సాక్షి, హైదరాబాద్: రైతులకు ఉచిత విద్యుత్ పథకం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మానస పుత్రిక అని.. దేశం ఆయన లేని లోటును ఎదుర్కుంటోందని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నారు. వైఎస్సార్ ఉండి ఉంటే ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులపై పోరాడేవారని చెప్పారు.
శనివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో కాంగ్రెస్ నాయకులు కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి రూపొందించిన ‘రైతే రాజైతే.. వ్యవసాయం పండుగే’ పుస్తకావిష్కరణ సభ జరిగింది. దిగ్విజయ్ ఆ పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. వైఎస్సార్‌తో తనకు విడదీయరాని అనుబంధం ఉందని.. వైఎస్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని దిగ్విజయ్ పేర్కొన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడంతోపాటు 40లక్షల ఎకరాలకు సాగునీరందించే జలయజ్ఞంకు శ్రీకారం చుట్టారని చెప్పారు.
వైఎస్ సంక్షేమ పాలనను అమలు చేస్తాం: రేవంత్
రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి.. వైఎస్ సంక్షేమ పాలనను అమలు చేస్తామని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చెప్పారు. నాడు వైఎస్ వేసిన పునాదులే కాంగ్రెస్‌ను నడిపిస్తున్నాయన్నారు. మహా నేత వైఎస్సార్ తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కార్యకర్తలతో ప్రేమను ఎలా పెంచుకోవాలో వైఎస్సార్ దగ్గర నేర్చుకున్నానని చెప్పారు.
వైఎస్ పాలన చిరస్మరణీయం: రఘువీరా
♦ రాజుల కాలంలో శ్రీకృష్ణదేవరాయుల పాలన, ప్రజాస్వామ్యంలో వైఎస్ పాలన చిరస్మరణీయమని మాజీ మంత్రి రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. రైతును రాజును చేయడం కోసం తపించారని చెప్పారు.
♦ జస్టిస్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ పాలనలో ఆర్థిక, వ్యవసాయ విధానాలు అందరికీ ఆదర్శమన్నారు. సుదీర్ఘ కాలం పోరాడి సీఎం అయిన వ్యక్తి కాబట్టి అందరి అభిప్రాయాలను గౌరవించేవారని చెప్పారు.
♦ వైఎస్‌తో విపక్షాలు విభేదించినా గౌరవించేవారని సీపీఐ నేత నారాయణ గుర్తు చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజల మంచి కోసం వైఎస్సార్ ముందడుగు వేసేవారని సీనియర్ పాత్రికేయుడు సాయినాథ్ పేర్కొన్నారు.
గాంధీభవన్‌లో వైఎస్సార్‌కు ఘన నివాళి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా శనివారం గాంధీభవన్‌లో ఘనంగా నివాళులు అర్పించారు. సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
వైఎస్ రైతు పక్షపాతి అని, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాల ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన చేసిన సంక్షేమ సంతకం చెరిగిపోనిదని ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి పేర్కొన్నారు. కాగా.. హైదరాబాద్‌లోని పంజాగుట్ట సర్కిల్, సిటీ సెంటర్ చౌరస్తా, పలు ఇతర ప్రాంతాల్లోని వైఎస్ విగ్రహాలకు కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment