిస్కమ్‌లను అప్పులపాలు చేసింది. గత రెండేళ్లుగా ఇవ్వాల్సిన సబ్సిడీ కూడా ఇవ్వలేదు. 2018–19లో రూ.6,030 కోట్లు సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటే.. కేవలం రూ. 1,250 కోట్లు మాత్రమే ఇచ్చింది. 2019–20లో రూ.7,064 కోట్లు ఇవ్వాల్సి ఉంటే.. ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇవ్వాల్సిన మొత్తాన్ని విద్యుత్ సంస్థల ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకోవాలని ఉచిత సలహా పారేసింది. -
మరో హామీ కాపీ!
సాక్షి, అమరావతి: రైతులకు తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి అధికారంలోకి వచ్చాక ఐదేళ్ల పాటు హామీని అమలు చేయకుండా కాలయాపన చేసిన టీడీపీ సర్కారు రేపో మాపో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న తరుణంలో మరో మోసానికి తెర తీసింది. వ్యవసాయ అవసరాల కోసం రైతులకు ఉచితంగా అందించే కరెంట్ సరఫరాను రోజుకు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటలకు పెంచుతున్నట్లు విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ శుక్రవారం రాత్రి పొద్దు పోయాక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని ఎప్పుటి నుంచి అమలు చేస్తారనే విషయాన్ని జీవోలో పేర్కొనలేదు. ఏడాదిన్నర క్రితమే హామీ ఇచ్చిన జగన్ తాము అధికారంలోకి రాగానే రాష్ట్రంలో రైతులందరికీ 9 గంటల పాటు ఉచిత విద్యుత్ అందజేస్తామని ఏడాదిన్నర కిత్రమే వైఎస్సార్ సీపీ ప్లీనరీ సందర్భంగా ప్రకటించిన నవరత్నాల పథకాల్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. 2009 ఎన్నికలకు ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలకు కొత్తగా రెండు హామీలు మాత్రమే ఇచ్చి తిరిగి అధికారంలోకి రావడం తెలిసిందే. అప్పట్లో ఆయన ఇచ్చిన రెండు కొత్త హామీల్లో రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ ఒకటి. అయితే ఎన్నికల అనంతరం అధికారం చేపట్టిన మూడు నెలల వ్యవధిలోనే ఆయన అకాల మరణం చెందడంతో ఆ హామీని అమలు చేయలేకపోయారు. తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ ముఖ్యమంతులు ఆ హామీని నెరవేర్చలేదు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఈమేరకు ఇచ్చిన హామీని కూడా చంద్రబాబు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో తన తండ్రి ఆశయాలను నెరవేర్చాలన్న లక్ష్యంతో 2017 జూలైలో వైఎస్సార్ సీపీ ప్లీనరీ సందర్భంగా రైతులకు 9 గంటల పాటు ఉచితంగా విద్యుత్ అందిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ప్రతిపక్ష నేత ప్రకటన చేసిన తర్వాత ఏడాదిన్నర దాని గురించి ఏమాత్రం ఆలోచించని టీడీపీ సర్కారు ఎన్నికలు రావడంతో హడావుడి చర్యలకు ఉపక్రమించింది. ఎంబీసీలకు వంద యూనిట్లు ఉచితం దారిద్రరేఖకు దిగువన ఉండే అత్యంత వెనుకబడిన తరగతుల(ఎంబీసీ)కు చెందిన కుటుంబాలకు వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాకు ఆమోదం తెలుపుతూ విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ శుక్రవారం రాత్రి పొద్దు పోయాక మరో ఉత్తర్వు జారీ చేశారు. రజకుల లాండ్రీ షాపులకు 150 యూనిట్ల వరకు, నగల తయారీ వృత్తిదారులకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ నిధులను బీసీ సంక్షేమ శాఖ విద్యుత్ శాఖకు చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో మాత్రం ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. -
50 యూనిట్ల వరకూ ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్
♦ ఆపై వాడే విద్యుత్‌కే ఛార్జీ వసూలు ♦ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు గృహవినియోగ విద్యుత్‌ను 50 యూనిట్ల వరకూ ఉచితంగా అందించే పథకంలో మార్పులు చేసి.. మరింత మందికి లబ్ధి చేకూర్చుతామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం నెలకు 51 యూనిట్ల విద్యుత్ వినియోగించే ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకం వర్తించడం లేదన్నారు. ఇకపై 50 యూనిట్ల వరకూ విద్యుత్‌ను ఉచితంగానూ.. ఆపైన వినియోగించే విద్యుత్‌కు మాత్రమే ఛార్జీలు వసూలు చేసేలా పథకంలో మార్పులు చేశామని వివరించారు. దీని వల్ల ఆరు లక్షల ఎస్సీ, 90 వేల ఎస్టీ కుటుంబాలు లబ్ధి పొందుతాయన్నారు. గృహాలకు ఉచితంగా విద్యుత్ అందించే పథకానికి రూ.76 కోట్లను ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నాలుగు ఎల్ఈడీ బల్బుల చొప్పున పంపిణీ చేస్తామని.. తద్వారా ఆ కుటుంబాలు నెలకు 50 యూనిట్ల లోపే విద్యుత్ వినియోగించే అవకాశం ఉంటుందన్నారు. -
50 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్
హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు గృహాలకు వినియోగించే విద్యుత్‌ను 50 యూనిట్ల వరకూ ఉచితంగా అందించే పథకంలో మార్పులు చేసి.. మరింత మందికి లబ్ధి చేకూర్చుతామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం నెలకు 51 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించిన ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకం వర్తించడం లేదన్నారు. ఇకపై 50 యూనిట్ల వరకూ విద్యుత్‌ను ఉచితంగానూ.. ఆ పైన వినియోగించే విద్యుత్‌కు మాత్రమే ఛార్జీలు వసూలు చేసేలా పథకంలో మార్పులు చేశామని వివరించారు. దీని వల్ల ఆరు లక్షల ఎస్సీ, 90 వేల ఎస్టీ కుటుంబాలు లబ్ధి పొందుతాయన్నారు. గృహాలకు ఉచితంగా విద్యుత్ అందించే పథకానికి రూ.76 కోట్లను ఖర్చు చేస్తున్నామని కిషోర్ బాబు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నాలుగు ఎల్ఈడీ బల్బుల చొప్పున పంపిణీ చేస్తామని.. తద్వారా వారు నెలకు 50 యూనిట్ల లోపే విద్యుత్‌ను వినియోగించే అవకాశం ఉంటుందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125వ జయంతిని ఘనంగా నిర్వహించే అంశంపై సీఎం చంద్రబాబునాయుడు సోమవారం శాసనసభలో ఒక ప్రకటన చేస్తారని రావెల చెప్పారు.